Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 27


    "ఎలాగో కూడా నేనే చెప్పాలా ఏంటి....నేను ఆడదాన్ని....నాకేం తెలుస్తాయి....మీరు మగవాళ్ళు....ఆ మాత్రం ఆలోచన చేయలేకపోతే ఇంకెందుకు..." కావాలనే ఎత్తిపొడిచిందతనిని....

    జగపతికి రోషం ముంచుకు వచ్చింది.

    "అయితే ఒక పని చేద్దాం...."

    "ఏమిటి....?"

    "నా భార్య ప్రతి శనివారం గుడికి వెళుతుంది....వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఆమెను మర్డర్ చేయమని కిరాయి మనుషులను మాట్లాడతాను. ఎలా చంపాలో వాళ్ళే చూసుకుంటారు"

    జగపతి తన ప్లాన్ వివరించాడు.

    "వద్దండీ....అలా కిరాయి మనుషులచేత చంపిస్తే ఏదో ఒకరోజు మనకే ప్రమాదం" అతని ఒడిలోకి వ్రాలుతూ అన్నదామె.

    ఆ స్పర్శకు జగపతి పూర్తిగా కరిగిపోయాడు.

    అలాగే ప్రియా....నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను....నీ కోసం నా సర్వస్వం వదులుకుంటాను" అంటూ అదే అవకాశంగా ఆమె ముఖం పైకి వంగాడు జగపతి.

    అతని నోటికి తన అరచేతిని సుతారంగా అడ్డువుంచి అతని ఒడిలో నుంచి పైకిలేచి సర్దుకుని కూర్చున్నది శ్రీప్రియ.  

    "మీరేమీ నాకోసం సర్వస్వం వదులుకోనక్కరలేదు....ముందు మీ భార్యను వదిలించుకుని తరువాత నన్ను పెళ్ళాడండి....అది చాలు...."

    "అలాగే తప్పకుండా చేస్తానన్నానుగా....కానీ చంపే ప్లాన్ ఏదీ తట్టడంలేదు...."

    "దానికి కూడా అంతసేపు ఆలోచించాలా ఏమిటి....సింపిల్ గా విషప్రయోగం చేయొచ్చుగా" ఎలా చంపాలో సూచన అందించిందామె.

    "డాక్టర్లు శవాన్ని పరీక్షచేస్తే...."

    "అసలు శవాన్నే మాయంచేద్దాం....ఆ విషయంలో నేను మీకు సహాయం చేస్తాను....ఇద్దరం కలిసి శవాన్ని ఊరిచివర పాతిపెడదాం....మీ భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పవచ్చు"

    "మంచి ఆలోచనే చెప్పావు శ్రీప్రియా....కానీ నా కూతురు....అదే నీ ఫ్రెండ్ అలేఖ్య వచ్చి అడిగితే ఏం చెప్పాలి?" మరో సందేహం వచ్చిందతనికి.

    "అది వచ్చి అడిగినప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు....ముందు ఇప్పుడు పని పూర్తిఅయ్యే మార్గం ఆలోచించండి...." అంటూ అతణ్ని ఆలోచించుకోనివ్వకుండా తొందర పెట్టిందామె.

    "ఓ.కె....ముహూర్తం ఎప్పుడు పెట్టమంటావో అదికూడా నువ్వే చెప్పు...."

    "ఎప్పుడో ఎందుకు....ఈరోజు రాత్రి చివరిసారిగా మీ ఆవిడతో ఎంజాయ్ చేయండి....రాత్రి ఏడు. ఎనిమిది గంటల మధ్య మీ పని పూర్తి చేయండి....ఆవేళలో అయితే మన పని సులువుగా వుంటుంది...." అంటూ అతని బుగ్గపై ఒక ముద్దిచ్చింది శ్రీప్రియ.

    ఆ మాత్రం దానికే అతను ఉప్పొంగిపోయాడు.

    సంతోషంతో తల వూపాడు జగపతి....

    చిరునవ్వుతో ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చింది శ్రీప్రియ....


                           *    *    *


    రాత్రి ఏడుగంటలు....

    అనుకున్న ప్లాన్ ప్రకారం భార్యకు భోజనంలో కలిపి ఇవ్వాలనుకున్న విషాన్ని ముందుగానే సిద్దంచేసి పెట్టుకున్నాడు జగపతి.

    అర్ధగంట ముందు ఫోన్ లో శ్రీప్రియ అతనికి ఫైనల్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది.

    పనిపూర్తి అయ్యేవరకూ ఆమె అతని గెస్ట్ హౌస్ లో వుంటానని, ఎప్పుడు అవసరం కలిగినా వెంటనే కాంటాక్ట్ చేయమని మరీ మరీ చెప్పింది శ్రీప్రియ.

    జగపతి ముందు జాగ్రత్తకోసం ఆరోజు వంటవాళ్ళకు సెలవు యిచ్చేశాడు.

    ఆ రోజు అతను....అతని భార్య తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు.

    "ఏమండోయ్ శ్రీమతిగారూ...."అంటూ ఆప్యాయంగా తన దగ్గరరకు చేరుకున్న భర్తవైపు ఆశ్చర్యంగా చూసింది వసుమతి.

    ఏరోజు లేనిదీరోజు....ఎంతో ప్రత్యేకంగా పిలవడంతో ఆమె ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నది.

    "శ్రీమతీ....ఈరోజు వంటవాడు శెలవు పెట్టాడు....వంట వండే శ్రమ నీకు తప్పడంలేదు....పోనీ....హోటల్ నుంచి మీల్స్ కారియర్ తెప్పించమంటావా?" ఎంతో ప్రేమను ఒలకపోస్తున్న భర్తవైపు అపురూపంగా చూసిందామె.

    "మీ ఇష్టమండీ....మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనెప్పుడు కాదన్నాను....చెప్పండి"

    ఆమాట కోసమే ఎదురు చూస్తున్నవాడిలా ఫోన్ లో చెప్పి మీల్స్ ఎరేంజ్ చేయమన్నాడు జగపతి.

    అతను ఫోన్ చేసిన పావుగంటకల్లా హోటల్ నుంచి క్యారియర్ వచ్చే ఏర్పాటు చేసింది శ్రీప్రియ....

    భార్యను పిలిచి భోజనం వడ్డించాడు జగపతి.

    అప్పటికే అతను చేయాలనుకున్న పనిని చేసేశాడు....

    ఆమెకు వడ్డించిన భోజనంలో విషం కలపబడిందని తెలుసు కాబట్టి ఆమెకు మాత్రమే కొసరి కొసరి వడ్డిస్తూ తను మాత్రం ఏమీ ముట్టుకోలేదతను.

    "అదేమిటండీ....మీరూ పెట్టుకోకుండా నాకు మాత్రమే వడ్డించారు"

    "ఎప్పుడూ చేసేది అదే కదూ....అందుకే ఈరోజు నేను నీ చేత ప్రేమగా తినిపించాలనుకున్నాను....తరువాత నువ్వు నాకు వడ్డించు...."

    భర్త మాటలు నిజమేనని విశ్వసించింది ఆ ఇల్లాలు.

    భోజనం చేసిన మరు నిమిషం నుంచే ఆమెలో మార్పురావడం మొదలయింది....

    వెంటనే భోజన పదార్ధాలన్నీ కిచెన్ లోని సింక్ లో కడిగేసి....ఆ గుర్తులు అక్కడ ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడతను.
 

 Previous Page Next Page