నీలకంఠం వ్యంగ్యంగా, "తులసి మీతో వస్తుందా?" అన్నాడు వెటకారంగా.
నీలకంఠం ఆ మాటలనకపోతే తులసి కొంచెమయినా సంకోచించేదేమో! గానీ, అతడలా మాట్లాడగానే లేచి నిలబడి, "నేను సిద్ధంగా ఉన్నాను. మీరిక్కడికి తీసికెళ్తే అక్కడికి వస్తాను" అంది.
"తులసీ!" అంది జానకి సన్నగా లోపలి గదిలోనుంచి. ఇక తల్లి నీతులు మొదలుపెడుతుందేమోనని భయపడుతూ విసుగును అణచుకుంటూ, తల్లి దగ్గరకు వచ్చింది తులసి. జానకి లోగొంతుకతో, "ఎలాగూ కృష్ణారావుతో బయటకు వెళ్తున్నావుగా! అతడు రాయవెల్లూరులో చెయ్యి బాగుచేయించుకోవటానికి అప్పిస్తాడేమో అడుగు" అంది.
నిర్ఘాంతపోయింది తులసి. తల్లికి సమాధానం చెప్పలేక తలెత్తి తల్లిని చూడలేక, తలవంచుకుని బయటకు వచ్చేసింది. కృష్ణారావు తులసిని హోటల్ కు తీసికెళ్ళాడు. తులసి ఏమాత్రం మొహమాటపడకుండా, సంకోచ పడకుండా, స్వీట్, దోసె, ఉప్మా ఆవురావురుమంటూ తింది. కాఫీ తాగింది. జాలిగా తులసిని చూస్తూ కూచున్నాడు కృష్ణారావు. హోటల్ నుంచి బయటకు వచ్చాక, "ఇంక ఇంటి దగ్గర దింపెయ్యనా?" అని అడిగాడు.
తులసి తల అడ్డంగా తిప్పుతూ, "వద్దు. ఏదైనా సినిమాకి తీసికెళ్ళండి." అంది.
కృష్ణారావు తులసిని సినిమాకు తీసికెళ్ళాడు. చిన్నపిల్లలా కథలో లీనమయిపోయి సినిమా చూసింది తులసి.
"తోడు ఎవరూ లేక.... డబ్బులు లేక.... సినిమా చూసి చాలా రోజులయింది." అంది తులసి. కృష్ణారావు తులసిని ఆశ్చర్యంగా చూశాడు. ఆ ఆశ్చర్యం తులసి గమనించినా, లక్ష్యపెట్టలేదు. కృష్ణారావుతో తులసి ఇంటికి వచ్చేసరికి పది దాటింది. తలుపు తీసిన సుమతి తులసిని ముఖంమీదే, "ఛీ! ఛీ!" అని చీదరించుకుంది.
తులసి నవ్వేసి తమ గదిలోకి....తల్లీ, తండ్రీ, తను పడుకొనే గదిలోకి వచ్చింది.
జానకి ఆరాటంగా, "డబ్బు అప్పు అడిగావుటే! ఇస్తానన్నాడా?" అని అడిగింది.
తులసి నిలబడిపోయి, "ఇంకా ఆయన్ని వలలో వేసుకోలేదమ్మా! ఇంకాస్త టైం పడుతుంది. రెండు మూడు రోజుల్లో అడుగుతాను" అంది.
తులసి మాటలకూ, ఆ కరకు కంఠస్వరానికి గతుక్కుమంది జానకి. ఎందుకో, ఏమిటో తెలియకుండా దుఃఖం పొంగిరాగా "నా ఖర్మ!" అని నుదురు కొట్టుకుని దిండులో ముఖం దాచుకుంది ఒగరుస్తూ.
15
సుమతి, తులసితో చాలా ముభావంగా ఉండసాగింది.
తులసి ఏదో మహాపరాధం చేసినట్లూ, తాను గనుక మహోదారంగా క్షమించినట్లూ ఉంది సుమతి ప్రవర్తన. సొంత అక్కే ఇలా ప్రవర్తిస్తోంటే ఏమనుకోవాలో అర్థంకాలేదు తులసికి. నీలకంఠం కనీసపు విచక్షణ కూడా లేకుండా తెగబడి తనను చేసుకుంటానంటే, ఆ తప్పు తనదా? అందుకు అక్క తనపట్ల వైమనస్యం పెంచుకోవటం న్యాయమేనా?
