Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 28


    అనిల త్రిసికి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళూ మాట్లాడుకున్నాయి.
    "మీరు...ఏమీ చూడలేదా?"
    వణికింది అనిల గొంతు. కొద్దిపాటి జీర వినిపించింది ఆ గొంతులో.
    "చూశాను. దేవనారాయణ్ గారిని..." ఈ మాటలని అనిల ముఖంలోకి చూశాడు. అంత చల్లని రాత్రిలో ఆమె ముఖం మీద చమట బిందువులు.
    "ఏమనుకున్నారు?" అడిగింది. గొంతులో వణుకు పోలేదు.
    "ఇక్కడేదో కుంభకోణం జరుగుతోంది. అదేమిటో మాత్రం సరిగ్గా అర్థం కాలేదు."
    "కరెక్ట్! నా దురదృష్టం కొద్దీ ఈ కుంభకోణంలో నేనూ ఒక పావుగా చిక్కుకున్నాను. నన్ను నేను విడిపించుకునే ప్రయత్నంలోనే ఇక్కడికి వచ్చాను."
    "మీరు 'రిడిల్స్' మాట్లాడకుండా నా కర్థమయ్యేలా మాట్లాడండి. నేను చెయ్యగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను."
    "థాంక్యూ! నిజంగా!...కానీ, ఈ ప్రయత్నంలో మీకు ప్రమాదాలు ఎదురయితే?"
    "మరీ మంచిది. ప్రమాదాలతో ఢీ కోవటం అంటే నాకు చాలా సరదా"
    "ప్రాణాలకే ముప్పు రావచ్చు!"
    "పోయే ప్రాణాలు ఎలా అయినా పోతాయి. నా ఆయుర్దాయం చాలా గట్టిదని చెప్పాడు జ్యోతిష్కుడు. ఏ రకమైన ప్రగాఢానుభూతులూ లేని సాదా పేద జీవితం నూరేళ్ళు బ్రతికి ఏం ప్రయోజనం!"
    నవ్వింది అనిల. అతడంటే ఆదరంతో పాటు గౌరవం కూడా కలుగుతోంది.
    "అయితే వినండి. నా కథ ముత్తాతల నాటినుంచీ ప్రారంభమవుతుంది. బ్రిటీష్ పరిపాలన ఉన్నరోజులు. జమీందారులు మహారాజుల్లా వెలిగిపోయిన రోజులు. కొందరు జమీందారులు, తంగిళ్ళమూడి జమీందారులూ, విజయనగరంవారూ, సహృదయులై కవి పండితులను పోషిస్తూ తమ జమీలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నవారు లేకపోలేదు. కాని ఎక్కువమంది జమీందారులు బోగలాలసులే! వాళ్ళు తమ జమీ బాధ్యతనంతా దివాన్ల మీద వదిలేసి పల్లెటూళ్ళు వదిలి మహా నగరాల్లో జల్సాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కోరినప్పుడల్లా కోరినంత డబ్బు పంపటం దివాను బాధ్యత.
    అలా డబ్బు పంపకపోతే జమీందారులు వెంటనే తమ దివానులను మార్చేసేవారు. ప్రస్తుతం కేంద్రం ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని మారుస్తున్నట్లు. ఆ భయానికి దివాన్లు ప్రజల్ని తమకు తోచిన అన్ని విధాలుగానూ పీడించి డబ్బు వసూలు చేసేవారు. తాము కొంత మిగుల్చుకుని మిగిలినది తమ 'ప్రభువు'లకి పంపేవారు. ఈ బాధలు పడలేక ప్రజలు తిరగబడిన సందర్భాలు లేకపోలేదు.
