Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 28


    
    ఆ గది అవతలనుంచి అంతా వింటున్న శంకరం "అమ్మయ్య" అనుకున్నాడు.
    
                                                         5
    
    నాగమణి అక్కయ్య చెప్పినట్లు ఇంకో నాలుగురోజుల్లో శంకరం బావ వచ్చేశాడు. అతనిపేరు సుందరం.
    
    శంకరానికి బావంటే నిజానికి ప్రేమ. పనివుంటే తప్ప అతన్ని ఒక్కక్షణం వదిలిపెట్టడు. సుందరం బావతో ఎప్పుడూ షికార్లకు, కాఫీహోటళ్ళకుకూడా తరచుగా పోతుండేవాడు. ఎప్పుడూ బిల్లు బావే ఇస్తుంటే బావుండక ఒకసారి 'నేను ఇస్తాను బావా!" అన్నాడు. శంకరందగ్గర అప్పుడు నిజంగా డబ్బులున్నాయి. బావ అతనివంక ఆశ్చర్యంగా చూసి "అలాగా?" అన్నాడు. బిల్లుకూడా అతనే ఇచ్చేశాడు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను ఇవ్వనిస్తే వచ్చిన నామర్దా ఏమిటో శంకరానికి అర్ధంకాలేదు.
    
    అతను మొదటిరోజున తెలుగుమేష్టారు ఇంటికిపోయి తన పోర్షన్ రాసి తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి దాన్ని యింట్లో కంఠతా చేస్తూనే వున్నాడు. రిహార్సల్సుకు పోయివస్తూనే వున్నాడు. బావ వచ్చాక తన పోర్షన్ చూపించాడు. అతనుకూడా చూసి చాలా బాగుందని చెప్పాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా నటించాలో స్వయంగా చేసి చూపించాడు. బావ ఏం చెప్పినా శంకరానికి బాగా గురి. అందుచేత అతను చెప్పినట్లు అలవర్చుకుని మేస్టారు దగ్గరకి పోయి చేసి చూపేసరికి ఆయనకూడా అబ్బురపడ్డాడు.
    
    అయితే, పిల్లలు అనుకొన్నట్టు తలా ఒకరూపాయి ఇవ్వలేదు. కొందరు అర్ధలు, మరికొందరు పావలాలు ఇచ్చారు. మరికొందరు ప్రబుద్దులు అదికూడా ఇచ్చేందుకు ఇష్టపడక ఎగ్గొట్టి వూరుకొన్నారు. మేష్టారికేమీ తోచలేదు. నాటకం వెయ్యాలంటే చాలా ఖర్చు కనబడుతున్నది. కావలసిన ఖర్చులో సగంకూడా వసూలుకాలేదు. ఆయన చేతినుండి వేసుకునేందుకు ఏమీ అభ్యంతరం లేదుగాని అసలు ఆయనకెక్కడిది?
    
    ఒకసారి రిహార్సల్సు జరిపి, శంకరం ఇంటికి పోతుంటే ఆపి వున్న విషయమంతా చెప్పి, "ఎలారా శంకరం?" అన్నాడు ఆయన ఉద్దేశ్యం ఎలాగైనా నాటకాన్ని ఘనంగా ప్రదర్శిద్దామని.
    
    "డబ్బు లేకపోతే ఏమవుతుంది మేస్టారూ?" అనడిగాడు శంకరం.
    
    "ఏమవుతుంది? ఆగిపోతే ఆగిపోతుంది" అన్నాడాయన దిగులుగా. శంకరానికి కూడా దిగులేసింది. నాటకం ఆగిపోతే ఎట్లా? తనపేరు నలుగురికీ ఎలా తెలుస్తుంది? పైగా యింట్లో ఎంత అవమానం? బావకేమని సమాధానం చెప్తాడు? అప్పటికే తన నాటకాన్ని చూడటానికి రమ్మనమని బావనీ, అక్కయ్యనీ వందసార్లయినా పిలిచాడాయె.
    
    శంకరం అప్పటికేమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చేశాడు. అతని తలనిండా ఆలోచనలు అలుముకున్నాయి. నాన్ననడిగితే? ఆయన ఎలాగూ యివ్వడు. అడిగి 'లేదు' అనిపించుకుంటేగాని తృప్తి వుండదు. కాని ఒక చిక్కు తనకు అలవాటయిన మార్గం ఒకటుంది. ముందుగా నాన్నను అడిగితే తను ఆ పని చేసినతర్వాత ఆయనకు అనుమానం కలగవచ్చు. అందుకని తను చేసేదేదో గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దామనుకున్నాడు.
    
