Previous Page Next Page 
కళ్ళు పేజి 28


    "హేమసుధా! హేమసుధా" అని అరుస్తూ బయటినుంచి తలుపు బలంగా తడుతున్నారు.

 

    "ఐ కాన్ట్... ఐ కాన్ట్..." అంటూ ఆమె నెత్తురు ఓడుతున్న చేతులతో టి.విలన్నీ పగలకొట్టి ముక్కలు ముక్కలు చేసి పారేస్తోంది.


                                       10


    డాక్టర్ కృష్ణచైతన్యతో గెటవుట్ అనిపించుకున్న విలేఖరి కోపంతో ఇష్టమొచ్చినట్లు రాసిపారేశాడు.

 

    "పద్మనేత్రాలయ డాక్టర్ల సహకారం లేకుండా ఈ దుర్ఘటన ఎలా జరుగుతోంది?"

 

    "అసలు పద్మనేత్రాలయలోని డాక్టర్లే ఈ ఘోరం చేశారా?"

 

    "నిజంగా డాక్టర్ కృష్ణచైతన్యకు ఏమీ తెలీనే తెలియదా?"

 

    డాక్టర్ కృష్ణచైతన్య బాధతో, అవమానంతో, నిస్సహాయుడై కృంగిపోతున్నాడు. పద్మనేత్రాలయ అంటే జనం భయపడిపోయి, అక్కడికి వచ్చే రోగుల సమాఖ్య రానురానూ తగ్గిపోతోంది. కృష్ణచైతన్య షాక్ లోంచి ఇంకా కోలుకోలేక అసలు అటెండవటం మానేశాడు. వచ్చిన కేసులు అతని అసిస్టెంట్లే చూస్తున్నారు.    

 

    రంజిత అతని దగ్గరకొచ్చింది. "సార్! మీ హాస్పటల్ కి వచ్చిన అపవాదు నాక్కూడా బాధ కలిగిస్తోంది. మీకభ్యంతరం లేకపోతే మీ హాస్పటల్లో డాక్టర్సందరి వాయిస్ లూ హేమసుధగారికి, మందాకినికీ వినిపిస్తాను. తాను విన్న గొంతులు అవి కాదంటే మీకు రిలీఫ్ గా ఉంటుంది గదా" అంది.

 

    "నాకేం అభ్యంతరంలేదు" అన్నాడు కృష్ణచైతన్య నిర్లిప్తంగా.


                                                             *  *  *


    డాక్టర్ వసంతకుమార్ సీట్లో కూర్చుని అంతకు ముందురోజు ఓ పేషెంట్ కు తీసిన ఏంజియోగ్రామ్ లోని ఫోటోలు పరిశీలిస్తున్నాడు. సిస్టర్ మెమో తీసుకొని అతని దగ్గరకొచ్చింది.

 

    అందుకని చదివాక "నో, నే ఒప్పుకోను. ఎవరో రాస్కెల్ వచ్చి ఏదో చేశాడని హాస్పటల్లోని డాక్టర్లందర్నీ అనుమానిస్తారా? వాళ్ళందరూ పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే డర్టీ ప్రొసీజర్స్ కు ఆన్సర్ ఇవ్వాలా? దిసీజ్ డిస్ గ్రేస్ ఫుల్" అంటూ కాగితాన్ని విసిరి పారేసి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.

 

    సిస్టర్ ఆ ఆరడుగుల విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ మొహంలోని ఎర్రదనం... ఆమెకెందుకో భయం కలిగింది.

 

    అతని మొహంలో ఇదివరకెన్నడూ చూడని క్రూరత్వం కనిపించినట్లయింది.

 

    "డాక్టర్" అంది వణికేకంఠంతో. ఆమె ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.

 

    ఆమెవంక తిరిగాడు. కళ్ళలో ఎర్రని జీరలు కదులుతున్నాయి. సిస్టర్ ఒక అడుగు వెనక్కి వేసింది.

 

    "నో! హాస్పటల్లో ఇలాంటి న్యూసెన్స్ జరగటానికి వీల్లేదు" బలవంతం చేస్తే రిజైన్ చేసేస్తాను. వెళ్ళు." అని గట్టిగా అరిచాడు.   


