Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 28


    టీ ఆకారంలో ఉన్న జంక్షన్ లో కొచ్చిన సుబ్రహ్మణ్యం జీపు కుడి వేపుకి తిరిగి స్పీడందుకుంది.

 

    కానప్పటికే సుబ్రహ్మణ్యం దూరంనుంచి వస్తున్న కాళిదాసు లారీని గుర్తించి నవ్వుకున్నాడు.

 

    సుబ్రహ్మణ్యం జీప్ ని చూసి డేవిడ్ సిద్ధమౌతుండగానే-

 

    టీ షేప్ జంక్షన్ లో కుడివేపుకి తిరగబోతున్న ప్రిజనర్స్ వ్యాన్ ని కాళిదాసు తన లారీతో గుద్దేశాడు.

 

    అది చూస్తూనే డేవిడ్ షాక్ తిని సుబ్రహ్మణ్యం జీప్ ని ఆపటం మర్చిపోయాడు.

 

    ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి.

 

    ప్రిజనర్స్ వ్యాన్ మర్రిచెట్టుని ఢీకొని, బోల్తాపడి, ఎడం పక్కనున్న బండరాయికి గుద్దుకుని-

 

    లోయలోకి పడిపోయింది చూస్తుండగానే.

 

    తన దెబ్బకు వ్యాన్ కుడి వేపుకి పడిపోతుందని ఊహించిన కాళిదాసు అంచనా తలక్రిందులయింది. రోడ్డు పక్కన పడిపోవలసిన వ్యాన్ లోయలోకి జారిపోయింది. మరేమాత్రం ఆలస్యం చేయకుండా, రెండు కిలోమీటర్ల వరకూ ముందుకుపోయాడు కాళిదాసు.

 

    లారీ ప్రిజనర్స్ వ్యాన్ ని గుద్దటంతోనే శరవేగంతో ముందుకొచ్చిన సర్కిల్ ఇన్ పెక్టర్ డేవిడ్-

 

    ప్రిజనర్స్ వ్యాన్ లోయలోకి దొర్లిపోవటం, అందులోంచి తెల్లటి దుస్తులతో ఖైదీలు ఒక్కొక్కరూ కిందపడడంతో ఏం చేయాలో తోచక-

 

    బిత్తరపోయి, వెంటనే తేరుకొని-

 

    ఆ ఖైదీల వేపే గురిచూసి కాల్చడం ప్రారంభించాడు.

 

    "కమాన్ ఫైర్" మిగతా పోలీసుల్ని కూడా షూట్ చేయమని ఆర్డర్ చేశాడు.

 

    అంతా చీకటి... లోయలోకి దొర్లుతున్న వ్యాను... పైగా తూపాకీ కాల్పులు... ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ఖైదీలకు.

 

    వాళ్ళకు... ఆలోచించడానికి అవకాశం లేదు.

 

    ఎవరు గాయపడ్డారో... ఎవరు బ్రతికున్నారో... అంతా అయోమయం... అంతా భయంకరం.

 

    వ్యాన్ లోంచి దబ్ మని రాళ్ల గుట్టమీద పడిన ధరణి.

 

    "ఆదిత్యా..." అంటూ పెనుకేక వేశాడు.

 

    అదే సమయంలో వ్యాన్ లోంచి ఎడమ పక్కన తుప్పల్లో పడిపోయిన ఆదిత్య-

 

    "ధరణి కుమార్! కిందకు పారిపో... లోయలోకి పారిపో" అని అరుస్తూ ఒక వేపు కాల్పుల నుంచి తప్పించుకుంటూ-

 

    రాళ్ళను రాప్పల్నీ, తుప్పల్నీ, డొంకల్నీ, ముళ్ళనీ దాటుకుంటూ లోయలోకి అడ్డదిడ్డంగా పరుగెత్తడం ప్రారంభించాడు.

 

    తూటాలు తగిలిన ఖైదీలు హాహాకారాలు చేసుకుంటూ నేలకొరిగి పోతున్నారు... మరికొంతమంది పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు.

 

    పావుగంట గడిచింది-

 

    కాల్పుల శబ్దానికి ముందు కెళ్ళిపోయిన జైలు సూపరింటెండెంట్ వెనక్కి వస్తే... తనని, తన సిబ్బందిని గుర్తుపడితే ప్రమాదం. వెనుక స్లోగా వస్తున్న ఎస్కార్ట్ వ్యాన్ లోని సిబ్బంది తమని చూసినా ప్రమాదమే అందుకే-

 

    "కమాన్... పదండి పోదాం" అంటూ ధన్ మని జీపెక్కాడు డేవిడ్. మిగతా పోలీసులు కూడా జీపెక్కేశారు. ఆ జీప్ మరుక్షణంలో అక్కడ కన్పించలేదు... మెదక్ దారిలో వుంది.

 

    "మన కాల్పులకు ఆదిత్య చచ్చుంటాడు."

