Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 27

 

    భవానీశంకర్ ఇచ్చిన స్వేచ్చతో యాంకర్లు, జర్నలిస్ట్ లూ అందరూ రాత్రింబగళ్ళు తిరుగుతూ జనాన్ని ఆకట్టుకునే స్టోరీస్ షూట్ చేసుకోస్తున్నారు.
    విజయ్ యాదవ్ బాచ్ ఇప్పుడు పుల్ బిజీ అయిపోయారు. పెన్ కెమెరాలు తీసుకుని వీధుల్లో , గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాల కేస్ లన్నీ రహస్యంగా షూటింగ్ చేసి "బ్రేకింగ్ కర్రప్షన్" అనే ప్రోగ్రాం కింద టెలికాస్ట్ చేస్తున్నారు. దాంతో యాంటి కర్రప్షన్ బ్యూరో వాళ్ళు బృందావన్ చానెల్ ని ఫోలో అవటం మొదలు పెట్టారు.
    ఈతరం పార్టీ నేతల ఇంటర్ వ్యూ కోసం తిరుగుతోన్న మల్లిక - తను వెళ్ళిన చోటల్లా బృందావనం చానెల్ కి ఇస్తోన్న ప్రాముఖ్యత గమనించి చాలా ఇది టేటింగ్ గా ఫీలయింది.
    "మాది నెంబర్ వన్ చానెల్ సార్ - ఇంటర్యూ మాకివ్వకుండా ఆ బృందావనం చానెల్ కిస్తున్నారేమిటి?" అడిగింది పార్టీ సేక్రటరీనీ.
    "మాక్కావలసింది ఏది నెంబర్ వన్ అనేది కాదు. దేనికి జనంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందీ అనేది" అన్నాడతను.
    అప్పుడే లోపల్నుంచీ కెమెరాతో బయటికోస్తున్న భవానీ ఆమెకు విష్ చేశాడు.
    "హాయ్ ! నెంబర్ వన్ - హౌ ఆర్ యూ"
    "నేనెక్కడి కెళ్తే నువ్వుక్కడ కొచ్చి న్యూసెన్స్  క్రియేట్ చేస్తున్నావ్" అందామె చిరాగ్గా.
    "అదే నేనూ అంటే?"
    "నువ్వెంత ట్రై చేసినా నెంబర్ వన్ ని కాలేవు! గుర్తుంచుకో-"
    "అవకపోతే నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అయితే నీ గతేమవుతుందో ఒకసారి ప్లాష్ ఫార్వార్డేసి చూసుకో-"
    "నేనుండగా అలాంటిది జరగదు - " ఉక్రోషంగా అంది.
    సెక్రటరీ ఆమె దగ్గర కొచ్చాడు.
    "సారీ మేడమ్! మా బాస్ అర్జంట్ పని మీద వెళ్తున్నారు. మీ ఇంటర్ వ్యూ ప్రస్తుతానికి కౌన్సిలయింది -"
    మల్లిక ఇంకా మండిపడింది.
    "సరే - ఆ ఇంటర్ వ్యూ వల్ల మీకే లాభం! మాక్కాదు ' అనేసి వెళ్ళి పోతుంటే భవానీ హేళన గా నవ్వాడు.
    "హౌ ఎబౌట్ షేరింగ్ డియర్?"
    "ఏంటి షేరింగ్ ? కోపంగా అడిగింది.
    "ప్రస్తుతానికి ఈ ఇంటర్ వ్యూ - తర్వాత దేనికయినా నేను రడీ-"
    "షటప్ - ఆ బోడి ఇంటర్ వ్యూ ఎవడికీ అవసరం లేదు -"
    విసవిస నడిచి వెళ్ళిపోయింది.

