"శేఖర్!"
"ఎందుకో నీ పిలుపీవేళ చాలా మధురంగా వుందిరా. ఏమిటి మీరిద్దరూ చెప్పలేకపోతున్నారు? ముగింపు నాకాశ్చర్యంగా వుంది. ఈ ముడి మీరు విప్పేస్తారని అనుకున్నాను. పోనీ నేను విప్పనా?"
మాలతికి ఈ పరిస్ధితి పద్మవ్యూహంలా వుంది. ఎలాగో మాట్లాడగలిగింది. "అబ్బ! ఏమిటండీ ఆ మాటలు? నాకేం బాగాలేదండీ. మీకు పాలు తెస్తాను" అంటూ లోపలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది.
శేఖర్ ఆమెను మృదువుగా చెయ్యిపట్టుకుని ఆపాడు. "పాలుతెస్తావా మాలతీ! అయితే ఓ పనిచెయ్యి. ఇద్దరికీ.....అంటే - నాకూ, శంకర్ కీ ఒకే గ్లాసులో తీసుకురా. ఇద్దరం ఒకే గ్లాసులో త్రాగుతాం. అంతేకాదు ఈవేళ ఇద్దరం ఒకే కంచంలో భోంచేస్తాం....."
మాలతి ఇహ నిగ్రహించుకోలేకపోయింది. కన్నీళ్ళు వరదలై ప్రవహిస్తూనే వున్నాయి. "నాకు తెలుసు మీరెందుకిలా మాట్లాడుతున్నారో. నేను తప్పుచేశానని మీరనుకుంటే నన్ను తిట్టండి, కొట్టండి, నరికి పారెయ్యండి కానీ దయవుంచి అలా మాట్లాడకండి. ఇంతలో కటువుగా మారిపోయినట్లయిపోయింది "ఈ విషయం మీతో చర్చించాలని అనుకుంటున్నాను. అతన్ని ముందు ఇంట్లోంచి బయటకు పంపించెయ్యండి. మనం భార్యాభర్తలం.పరాయి వాళ్ళ సమక్షంలో ఇలా మాట్లాడుకోవటం మంచిది కాదు."
"భార్యాభర్తలం" అన్నాడు శేఖర్ బరువయిన కంఠంతో.
"నిజమే కానీ అతనూ ఇప్పుడు పరాయివాడు కాదు మాలతీ!"
"ఏమండీ! ఏమిటండీ ఇది?" అని మాలతి వెక్కి వెక్కి ఏడుస్తూంది.
"అవును మాలతీ! అతనిప్పుడు మనకి చాలా కావలసినవాడు. అయిన వాడు అనే నమ్మకంతోనే ఇక్కడ చోటిచ్చాను." హఠాత్తుగా శేఖర్ నిగ్రహశక్తి కోల్పోయినట్లయిపోయాడు. అతని గొంతు మార్దవంనుంచి కర్కశంగా మారింది. "నువ్వూ తక్కువ తినలేదు.....కొంత చోటు....."
"ఛీఛీఛీఛీ!" మాలతి భరించలేక రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకుంది.
శేఖర్ విగ్రహంలా నిలబడ్డ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి భుజంమీద చెయ్యి వేశాడు. "అదేమిటలా సిగ్గుపడిపోతున్నావు శంకర్?"
ఎంత చలించకుండా ఉందామన్నా శంకర్ నిలద్రొక్కుకోలేకపోయాడు.
"శేఖర్! నీకు.....నేను......" గొంతు గజగజ వణికింది.
"నువ్వు గొప్ప నటుడివే. కానీ ఈ సంఘటనలో నటించవద్దు శంకర్. ప్రతి మానవుడూ నటించకుండా నిజాయితీగా మాట్లాడే క్షణాలు కనీసం కొన్ని వుంటాయి. అందుకే నేనూ నిజమే మాట్లాడుతున్నాను అంటూంటే అతన కంఠస్వరం గాద్గదికమైంది. నీమీద నీకేం కోపంలేదనీ, ప్-పైగా నిన్ను అభినందిస్తున్నాననీ చెబుదామని లోపల ఉంది. కామీ మీమీద భరించలేనంత ద్వేషంగా వుందనీ, నిన్ను చూస్తే నాలో ప్రతిక్షణం ఖణఖణమని మండిపోతున్నదని మాత్రమే చెప్పాలనిపిస్తుంది శంకర్! ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన మృగమేదో తెలుసా? మనిషి. కోడిపిల్లను ఇంటికి తీసుకొచ్చి, దానిని మేపి, పెంచి అది పెరిగి పెద్దదై "ఇది నా ఇల్లు, వీళ్ళు నా యజమానులు" అన్న బంధం ఏర్పడేసరికి, ఏ పండుగకనో దాని. పీక కోసిపారేసి, దాని మాంసం కరకరమని నమిలేస్తారు. అది మృగలక్షణంగాక మరేమిటి? పెంచి పెద్దవాళ్ళను చేసిన వాళ్ళని అనవసరంగా కాల్చుకుతినే వాడూ, నమ్మినవాళ్ళని గొంతు కోసేవాడూ, స్నేహాలను కూడా లెక్కచెయ్యకుండా కార్చిచ్చు రేపేవాడూ మనిషి. వాడు అనర్ధాలకి అసహ్యంగా లొంగిపోయే వికృతమైన జంతువు."
