అంతేగానీ మారణహోమానికి ప్లానులు వేస్తున్న గ్యాంగ్ స్టర్ ని చూస్తున్నట్లు అనిపించడంలేదు.
ఎందుకనీ ? తెలివితేటలు ఉట్టిపడే అతని కళ్ళా? తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయినట్లు కనబడుతున్న అతని మొహంలోని భావమా? మరేదైనానా?
ఏమో!
మళ్ళీ నవాబుగారివైపు చూస్తూ ఆయన చెప్పేది వినడం మొదలెట్టింది సుధ.
అంతకుముందు కొద్ది క్షణాలపాటు కళ్ళార్పకుండా సుధ చిరునవ్వునే చూసిన అఖిల్, తల పక్కకి తిప్పుకుని దీర్ఘాలోచనలో పడిపోవడానికి ఒక కారణం ఉంది. అఖిల్ కి తెలుసు! కొంతమంది ఆడపిల్లల దగ్గర, మొగాళ్ళని ఆటపట్టించే స్వభావం ఉంటుంది.
అది అతనికి బాగా తెలుసు! రెండు సందర్భాలలో అతనికి అనుభవం అయ్యింది కూడా.
ఏం జరుగుతుందో తనకు తెలియకుండానే, అసలు తన తప్పేం లేకుండానే, కొంతమంది ఆడపిల్లల పరిహాసాలలో తనొక పావు అయిపోయి అల్లరిపడిపోయాడు.
అతనికి ఇప్పటికీ కళ్ళకి కట్టినట్లు గుర్తుంది ఒక ఇన్సిడెంట్.
తనకి ఒక కజిన్ సిస్టరు వుండేది. తనకంటే ఏడేళ్ళు పెద్ద. అప్పట్లో తనకి పదకొండేళ్ళు. ఆమెకి పద్దెనిమిది. కాలేజీలో చదువుతూ ఉండేది. వాళ్ళది తమ పక్కిల్లే. ఆమెతోబాటు కంబైన్డ్ స్టడీ చేయడానికి ఒక ఫ్రెండ్ వస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ మేడమీద గదిలో చదువుకుంటూ వుండేవాళ్ళు. తను చిన్నపిల్లాడు కాబట్టి తనకు చిన్న చిన్న పనులు చెబుతూ ఉండేవాళ్లు అప్పుడప్పుడు.
ఒకసారి వాళ్ళు ఏదో పనిచెబితే పూర్తిచేసి, మెప్పుని ఆశిస్తూ మేడ మీది గదిలోకి వెళ్ళాడు.
అక్కడ తన కజిన్ లేదు. కజిన్ ఫ్రెండు మాత్రం కూర్చుని ఉంది. పరికిణీ కట్టుకుని ఉంది తను. చీరె కట్టుకోలేదు. జాకెట్ తొడుక్కోలేదు. భుజాల చుట్టూ టవలు మాత్రం కప్పుకుని ఉంది. తను లోపలికి రాగానే తనని నఖశిఖ పర్యంతరం పరీక్షగా చూడడం మొదలెట్టింది. ఆమె ఎందుకు అలా విచిత్రంగా ఉందో తెలియక తను కళ్ళప్పగించి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.
ఆశ్చర్యమే తప్ప యింకేం తెలియదు తనకి! అప్పుడు కొత్త పాత్ర రంగప్రవేశం చేస్తున్నట్లు తన కజిన్ సిస్టరు చటుక్కున గదిలోకి వచ్చింది. గద్దిస్తూ "ఛీ వెధవా! బయటికెళ్ళు!" అనేవరకూ తను ఆ ఫ్రెండు వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడని తనకే తెలియదు.
కజిన్ సిస్టరు గద్దించగానే, తను ఒక్క అంగలో గదిలో నుంచి బయటపడ్డాడు. తన వీపు వెనకే గది తలుపులు ఠపామని పెద్ద చప్పుడుతో మూసుకుపోయింది. ఇంక ఆ రోజు నుంచి తన కజిన్ సిస్టరూ, ఆమె ఫ్రెండూ కలిసి తనని చిన్నతనంలోనే భ్రష్టుడైన వాడిని చూసినట్లుగా చూడడం మొదలెట్టారు.
తన కజినైతే, ఏదో ఒక అవకాశం కల్పించుకుని, "వీడేదో మహా మంచి వాడనుకున్నా! అన్నీ అలగా బుద్ధులు!" అని అన్యాపదేశంగా తిట్టడం మొదలెట్టింది. ఈ విషయం తక్కిన ఆడపిల్లలకి కూడా ఎలా తెలిసిపోయిందో తనకి తెలియదుగానీ, తను ఎదురుపడితే చాలు చిరాగ్గా ముఖం పెట్టి, పమిట సవరించుకునేవాళ్ళు వాళ్ళంతా.
