Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 28


    'డాక్టరు సునంద కూడా ఈ కోవకు చెందినదే అయివుండవచ్చు!' అనుకున్నాడు నవీన్.

    తన ఎదుట కుర్చీలో కూలబడినట్టు మౌనంగా కూర్చున్న నవీన్ నే చూస్తూ, ఏమీ మాట్టాడాలో అర్ధం కావడంలేదు డాక్టరు సునందకు.

    తోటి పోలీస్ ఆఫీసరు వీరేష్ మరణ వార్తను ఆమె పేపరులో చదివి వుంది. ఆ దిగులు నుంచి నవీన్ ఇంకా కోలుకోలేదని ఆమె గ్రహించింది.

    "మీరు ప్రమాదంనుంచి బయటపడినట్టు పేపరులో చదివి చాలా సంతోషించానండి! ఇన్ స్పెక్టరు వీరేష్ గారు మరణించారనే వార్త నన్ను కలవపెట్టింది వెరీ సారి సర్...." యాదృచ్చికంగా అన్నదేగాని, ఆమెకు నిజంగానే ఇప్పుడు దుఃఖం ముంచుకువస్తున్నది. అది సహజం. మానవ ప్రవృత్తే అంత....

    నవీన్ మౌనంగా అలాగే కూర్చున్నాడు. అతని ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. మనిషి నిండుకుండలా తొణకడు బెణకడు.

    తలెత్తి, అతని కళ్ళలోకి చూడలేకపోతున్నది డాక్టరు సునంద.

    "థాంక్స్ డాక్టర్ థాంక్స్....మీరు కనబరిచిన కండొలెన్స్ కు ణా కృతజ్ఞతలు. ఇన్ స్పెక్టరు వీరేష్ ఒక అనాథ. 'నా' అనే వారెవ్వరూ లేరు. న్యాయాన్ని ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపించాలనే పరమధ్యేయంతోనే ఏరి కోరుకుని మరీ ఈ వృత్తిలోకి వచ్చాడు. ఆ కర్తవ్య పాలనలోనే ప్రాణాలను పోగొట్టుకున్నాడు...." నవీన్ గొంతు బొంగురు పోయింది. కనుకొలకులలో కన్నీరు సుడులు తిరిగింది.

    నవీన్ కంట కదులాడుతున్న కన్నీటిని చూసి క్షణకాలం చలించి పోయింది డాక్టరు సునంద. ఆమె అసలే సున్నిత మనస్క.                        
        
    అప్పటి వరకు మొండిగా వున్న ఆమెలో మార్పు వచ్చింది. రెండవ ఆలోచన మొదలయింది. అది ఆమె సహజ నిజానికి చిహ్నం.

    "డాక్టర్! వచ్చిన విషయాన్ని చెప్పడం అసలు మరిచాను. సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ లో టెర్రరిస్టులను చివరిసారిగా మీరే చూశారు. మీరు వాళ్ళను చూడలేదన్నా, మీకేమీ తెలియదన్నా పోలీసులను నమ్మించ గలరేమో కానీ, టెర్రరిస్టులను నమ్మించలేరు. తమను గుర్తించిన వాళ్ళను ప్రాణాలతో వదలరు టెర్రరిస్టులు. కనుక, మీ లైఫ్ రిస్క్ లో వుంది. మీకు రక్షణగా ఇక్కడ మా సిబ్బందిని వుంచాను. అది చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను...." గబుక్కున లేచి వెనుదిరిగాడు నవీన్.

    "ప్లీజ్! ఆగండి....ఒంటరిగా మాట్టాడాలి...." ఖంగారుగా లేస్తూ అన్నది సునంద.

    ఠక్కున ఆగాడు నవీన్. అతను ఆశించింది అదే!

    "ఇలా రండి...." లోని గదిలోకి దారితీసింది సునంద. అనుసరించాడు నవీన్.

    ఆమె సరాసరి ఆపరేషన్ థియేటరులోకి వెళ్ళింది. అది సౌండ్ ఫ్రూఫ్ గది. ఒక మూలగా ఎ.సి. మెషిన్ వుంది. ఆపరేషన్ టేబులు, పరికరాల అలమర రిఫరెన్స్ బుక్ షెల్స్....

