"బావుంది" ఆడుకొంటున్న పాపాయిని ఎత్తుకొని ముద్దుపెట్టుకొంటూ అన్నాడతను.
"ఇదిగో చూడండి! వేరే ఇల్లు చూడండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. మీరేమో శ్రద్ధ తీసుకోరు. ఇవాళ ఆ ప్రొడ్యూసరు గారొచ్చేసరికి నాకెంత సిగ్గనిపించిందో తెలుసా? ఇరుకు గది_అందులోనే ఇన్ని సామాన్లు. మనిషి కదలడానికి స్థలముంటేనా? ఏమయినా సరే_ రేపట్నుంచీ రెండు రోజులు శలవుపెట్టి మంచి ఇల్లు వెతకండి. అదే మూడువందలయినా ఫర్వాలేదు. తెల్లారి లేస్తే ఇంటికి ఎంతోమంది వచ్చిపోతుంటారు. వాళ్ళేమనుకొంటారు?" కోపంగా అందామె.
"ఆల్ రైట్_రేపు శలవు పెట్టి అటో ఇటో తెల్చేస్తాను ఇంటి సంగతి" అన్నాడు మాధవరావు.
అన్నట్లే శలవుపెట్టి తిరిగాడుగానీ ఏమీ లాభం లేకపోయింది. నెలరోజుల తర్వాత ఖాళీ అయ్యేవీ, రెండునెలల తర్వాత ఖాళీ అయ్యేవీ ఉన్నాయి! అంతవరకూ ఆగాల్సిందే. చేసేది లేక ఊరుకుండిపోయింది సీత.
10
సరిగ్గా పదిహేనురోజుల తరువాత మళ్ళీ ఇంటికొచ్చాడు వర్ధనరావు.
"రండి?" చిరునవ్వుతో ఆహ్వానించింది సీత.
"ఉదయం నుంచీ మీ ఇంటికి రావాలని ప్రయత్నం. కానీ ఏదో ఒక పని. అయినా మీలాంటి ప్రముఖ రచయిత్రి, అందునా కాబోయే సినీ రచయిత్రి_ఇలాంటి మారుమూల ఉండటం నాకేం బావుండలేదు" నవ్వుతూ అన్నాడతను.
సీతకు తల కొట్టేసినట్లయిపోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే మాధవరావుతో మొత్తుకుంటోంది. తను వేరే మంచి ఇల్లు చూడమని! ఆయన వినిపించుకొంటేనా?
"మంచి ఇల్లు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామండీ. ఎక్కడా దొరికితేనా? మావారు ఓ రోజంతా శెలవు పెట్టి తిరిగినా ఫలితం కనిపించలేదు" నొచ్చుకుంటూ అందామె.
"అరె మరి ఆ విషయం మీరు మొన్న నాతో అంటే సరిపోయేది కదా మా ఇంటిదగ్గర ఏరియాలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది. మేడ మీద పోర్షన్ అనుకోండి! రెండు బెడ్ రూమ్ లున్నాయి. మీకిష్టమయితే రేపే మాట్లాడతాను. నా ఫ్రెండ్ దే లెండి, అది"
సీతకి ఆ ఇల్లు తీసుకోవాలని ఉందిగానీ అద్దె ఎంత చెప్తారోనని భయం వేసింది. ఆయనుండే ఏరియా చాలా ఖరీదయినది రెండు బెడ్ రూమ్ ల ఇల్లంటే ఆ ప్రాంతంలో కనీసం నాలుగయిదు వందలుంటుంది.
"మరి అద్దె ఎంత చెప్తారో" సంశయంగా అందామె.
అతను గట్టిగా నవ్వేసరికి తను తెలివి తక్కువగా మాట్లాడానేమోనని భయపడి పోయిందామె.
"అద్దెదేముందిలెండి ఈ పిక్చర్ కి మీరు రాయడం పూర్తయ్యేవరకూ నేనే భరిస్తాను. తరువాత సంగతి తర్వాత చూసుకుందాం. అదే మొగ రచయితయితే రోజుకి యాభై, అరవై రూపాయలు పెట్టి హోటల్లో రూము ఏర్పాటు చేయటంలేదూ? దాని బదులు మీకు ఇంటి అద్దె భరించడం చాలా చవక కాదూ మాకు?"
సీతకి అతనికి ఎలా ధన్యవాదాలర్పించాలో తెలీలేదు.
"మీకు బాగా శ్రమ ఇస్తున్నాననుకొంటాను" అందామె సిగ్గుపడుతూ.
"ఇటీజ్ ప్లెజర్! అలా అనుకోకండి మీ విషయంలో చెప్పాను కదూ ఎంత శ్రమయినా అదో శ్రమ అనే అనుకోను! మీరు దయచేసి నా దగ్గర ఎలాంటి సంకోచాలు పెట్టుకోకండి. మీరు నా రైటరు అంచేత మీ బాగోగులు ప్రస్తుతం నాకు ముఖ్యం"
సీత మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకొంది. ఆమె మనసంతా అతని మీద కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. ఇప్పుడతను చేస్తున్న సహాయం సామాన్యమయినది కాదు. ఏనాటినుంచో తాము సాధించలేని విషయాన్ని ఒక్క నిమిషంలో పరిష్కరించాడు. ఈయన రుణం ఎలా తీర్చుకోవాలో?
"సరే ఇంటి విషయం సెటిలయిపోయింది. రేపు ఉదయం ఏదో ఒక సమయంలో నా కారు పంపిస్తాను. మీరు కావాలంటే ఇల్లు మారడానికి ఉపయోగించుకోవచ్చు ఏమంటారు"
"అలాగే నండీ"
"ఇకపోతే ఇవాళ మంచిరోజు కనుక మీకు అడ్వాన్స్ ఇద్దామని బయల్దేరానసలు. ఇదుగో! ప్రస్తుతం ఐదువేలు అడ్వాన్స్ తీసుకోండి. మిగతాది మనం వర్క్ ప్రారంభించాక తీసుకొందురుగాని" వందరూపాయల నోట్లకట్ట అందిస్తూ అన్నాడతను.
తీసుకొని టేబుల్ మీదుంచింది సీత.
"మీవారేం చేస్తున్నారో చెప్పనేలేదు! ఆయనని కూడా నాకోసారి పరిచయం చెయ్యండి" అన్నాడతను.
"రేపెలాగూ ఇల్లు మారుతున్నాం కదా రేపు సాయంత్రం మీరు ఆ కొత్త ఇంటికొస్తే మనందరం కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు."
"బాగానే వుంది మీరు చెప్పింది మరి నేను వెళ్ళవచ్చా ఇక? లేవబోతూ అన్నాడు.
"అహహ ఉండండి. ఇదివరక్కూడా కాఫీ త్రాగకుండా వెళ్ళిపోయారు. ఐదు నిమిషాల్లో తయారు చేసుకొస్తాను" త్వరత్వరగా వంటింటివేపు నడిచిందామె. "సర్లెండి మీ చేతి కాఫీ రుచి ఇవాళ చూడాలని రాసి వుంది కాబోలు" నవ్వుతూ అన్నాడతను.
కొద్ది నిమిషాల్లో ఓ కప్పు నిండా కాఫీ తీసుకొచ్చి అతనికందించిందామె.