"తరువాతెం ముంది లత కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఏం చేస్తాం . మన ఖర్మ . ఊరుకో అని ఒదార్చాను. అధైర్యపడక ఎలాగయినా పోరి అయన ఈ పల్లెటూరు వదిలేలా చెయ్యమని భోధ పరచి వచ్చాను."
'ఛీ! ఎంత పని చేశావ్! పైగా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావా?"
"ఏమిటి వారిజా! ఇందులో అంత సిగ్గు మాలిన పని?"
"ఇంకా నెమ్మదిగా అడుగుతున్నావా? చిల్లపిల్ల దానికి తెలియక బంగారం లాంటి సంసారంలో కలతలు రేపుకుంటుంటే సర్దడానికి బదులు ఆ కలతలు మరింత రెచ్చగొడతావా? ఇప్పుడు దానికి లోటు వచ్చిందని అది ఏడవటానికి, నువ్వు ఒదార్చటానికి?
తనను మొగుడు అర్ధం చేసుకోవటం లేదే అని బాధపడుతుందే కాని, తను మొగుణ్ణి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించదెం? దాని నైలాన్ చీరలు అయన కిష్టం లేకపోయినా సహించటం లేదా అయన? పంచ కోవటం దానికి నచ్చక పోయినా సహించాలి.
అసలు ముందు భర్తను ప్రేమించటం నేర్చుకోవాలి ప్రేమతో అయన మనస్సు వశం చేసుకుని తర్వాత నెమ్మది మీద తన కోర్కె తీర్చుకోవాలి దానికి సర్ది చెప్పటానికి బదులు రెచ్చగొట్టి వచ్చావు. భర్తతో పోరమని సలహా యిచ్చావు. నీ సలహా ప్రకారం అది భర్త చెవులో పోరు పెడితే , ఆ పోరు పడలేక అయన దానిని వదిలేస్తే ......దాని గతి ఏమవుతుంది? నువ్వు పోషిస్తావా. దాన్ని? మనలో కనీసం అది ఒక్కతి అయినా సుఖంగా ఉండటం నీకు నచ్చలేదులా ఉంది."
అత్యంత తీక్షణంగా పిడుగులు కురిపిస్తూ మాట్లాడుతోన్న వారిజను తెలతెలపోతూ చూశాడు రవి.
చివరకు తలవంచుకుని "పొరపాటయిపోయింది , వారిజా!" అన్నాడు . వారిజ ఏం సమాధానం చెప్పలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది . కొంతసేపాగి రవి నసుగుతూ అడిగాడు.
"వారిజా! నీ దగ్గిర డబ్బే మైనా ఉంటే .....ఇంట్లో యిబ్బందిగా వుంది.." వారిజ కెంతో కోపం వచ్చింది. నా దగ్గిరేం లేదని అనేయ్యబోయింది. నోరు రాలేదు. యిరవై రూపాయలు తెచ్చి రవి చేతిలో విదిలిస్తున్నట్లుగా పెట్టింది. ఆ విదిలింపులు రవికి లెక్క లేదు. సంతోషంగా వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిన వైపే దిగులుగా చూస్తూ నిల్చుంది వారిజ.
రవి వారిజ దగ్గర్నుంచి తిన్నగా లత దగ్గర కెళ్ళాడు. "లతా! నీకు తెలుసా? వారిజ ఈ ఊళ్ళోనే వుంటోంది." అన్నాడు. ఆశ్చర్యమూ, సంభ్రమమూ ఒక్కసారిగా కమ్ముకున్నాయి లతలో.
"నిజంగానా! ఎక్కడుంటుంది? ఎప్పుడొచ్చింది? ఎందు కొచ్చింది? ఎన్నాళ్ళు ఉంటుంది?" గబగబ అడిగింది.
కుర్చీలో జారిగిలబడి కూర్చుని విసుగ్గా అవలించాడు రవి. "ఇక్కడేదో ఉద్యోగం చేస్తుంది. పంతులమ్మగా! ఎన్నాళ్ళు ఉంటుందో?"
"పంతులమ్మగానా? సినిమా వదిలేసి ......హు! సుఖ పడటం చేతకాదు!" పకపక నవాడు రవి. " వారిజ నిన్ను గురించి ఇలాగే అంటోంది. నీకు సుఖపడటం చేత కాదుట!"
