వాళ్ళను ఆ పనికి వినియోగించింది హోంమినిస్టర్ చిదంబరరావు.
అదే సమయంలో-
హోం మినిస్టర్ చిదంబరరావు తనకు మాత్రమే అప్పగించిన పని గుర్తుకొచ్చింది సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్ కి.
"ఆదిత్య కోసం ఎవరో అతని శతృవులు ఎటాక్ చేసినట్టుగా వుండాలి. ఎవరో ఏమిటి? గుర్రం పెద్దబ్బాయి ఎటాక్ చేసినట్లుగా వుండాలి. గుర్రం పెద్దబ్బాయి కూడా రంగప్రవేశం చేయబోతున్నట్లు తెలిసింది. అతనికే ఆదిత్య దొరికితే అహోబలపతి మంత్రివర్గం కూలిపోతుంది. దాంతో నా పదవి పోతుంది. నీ డి.ఎస్.పి. ప్రమోషన్ ఎగిరిపోతుంది జాగ్రత్త... ఆదిత్యను బయటకు తీసుకొస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఆదిత్య కోసం ముందుకు రాక మానరు. ఆ అవకాశాన్ని వినియోగించుకో. ఎమోషన్ క్రియేట్ చెయ్యి. ధరణిని కాల్చిపారెయ్యి. వెంటనే ఆదిత్యను సగం దారి వరకూ తీసుకురా. కాల్చెయ్! శవం కూడా ఎవడికీ దొరకడానికి వీల్లేదు. దహనం చేసెయ్. ఇది నా ఆర్డర్ కాదు. ఇట్స్ అవర్ బాస్ ఆర్డర్... గుర్తుంది కదా?"
హోంమినిస్టర్ చెప్పిన ప్లాన్ ను అక్షరాలా అమలుచెయ్యడానికి సిద్ధంగా, వుత్సాహంగా వున్నాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్.
అందుకు కారణం...
ప్రమోషన్....
అప్పటికీ మఫ్టీలో ఉన్న పోలీసులు క్రిందకు దిగి చెట్లచాటున కాపుకాశారు.
చీకటి నెమ్మదిగా చెట్లచాటునుంచి రోడ్డు మీదకు ప్రయాణం చేస్తూ ఉంది.
* * * * *
సరిగ్గా అదే సమయంలో...
హైద్రాబాద్ నుంచి బొంబాయికి వెళ్ళే రోడ్డులో, మెదక్ క్రాస్ రోడ్స్ కు యిరవై గజాల దూరంలో-
నేషనల్ హైవేకి ఆనుకునివున్న మెటల్ రోడ్డుమీదకొచ్చి ఆగింది ఒక లారీ. ఆ లారీ డ్రైవింగ్ సీటులో పులిలాంటి వ్యక్తి కూర్చున్నాడు. వాడి పేరు కాళిదాసు.
గుర్రం పెద్దబ్బాయి అనుంగు కార్యకర్త.
కిడ్నాప్ ల స్పెషలిస్టు, యాక్సిడెంట్ ల స్పెషలిస్టు, యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇన్స్ డెంట్ ను క్రియేట్ చేసి, కావలసిన వాళ్ళను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోవడంలో, హరీ మనిపించడంలో నెంబర్ వన్ కాళిదాసు.
అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తప్ప కాళిదాసు లారీతో రోడ్డు మీదకు రాడు. గుర్రం పెద్దబ్బాయి స్వయంగా చెప్పడంతో బయటకు వచ్చాడు.
సాధారణంగా కాళీ వుంటే జైల్లోనూ, లేకపోతే అండర్ గ్రౌండ్ లోనూ వుంటాడు.
కాళీ బయటికొచ్చాడంటే పోలీసులు కూడా టెర్రర్.
కాళీకి గుర్రం పెదబ్బాయి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
"ఈ ఫోటోను జాగ్రత్తగా చూడు" అని పాత న్యూస్ పేపర్లోని ఆదిత్య ఫోటోను చూపిస్తూ-
"వీడే మనకు కావలసిన వ్యక్తి, నువ్వెలా చేస్తావో, ఏం చేస్తావో నాకనవసరం. వాడు నాకు కావాలి. జైల్లో సూపరింటెండెంట్ మనవాడు... వాడికి నీ లారీని చూడగానే విషయం అర్ధమైపోతుంది. ముందుకు వెళ్ళిపోయాడు. ప్రిజనర్స్ వ్యాన్. పోలీస్ వ్యాన్ వుంటాయి. రక్తపాతాన్ని... క్రియేట్ చెయ్యి, నీకెవడడ్డొచ్చినా చంపెయ్. ఒక్క ఆదిత్యను తప్ప..." చెప్పాడు గుర్రం పెద్దబ్బాయి.