ఆ తర్వాత చాలా రోజులకి అర్ధమైంది తనకి. నిజంగా జరిగింది ఏమిటో! తన కజిన్ సిస్టర్ కీ, ఆమె ఫ్రెండుకీ ఒక విషయంలో వాదన జరిగిందిట.
"ఇప్పటి పిల్లలకి ఐదో ఏడు రాకముందే సెక్సు అంటే ఏమిటో తెలిసిపోతుంది! వేలెడంతలేని వాళ్ళకి కూడా ఇదంటే తగని ఇంట్రెస్టు!" అందిట ఆ ఫ్రెండు ఏదో సందర్భంలో.
తన కజిన్ మాత్రం ఆ వాదనకి ఒప్పుకోలేదు.
"అందరి సంగతీ ఏమోగానీ, మా అఖిల్ మాత్రం అలాంటివాడు కాదు. వాడికలాంటి యావ అస్సలు లేనే లేదు" అందిట తన కజిన్. ఆ అమ్మాయికి తనంటే తగని యిష్టం!
"అలా అని అనుకుంటున్నావ్! నీ అభిప్రాయం తప్పని నేను క్షణంలో రుజువు చెయ్యగలను" అందిట ఆ ఫ్రెండు.
మాటామాటా అనుకున్నారు. పట్టుదల పెరిగింది. వందరూపాయల పందెం వేసుకున్నారుట! ఆ పందెంలో తను పావు. ఆ సంగతి తనకి తెలీదు. తనకి పరీక్ష ఏమిటంటే....
ఆ ఫ్రెండు ఉత్త పరికిణీతో జాకెట్టు కూడా లేకుండా టవలు మాత్రం కప్పుకుని గదిలో కూర్చుని ఉండగా తనని ఏదో వంకమీద పిలిపిస్తారు.
తను గనక ఆ ఫ్రెండు వైపు "ఆబగా" చూస్తే తన కజిన్ ఓడిపోయినట్లుట! తను గదిలోనుంచి గబుక్కున బయటికి వచ్చెయ్యడమో, లేకపోతే పప్పుసుద్దలా ఆ ఫ్రెండుని గమనించకుండా ఉండిపోవడమో చేస్తే తన కజిన్ గెలిచినట్లుటా.
పందెంలో తన కజిన్ ఓడిపోయిందిట. ఆ ఫ్రెండే గెల్చిందిట. తనకి ఆ "యావ" చాలా ఉందని ఫ్రూవ్ అయిపోయిందిట!
నిజానికి తను ఆ ఫ్రెండు వైపు ఆబగాగానీ, ఆశగాగానీ చూడలేదు. తనకి వాళ్ళనుకుంటున్నట్లు ఆ "యావ" లేనేలేదు కూడా! తను ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా, వింతగా చూశాడు.
"ఈ అమ్మాయి యిలా ఎందుకుందీ?" అని అంతే!
అప్పటికింకా చిన్నపిల్లాడే కదా తను! జరిగినదాన్ని అనలైజ్ చేసుకుంటే ఇప్పుడనిపిస్తుంది.
తప్పు తనది కాదు. వాళ్ళిద్దరిదే! అసలు వాళ్ళకే ఉందేమో ఆ "యావ!" లేకపోతే ఇలాంటి టాఫిక్ వాళ్ళ మధ్య ఎందుకు రావాలీ? వచ్చిందే అనుకుందాం. వంటిమీద బట్టల్లేకుండా ఈ పరీక్షలు పెట్టడమేమిటి? మొత్తంమీద వాళ్ళిద్దరూ కలిసి తను ఒక జులాయిరకం అని తేల్చిపారేశారు.
"కొత్తచీర కొనుక్కుందామని వందరూపాయలు దాచుకున్నా! ఆ వందా వీడివల్ల ఊడాయి" అని తన కజిన్ సణుక్కోవడం విన్నాక, ఇక జన్మలో ఆడాళ్ళవేపు కన్నెత్తి చూడగూడదనుకునే, పన్నెత్తి పలకరించకూడదనీ నిశ్చయించుకున్నాడు తను.
అప్పటినుంచి అలాగే వున్నాడు కూడా.
సంవత్సరాలు గడిచాయి. తను ఇంజనీరింగ్ లో చేరాడు. కాస్త కాస్త లోకం తెలుస్తోంది.