"నాకు సుఖపడటం చేతకాదంటోందా? ఏవుందిక్కడ సుఖం? గుడ్డు చాకిరీ, గొడ్డు బతుకు! సినిమాలా షికార్లా - సరదాలా?" దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ అంది.
"అయ్యో! వారిజక్కయ్య ఇక్కడుందని నాకు తెలిస్తే మొన్న బేంక్ ఏజెంట్ గారింట్లో పెళ్ళి పేరంటానికి ఒక పట్టు చీర ఎరువడిగే దాన్ని. నా చీరలన్నీ ఒకసారి కట్టేసుకున్నానే!"
"ఏమో! దాని దగ్గర పట్టు చీరలే వున్నాయో సిల్కు చీరలే వున్నాయో నాకు తెలీదు. నేను చూసేసరికి మాత్రం మిల్లు చీరతో వుంది. మెడ్రాస్ లో మాములు చీరలే కట్టేది."
"అవన్నీ యెక్కడో దాచి వుంటుంది. అంత గొప్ప తార - మంచి మంచి చీరలు లేకుండా ఎలా వుంటాయి?" "ఏమో! చీరల సంగతి నేనడగలేదు."
"అసలు సినిమాల్లో ఎందుకు మానేసిందట?"
"అదీ తెలీదు. అసలు సరిగ్గా మాట్లాడుతుందేమిటి? ఓయబ్బో ! ఎంత టేక్కని/ అయితే ఒకటి, అడిగినప్పుడల్లా డబ్బు లిస్తుంది."
"ఇస్తుందా!" సంభ్రమంగా అడిగింది లత.
"ఆ! కాస్త విసుగ్గా ముఖం పెట్టి చిటచిట లాడుతుంది. కాని, చివరకు యిస్తుంది."
"మా ఆయనతో చస్తున్నాన్నయ్యా! ప్రతిదానికి లెక్కలు చెప్పాలి. ఇది అవసరం. ఇది అనవసరం అంటూ సణుగుళ్ళు. ఇక మీదుట హాయిగా వారిజక్కయ్యను అడుగుతాను.'
'అడుగు , ఇవకేం చేస్తుంది? తనకేం మొగుడా? పిల్లలా? మనకియ్యకపోతే డబ్బు ఏం చేసుకుంటుంది?" లత ,ముఖం సంభ్రమంతో వికసించింది.
"నాకు వడ్డించేయ్యి లతా! ఇవాళ రాత్రి కెళ్ళి పోతాను " అన్నాడు రవి.
"బావగారు వచ్చే వరకూ అగవూ?" అయన ఏ లైబ్రరీ లోనో కూర్చుని రాత్రి ఏ తొమ్మిదింటికో వస్తారు. నాకు టైం లేదు." "పద! నేను కూడా తినేస్తాను."
రవితో పాటు తనూ భోజనం ముగించి రవిని సాగనంపి పడుకుంది లత. లైబ్రరీ నుండి తొమ్మిది దాటాక వచ్చాడు రామచంద్ర . తలుపు తట్టగా తట్టగా ఎప్పటికో తెరిచింది లత.
"నిద్రపోతున్నావా?" ఆప్యాయంగా అడిగాడు రామచంద్ర.
"ఊ!" బద్దకంగా ఆవులిస్తూ అంది.
"పద! అన్నాలు తిందాం."
"నేను తినేశాను. "ఒక్క నిముషం మనసు కలుక్కుమన్నా సర్దుకున్నాడు రామచంద్ర.
"పోనీలే! మంచి పనే చేశావు. నాకు వడ్డించేయ్యి."
"నేను వడ్డించలేను బాబూ! నాకు నిద్ర ముంచు కొస్తుంది. అన్నీ అక్కడున్నాయి వడ్డించుకోండి."
వెళ్ళి పక్క మీద వాలిపోయింది లత. ఒక్క క్షణం ఊసురుమనిపించినా , తనను తాను సముదాయించుకున్నాడు రామచంద్ర. బట్టలు మార్చుకుని కాళ్ళూ చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు రామచంద్ర. అన్నీ కనిపించాయి, కాని పెరుగు కనిపించలేదు. సాంబారు వేసుకు తిని, పెరుగు కోసం అంతటా వెతికాడు. ఎక్కడా లేదు.
"లతా!' మృదువుగా పిలిచాడు పలకలేదు.
"లతా!' గట్టిగా పిలిచాడు.
"అబ్బా !" అని విసుక్కుంటూ వచ్చింది లత.