లాభంలేదు. ఏదో చెయ్యాలి! ఇలాంటి పరిస్థితుల్లో తనకింకా అభిమానం ఎందుకు? తన వైద్యానికి సూర్యం అప్పుగా డబ్బు ఇస్తానన్నాడు. అది తీసుకోవాలి. వెంటనే వైద్యం చేయించుకొని, ముందు చెయ్యి బాగుచేయించుకుని, తన కాళ్ళమీద తను నిలబడాలి! లేకపోతే రాబందుల్లాంటి ఈ మనుష్యులు తనను బ్రతికుండగానే పీక్కుతినేలా ఉన్నారు.
ఆరోజు రెండవ శనివారం. సెలవురోజు. బహుశః సూర్యం ఇంట్లోనే ఉంటాడు. తయారయి సూర్యం ఇంటికి బయలుదేరింది.
సుమతి, తులసిని ఎగాదిగా చూస్తూ, "ఎక్కడికీ? కృష్ణారావు ఇంటికా?" అని అడిగింది అదొకరకంగా.
తులసి సమాధానం చెప్పటం కూడా మరిచిపోయి నిలబడిపోయింది అక్క ముఖం చూస్తూ. ఆ చూపులకు సుమతిలో మనసు కరిగింది కాబోలు, చెల్లెలి దగ్గరగా వచ్చి, ఆప్యాయంగా హితబోధ మొదలుపెట్టింది.
"నీ మేలుకోరి చెపుతున్నాను. ఈ మొగాళ్ళకి కొత్తొక వింత, పాతొక రోత. చెడగొట్టేవరకూ నీ చుట్టూ తిరుగుతారు. చెడిపోయాక నీ ముఖం చూడరు. ఆడదాని అందం ఎంతకాలం ఉంటుందీ? నీకు తెలియదూ? చిన్నప్పుడు నీ వయసులో నేను ఎలా ఉండేదాన్నో! ఇప్పుడు చూడు, ముగ్గురు పిల్లల్ని కానీ తుక్కయిపోయి, మీ బావగారి అందానికి పనికిరాకుండా పోయాను. ఆడదాని అదృష్టమింతే! అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి! ఎన్ని నరక యాతనలు అనుభవిస్తున్నా, మరో మగాణ్ణి నా దరిదాపులకు రానిస్తానా?"
అక్క తనమీద కురిపిస్తోన్న ఆ ఆప్యాయపు జల్లును భరించటం కష్టమయిపోయింది తులసికి. తన భుజంమీద ఉన్న అక్క చేతిని కంపరంగా తోసిపారేసి ఇంట్లోంచి బయటపడింది.
క్యూలో నిలబడలేదు. బస్ లో ప్రయాణం చెయ్యలేదు. పర్స్ లో రెండు రూపాయలకంటే ఎక్కువ లేవు. తెగించి ఆటోలో కూచుంది. సూర్యాన్ని అడిగి ఆటోఛార్జీ ఇయ్యవచ్చునని. తీరా సూర్యం ఇంటికి వెళ్ళేసరికి పని కుర్రాడు సూర్యం ఇంట్లో లేడని చెప్పాడు. హాస్పిటల్ కి వెళ్ళాడని అన్నాడు. హాస్పిటల్ పేరు వినగానే తులసి కంగారుగా, "ఏం? అయ్యగారికి వంట్లో బాగుండలేదా?" అని అడిగింది.
"అయ్యగారికి బాగానే ఉంది. ఆస్పత్రిలో ఎవరినో చూట్టానికి వెళ్ళారు" అని చెప్పాడు పని కుర్రాడు. తులసి కాస్త స్థిమితపడింది. ఆటో డ్రైవర్ హారన్ వేశాడు తన ఛార్జీ ఇయ్యమని. తులసికి చెమటలు పట్టాయి. హుందాతనం తెచ్చిపెట్టుకుంటూ పని కుర్రాడితో "నీ దగ్గర నాలుగు రూపాయలుంటే ఇస్తావా? నా దగ్గర వంద రూపాయలనోటు ఉంది. చిల్లరలేదు" అంది.
వాడు వెంటనే తన జేబులోంచి నాలుగు రూపాయలు తీసి ఆటో వాడికిచ్చి చిల్లర తీసుకొచ్చి తులసికిచ్చాడు. తులసి జాగ్రత్తగా ఆ చిల్లర తన పర్సులో వేసుకుంది.