 

    తనని తాను సంతృప్తి పరచుకొంటూ అన్నాడు డేవిడ్.

 

    డేవిడ్ జీప్ అక్కడ నుంచి మాయమైన పది నిమిషాలకు ముందు కెళ్ళిన సుబ్రహ్మణ్యం జీప్ రివర్సయి అక్కడ కొచ్చింది.

 

    అనుకున్నదొకటి... జరిగిందొకటి.

 

    పోలీస్ ఎస్కార్ట్ వ్యాన్ అప్పటికే అక్కడకొచ్చింది. బిల బిల మంటూ దిగిన పోలీసులు వెల వెలబోతూ-

 

    "ఎవరో యాన్టీసోషల్ ఎలిమెంట్స్... ప్రిజనర్స్ వ్యాన్ ని ఎటాక్ చేసి, ప్రిజనర్స్ ని షూట్ చేసి, పారిపోయారు సార్."

 

    సుబ్రహ్మణ్యం గుండె గుండెలో లేదు. గుబ గుబలాడుతోంది.

 

    ఆదిత్య, ధరణిలకు ఏమయినా జరిగితే-

 

    అసలీ దాడి ఎవరు చేశారు? సి.ఎం. మనుషులేనా?

 

    అతనికి ఆలోచించటానికే భయంగా వుంది.

 

    అప్పటికే పూర్తిగా చీకటి నిండిపోయింది.

 

    "కమాన్! జీప్, పోలీస్ వ్యాన్ హెడ్ లైట్లను లోయలోకి ఫోకస్ చేయండి. కమాన్... సెర్చ్... ఖైదీలెవరూ... ఎక్కడా తప్పించుకోకుండా చూడండి... టెన్షన్ ఆపుకోలేక బిగ్గరగా అరిచాడు సుబ్రహ్మణ్యం.

 

    జైలర్, వార్డర్లు, పోలీసులు లోయలోకి దిగారు. సుబ్రహ్మణ్యం ఒక్కడూ జీపు దగ్గర నిలబడ్డాడు.

 

    ముందుకెళ్ళిపోయిన కాళిదాసు దూరం నుంచే పరిస్థితిని అంచనా వేసి, జైల్ సూపరింటెండెంట్ జీప్ వెనక్కి రావడంతో తనూ ముందుకెళ్ళాడు.

 

    దగ్గరకొచ్చిన లారీని, లారీలోని కాళిదాసుని చూసి గతుక్కుమన్న సుబ్రహ్మణ్యం-

 

    "ఒరే... ఇడియట్! నువ్వు చేసిందేమిట్రా... ప్లానంతా పాడుచేశావు... వెళ్ళు... వెళ్ళి... ఆ పెద్దబ్బాయికి ఏం చెప్పుకుంటావో. పో... మరొక్కక్షణం నువ్విక్కడుంటే నేనే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. ఆదిత్యను తప్పించమంటే శరవేగంతో వచ్చి వ్యాన్ ని గుద్దేశావు. అది లోయలోకి జారిపోయింది. అప్పటికే సిద్ధంగా వున్న సి.ఎం. మనుషులు కాల్పులు జరిపారు. ఆదిత్య బ్రతికున్నాడో, కాల్పుల్లో చచ్చాడో తెలీదు. ఛస్తే మాత్రం గుర్రం పెద్దబ్బాయి క్షమించడు. బ్రెయిన్ లేని వెధవా... పోరా... పో" చిందులేశాడు సుబ్రహ్మణ్యం.

 

    "మరి... ఆదిత్య..." వాడికి అప్పటికే మందు దిగిపోయింది.

 

    "ఆదిత్య లేడు... గాడిద గుడ్డూ లేదు. గెటౌట్."

 

    జైల్ సూపరింటెండెంట్ అరుపుకి భయపడిపోయాడు కాళిదాసు.

 

    లారీని స్టార్ట్ చేశాడు కాళిదాసు.

 

    "ఒరేయ్... కాళీ... గుర్రం పెద్దబ్బాయికి యిక్కడ జరిగిందేమీ నువ్వు చెప్పకు. తర్వాత నేనే చెప్తాను" అరిచి చెప్పాడు సుబ్రహ్మణ్యం.

 

    "ఓ.కె... సార్" ముందు కెళ్ళిపోతున్న లారీలోంచి అరిచాడు కాళిదాసు.

 

    జీప్ వెలుగులో తనూ లోయలోకి దిగడం ప్రారంభించాడు జైల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం.

    
                                                    *    *    *    *    * 


    పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయాడు ఆదిత్య. పరుగెడుతూనే ధరణి కోసం అతని కళ్ళు వెతుకుతున్నాయి.

 

    "ధరణీ... ధరణీ... ధరణీ" ఎలుగెత్తి అరుస్తున్నాడు. క్రమంగా ఖైదీల అరుపులు, హాహాకారాలు దూరమౌతున్నాయి.

 Previous Page Next Page