"ఎందుకూ....? మీకు వడ్డించాలి కదూ....! నేనసలు నిద్ర పోకూడదు. మీరు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేవరకూ పడిగావులు పడుతూ కుచోవాలి. ఛీ....ఛీ.....వెధవ బ్రతుకు ! మొగవాడికి బానిసలా పడి వుండటం కన్న వేరే మోక్షం లేదు. మేమూ మనుష్యులమేననీ , మాకూ కష్ట సుఖాలుంటాయనీ గుర్తింపే లేదు మొగజాతికి .యింకా ఎన్నాళ్ళో ఈ బానిసత్వం? ఏనాటికి ఈ మొగవాడి అహంకారం అణుగుతుందో!"
నివేరపోయి చూశాడు రామచంద్ర. మాట్లాడకుండా కంచంలో చెయ్యి కడిగేసుకుని లేచిపోయాడు. రుసరుసలాడుతూ వెళ్ళి తన మంచం మీద పడుకుంది లత.
ఎలాంటి వాళ్ళకు అలాంటి స్నేహితులు దొరుకుతూ వుంటారు. లతకు తగిన స్నేహితురాలు పొరుగింటి నాగమణి . వచ్చిన ప్రతి సినిమాకు తను బయలుదేరుతుంది. లతను కూడా బయలు దేరతీస్తుంది.
"భయంకర నారి సినిమా వచ్చిందట! వెళదామా?" అంటూ వచ్చింది నాగమణి లత దగ్గరకు. నాగమణికి పెళ్ళి కాలేదు. పైగా వాళ్ళు ధనవంతులు ఇరుగు పొరుగు అందర్లో లతను నాగమణి ఆకర్షించటానికి ఆవిడా ఐశ్వర్యం కూడా ఒక కారణం. నాగమణి మాటలకూ ముందు ఉత్సాహం చూసినా అంతలోనే కుంగిపోయింది లత.
"ఎలా వస్తాను? ఆయనగారేమో , తొమ్మిదయితే కాని రాదు. అప్పుడింక ఎప్పుడు 'అనుమతి " తీసుకోవాలి? ఎప్పుడేల్లాలి / చెప్పకుండా వెళితే ఇంకేమన్నా ఉందా? హమ్మనాయనో ! చేసే ఉద్యోగం లేకపోయినా అహంకారం జాస్తి."
"పోనీలే ! ఇవాళడుగు రేపేళదాం. నీకోసం నేను రేపటి వరకూ ఆగుతాను.' ఉదారంగా ప్రకటించింది నాగమణి. స్నేహితురాలి త్యాగానికి ఉబ్బి తబ్బిబ్బయి పోయింది లత. తను వచ్చేసరికి ఇంకా నిద్రపోకుండా కూర్చున్న లతను చూసి ఆచర్యపోయాడు రామచంద్ర.
"ఏం లతా! పడుకోలేదూ?" అన్నాడు మృదువుగా . "ఊహు .....ఇంకా అన్నం కూడా తినలేదు. "ఈసారి పూర్తిగా మతిపోయింది రామచంద్రకి.
"ఇదేమిటి. యింత ప్రేమ? అకస్మాత్తుగా!"
'అలాగే మాట్లాడతారు. నాకెప్పుడూ ప్రేమే! నిద్ర మేల్కొలేను. అంతే?" మూతి ముడుచుకుంది లత.
తెల్లని బట్టల్లో , వెన్నెల్లో వెన్నెల కన్నా మెరిసిపోతోన్న లత ఎంతో ముద్దుగా అనిపించింది రామచంద్రకు. ఆవిడ బుంగమూతి మీద ముద్దు పెట్టుకుని క్షమించండి రాణి గారూ మీ ప్రేమ నాకు తెలీదు?" అన్నాడు హాస్యంగా.
"అంటే?" అంది కోపంగా కనుబొమలు ముడిచి.
"ఇలాంటి సమయాల్లో కోపం తెచ్చుకోకూడదు. 'అంటూ చక్కిలిగిలి పెట్టాడు అతను. అప్రయత్నంగానే కిలకిల నవింది లత.
"పద! వడ్డించు." అన్నడు బట్టలు మార్చుకుంటూ. భర్తకు వడ్డించి తనూ కూర్చుంటూ అడిగింది లత. "ఇవాళ నాగమణి వచ్చి సినిమా కేళదామంది, మిమ్మల్ని అడిగి రేపు వస్తానన్నాను."