అప్పుడు తమ యింట్లో వుండిపోవడానికి వచ్చింది ఒకామె. అమ్మ తరపున దూరపు బంధువు. ఆమె తనకంటే వయసులో రెండేళ్ళే పెద్ద. అంత చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయాడు. అనాధ అయిపోయింది. పిల్లలు లేరు. ఆమె అంత అందగత్తె కాదుగానీ కళగా ఉంటుంది. పెద్దపెద్ద కళ్ళు. ఆ కళ్ళనిండా చెప్పలేనంత దిగులు. ఆమె కళ్ళలో దిగులు తను చూడలేకపోయేవాడు. ఆడవాళ్ళంటే ఆమడ దూరంలో ఉండే తను ఆమె మీది సానుభూతితో ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆమె కూడా తనతో చాలా అభిమానంగా మాట్లాడేది. తనకి చిన్నప్పటినుంచి కూడా రెగ్యులర్ గా ఎక్సర్ సైజు చేయడం అలవాటు. తను ఎక్సర్ సైజులు చేస్తుంటే ఆమె ఆసక్తిగా చూస్తూ వుండేది.
తనకి కరాటేలో బ్లాక్ బెల్టు వచ్చిన రోజున తనకంటే ఆమె ఎక్కువ సంతోషపడినట్లు కనబడింది.
తనకి అన్నీ రెగ్యులర్ హాబిట్స్ రోజూ ఎక్సర్ సైజు చేయడం, ఆరోగ్యం కలిగించేవి మాత్రమే తినటం, శ్రద్ధగా చదువుకోవటం. ఇదీ తన దిన చర్య. తనకి వున్న సరదా అల్లా, ప్యాషనబుల్ గా వుండే బట్టలు వేసుకుని నీటుగా వుండటం. అంతే! తను ఏ బట్టలేసుకున్నా "ఈ బట్టల్లో నువ్వు బాగున్నావ్" అని కాంప్లిమెంట్ ఇచ్చేదామె.
తన కజిన్ సిస్టరు ఫ్రెండు తనకి పరీక్ష పెట్టినప్పటికి తను చిన్న పిల్లాడు. తనకి అప్పట్లో ఏమీ తెలియదు.
కానీ యిప్పుడు తను వయసొచ్చిన మొగాడు. ఆమె మనసు తనకి అర్ధం అయ్యింది. ఆమె భర్త చనిపోయాడు. కానీ కోరికలు చచ్చిపోవుగా!
అందుకే అస్పష్టంగా ఆమె తన ఇష్టాన్ని వెల్లడి చేస్తుంది.
అది తలుచుకుంటేనే తనకు అదోరకమయిన వికారం కలిగింది. దానితోపాటే ఆమె మీద జాలి కూడా కలిగింది. తను దూరం దూరంగానే వున్నా, ఆమె మాత్రం రోజు రోజుకీ చనువు పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే వుండేది. ఏదో వంక కలిపించుకుని, తనని తాకుతూ వెళ్ళేది. ఏదయినా అందించవలసి వస్తే తప్పనిసరిగా వేళ్ళు తాకించేది. ఆమె గనక గ్లాసుతో ఏదయినా ఇచ్చిందంటే ఆమె వేళ్ళు గ్లాసు అంచుని కాకుండా గ్లాసు మొత్తాన్ని పట్టుకుని వుండేవి. ఆ వేళ్ళని తాకకుండా తను గ్లాసు అందుకోవడం అసంభవం అయ్యేది.
చిరాకు ప్రదర్శించి, తన అయిష్టాన్ని ఆమెకు అర్ధమయ్యేలా చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాడు తను.
కానీ....అంత నిర్దయగా ప్రవర్తించటం తనవలన అయ్యేది కాదు. రాక్షస వంశంలో పుట్టిన తనకు రాని లక్షణం....నిర్దయ.
ఆ నిర్దయ గనక తనకు వుండి వుంటే.... ....తను ఆమెకి చాలా స్పష్టంగా తెగేసి చెప్పి వుండేవాడు జాగ్రత్తగా వుండమని.
చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాడు కూడా. కానీ అన్నిసార్లూ చెప్పలేక వాయిదా వేసుకున్నాడు. కానీ ఒక రోజున ఒక విచిత్రం జరిగింది.
ఇలాంటి వేషాలు వెయ్యొద్దని తను ఆమెతో చెప్పెయ్యాలనుకున్నాడు. సరిగ్గా తను అనదలుచుకున్న మాటలు ఆమే తనతో అంది. ఒక రోజున ఎవరూ లేకుండా చూసి తనతో అందామె.
"అసలు నీ ఉద్దేశ్యమేమిటీ?"
"ఏ విషయం గురించి?" అన్నాడు తను అయోమయంగా.
"తప్పుకదూ! నా మీద అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నువ్వు" అంది. ఊహించని ఈ ఎదురు దాడికి తన గొంతు తడారిపోయినట్లయిపోయింది.
"ఏం ఆలోచనలు?" అన్నాడేగానీ ఆమె మాటల అంతరార్ధం తనకి అప్పటికే అర్ధమైపోవటం మొదలెట్టింది.