"రేణూ!" దెబ్బతిన్న పక్షిలా అరిచారు ప్రసాదరావుగారు. "రేణూ! ఏమిటమ్మా ఈ మాటలు. నిన్నేదో ఇంట్లోంచి పోమ్మన్నట్టు మాట్లాడుతున్నావు . నీ తల్లీ, తండ్రీ ఇంకా బతికే ఉన్నారు. అయన రుద్దకంఠంతో అన్నారు.
సావిత్రి కళ్ళు తుడుచుకుంది. "రేణూ, ప్రతి తల్లి, తండ్రి పిల్ల బరువని పెళ్ళి చేసి పంపరమ్మా. కూతురు సుఖపడాలని , తనకో ఇల్లు, సంసారం , భర్త పిల్లలు అండ ఉండి సుఖించాలని చేస్తారు. అంతమాత్రాన ఆడపిల్ల కష్టంలో ఉంటే ఆదుకోరనా అలా మాట్లాడుతున్నావు.....?"
"రేణూ.....పిల్లని కన్నాకయినా కన్న మనసు అర్ధం కాలేదా....?"
'డాడీ , నిజమే పెళ్ళి చేశారు. సుఖపడాలనే కానీ, ఆ పెళ్ళి పెటాకులూ అయి రక్షించాల్సినవాడే నరకం సృష్టిస్తుంటే , "ఆడపిల్లకి ఇంకా 'ఆడే" స్థానం అనడం న్యాయమా?" 'ఆడపిల్ల" పుట్టిందగ్గర నుంచి ఎప్పటికయినా 'ఆడదే" అన్నట్టు, ఆడపిల్లకి పెళ్ళి చేసి పంపడం ఒక్కటే ధ్యేయం అన్నట్టు ఎందుకనుకుంటారు? ఏం, ఆడపిల్లని మగపిల్లాడితో సమంగా చదివిస్తున్నారు. సమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మగపిల్లవాడి గురించి లేని తొందర, ఆరాటం , ఆందోళన ఎందుకు? ఎంత తొందరగా పెళ్ళి చేసి బాధ్యత వదుల్చుకుందామనుకుంటుంటారు?"
ప్రసాదరావుగారు నవ్వారు. 'అమ్మా! నీవూ ఒక ఆడపిల్లని కన్నావు కదా, అది పెద్దదవుతుంటే అప్పుడు నీకర్ధం అవుతుంది. తల్లిదండ్రుల ఆరాటం. సరే పోనీ, మా తరంలో లేని ధైర్యం మీ తరం చూపుతుందని ఆశిస్తాను రేణూ. ఏ తరం అయినా, ఎప్పటికయినా సృష్టిలో ఆడదాని స్థానం మారదమ్మా శారీరకంగా బలహీనురాలైన స్త్రీకి ప్రతి దశలోనూ పురుషుని అండదండలుంటాయి."
"రబ్బిష్ డాడీ. ఆపండి. చదువుకున్న మీరూ అలా మాట్లాడకండి. ఆడపిల్ల బలహీనురాలెందుకు అయింది? పుట్టిందగ్గర నించి, అసలు పుట్టక ముందు నించి ఆడపిల్ల పుడ్తుందని భయం. వీలయితే పుట్టకుండా చెయ్యడం, పుడితే ఆడపిల్లా అని బాధపడడం - ఆడపిల్లను ఏదో కాస్త చదివించి తొందరగా పెళ్ళి చేసి బాధ్యతవదుల్చుకుందామన్న ఆరాటం - ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇంట్లో ఎంత తేడా చూపుతారు. అది చెయ్యకు, అలా నవ్వకు , అలా గెంతకు , అలా చెట్టెక్కకు, ఆడపిల్లవు గాదూ - ఆ నవ్వేమిటి? మగపిల్లాడితో సమంగా ఆ గెంతులు ఏమిటి? వాద్దిక నేర్చుకో, అత్తవారింటికి వెళ్ళాల్సిన దానివి. రేపు పొద్దుట మొగుడితో కాపురం ఎలా చేస్తావు? మగరాయుడులా ఆ బట్టలేమిటి? ప్రతి క్షణం అమ్మాయిలకి ఆడపిల్ల, ఆడపిల్ల అని గుర్తుచేస్తూ అన్నింటిలోనూ మగాడి కంటే తను తక్కువ అన్న న్యూనతాభావం బీజం నాటుతారు. ఆడపిల్ల పెళ్ళి చేశాక , ఇంక నీ స్థానం అక్కడే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. మంచయినా, చెడయినా , చావయినా, బతుకైనా అక్కడే అంటూ చేతులు దులుపుకుంటారు. పాపం అమ్మాయి ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి విని విని , నరాల్లో జీర్ణించుకుని తను ఏం చేసినా మగవాడితో సమంగా అవలేదని, పెళ్లియ్యాక భర్త ఏం చేసినా ఆ ఇల్లు వదిలితే అధోగతని, పుట్టింటి వారు అదుకోరని, వంటరి బతుకు కంటే ఏ మొగుడో ఓ మొగుడు అంటూ సర్దుకు బతకడానికి మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు." రేణుక ఆవేశం కట్టలు తెంచుకుంది.