                                                            *  *  *


    రంజితకు ఎంతకూ నిద్రపట్టడం లేదు. రాత్రి ఇంచుమించు ఒంటిగంట దాటిపోయింది. ఇంట్లో ఆమె ఒక్కతే వుంది. తన తల్లిదండ్రులకు తాను ఒక్కతే సంతానం. ఎంతో గారాబంగా పెంచుకున్నారు. కూతుర్ని పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేర్చటం వాళ్ళకెంతమాత్రం ఇష్టంలేదు. తల్లయితే పోట్లాడి, ఏడ్చేసింది కూడా. తనకు మొదట్నుంచీ ఈ శాఖ అంటే ఇష్టం. చాలామంది అమ్మాయిలు డాక్టర్లవ్వాలనీ, ఆఫీసర్లవ్వాలనీ కలలు కంటారు. తనకు పోలీస్ శాఖలో చేరి అన్యాయాన్నీ, అరాచకాన్నీ ఎదుర్కొంటూ, అక్రమాలతో పోరాడుతూ కష్టంతో కూడిన మంచిని ఎన్నుకుంటూ, అధర్మాన్ని తరుముకుంటూ, తలుచుకుంటూ జీవితాన్ని గడపాలన్నది ఆమె ఆశయం. అందుకే వాళ్ళ మమతల్ని ఛేదించి, అభిప్రాయాలను వ్యతిరేకించి ఈ ఉద్యోగాన్ని ఎన్నుకుంది. తల్లిదండ్రులు దగ్గరుంటే వాళ్ళ ఆపేక్ష, అనురాగాలు అడుగడుక్కూ ఉద్యోగధర్మానికి అడ్డుతగులుతూ ఉంటాయి. అందుకే కొంత కఠినంగానే ప్రవర్తించి వాళ్ళని స్వంత గ్రామంలో వుంచి వచ్చేసింది. చూడాలనిపించినప్పుడు తానే వస్తానని వాళ్ళకు నచ్చజెప్పింది.

 

    తెరచివున్న కిటికీలోంచి వెన్నెలకాంతి ప్రక్కమీదకు విరజిమ్ముతూన్నట్లు వాలుతోంది. ప్రక్కకి ఒత్తిగిలి పడుకుని చూస్తోంటే ఆకాశంలో నక్షత్రం పరుగులు తీస్తున్నట్లు అనుభూతి.

 

    జరుగుతున్న దుర్ఘటనలే మనసుని తొలచి వేస్తున్నాయి. ప్రపంచచరిత్రలో ఇలా ఎప్పుడయినా జరిగిందా? హాస్పటల్లో ప్రవేశించి బహిరంగంగా వీల్ ఛైర్ లో ఓ ప్రఖ్యాత నటీమణిని తీసుకెళ్లి, ఆపరేషన్ థియేటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించాడంటే అతనెంత గుండెలు తీసిన బంటై వుండాలి!

 

    ఆమెను వేధిస్తోన్న ప్రశ్నలు.

 

    ఇంతవరకు పెరికివెయ్యబడ్డ కనుగుడ్లు ఏం చెయ్యబడ్డాయి?

 

    కనుగుడ్లు అవసరమైనప్పుడు ఆ అవసరాన్ని తీర్చుకోవటం కోసం మొరటుగా ప్రవర్తించక అనుభవమున్న సర్జన్ లాగా, చాలా సైంటిఫిక్ గా నిర్వహించడానికి కారణమేమిటి?

 

    ఆ మనిషి డాక్టరా?

 

    కనుగుడ్లు కావాలనుకుంటే ఎంతోమంది అమాయకుల్ని, మామూలు మనుషుల్నే ఎన్నుకోవచ్చు. చాలా ఎరిస్టోక్రట్ ఫ్యామిలీకి చెందిన ఓ యువతీ ఓ ప్రఖ్యాత సినీ నటిని ఎన్నుకోవడానికి కారణమేమిటి?

 

    మందాకినికీ, హేమసుధకూ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏమైనా సంబంధం ఉందా?

 

    హేమసుధ ఇంట్లోంచి ఓ ఆజానుబాహుడైన వ్యక్తి బయటకు రావడం చూసింది హేమసుధ తల్లి. ఆమె పేరు కల్పవల్లి అని గుర్తు. ఎవరూ రాలేదని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పినట్లు అర్థమవుతోంది. ఎందుకబద్ధం చెప్పినట్లు? ఆ వ్యక్తి కారు నంబరు చూసింది. ఎడ్రస్ తెలుసుకుంది. రేపు ప్రొద్దుట అతన్ని కలుసుకోబోతోంది.

 Previous Page Next Page