Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 27


    కానీ సడెన్ గా బ్రేక్ పడింది.
    వాడికి వుద్యోగం వచ్చి వైజాగ్ వెళ్ళిపోయాడు. దాంతో అందరికీ బోర్ మొదలయింది. చచ్చేవాళ్ళం టైంపాస్ అవక. నిరుద్యోగ పర్వం వుంది చూశారా! మనిషి జీవితంలో చాలా హారిబుల్ పిరీడ్!
    "మనక్కావాల్సింది మనం చేయలేము...ఏం చేద్దామన్నా ఎవరేమంటారో భయం... ఇంట్లోవాళ్ళెంత బాగా చూసినా అనుమానం...మనకి ఉద్యోగం రాలేదని వాళ్ళు విసుక్కుంటారేమోనని ఒక ఫీలింగ్_మా ఫ్రెండ్ రాజు వాళ్ళన్నయ్య ఏం చేశాడనుకున్నారు. ఇంకేదో విషయంలో వాళ్ళ ఫాదర్ అతనిమీద విసుక్కునేసరికి కోపం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు."
    "మైగాడ్!"
    "అవునండీ! ఆ సమయంలో అలాగే అనిపిస్తుందెవరికయినా. వృధాగా టైం గడుపుతున్నట్లు ఒకటి దయాదాక్షిణ్యాలమీద బ్రతుకుతున్నట్లూ జీవితాంతం ఉద్యోగం రాకపోతే భవిష్యత్ ఏమిటి అనే ఆలోచనా"
    అతను మాట్లాడుతూనే ఉన్నాడు. టైం ఎలా గడిచిపోతుందో తెలీటంలేదు సావిత్రికి.
    ఇప్పుడతను ఓ క్రొత్తవ్యక్తిగా అనిపించటంలేదు.
    ఇద్దరికీ చాలాకాలంగా పరిచయం వున్నట్లు అనిపిస్తోంది.
    అతను వెళ్ళిపోయాక కూడా అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయిందామె. ఏం చేయాలి?
    "భోజనం చేయాలనిపించలేదు, ఓ విధమైన సంతృప్తి, ఆనందం"
    అద్దం దగ్గర కూర్చుంది చాలాసేపు.
    అదివరకటి గ్లామర్ తిరిగి వచ్చేసింది ముఖంలో. తను ఇవాళ ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణ వలన.
    లేక అతనితో ఏర్పడిన చనువు వల్లా?
    అలాగా మంచంమీదకు వాలిపోయిందామె.
    ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు.

                                        *    *    *    *

    "శాంత లీవ్ పొడిగించింది...ఆ విషయం తనకూ ఉత్తరం రాసింది. వాళ్ళ ఊళ్ళో ఓ తమాషా సంఘటన జరిగిందట. అందుమూలాన సెలవు పొడిగించాల్సి వచ్చిందట. వివరాలు వచ్చే సంచికలో" అన్రాసింది.
    తనకు సస్పెన్స్ మొదలయిపోయింది. ఏమిటి తమాషా? ఆ సంఘటన మూలాన శలవు పొడిగించేటంత ముఖ్యమయిన విషయమా అది? ఒకవేళ పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారా?...అంటే శాంతకి పెళ్ళయిపోతుందా? పెళ్ళయిపోతే ఆమె దారిన ఆమె వెళ్ళిపోతుందేమో. తను ఒంటరి జీవితం గడపాల్సిందేనా? ఆందోళన ప్రారంభమయింది సవిత్రిలో...ఎన్నాళ్ళీ వంటరి జీవితం ఆఫీస్ నించి బయలుదేరి కోఠీ చేరుకుంది సావిత్రి.
    ఎంచేతో మనసంతా పాడయిపోయింది. హోటల్ మెట్లెక్కబోతుంటే వెనుకనుంచి శంకర్ గొంతు వినిపించింది...
    "సావిత్రిగారూ!"
    వెనక్కు తిరిగి చూసింది. బెల్ బాటమ్ పాంటూ, పువ్వుల షర్టూ కళ్ళకి కూలింగ్ గ్లాసులూ, స్పోర్ట్సుమన్ అవడం వల్ల ఏర్పడ్డ దృఢమయిన శరీరం.     
    "సీరియస్ గా నన్నుదాటి మెట్లెక్కేస్తోంటే ఎవరా అని చూశాను. తీరా చూస్తే మీరు" నవ్వుతూ అన్నాడు అతను.
    "మీరూ కాఫీకేనా?" అడిగింది సావిత్రి.
    "అవును. పదండి..." మెట్లెక్కుతూ అన్నాడతను. ఇద్దరూ ఫ్యామిలీ రూములోకెళ్ళారు.
    "ఇక్కడ కూర్చుందామా!" ఖాళీగా వున్న ఓ టేబుల్ చూపుతూ అడిగాడతను.
    "ఉహూ! నా సీటు ఆ కార్నర్ లో" నవ్వుతూ అని అక్కడకు నడిచి కూర్చుంది సావిత్రి.
    ఓ కుర్చీ లాక్కుని ఆమెకెదురుగా తనూ కూర్చున్నాడతను.
    "నిజమేనండోయ్! ఇక్కడ చాలా బావుంది. ఇది మీ పర్మనెంట్ సీటన్నమాట" కర్టెన్ తొలగించి రోడ్డు మీదకు చూస్తూ అన్నాడతను.
    ఆ సమయంలో అతను కనిపించడం సావిత్రికి చాలా ఉత్సాహాన్ని కలుగజేసింది.
    సర్వర్ వచ్చాడు.
    "రెండు కాఫీ" అంది సావిత్రి.
    "ఊహు! నాకు ఆకలిగా వుందండి! మధ్యాహ్న భోజనం కూడా చేయలేదు"... నవ్వుతూనే అన్నాడు శంకర్.
    "ఓ సారీ! అలాగయితే మీకేం కావాలో చెప్పండి__"
    సర్వర్ ని ఏమేం ఉన్నాయో అడిగి పూరీ రెండు ప్లేట్లు ఆర్డర్ చేశాడతను.
    "నాకేం చెప్పకండి! నాకు ఈ టైంలో ఉట్టి కాఫీ తాగడం అలవాటు" వారిస్తూ అందామె.
    "ఇవాళ ఒక్కరోజున మీ అలవాటుని మర్చిపోదాం__"
    "ఎందుకని?"
    "కంపెనీ లేందే తినటం నాకు అలవాటులేదు కనుక__"
    సావిత్రి నవ్వేసింది.
    "హాకీ మీకు మాటలు కూడా బాగా నేర్పినట్లుంది."
    "ఒకటేమిటండీ! హాకీ చాలా నేర్పింది. ఎటొచ్చి వాటిని నేనే ఉపయోగించుకోలేక పోతున్నాను. అన్నట్లు మా ఫ్రెండ్ రాలేదా ఊర్నుంచి?"

 Previous Page Next Page