గుర్రం పెద్దబ్బాయితో తను వేసిన ప్లాన్ ని మరోసారి మనసులోనే మననం చేసుకున్నాడు కాళిదాసు.
అరబాటిల్ నిషాలో హుషారుగా ఉన్న కాళిదాసు, చార్మినార్ సిగరెట్ తీసి-
వెలిగించుకొని, గుండెలనిండా పొగ పీల్చాడు.
మసక చీకట్లో ముందుకి చూశాడు.
* * * * *
జైలు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం చేతి గడియారం వేపు చూసుకున్నాడు అసహనంగా.
అతని కళ్ళు గుర్రం పెద్దబ్బాయి పంపించే లారీ కోసం వెతుకుతున్నాయి.
"సార్! చల్లగాలి చూశారా? వర్షం వస్తుందేమో..." జీపు డ్రైవర్ అన్నాడు.
"అయితే స్పీడు పెంచు" ఆర్డర్ వేసి, వ్యూ మిర్రర్ లోంచి వెనక్కి చూశాడు సుబ్రహ్మణ్యం.
ఎస్కార్ట్ వ్యాన్ నెమ్మదిగా వస్తోంది.
నెమ్మదిగా పెరుగుతున్న చీకటి....
మెదక్ క్రాస్ రోడ్స్ మరో పదిగజాల దూరంలో వుంది.
ఎత్తైన ప్రదేశంలో వున్న కాళిదాసు దూరంగా వస్తున్న వాహనాలను గమనించాడు.
వెంటనే-
మెటల్ రోడ్డు మీంచి లారీని మెయిన్ రోడ్డుకు తీసుకొచ్చి-
గేరు మార్చి, ఒక్కసారిగా స్పీడు పెంచాడు.
సుబ్రహ్మణ్యం దూరంగా లారీని చూడగానే-
"స్పీడు పెంచు. జల్దీ పోనీ..." సడన్ గా అరిచాడు.
ఎందుకలా అరిచాడో అర్ధంకాలేదు డ్రైవర్ కి.
జైలు సూపరింటెండెంట్ జీపెందుకు సడన్ గా స్పీడందుకుందో తెలీని ప్రిజనర్స్ వ్యాన్ డ్రైవర్ తనూ స్పీడు పెంచాడు.
ఇన్ స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ ఎస్కార్టు వ్యాన్ మాత్రం ఎడ్లబండిలా నడుస్తోంది. అందులోని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తెచ్చుకున్న క్వార్టర్ బాటిల్ విస్కీ సీసాలతో జాలీగా వున్నారు.
కానీ-
ఆ వ్యాన్ ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మాత్రమే ఆందోళనగా వున్నాడు.
ఏదో జరగబోతోందన్న విషయం అతనికి తెల్సు గానీ, ఏం జరగబోతోందో తెలీదతనికి.
ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో కావడమే అతని డ్యూటీ!
సడన్ గా హెడ్ లైట్ల వెలుగు కనిపించడంతో సర్కిల్ ఇన్స్ పెక్టర్ డేవిడ్ ముందుకు వురకడానికి సిద్ధంగా వున్నాడు.
కానీ-
టీ ఇంగ్లీషు లెటరు ఆకారంలో వున్న దారిలో, కుడివేపు నుంచి ప్రిజనర్స్ వ్యాన్, జైలు సూపరింటెండెంట్ వాహనాలు వస్తున్న విషయమే తెల్సు తప్ప-
ఎడం వేపునుంచి కాళిదాసు వస్తున్న విషయం తెలీదు.
అతని దృష్టంతా జైల్ సూపరింటెండెంట్ జీప్ మీదే వుంది.
చెట్ల మీద పడుతున్న దాని హెడ్ లైట్ల కాంతినే అతను చూస్తున్నాడు.
కానీ-
అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.