ఆ అనునయానికి కరిగిపోయింది తులసి. తన బ్రతుక్కి తోడు తనను ఈ మాత్రంగా బ్రతిమాలి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు?
"మీరెందుకు? నేనే వండుతాను" అంది.
"ఆల్ రైట్! నేను సాయం చెయ్యొచ్చునా?"
"నిరభ్యంతరంగా....."
సూర్యం బియ్యం కడిగిస్తే తులసి అన్నం పడేసింది. అతడు బంగాళ దుంపలు తరిగి ఇస్తే వేయించింది. అంతా అయ్యాక, నేను విస్తళ్ళు తెచ్చాను. కడిగి పట్టుకొస్తాను" అని సూర్యం పంపు దగ్గర విస్తళ్ళు కడిగి తనకూ, తులసికీ రెండు విస్తళ్ళు పరిచి కుసుమ కోసం కుసుమ ప్లేటు కూడా పెట్టాడు. ఆ ప్లేట్ చూడగానే తులసి ముఖం నల్లబడింది. అది గమనించిన సూర్యం కొంచెం కరుగ్గా, "ముందు మనం తినేసి ఆ తరువాత కుసుమను తినమందామా? లేకపోతే, ముందు మీరొక్కరూ తింటారా? ఆ తరువాత నేనూ, కుసుమా తినమా?" అన్నాడు. తులసి సర్దుకుని "ఫరవాలేదు. ముగ్గురం కలిసే తిందాం" అంది. ఎదురుగా కూచుని కావలసినది సైగలతో అడుగుతూ భోజనం చేస్తున్న కుసుమను చూస్తోంటే తులసికి కడుపులో తిప్పసాగింది. ఎలాగో భోజనం చెయ్యసాగింది లేచిపోలేక. సూర్యం ఒకసారి ఏదో మాట్లాడబోతే తులసి వినిపించుకోలేదు. తులసి తన పొరపాటు గ్రహించేసరికి, కాలం మించిపోయింది. సూర్యం మళ్ళీ మాట్లాడలేదు. ఎలాగో భోజనాలు పూర్తయ్యాక, సూర్యం తులసి అవస్థ అర్థంచేసుకుని, "ఈ పరిసరాలు చాలా బాగుంటాయి. చూపిస్తాను, రండి." అని బయటికి తీసికెళ్ళాడు. ఆ అరణ్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా పరుచుకున్న పచ్చని ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మధ్య మధ్య ఎత్తుగా వున్న గుట్టలు ఎక్కలేక కాలు జారితే సూర్యం చెయ్యి పట్టుకుని ఎక్కించాడు.
"కొండలూ, గుహద్వారాలూ, గుట్టలూ, రహస్య మార్గాలూ, ఏదో అపరాధ పరిశోధక నవలలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది" అంది తులసి.
"భలేవారు! కొంపదీసి ఇక్కడున్న వారంతా అపరాధులని అనుకోవటం లేదు కదా? పాపం! వాళ్ళు నిరపరాదులండీ! ఎవరి అపరాధాలకో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఆ అన్యాయాన్ని సాధ్యమయినంత వరకూ సరిదిద్దటానికే ఇక్కడివాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సృష్టి శక్తిని ఎవరు వ్యాఖ్యానించగలరు?"
ఈ మాటలతో మళ్ళీ తులసి మనసు కుసుమ మీదకు పోయింది. సంకోచిస్తూనే, "ఆ అమ్మాయి ఎవరు?" అంది.
సూర్యం మాట్లాడలేదు.
"చెప్పకూడని రహస్యమయితే చెప్పక్కర్లేదు లెండి" అంది తులసి నిష్ఠూరంగా.
"చెప్పకూడనిదేమీ లేదు. అయితే ఈ విషయం చెప్పబోయేముందు మీ దగ్గర నుండి నా ప్రశ్నకు సమాధానం కావాలి!"
"అదేమిటి? అడగండి!"
"కుసుమను మీరు మీ కన్నబిడ్డలా నిండు మనసుతో ఆదరించగలరా? మీకు సంబంధించిన వ్యక్తిగా నిర్భయంగా సమాజంలో మీవెంట తిప్పుకోగలరా?"
తులసి ముఖం పాలిపోయింది. లీలగా విషయం అర్థమవుతోన్నా, "కుసుమను నేను కన్నబిడ్డలా చూసుకోవటం యేమిటి?" అంది.
"మీకు అర్థం కాలేదన్న మాట! అయితే స్పష్టంగానే అడుగుతాను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలంటే, అఫ్ కోర్స్.... మీకు ఇష్టమయితేనే అనుకోండి. మీరు కుసుమను కన్నబిడ్డలా చూసుకోగలగాలి! ఆ శక్తి మీకు లేకపోతే, దుర్భరమయిన నా వ్యక్తిగత విషయాలనూ, నా మనోమాలిన్యాన్నీ మీ ముందు బయటపెట్టి ప్రయోజనం లేదు....."
'దుర్భరమయిన వ్యక్తిగత విషయాలు' - 'మనో మాలిన్యం' తిన్నగా ఏ విషయమూ ఆలోచించలేక సుడులు పడిపోతోంది తులసి మనసు.
సూర్యం తనంతట తాను పెళ్ళి చేసుకొంటానని అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తనకు గొప్ప అదృష్టం. తన సమస్యలన్నీ పరిష్కారమయి పోతాయి. కానీ, కుసుమను తన కన్నబిడ్డగా అంగీకరించి, సమాజములో తనవెంట తిప్పుకొని.... అందరూ తననూ, కుసుమనూ విడ్డూరంగా చూస్తూండగా. ఎక్కడికక్కడ అపహాస్యాలను ఎదుర్కొంటూ.....
శరీరమంతా చల్లబడినట్లయింది తులసికి.....
"నన్ను క్షమించండి_ నావల్ల కాదు" అనేసింది, తల వంచుకుని.
సూర్యానికి చాలా కోపం వస్తుందనుకుంది కానీ, సూర్యం మామూలుగా నవ్వేసి, "దట్సాల్ రైట్! నేను అర్థంచేసుకోగలను" అన్నాడు.
ఏది ఎలా ఉన్నా, అతని విశాల హృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది తులసి.
16
తులసి, సూర్యం కాటేజ్ దగ్గరకు వచ్చేసరికి కాటేజ్ ముందు కృష్ణారావు కారు ఆగి ఉంది.
"చంద్ర, కృష్ణారావూ వచ్చారు" అంటూ సూర్యం హుషారుగా లోపలికి వచ్చాడు. చంద్ర పేరు వినగానే తులసి కళ్ళు ముందుకు కదలనని మొరాయించాయి. వాటిని బలవంతాన ఈడ్చుకొంటూ తను లోపలికి వచ్చింది. కుసుమ చంద్ర మెడచుట్టూ చేతులువేసి చంద్ర వళ్ళో కూచుంది. చంద్ర నవ్వుతూ కుసుమతో ఏదో కబుర్లు చెపుతూంది ఆప్యాయంగా.
లోపలకు రాగానే, "ఇన్నాళ్ళకా వచ్చేది? కుసుమ నీకోసం బెంగపెట్టుకొంది తెలుసా?" అన్నాడు సూర్యం చంద్రతో.