                              ***

    ఆ రాత్రి ఒంటిగంటకు భవానీ స్టూడియో లో కూర్చుని మర్నాడు టెలికాస్ట్ అవబోతున్న ప్రోగ్రామ్స్ లో మార్పులూ, చేర్పూలూ చేస్తుంటే అతని ఆఫీస్ ఫోన్ మోగింది.
    "అన్నా! నేను విజయ్ ని మాట్లాడుతున్నా!" రహస్యంగా గొంతు తగ్గించి మాట్లాడాడు విజయ్.
    "మనం ఎక్స్ పెక్ట్ చేసింది కరెక్ట్ అన్నా! స్వామి రూపానంద ఆశ్రమానికి నేను టీవీలో చిన్న చిన్న వేశాలేసే మహీరాని తీసుకెళ్ళి స్వామిజీకి  నా భార్య అని పరిచయం చేశాను. మహీరా స్వామీజీ బోధలు వింటూ ఆయనకు శుశ్రూషలు చేస్తూ కొద్ది రోజుల ఆ ఆశ్రమంలోనే గడప దల్చుకుందని చెప్పాను - స్వామీజీ తనకు లేడీస్ శుశ్రూషలు చేయటం నచ్చదని అన్నాడు గానీ నేను బ్రతిమాలేసరికి వప్పుకున్నాడు. ఆశ్రమానికి నేను వెంటనే పాతిక వేల రూపాయలు డొనేషన్ ఇచ్చేసరికి స్వామీజీ పొంగిపోయాడు. నేను మరో పదిహేను రోజుల తర్వాత వస్తానని చెప్పి వచ్చేశాను -- నేను వచ్చేసిన రెండో రోజే అంటే గంట క్రితం మహీరా ఫోన్ చూసింది. స్వామీజీ తన భక్తురాళ్ళతో జరుపుతున్న శృంగారాన్ని తను వీడియో తీసిందంట. నేను ఇప్పుడే టాక్సీలో వెళ్ళి తెల్లారేసరికల్లా ఆశ్రమానికి చేరుకుని మహీరాతో సహా తిరిగి వస్తాను. అంటే షుమారు మధ్యాహ్నం నుంచీ మనం ఆ వీడియోని మన చానెల్లో టెలికాస్ట్ చేయవచ్చు -"
    భవానీ హాపీగా ఫీలయ్యాడు.
    "ఒండర్ పుల్ విజయ్- ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ లే మన చానెల్ని నెంబర్ వన్ గా చేసేది. నేను రేపు మాణింగ్ నుంచే పేరు చెప్పకుండా ఒక  ప్రసిద్ద స్వామీజీ తన ఆశ్రమంలో జరుపుతున్న రహస్య శృంగారకేళి ! మరి కొద్దిసేపట్లో - కేవలం మీ బృందావనం చానెల్లో మాత్రమే అని వేసేస్తాను - దాంతో ప్రేక్షకుల్లో మాణింగ్ నుంచే సస్పెన్స్ బిల్డప్ అవుతుంది -"
    "ఒకే అన్నా - నేను బయల్దేరుతున్నా - బై ఫోన్ పెట్టేశాడతను.
    భవానీ ఫోన్ పెట్టేయబోతుండగా క్లిక్ మన్న శబ్దం వినిపించింది. ఒక్క క్షణం భవానీ శంకర్ కి అనుమానం వచ్చింది. ఆ శబ్దం వచ్చిందంటే తమ ఫోన్ ఎవరో టాప్ చేస్తున్నారని అర్ధం!
    నిజంగా ఎవరయినా తమ సంభాషణలను టాప్ చేస్తున్నారా? ఎవరికా అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ పోలీసులు గానీ, సేక్యూరీటీ ఏజెన్సీస్ గానీ చేస్తారు.
    మర్నాడు ఉదయం ఆరు నుంచే బృందావనం చానెల్లో "ఒక పేరు ప్రతిష్టలున్న స్వామీజీ తన ఆశ్రమంలో సాగిస్తోన్న రహస్య శృంగారాకేళి - మొత్తం స్టోరీ -- వీడియోతో సహా - త్వరలో - చానెల్ ఆఫ్ చేయకండి - మార్చకండి! ఇది కేవలం బృందావనం చానెల్ ప్రేక్షకులకు ప్రత్యేకం" అంటూ భయంకరమయిన మ్యూజిక్ తో ప్లాష్ చేయటం మొదలుపెట్టాడు.
    సరిగ్గా అరగంట గడిచేసరికి ఫోన్ మోగింది.
    విజయ్ కంగారుగా మాట్లాడాడు.
    "అన్నా కొంప మునిగింది -"
    "కొంపలున్నది మునగడానికే - ఊరికే ఎగ్జయిటయి పోకు! ఏంటి మేటరు?"
    "నేను మాణింగ్ సిక్స్ ధర్టీకి స్వామీజీ ఆశ్రమం చేరుకున్నా! పది నిమిషాల క్రితమే మహీరా బంధువులెవరో వచ్చి ఆమెను తీసుకెళ్ళారని ఆశ్రమంలో వాళ్ళు చెప్పారు. మహీరా సెల్ కి ఫోన్ కొడితే సెల్ ఆఫ్ ఉంది -"
    "ఒక్క నిమిషం లైన్ లో ఉండు" అంటూ పక్కనే ఉన్న టీవీలో చానెల్ మార్చి సంపూర్ణ టీవీ అన్ చేశాడు.
    అందులో కూడా బ్రేకింగ్ న్యూస్ ప్లాష్ అవుతోంది.
    రాష్ట్రమంతా పేరు ప్రతిష్టలు గల స్వామీజీ రూపానంద రాసలీలలు! ఆశ్రమంలో తన భక్తురాళ్ళతో ఎంతో కాలంగా జరుపుతోన్న కామకేళి! కొద్ది సేపట్లోనే వీడియో దృశ్యాలు కేవలం సంపూర్ణ చానెల్ ప్రేక్షకుల కోసం ప్రత్యెక ప్రసారం"
    భవానీ షాకయ్యాడు.
    అయితే రాత్రి తన ఫోన్ టాప్ చేసింది మల్లికేనన్నమాట!
    "హలో అన్నా" పిలిచాడు విజయ్ యాదవ్.
    "మహీరాను సంపూర్ణ చానెల్ కొనేసి, కిడ్నాప్ చేసింది బ్రదర్! కనుక ఇంక ఆమె కోసం వెతకటం వృధా! వచ్చేసేయ్-"

 Previous Page Next Page