కూతుర్ని ఏడో నెలలో సారే ఇచ్చి పుట్టింటికి తీసుకువచ్చేనాటికి రేణుక కాపురం బాగుపడడం అటుంచి, పరిస్తితులు మరింత దిగజారాయి. కడుపుతో ఉన్న పిల్ల కళాకాంతులేకుండా చిక్కి శల్యమై బతుకు భారంగా ఈడుస్తున్న దానిలా ఉన్న రేణు అవతారం చూసి సావిత్రి తల్లడిల్లి పోయింది. కాపురం పేరుతొ కూతుర్ని కాటికి పంపామా అన్న ఆవేదన కలిగింది. ఏం అడిగినా రేణు అదోలా నవ్వి, "ఎందుకు అమ్మా అడుగుతావు? మీకు చెప్పుకుని ఏం లాభం? కష్టమో, నష్టమో నేనక్కడే పడుండాలని గదా అన్నారు" అంది.
సావిత్రి మనసు విలవిల్లాడింది . "రేణూ , మా ఉద్దేశం అది గాదమ్మా..... కాపురం....."
"అర్ధం అయిందమ్మా , పెళ్ళయ్యాక ఆ కాపురం నరకం అయినా చచ్చేవరకూ అక్కడే వుండాలి అనే గదా మన పెళ్ళిళ్ళలో అర్ధం ....." పట్టుకున్న గొంతుతో అంది.
సావిత్రి విచతురాలైంది . ఈ పరిస్థితిలో ఏం అనాలో అర్ధం గాలేదు. రేణుక ఏమాత్రం సుఖంగా లేదన్నది మాత్రం అర్ధం అయినా, తాను ఏమని భరోసా ఇవ్వాలో, ఈ పరిస్థితి ఎలా చక్కదిడ్డాలో, దిద్దగలిగే అవకాశం తమకి ఉందా..... లక్ష ప్రశ్నలు ఆమెని చుట్టుముట్టాయి.
'అమ్మా, ఆయన్ని సౌమ్యంగా మార్చుకోవాలన్నారు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని మనసు విప్పి మాట్లాడిమన్నావు ------మంచయినా చెడయినా , నచ్చనిదైనా నెమ్మదిగా చెప్పి అర్ధం అయ్యేట్టు చూడమన్నావు. కానీ మీరు చెప్పినవి ఏ మాత్రం పనిచెయ్యలేదు గాబట్టి ఈ "సూత్రబంధం ' నించి ఇప్పటికయినా నేను తప్పుకోవచ్చా?" జవాబు చెప్పమన్నట్టు చూసింది.
"నీవు చెప్పినా అతను.....అతను వినలేదా?"
"చెప్పానమ్మా , ఆయనకర్ధం అవాలని మనసు విప్పి చెప్పాను. ఆప్ట్రరాల్ భార్యా తనకు జవాబు చెప్పేది. భార్యా తన లోటు పాట్లు ఎత్తి చూపేది అన్న పౌరుషం వచ్చేసింది. దాంతో నోరేకాక చెయ్యి చేసుకోడం మొదలుపెట్టారు."
"కడుపుతో ఉన్న ఇల్లాలిని కొట్టడమా, అంతకి దిగజారడా? ఏదో చిన్నతనం - తెలియచేపితే సర్దుకుని కాపురం బాగు చేసుకుంటారని .....' సావిత్రికి కోపంతో మాటలు తడబడ్డాయి. "ఉండు రానీ , నిలేసి అడుగుతాను."
'ఇంక నువ్వు, అయన అరుచుకోవడం ప్లీజ్, నీవు ఆయనతో మాట్లాడకు. నిన్ను కూడా ఏదో అని అవమానించితే సహించలేను. ముందీ నరకం లోంచి ఈ పురిటి వంకనైనా నాలుగైదు నెలలు నన్ను బయటపడనీ. తర్వాత సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడేదన్నా అంటే అకోపంలో పురిటికి పంపనవచ్చు ఈ మూర్ఖుడు." భర్త తత్త్వం తెలిసిన రేణుక తల్లిని వారించింది.
కోడలికి సారె పెట్టించడానికి వచ్చిన వియ్యపురాలితో మాత్రం చూచాయగా కొడుకు సంగతి చెప్పింది సావిత్రి. ఆవిడ ఆశ్చర్యంగా కోడలి వంక చూసింది. "రేణూ నీవన్నా ఎప్పుడూ మా దగ్గిర ఏం అనలేదు." "ఏం చెప్పను" అన్నట్లు చూసి తలదించుకుంది రేణు.
"వదినగారూ , ఏదో మాట మాట అనుకోవడం ప్రతి సంసారంలో ఉంటాయి. కానీ పెళ్ళయిన కొత్తలోనే ఇలా ఉంటే, ఎడమొహం పెడ మొహంతో నూరేళ్ళ కాపురం ఎలా సాగుతుంది? ఈ కాలం అమ్మాయిలా చదువుకుంటున్నారు. వాళ్ళకీ ఆత్మాభిమానం ఉంటుంది కదా. చీటికి మాటికి భర్త అంటుంటే, ఇంట్లో నీదెం లేదు నాదే అంటే మన కాలంలో మాదిరి ఈ అమ్మాయిలూరుకుంటారా? కాస్త అబ్బాయితో మాట్లాడండి మీరు. వాళ్ళ సుఖం, అనందం కంటే మనకేం కావాలి" అంటూ మెత్తగా చెప్పింది సావిత్రి.
