Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 27


    ఈలోగానే....

    స్పృహ కోల్పోయి పడివున్న కానిస్టేబుల్స్ భుజాలకు వ్రేలాడుతున్న స్టెన్ గన్స్ ను చెరొకటి అందుకున్నారు పోలీస్ ఆఫీసర్లు.

    సాయుధుడు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. అది చాలు అధికార్లకు!

    అటువైపు స్టెన్ గన్స్ గురిపెట్టారు ఇరువురూ.

    అయితే, వీరేష్ చేయి పట్టుఇవ్వడం లేదు. గం కు గురి నిలవడం లేదు. కళ్ళు తేలిపోతున్నాయి....

    ప్రమాదం ఏదో పొంచి వున్నదనే అనుమానం సాయుధులకు కలగనే కలిగింది. వాళ్ళు ఎలర్ట్ అయ్యారు.

    కౌంట్ _ డౌన్ ప్రారంభం అయింది....


                          *    *    *


                     తూర్పు దిక్కు ఎరుపెక్కుతున్నది.

    సూర్యగోళం పైపైకి ఎగబ్రాకుతున్నది.

    అదొక వల్లకాడుగా కనుపిస్తున్నది. బూడిద, ఎముకల పోగులు.   

    అక్కడే అంతకు ముందే మానవ శరీరాలను తగులపెట్టిన కారుకంపుతో ప్రకృతి కలుషితమయింది. ఆదిమానవ నాగరికతకు అది చిహ్నం.

    సూర్యకిరణాలు తాకిడికి బందీ లిరువురూ మెల్కొన్నారు.

    బందీల పాక చుట్టూ తుపాకులు ఎక్కుపెట్టిన సాయుధులు.

    ఆషా శీలాన్నీ కాపాడడానికి నలుగురు సాయుధులను అంతకు ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు కిరణ్ కుమార్.

    వాళ్ళ శవాలు కుళ్ళిపోతున్నందున తగులబెట్టక తప్పలేదు!

    "ఏ నేరస్తుడూ చేయని విధంగా అత్యంత అమానుషంగా నా మనుషులను చంపడమేకాక, వాళ్ళ శవాలను సయితం కనిపించకుండా కాల్చి బూడిదపాలు చేశారు. పైగా ధైర్యంగా ఇక్కడే తిష్ఠ వేశారు.... నిన్న జరిగిన ఎదురు కాల్పులలో మావాళ్ళు చాలామంది చనిపోయారు. ఒకడు బందీగా పట్టుబడిపోయాడు. అప్పుడే అనుకున్నాను_మా స్థావరం గురించి పోలీసుల వేట ప్రారంభమయిందని. మీ ఇద్దరూ మా స్థావరానికి చేరిన కొద్దిగంటలలోనే పోలీసుల గాలింపు చర్యలను మొదలుపెట్టారు. అంటే, మీరే వాళ్ళకు సిగ్నల్స్ ఇచ్చివుండాలి! నా సహచరులను మట్టుపెట్టిన విధంగానే మీ ఇద్దరినీ చంపి, మీ శరీర భాగాలను పోలీసు శాఖకు బహుమతిగా పంపుతాను!"

    తోక తొక్కిన  త్రాచులా బుసలుకొట్టాడు కమాండరు. పళ్ళు పటపట కొరికాడు. కళ్ళు చింత నిప్పులయాయి.

    "కమాండర్! వాళ్ళు నలుగురూ అత్యాచారానికి పాల్పడబోయారు. ఏ మగాడు చూస్తూ ఊరుకోగలడు? సహించలేకపోయాను. కాల్చిపారేశాను. ఇందులో ఆషా నిమిత్తమత్రురాలే, ఆమెను వదిలేయండి!" జరిగిన వాస్తవాన్ని వివరించాడు కిరణ్ కుమార్. దృఢ చిత్తంతో చెప్పాడు.

    "కట్టు కథ చెప్పకు మిస్టర్!" అంటూనే కమాండరు ఆవేశంతో రైఫిల్ బట్ తిప్పి కిరణ్ కుమార్ మాడు మీద ఒక్కటి బాదాడు.

    "అబ్బా...." ఆక్రందిస్తూ పడిపోయాడు కిరణ్ కుమార్.

    ఆతురతగా అతని దగ్గరకు పరుగెత్తింది ఆషా. తలను ఒడిలోకి తీసుకుంది. తడిమింది. చెంగు చించి కట్టు కట్టింది. నెత్తురుతో అది తడిసి పోయింది.

    కమాండరు చేతి సైగతో సాయుధులు వెంటనే ఆమెను వెనక్కు లాగారు. చాచి చెంపపెట్టు పెట్టారు. ఆమె కళ్ళు బైర్లుకమ్మాయి.

    "కామ్రెడ్స్ ! మనం వెంటనే ఈ స్థావరాన్ని ఖాళీ చేసేయాలి!"

    కమాండరు అనడమే తడవు, బందీలిద్దరి కళ్ళకు గంతలు కట్టారు సాయుధులు. వారి పెడరెక్కలు విరిచి కట్టారు. పట్టుకున్నారు. కదిలారు.

    మరుక్షణానే అక్కడి పాక మాడిమసైపోయింది.

    కమాండరు హృదయంలో బడబాగ్ని రగుల్కొంది....


                          *    *    *


          అది విషాద వార్త. పోలీసు వర్గాలలో నైరాశ్యానికి చోటు కల్పించిన వార్త.

          భయం కల్పించిన భయంకరమైన వార్త.

    ఎంతో ధైర్యశాలి, ఉజ్వల భవిష్యత్తు వున్న ఇన్ స్పెక్టరు వీరేష్ టెర్రరిస్టులు జరిపిన ఎదురు కాల్పులలో మరణించాడనే ఆ వార్త వినిన అన్ని స్థాయిల పోలీసు ఉద్యోగులు ఆవేదన చెందారు. ఆందోళన పొందారు.

    నవీన్ కు కుడిభుజంగా వున్న వీరేష్ మరణంతో, ముఖ్యమంత్రి కిడ్నాప్ కు సంబంధించిన దర్యాప్తు తాత్కాలికంగా కుంటుపడింది.

    దర్యాప్తును త్వరితగతిన కొనసాగించాలి, టెర్రరిస్టులను వేవేగమే పట్టుకోవలెననే ఆరాటం, ఉత్సుకతే వీరేష్ ను పొట్టన పెట్టుకున్నట్టు అనిపించింది నవీన్ కు.

    వీరేష్ లేని లోటు తనకు అడుగడునా కనిపిస్తూనే వుంది....

    దర్యాప్తులో తనకు ఎవ్వరూ సరిగా సహకరించలేకపోతున్నారు.

    అటేమో టెర్రరిస్టులు ఏ ఆధారమూ చిక్కనీయక తెలివిగా తప్పించుకు తిరుగుతున్నారు. రోజురోజుకు విజృంభిస్తున్నారు, పేట్రేగిపోతున్నారు, బలం పుంజుకుంటున్నారు.

    ఇటేమో ప్రజలు, పోలీస్ సిబ్బంది 'ఆఁ....టెర్రరిస్టులతో మనకు తగవు ఎందుకులే' అనే ధోరణితో తమకు తెలిసిన సమాచారాన్ని సయతం చెప్పడంలేదు.
 

 Previous Page Next Page