    అలాంటి తిరుగుబాటుని బ్రిటీషు సైన్యం సహాయంతో అణచివేసేవారు. ఇప్పుడు పోలీసుల సహాయంతో అణిచేస్తున్నట్లు. ఆ బ్రిటీషు సైన్యానికి అయ్యే ఖర్చంతా జమీందారులే భరించవలసి వచ్చేది. అంటే ప్రజలు తిరగబడినదానికి ఫలితంగా వారు మరికొన్ని పన్నులు చెల్లించుకొనవలసి వచ్చేది!
    ఆ రోజుల్లో పాపం ఈ పల్లె ప్రజలే బ్రిటీష్ సైన్యానికి పాలూ, పెరుగూ, గొర్రెలూ, కోళ్ళు ఫ్రీగా సమర్పించుకోవలసి వచ్చేది. తిరుగుబాటు తలెత్తినప్పుడల్లా ఆ నాయకులని ఏవేవో క్రిమినల్ కేసుల్లో ఇరికించి, జైళ్ళలో పెట్టేవాళ్ళు. అక్కడితో సాధారణ ప్రజలు బెదిరిపోయేవారు.
    ఈ రకమైన వాతావరణంలోనూ ముత్తాత కూడా జల్సారాయుడే. ఆయన యజ్ఞనారాయణ్, దేవనారాయణ్ ల ముత్తాత దగ్గిర ఆ రోజుల్లో రెండువేల రూపాయల అప్పు చేశాడట! ఆ అప్పు ఎవరూ తీర్చకపోవటం వల్ల మా నాన్నగారి తరం వచ్చేసరికి వడ్డీతో సహా పదివేలయింది. మా తాతగారి నాటికే జమీలు పోయాయి. వున్న భూములు అమ్ముకుని పట్టణాలకు వచ్చేసి వ్యాపారాలు ప్రారంభించారు మా నాన్నగారి అన్నదమ్ములు.
    దురదృష్టవశాన మా నాన్నగారు వ్యాపారంలో పెద్దగా రాణించలేదు. వెనకటి సిరిసంపదలు లేకపోయినా, ఆ దర్జాలు వదలటంలేదు నాకు. ఒక అన్న చదువులో పైకి వచ్చాం! అదే మా ఆస్థి. ఇంకా అన్న ఉద్యోగంలో చేరలేదు. నా చదువు పూర్తికాలేదు. ఈ సమయంలో తమ పదివేల రూపాయల అప్పు తీర్చమని యజ్ఞనారాయణ్, దేవనారాయణ్ లు దావా వేశారు నాన్నగారి మీద.
    నాన్నగారికి కోర్టులూ ఇష్టంలేదు. స్నేహంగా మాట్లాడి సమస్య పరిష్కరించుకోవటానికి ఇక్కడికి వచ్చారు. అదృష్టమో, దురదృష్టమో నాన్నగారితోపాటు నేనూ వచ్చాను. నన్ను తనకిచ్చి పెళ్ళిచేస్తే కట్నం అడక్కపోవటమే కాక అప్పు పూర్తిగా వదులుకుంటాననీ, అలా రాసిస్తాననీ అన్నాడు దేవనారాయణ్.
    సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారమయినందుకు నాన్నగారు చాలా సంతోషించారు. ఎందుకంటే మాలో కట్నాలు చాలా ఎక్కువ, ఇప్పటికీ! ఆడపిల్లతో పంపవలసిన "సారి"కి కూడా ఎన్నో నిబంధనలున్నాయి.
    అమ్మ కూడా సంతోషించింది. "నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా!" అని కూడా అంది. అమ్మ దృష్టిలో అదృష్టం, జమీలు పోయినా దేవనారాయణ్ కుటుంబానికున్న భూములు.
    "అప్పటికి పెళ్ళి గురించి నాకే ఆలోచనలూ లేవు. సాంప్రదాయక కుటుంబాలలో పుట్టి పెరగటం వల్ల కాలేజీకి వెళ్ళి చదువుకోవటానికే కొంత ఘర్షణ పడవలసి వచ్చింది. మొగ పిల్లలతో స్నేహాలూ, ప్రేమలూ మొదలయిన వాటికి ఆస్కారమే లేదు.