'చిన్నప్పటినుంచి వాడు కాస్త ముభావి, కోపిష్టి --- ఎంతసేపూ వాడన్నదే జరగాలి అన్న పంతం ఉండేది. ఎప్పుడూ చదువు తప్ప ఎవరితోనూ కలిసేవాడు కాదు. చదువులో ఎప్పుడూ ఫస్ట్ కనక మిగతావి మేమూ పట్టించుకోలేదు. పెళ్ళి సంసారం అయితే వాడు సరదాలు నేర్చుకుంటాడు అనుకున్నాం గాని ఇలా ...... రేణూ మాకు ఓ ముక్క చెప్పద్డా.....' ఆవిడ నొచ్చుకుంటూ అంది.
"వదినగారూ మేం వెళ్ళాక కాస్త మాట్లాడండి ------రేణు భయపడుతుంది . సంసారంలో సంతోషం కరవయితే అతనికి మాత్రం సుఖమా?" వియ్యపురాలు తల పంకించింది.
* * * *
అమ్మాయి నెత్తుకుని మూడో నెలలో వెళ్ళేసరికి భర్త మారకపోతాడా అన్న చిన్న ఆశ కాస్తా అడియాస అయింది. పైగా తన గురించి అందరికీ చెప్పిందనే కసి ఇంకాస్త పెంచుకున్నాడు. ఆర్నెల్లు దూరంగా వున్నా తల్లి మంచిగా చెప్పినా మారని భర్తని చూసి హతాశురాలైంది. "ఏం అక్కడే ఉండకపోయావా? నేనంత చెడ్డవాడినని ఊరంతా చాటినదానివి. మళ్ళీ ఏం మొహం పెట్టుకు వచ్చావు" అని చెప్పి పొడిచాడు.
తనేకాక , తన పిల్ల కూడా కన్నవారి మీద కొన్నాళ్ళయినా అధారపడాలన్న నిజం వెనక్కి లాగింది. తనో ఉద్యోగం చూసుకోవాలి. ఒంటరిగా పిల్లని పెంచుకోవాలి అన్న స్థితికి ఆలోచన రేణుని వెనక్కి లాగకపోతే .....ఛా.....తనైనా కాస్త జాగ్రత్తపడి పిల్లని కనకుండా ఉండాల్సింది.
రోజూ దేనికో గొడవ . అర్గ్యూమెంట్లు, అరుచుకోడాలు, దెప్పి పొడవటాలు, కేకలు, శృతి మించిన రోజు చెయ్యి చేసుకోడం, మనశ్శాంతి కరవై , ద్వేషాలు పెరిగి, దూరాలు పెరిగి ఈ బతుకు కంటే బయటికి వెళ్ళి ఏ అవస్థలన్నా ఎదుర్కోవచ్చు నన్న నిర్ణయానికి వచ్చింది రేణుక.
ఏ బతుకయినా ఇంతకంటే అధ్వాన్నంగా ఉండదన్న నిబ్బరం కలిగింది. ఆ నిర్ణయం, నిశ్చయం పెద్దవాళ్ళకు తెల్సి అమలు పరచాలనుకునేలోగా --- ఉన్న పాటున చేతిలో దమ్మిడి లేకుండా పసిపిల్లతో సాయంత్రం ఇంట్లోంచి తరమబడ్తుందని ఊహించలేదు. ఆరోజు ఇద్దరి మధ్య తగవు పరాకాష్టకి చేరుకుంది. జుట్టు పట్టుకు ఈడ్చి కళ్ళ ముందు మెరుపులు మెరిసేటట్లు కొట్టిన రమేష్ ని ఎదుర్కొంది. వంటింట్లోంచి కత్తి చేత్తో పట్టుకుని అడుగు ముందుకు వేస్తె చస్తావు అని బెదిరించింది. దాంతో ఆ పురుష పుంగవుడు ఉగ్రరూపుడై పులిలా గర్జించి, పులిలా దూకి, కత్తి విసిరేసి ఆ చేత్తో రేణుకని బయటికి ఈడ్చి తలుపేశాడు. ఏడుస్తున్న పిల్లని గుమ్మంలో పడేసి, తలుపు మూసుకున్నాడు. కాసేపు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నిలబడి, తనకు కాస్త తెల్సిన ఎడురింటావిడ దగ్గర డబ్బు అప్పు చేసి రైలెక్కింది.
* * * *
"ఏమిటి దారుణం? ఉన్నపాటున ఇలా ఇంట్లోంచి వెళ్ళగోడతాడా?" కోపంతో వణికిపోయారు ప్రసాదరావుగారు, మర్నాడు రేణుక చెప్పింది విని.
"పోలీసులకి రిపోర్టు ఇస్తాను. పెళ్ళాన్ని వీధిలోకి నెట్టేయడం అంత సుళువను కుంటున్నాడా? పెళ్ళంటే , భార్యంటే ఏమనుకుంటున్నాడు వాడు? వాడి అంతు తేలుస్తాను." ప్రసాదరావు ఆవేశంలో హుంకరించాడు.
"నాన్నా ....ఆ కాపురం నాకింక వద్దు. అతన్ని ఏం చేసినా, ఏం అన్నా మారే మనిషి కాదు. అలాంటి కాపురం చచ్చినా చేయ్యనింక. డాడీ, దయచేసి నన్నక్కడికి వెళ్ళ,మనకండి. ప్లీజ్ - నేనేదో ఉద్యోగం చూసుకునే వరకు కొన్నాళ్ళు నాకశ్రయం ఇవ్వండి.....ప్లీజ్ , నేను నిలదొక్కుకునే వరకు ఆదుకోండి..... పెళ్ళయిన దానివి, 'ఆడపిల్ల " వి గాని ఇంక "ఈడపిల్ల " వి గాదు అనకండి......ఒక్క ఏడాది నాకేదో దారి దొరికే వరకు ." దీనంగా కన్నీళ్ళతో చేతులు జోడించి అంది రేణుక.