ఎప్పుడొచ్చాడో గానీ గోపయ్య ఈ ఇంట్లో ఎన్నడూ ఎరుగని వింత వాతావరణం, అలవాటు లేని అయ్యగారి ఈ వాగ్ధోరణి చోద్యం చూస్తున్నట్లు చూస్తూ నిలబడ్డాడు.
శేఖరం జేబులోంచి తాళంచెవులు తీసి గోపయ్యకేసి గిరాటేశాడు.
"గోపయ్యా" ఇనప్పెట్టె తెరచి పదివేలు తీసుకురా!"
ఆ ఇంటిని చిరకాలంనుంచి అంటుకుపోయివున్నా ఆ నమ్మినబంటు పరిస్ధితి తీవ్రంగా వుందని అర్ధం చేసుకున్నాడు.
"బాబుగారూ!"
"తీసుకురా గోపయ్యా!" అన్నాడు శేఖర్ కఠినంగా.
అయ్యగార్ని అంత ఉద్రేకంగా ఎప్పుడూ చూడలేదతను. ఎదురు చెప్పడానికి భయపడి, వంగి తాళం చెవులు తీసుకుని లోపలకు వెళ్ళాడు.
శంకర్ కంతా అయోమయంగా వుంది. ఏం జరుగుతున్నదో కొంచెం కొంచెం అర్ధమవుతుంది. "శేఖర్! నువ్వు ఊహించేంతటి నీచుడ్ని కాను నేను" అన్నాడు దీనంగా.
"ఈ మాట ఇవేళ కాదు, నిన్న అంటే విలువ లభించేది."
"శేఖర్!"
"శంకర్! నీచులంటూ విడిగా ఒక తెగ వుండదు. ప్రస్తుతం దోషి స్థానంలో నిలబడ్డావు కాబట్టి నువ్వు నీచుడివి. నీతో నేనిలా మాట్లాడుకుండా పిస్టల్ తో కాల్చిపారేస్తే నేను నీచుణ్ణి. తేడా అంతే."
గోపయ్య లోపలనుండి నోట్లకట్టలు తీసుకొచ్చి భయంగా "బాబుగారు!" అంటూ యజమాని చేతికందిచ్చాడు.
"గోపయ్యా! నువ్వు లోపలికెళ్ళు."
అయ్యగారికెదురు చెప్పలేక అతను అమ్మగారివంక దీనంగా చూసి లోపలికెళ్ళిపోయాడు.
"శంకర్! నీతో ఒక పందెంకట్టాను, గుర్తుందా? నువ్వు నాకు అపకారం చెయ్యగలిగితే పదివేలు ఇస్తానని. నువ్వే గెలిచావు. ఇదిగో డబ్బు."
శంకర్ నిలువునా వణికినట్లయాడు. "శేఖర్! నేను తీసుకోను. ఈ డబ్బు నాకు వద్దు."
శేఖర్ అతనివంక కఠినంగా చూస్తూ అన్నాడు "అయిదు నిముషాల సాంగత్యంతో ఈ మందిరంలోంచి మాలతిని తీసుకెళ్ళే సాహసం నీకుందిగానీ దాని తాలూకు బహుమానాన్ని చూస్తే భయంగా వుందా?.....పోనీ మాలతి కావాలా.........?"
భగవంతుడా! ఈ చిత్రవధకు అంతులేదా?
ఆమె ఆగాథాల్లో పడిపోతున్నది.
శేఖర్ ఆమె కభిముఖంగా తిరిగాడు "మాలతీ!"
పాత మాలతిని ఇహనుంచి చెరిపివేస్తున్నాను. తను ఇహలేదు. అతన్తో నువ్వు......?
ఆమె మళ్ళీ ఒక్కసారిగా బయటకు ఏడ్చింది. "నన్ను ఒక్కసారిగా చంపెయ్యండి.....కానీ......ఇలా చిత్రహింస చెయ్యకండి......"