    స్ప్రింగ్ డోర్ లాక్ చేసి, ఎ.సి. ఆన్ చేసింది డాక్టరు సునంద.

    గదిని పరిశీలనగా చూస్తున్నాడు నవీన్.

    గదిలో మెర్క్యురీ లైట్లను తీసివేసి, స్టాండ్ మీద వున్న స్క్రీన్ ప్రొజక్టరును ఆన్ చేసింది డాక్టరు సునంద.

    ఆశ్చర్యంగా కనులు చిట్లించి మరీ చూస్తున్నాడు నవీన్.

    సూపర్ ఫాస్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు డాక్టరు సునంద లిప్ స్టిక్ కి వున్న మైక్రో కెమెరాతో తీసిన యువజంట ఫోటో స్పష్టంగా కనుపించింది.

    "ఫోటో ఎవిడెన్స్! రిమార్క్ బుల్!" ఉద్విగ్నతతో అన్నాడు నవీన్.

    తృప్తిగా నవ్వుతూ లైటు వేసింది డాక్టరు సునంద.

    ఆ యువ జంటకు తనకూ జరిగిన సంభాషణ, తను వాళ్ళను బెదిరించడం, ఆ యువతి తనను వెంబడించడం వగైరా గత సంఘటనలను పూసగుచ్చినట్టు చెప్పింది సునంద. గుర్తుచేసుకుంటూ మరీ చెప్పింది.

    "థాంక్స్ డాక్టరు సునందా! ఒక సీక్రెట్ ఏజంటులా చాలా తెలివిగా వ్యవహరించారు. ముందుచూపుతో ఫోటో కూడా తీసిన మిమ్ము నిజంగా అభినందిస్తున్నాను. ప్రజంలంతా మీలా సహకరిస్తే మా పని సుళువవుతుంది!" అన్నాడు నవీన్ ఉత్సాహంగ.

    నవీన్ లో ఇప్పుడు నిరుత్సాహం లేదు. నిర్లిప్తత అసలే లేదు.

    "మీరు మెచ్చుకుంటున్నంతగా నేనేమీ ఆలోజించలేదు! మా కజిన్ ఒకరు స్టేట్స్ నుంచి బ్యూటీ కిట్ పంపారు. అందులో ఒక లిప్ స్టిక్ కు మైక్రో కెమెరా ఫిక్స్ చేసి వుంది. ప్రయాణంలో వెంట తెచ్చుకున్నాను. అది ఎలా పనిచేస్తుందో చూద్దామని ప్రయత్నించాను. అదృష్టవశాత్తు ఫోటో బాగానే వచ్చింది! ఆ తరువాతే ఆ ఫోటో ప్రాముఖ్యతను గుర్తించగలిగాను!" సన్నగా నవ్వి చెప్పింది డాక్టరు సునంద.

    మాక్రో ఫిల్మ్ చుట్టను జేబులో వేసుకుంటూ నిదానంగా చెప్పాడు నవీన్: "ఒక వేళ_ అవసరమైతే_ ఒకసారి మీరు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పవలసి వుంటుంది డాక్టర్!"

    ఆ మాటతో బెదిరిపోయింది డాక్టరు సునంద. అతని కోర్కెను నమ్రతగా తిరస్కరించింది:

    "అమ్మో! కేసులు కోర్టులు అంటూ నన్ను ఇబ్బందిపెట్టకండి, సర్! ఇటువంటి ఏవో వస్తాయనే మొదట మీకు ఈ విషయం చెప్పలేదు. అయితే, దర్యాప్తులో మీరు కనబరుస్తున్న శ్రద్ద, చేస్తున్న శ్రమ, ప్రాణాలమీద ఆశ వదులుకొని మరీ చేస్తున్న మీ సాహసం చూసి, ఇహ ఉండబట్టలేక, ఒక పౌరురాలిగా నా ధర్మాన్ని నేను నెరవేర్చుదామనే ఉద్దేశంతోనే బయటపెట్టాను, అంతే!" స్పష్టంగా చెప్పింది.
 

 Previous Page Next Page