"రేణూ! ' సావిత్రి అడ్డబోయింది.
"ఉండమ్మా నన్ను చెప్పనీ - ఏ తల్లీ , తండ్రయినా కూతురికి తామన్నా భరోసా ఇస్తే నరకం లాంటి కాపురం నించి బయటపడడానికి సాహసిస్తుంది. అమ్మా కావాలని ఏ ఆడపిల్లా సంసారం వదులుకోదమ్మా. సహనం ఆఖరి మెట్టుకు వచ్చాక , ఆడది గడప దాటుతుంది. అలా గడప దాటిన ఆడపిల్లకి కన్నవాళ్ళు చెయ్యి అందించి కొన్నాళ్ళయినా ఆశ్రయం ఇస్తే ఈ దేశంలో ఇన్ని ఆడపిల్లల చావులుండవు. అలా తల్లి, తండ్రి ఆశ్రయం ఇస్తారు అంటే ఆ మొగుడు భయపడతాడు. ఎవరాదుకుంటారు దీన్నీ? నేనే గతి , చచ్చి నట్టుపడి ఉంటుంది అనుకునే గదా మొగుళ్ళు విర్రవీగుతున్నారు. ఆమె ఇల్లు వదిలిపోతుందేమోనన్న భయం ఉన్ననాడు ప్రతి భర్తా భార్యని హింసించే ముందు కాస్త సంకోచిస్తాడు. ఓ ఆడపిల్ల కాపురం వదిలితే లోకంలో అన్ని దారులూ మూసుకు పోతాయని , ఎందుకనుకుంటారు? అమ్మాయిలూ చదువుతున్నారు. నాల్గురోజులు అదుకుంటే ఏ ఉద్యోగమో చేసుకుంటారు. పెళ్ళయ్యాక అమ్మాయి అంత బరువైపోతుందా? ఊరికే కూచుని ఆమె తింటుందా? తనూ ఏదో చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది. కాస్త నీ వెనక మేం ఉన్నామన్న నిబ్బరం ఇస్తే చాలమ్మా. ఏం, పెళ్ళి - సంసారం ఆడదాని కెనా , మగాడి కక్కరలేదా? మగాడు లేకపోయినా డబ్బుంటే ఆడది నిక్షేపంలా బతుకుతుంది. అదే ఆడది లేని సంసారం మగాడు చెయ్యలేడు. పిల్ల తల్లితండ్రులు ఊరుకోరు, నిలేస్తారు అన్న భయం ఉన్న నాడు మగాడు ఇంత తెగించడు.'
"రేణూ , ఈ మాటలన్నీ వినడానికి, వాదించడానికి బాగుంటాయి. ప్రాక్టికల్ గా ఉండే ఇబ్బందులు అనుభవంలోకి వచ్చాకే అర్ధమవుతాయి. మగాడి కేం నాల్గు రోజులు పొతే మరో పెళ్ళి చేసుకుంటాడు. కానీ, పిల్లతల్లిని నిన్నెవరు చేసుకుంటారు. నూరేళ్ళ జీవితం వంటరిగా ....'
