ఆమె అక్కడ్నుంచి కదలకుండా నిండుగా ఆ వాతావరణమంతా ఆక్రమిస్తోన్నట్లు అలాగే నిలబడింది.
అతను జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళను చూశాడు. వారిలో చాలా హైక్లాసుకు చెందిన వాళ్ళూ వున్నారు. ఇతరత్రా వున్నారు. ఈ తరగతికి చెందినవాళ్ళూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో గడిపినప్పుడు మించిన ఆనందం ఇతరులతో గడిపినట్లు అనుభవించలేదు.
అతనికిలాంటి అనుభవాలు ఎప్పటికప్పుడే కొత్త నిషా.
ఆమె అంతదగ్గర్లో నిలబడి వుండటం అతనికెంతో బావుంది.
"కాఫీ చాలా బావుందంటే మాట్లాడవేం?"
"...ఏదో నాకు తోచినట్లు కలిపాను."
"ఇంట్లో ఎవరూ లేరా?"
"బయటికెళ్ళారు"
ఆ ఇంట్లో ఈ పద్ధతి అలవాటే. పనివాళ్ళమీద ఇల్లంతా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండటం, ఆ తర్వాత ఏ వస్తువైనా కనిపించకపోతే వాళ్ళమీద దొంగతనాలు బనాయించి ఇంతెత్తున ఎగురుతూ ఉండటం.
"నీ పేరు?"
"కామేశ్వరి"
"ఈ ఊరేనా?"
"ఊ"
"ఎక్కడ వుంటారు?"
"రోకళ్ళ పాలెం"
అలా ప్రశ్నలడుగుతూ ఆమె గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఒకప్పుడు కొంచం బాగా బ్రతికిన కుటుంబమే. భర్త చిన్నసైజు బట్టలకొట్టు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇద్దరు పిల్లలు. ఒకమ్మాయి, ఒకబ్బాయి. కొన్నాళ్ళకు భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుని తనని, పిల్లల్ని సరిగ్గా చూడటం మానేశాడు. క్రమంగా ఇంటికి సరిగ్గా రావటం మానేసి, చివరకు ఆ స్త్రీతో కలసి ఎటో వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితుల్లో నిస్సహాయగా మిగిలిన ఆడదానికి మిగిలిన విద్యార్హతలు లేకపోతే చేతనయేది... వంటపని చెయ్యటం. కామేశ్వరి అదే మొదలుపెట్టింది. కొన్నాళ్ళక్రితం పిల్లాడికి బాగా జబ్బుచేసి, సరియైన వైద్య సహాయం లేక మరణించాడు.
శ్రీనివాసరావు నాలిక మీదనుంచి వచ్చే మాటలతో సానుభూతి కురిపించాడు.
* * * *
రాత్రి బాగా పొద్దుబోయాక రాధాబాయి యింటికొచ్చింది.
శ్రీనివాసరావు ఇంట్లో లేడు. పిల్లలు వి.సి.ఆర్ వేసుకుని సెక్స్, హింసాకాండలతో నిండివున్న ఇంగ్లీషు సినిమా ఒకటి చూస్తున్నారు.
రాధాబాయి వాళ్ళని చూపులతో పలకరించి, తన గదిలోకి వెళ్ళిపోయింది. బాత్ రూంలోకిపోయి, స్నానం చేసి నైటీ వేసుకుని ప్రక్కమీదకు చేరి పడుకుంది.
పన్నెండు గంటలు దాటాక శ్రీనివాసరావు వచ్చాడు. ఈవేళ అయిదు రౌండ్లు దాకా తీసుకున్నాడు. అలాగే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు గానీ, మనిషి బాగా తూగుతున్నాడు.
బయటి తలుపు తెరిచి లోపలకు రావటానికి అతని దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది. ఈ రోజు మోతాదు ఎక్కువ అవటం వల్ల తడబడుతూ జేబు తడుముకుని కీ బయటకు తీసి డోర్ తెరిచి లోపలికి వచ్చాడు. ఇంట్లోని మనుషులంతా ఎవరి గదుల్లో వారు పడుకుని ఉండటంవల్ల నిశ్శబ్దంగా ఉండి నిర్మానుష్యంగా ఉన్నట్లు కనబడుతోంది. అలాగే తడబడుతూ నడుస్తూ తనగదిలోకి చేరుకున్నాడు.
బెడ్ లైట్ వెలుతుర్లో రాధాబాయి డబుల్ కాట్ మీద మధ్యలో ఓ ప్రక్కకి తిరిగి పడుకుని వుండటం కనిపించింది. పమిట వుండవలసిన స్థానంలో లేదు.