ధర్మలింగం వెళ్ళిపోయిన తరువాత వేదప్రకాశం సంద్యావందనం, దేవతార్చనా ముగించి భోజనానికి కూర్చొన్నాడు.
మడిచీరలో వున్న ఆయన భార్య శారదమ్మ నెయ్యి వడ్డించి అక్కడే కూర్చొంది. "భ్రమర చేతులు కాలితే పొయ్యి దగ్గర పొరపాటున కాలిందేమో అనుకొన్నాను. కావాలనే కాల్చుకొందని ధర్మలింగం వచ్చి చెబితేగాని తెలియలేదు. రాజభవనం నుండి ఆయన రాయబారం తెచ్చాడంటే నాగుండె ఝల్లుమంది. మళ్ళీ ఏదైనా ప్రళయానికి సూచన కాదుకదాని నా మనసు శంకిస్తూంది." "ధర్మలింగం ఈ విషయం మనదాకా తీసుకురావడం ఒకవిధంగా మంచిదనే నా ఉద్దేశం. ఎందుకంటే ఈ సంగతి మనకు తెలిసి వుండడం వల్ల మన జాగ్రత్తలో మనం ఉంటాం" అన్నాడాయన.
"జాగ్రత్త అంటే ఏం జాగ్రత్త? ఒంటిస్తంభం మేడ కట్టించి ఉంచుతారా?"
"భ్రమరాంబికకు మనం వెంటనే వివాహం చేసి పంపాలి. అదే ఈ సమస్యకు సరైన పరిష్కారం"
"ఇంత ఎకా ఎకీ మంచి సంబంధం దొరకాలి కదా?"
"ముందు ప్రయత్నించి చూడాలి కదా?"
"ఏదో ఒక సంబంధం అనుకొంటే భ్రమర పెళ్ళి రెండేళ్ళ క్రితమే జరిగిపోయేది. అన్ని విధాలా మంచి సంబంధం చేయాలనే కదా ఆగింది?"
"ఆగడానికి వీల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాం? దొరికిన దానితో సరిపుచ్చుకోవాలి. అన్ని విధాలా చూసి నచ్చినవి, విధివశాత్తు తలక్రిందులైనవి ఎన్ని లేవు? అసలు బ్రహ్మలిఖితం ఎలావుందో? ఉన్నది చెరుపలేం! లేనిది వ్రాయలేం"
"వేదాంతం చెప్పుకోవడానికైతే బాగుంటుంది కాని, జీవితంలో అన్వయించుకోడానికి బాగుండదండీ. యింత వేదాంతం తెలిసినా మనసు మోహపాశ బద్దమౌతూనే వుంటుంది"
నువ్వనేది నిజమేలే!" ఒక నిట్టూర్పు విడిచారు వేదప్రకాశం "భ్రమరాంబికను ఏ డాక్టరుకో , ఇంజనీరుకో ఇవ్వాలన్న కోరిక లేదు నాకు. మంచి సంప్రదాయం , తినడానికి, ఉండడానికి ఇబ్బందిపడని కుటుంబమైతేచాలు"
"మనం ఏ కాలంలో వున్నామో మీరింకా గుర్తించకపోతే ఎలాగ? అమరం చదివినవాడికో, వేదం చదివినవాడికో అదే గొప్ప సంబంధమని ఇచ్చే కాలంకాదు! మన బంధువుల్లో మెరికల్లాంటి కుర్రవాళ్ళున్నారండీ! డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాలకు వెళ్ళొచ్చినవాళ్ళు, మనం తూగలేకపోతే కదా ఏదో ఒక సంబంధమని సరిపెట్టుకోవాల్సింది? ఇక మన అమ్మాయికేం తక్కువ? చక్కని చుక్క సంగీత సరస్వతి, నృత్యమంజరి, ఏ పిలక పండితులవారికో ఇస్తానంటే అసలు భ్రమరే ఒప్పుకోదు"
"డాక్టరైనా, ఇంజనీరైనా -ఎంత పెద్ద చదువు చదివిన వాడైనాసరే! సంప్రదాయం లేకపోతే వియ్యమందలేను!"
"అన్నిటికన్నీ కావాలంటే ఇక అమ్మాయి పెళ్ళి చేసి పంపినట్టే"
"అందుకే నేను చెప్పేది. కొన్నిటికి మనం రాజీ పడాలి. ప్రస్తుతం నా ముందున్న కర్తవ్యం భ్రమరాంబిక పెళ్ళి తక్షణం చేసి అత్తారింటికి సాగనంపడం. రేపటినుండి ఇదే పనిమీద తిరుగుతాను."
గుమ్మంలో చీరచెంగు మెలిపెడుతూ తల్లిదండ్రుల సంభాషణ వింటున్న భ్రమర కల్పించుకొంటూ అంది. "ఇప్పుడు ఏం ప్రమాదం సంభవించబోతుందని మీరు భయపడుతున్నారు?"