    నవలలు చదివిన పరిజ్ఞానంతో దేవనారాయణ్ నన్ను చూడగానే ప్రేమించాడనీ, అందుకే కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటున్నాడనీ అనుకున్నాను. గర్వపడ్డాను. సంతోషంగానే పెళ్ళికి ఒప్పుకున్నాను. దేవనారాయణ్ తొందర పెట్టడం వల్ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తన డబ్బుతోనే అతి వైభవంగా ఈ గ్రామంలోనే జరిపించాడు ఆ వేడుక.
    ఆ తర్వాత నేనిక్కడికి ఏదో పండుగని మళ్ళీ ఆహ్వానం మీద వచ్చాను. అప్పుడు దేవనారాయణ్ నిజస్వరూపం అర్థమయిపోయింది. అతడు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నది నామీద ప్రేమతో కాదని కూడా తెలుసుకున్నాను.
    మరి ఎందుకూ? నాతో అతడికి ప్రయోజనం ఏమిటి? అదే అర్థం కావటం లేదు. నిశ్చితార్థం అయినా, అతడే "నేను నిన్ను పెళ్ళి చేసుకోను" అనేలా చెయ్యాలని ఎంతగానో ప్రయత్నించాను.
    అతడి మాట లెక్క చెయ్యకుండా తిరిగాను. "పల్లె ప్రజలతో కలిసిమెలిసి తిరగటం మన దర్జాకి భంగం!" అని అతడంటే, మరింత పెంకెగా పల్లె ప్రజలతో, గిరిజనులతో వాళ్ళలో ఒక మనిషిలాగ కలిసి మెలిసి తిరిగాను. ఆ రకంగా వీళ్ళ జీవితాలలో నాకు సాన్నిహిత్యమేర్పడింది.
    మా కాలేజీలో అందర్నీ అడిగి పాత బట్టలు పోగుచేసి వాళ్లకు పంచాను. సిటీ నుంచి వచ్చినప్పుడల్లా పాలపొడి ప్యాకెట్లూ, బిస్కెట్లూ మొదలయినవి తీసుకొస్తాను వీళ్ళకోసం. చాలా కరువు ప్రాంతం ఇది!
    నాలుగైదు కుటుంబాలు మాత్రం అపార ధనరాసుల్లో మునిగి తేలుతున్నాయి. మిగిలిన వాళ్ళంతా తిండి కూడా లేకుండా మాడుతున్నారు. ఇక్కడ పుష్కలంగా దొరికేది కల్లు మాత్రమే!
    "నేను ఇలా నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నా దేవనారాయణ్ నన్ను పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం మార్చుకోలేదు. నామీద కోపం తెచ్చుకున్నాడు. అది నేను లక్ష్య పెట్టలేదు.
    చేసేది లేక త్రిసికిని నాకు గార్డియన్ గా వుంచాడు. నేను మీతో డేరాలలో వుంటున్నందుకు అతడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు. అయినా నాతో తెగతెంపులు చేసుకోలేదు. నన్ను పెళ్ళి చేసుకుంటాననటంలో ఏదో కుట్ర వుందనే నా అనుమానం మరింత బలపడుతోంది. అది తెలుసుకోవాలనే..."
    ఆగిపోయింది అనిల.
    గుండెలదిరిపోయేలా కొండలూ, కోనలూ దద్దరిల్లేలా ఒక చావు కేక వినిపించింది.
    ముగ్గురూ స్థంభించిపోయారు ఒక్క క్షణం. అప్పటికి వాళ్ళు డేరాలకి దగ్గిరలో వున్న కొండ మలుపుకి కొద్ది దూరంలో వున్నారు.
    రవి తేరుకుని త్వరత్వరగా కొండ మలుపు దగ్గిరకి చేరుకున్నాడు.

 Previous Page Next Page