    ఆ రాత్రి ఆకలిగా వుందని అందరికన్నా ముందు అన్నం తినేశాడు. నాన్నా, బావా అన్నం తింటున్నప్పుడు వెళ్ళి నాన్న చొక్కాజేబులు తడిమాడు. కాని కొంత చిల్లర తప్పితే యింకేం తగల్లేదు. ఎట్లా!
    
    శంకరానికి ఏమీ తోచలేదు. లోపలికి తొంగిచూశాడు. అక్కయ్య యిద్దరికీ అన్నం వడ్డిస్తున్నది. అమ్మ వంటింట్లో వుంది. నాన్న పెట్లో డబ్బు ఎక్కువగా వుంటుందని శంకరానికి తెలుసు. పెట్టె అంటే కాస్తా కూస్తదికాదు పెద్ద కావడిపెట్టె. దాని తాళంచెవి దేవుడిపటంక్రింద మేకుకు తగిలిస్తాడు నాన్న. శంకరం గబగబా వెళ్ళి ఆ తాళంచెవి తీసి పెట్టె తెరిచాడు. అందులో ఒకమూల అరలో నోట్లదొంతరలు కనిపించినై శంకరం రెండు పదిరూపాయలనోట్లు బయటికి తీశాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్లు అనిపించింది. చటుక్కున పెట్టెమూత వేశాడు. నలువైపులా చూశాడు. ఎవరూ కనిపించలేదు. అప్పటికే బాగా భయపడిపోయాడేమో ఇక మళ్ళీ మూత తెరవటానికి ధైర్యం చాలకపోయింది. ఆ రెండునోట్లే జేబులో పెట్టుకుని పెట్టెతాళం వేసేసి, తాళంచెవి యధాస్థానంలో పెట్టేసి సావిట్లోకి వచ్చి పుస్తకం ముందుపెట్టుకుని కూచున్నాడు.
    
    ఆ రోజలా గడిచిపోయింది. మరునాడు శంకరం ఆ డబ్బు పట్టుకుపోయి మాస్టారుకు యిచ్చాడు. "ఎక్కడిది?" అనడిగాడు ఆయన ఆశ్చర్యంగా "మా అమ్మనడిగితే ఇచ్చిందండి" అని చెప్పాడు శంకరం ధైర్యంగా మేస్టారుకు అనుమానం వెయ్యలేదు. భర్తలు పిసినార్లయి వుంటే భార్యలు బహు విశాల హృదయం కలవారయి వుంటారని ఆయన నమ్మకం. ఆయన శంకరాన్ని తెగ పొగిడాడు. "నిజంగా గొప్ప సహాయం చేశావురా ఇలా నువ్వు నన్ను ఆదుకోకపోతే నాటకం ఆపివేసే పరిస్థితి ఏర్పడి వుండేదేమో!" అన్నాడు. శంకరానికి నిజంగా ఒకమాదిరి గర్వం ఆవహించింది.
    
    ఆ సాయంత్రం ఒక సంఘటన జరిగింది. నారాయణరావుగారు రాముడికి అయిదురూపాయలనోటు యిచ్చి వెచ్చాలలిస్టు రాసిచ్చి- "దుకాణానికి పోయి తీసుకురారా" అని పంపించాడు. ఆయనకు వెచ్చాలధరలు బాగా తెలుసు. అందుకని వాడు ఎటువంటి మోసం చేసినా పసిగట్టివేయగలననే నమ్మకం ఆయనకు వుంది. ఒక అరగంట గడిచిన తర్వాత రాముడు వచ్చాడు. వాడు తెచ్చిన సరుకులన్నీ లెక్కజెపుతూ క్రిందపెట్టి మిగిలిన రూపాయి బేడా యివ్వటానికి జేబులో చెయ్యిపెట్టాడు. ఎక్కడా తగల్లేదు. వాడికి వణుకు పట్టుకుంది. "ఏమిట్రా వెధవా! అలా తెల్లబోతావేం? మిగిలిన డబ్బేం చేశావు?" అనడిగాడు నారాయణరావుగారు కఠినంగా. రాముడికి యింకా భయం పుట్టింది. "పో... పోయినట్లుంది" అని అంటున్నాడు వణికిపోతూ. నారాయణరావుగారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన బూతుల పంచాంగం విప్పారు.

 Previous Page Next Page