"ఏం పెళ్లికాకపోతే చచ్చిపోతానా, బతకలేనా? అవును ఆడపిల్లని వదుల్చుకుంటే చాలని మగాడి కోసం ఎగబడి కట్టబెట్టే ఆడపిల్లల తల్లితండ్రులుంటే ఎందుకు చేసుకోడు మగాడు. ఓ పిల్లని ఇచ్చే ముందు మొదటి ఇల్లాలు ఆ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళింది అని అరక్షణం అయినా ఆలోచించరు. చూస్తా . నేనూ చూస్తా మరో పెళ్ళి ఎలా చేసుకుంటారో నేనూ చూస్తా. "ఫలానా వాడి సంగతి ఇది పిల్లనిచ్చే ముందు జాగ్రత్త అంటూ పేపర్లో వేసి వీడి బండారం బయటపెడ్తా." ఎర్రబడ్డ మొహంతో , అదురుతున్న పెదాలతో అంది."
"నీ ఆవేశం అర్ధం అవుతుందమ్మా కానీ...."
"కానీ లేదు, అర్ధం కాలేదు. మీరెన్ని చెప్పినా నేనింక అక్కడికి వెళ్ళను. నా ఆశలు, కోరికలు, సమూలంగా నరికేసిన అలాంటి మొగుడు నాకక్కరలేదు. నన్ను మీరు ఆదుకోలేమంటే నా దారి నేను చూసుకుంటా. అక్కడ చేసే పని ఇంకో ఇంట్లో చేస్తే ఇంత తిండి దొరక్కపోదు. పదిమంది పిల్లలకి ట్యూషను చెప్పుకుంటాను. ఏం లేకపోతే చస్తాను.....' స్థిర నిశ్చయంగా అంది రేణుక. సావిత్రి భర్త వంక చూసింది. అయన నిట్టూర్చి , "రేణూ మేం ఉన్నన్ని రోజులూ నీకంత ఖర్మ పట్టదు - కానీ తర్వాత .'
"ఏం ఈలోగా ఏదో ఉద్యోగమే దొరకదా? నా కాళ్ళ మీద నేను ఈలోగా నిలబడలేనా?"
'అమ్మా రేణూ, ఒకవేళ అతను పిల్లనివ్వనని కోర్టు కెక్కితే!" సావిత్రి సందేహం.
"హు- ఆడదాని ఈ బలహీనత మీదే గదా మగాళ్ళు ఆటలాడుతున్నారు. మహారాజులా తీసికెళ్ళి పెంచుకోమంటాను. ముందు ఆడవాళ్ళు ఈ విషయంలో గుండె దిటవు పరచుకోవాలి.....నీకేం పిచ్చా అమ్మా. ఈ పసిపిల్లని తీసికెళ్ళి ఆయనెందుకు పెంచుతాడు. ఊరికే బెదిరిస్తాడు. గట్టిగా ఉండి సరే అంటే అప్పుడే బండారం బయటపడ్తుంది ." రేణు నిబ్బరంగా అంది.
"రేణూ , భగవంతుడు నీకింత అన్యాయం చేసినందుకు కనీసం మగపిల్లాడి నన్నా ఇస్తే బాగుండేది. రేపొద్దున పిల్ల పెళ్ళి.....ఈ సమస్యలు అన్నీ ఎలా నెగ్గుతావు?"
"హు.....డాడీ ఇంత చెప్పినా మళ్ళీ అదే మాట. అసలు 'ఆడపిల్ల" అన్న మాట మన డిక్షనరీ లోంచి తీసేయాలి. "అమ్మాయి" అనండి, "కూతురు" అనండి. "ఆడపిల్ల" "ఆడది" అంటూ పుట్టిందగ్గర నించి పరాయిగా చూసే ఆ పదం నా నిఘంటువులో ఉండదు. ఈరోజు నుంచి నా కూతురుని ఎవరూ 'ఆడపిల్ల" అంటే వప్పుకోను. అమ్మాయి అంటే "ఈడపిల్లె " అనేట్టు పెంచుతాను నా కూతురిని." పంతంగా పౌరుషంగా అంది.
'మంచిదే తల్లీ, మీ బతుకులు మార్చి, ఆ మాటకి అర్ధం మారితే నా కంటే సంతోషించేవాళ్ళెవరుంటారు. కానీ చూద్దాం , కాలం ఏం నిర్ణయిస్తుందో . మా తరంలో మేం చెయ్యలేనిది మీరు చేసి చూపిస్తే మాకు మాత్రం సంతోషం గాదూ....."మరీ మారని కాలంలో ఓ తండ్రిగా ఆయన ఇంకేం అమలేదు కూతురి నిశ్చయం నిర్ణయం అర్ధం అయి.
(ఇండియా టుడే)***