"మీ మేనత్తపోలిక నీకూ వస్తుందేమోనని భయం. రాచకన్ను పడితే రాళ్ళయినా పగులుతాయట" అంది తల్లి.
"నేనూ మా మేనత్త అంత అమాయకురాలిని కాదు. అతడు తండ్రి అంత దుర్మార్గుడు కాదు. అతడి గురించి భయపడితే ఇందాకా మేనేజరుగారు అన్నట్టు కర్రనుచూసి పామని బయపడ్డట్టే. అతడు నన్నేం చేయగలడు?"
"కర్మకాలితే కర్రే పామై కరుస్తుంది తల్లి. అతడు నిన్నేమీ చేయలేకపోవచ్చునేమో గాని ఈ సంఘటన గురించి నలుగురికీ తెలిస్తే చిలువలు పలువలై పోతుంది. అనవసరంగా నీ జీవితం అల్లరి పడుతుంది. పెళ్ళి కావలసిన పిల్లవు. అలా జరుగడం మంచిదా? మీ నాన్నగారన్నట్టు నీ పెళ్ళివెంటనే జరిగిపోవడమే మంచిదని నా ఉద్దేశ్యం కూడా. కాని, మంచి సంబంధం కుదరాలి. మరి , ఆ మల్లన్న దయ ఎలా వుందో!"
* * *
వేదప్రకాశం సల్పిన తీవ్ర ప్రయత్నాల ఫలితంగా, నాలుగోరోజుకల్లా పెళ్లి చూపులకు వాకిట్లో బండి దిగారు పెళ్ళికొడుకు వాళ్ళు! బాగా దగ్గరి సంబంధమే శారదమ్మ తమ్ముడికి బావమరిది ఈ అబ్బాయి. శారదమ్మ కోరినట్టు డాక్టరూ, ఇంజనీరూ కాకపోయినా హైదరాబాద్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేస్తున్నాడు. ఇరవై ఆరేళ్ళ వయసులో మంచి చురుకైన వాడిలా కనిపిస్తాడు. అందం మాటకి వస్తే అది భ్రమర చూసి చెపితేనే బాగుంటుంది.
చదువుకొన్నవాడు, ముఖ్యంగా ఉద్యోగస్తుడు అన్న తృప్తి శారదమ్మకి కలిగితే., ఒక పూట ఆతిధ్యం వాళ్ళింట్లో పొంది, వాళ్ళమాటా మన్ననా అన్నీ చూశాక మంచి సంప్రదాయస్తులే అన్న అభిప్రాయం వేదప్రకాశానికీ కలిగింది. ఇద్దరి జాతకాలు కూడా చక్కగా కుదిరాయి.
వాళ్ళు వాకిట్లో బండి దిగడంతో, వాకిట్లోనే అందరి కళ్ళకీ నీళ్ళిచ్చే బాధ్యత భ్రమర చెల్లెలు సంగీత తీసుకొంది. గుమ్మంలో అడుగుపెడుతుంటే శుభ్రంగా ఉతికిన తువ్వాళ్ళిచ్చి, కుర్చీలు వేసి మర్యాద చేయడం భ్రమర తమ్ముడు మల్లిఖార్జునుడు చేశాడు.
తరువాత సంగీత సాయంతో వచ్చిన వాళ్ళందరికీ ఫలహారాలు, టీలు, ఇప్పుడు పూర్తిచేసింది శారదమ్మ.
పెద్ద పెద్ద గుమ్మాలతో, నల్లగా మెరుస్తున్న కర్ర స్తంభాలతో సువిశాలంగా వున్న ఆ ఇల్లు, ఒంటినిండా చింతపువ్వులా మెరుస్తున్న నగలతో వున్న శారదమ్మ వాళ్ళ సంపన్నత చాటుతుంటే, వాళ్ళు చేస్తున్న మర్యాదలు మరీ సంతృప్తిని కలిగించాయి వాళ్ళకు.
'అన్నివిధాలా మంచి సంబంధమే! ఇక అమ్మాయి కూడా బాగుంటే మా రాఘవ అదృష్టవంతుడే!' అనుకొంది పెళ్ళికొడుకు తల్లి ఈశ్వరమ్మ. "ఇక అమ్మాయిని తీసుకువస్తే బాగుంటుంది" అందామె.
పెళ్ళికొడుకు తండ్రి కుడి చెయ్యి ఎత్తి వాచీలోకి చూసి "ఇంకొక్క అయిదు నిమిషాలు ఆగండి. వర్జంపోతుంది" అన్నాడు. వర్జం వారాల విషయంలో తనకు బాగా పట్టింపు వున్నట్టుగా.