"మన గాళ్ ఫ్రెండ్! మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం గానీ వాళ్ళ డాడీ వప్పుకోవటం లేదు..."
"ఎందుకని?"
"నేను ఏదొక వ్యాపారమయినా, ఉద్యోగమయినా చేయాలిట! లేదా నా పేర ఎంతోకొంత ఆస్తి ఉండాలిట! అవేమీ లేకపోతే తనే నన్ను కూడా పోషించాల్సి వస్తుందని భయం...అయితే ఇందుకు మా ఫ్రెండొకడు మాంచి ఉపాయం చెప్పాడు."
"ఏమిటది?"
"ఇప్పుడు మీరు రాయబోతున్న ఆత్మకథ తాలూకూ డైరీలు, ఫోటోలు కాజేసి అతనికిస్తే అతను నాకు యాభయ్ వేలు ఇస్తానన్నాడు."
భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
"కాజేయటమా!"
"అవును! మీ సహాయం ఉంటే అదేమంత కష్టం కాదని నా అభిప్రాయం..."
"నా సహాయమా?"
"అవును గురూజీ! ఓ యంగ్ ఫెలో_ఓ చిన్న గుర్రాన్ని కొని వ్యాపారం ప్రారంభించి జీవితంలో పైకివచ్చి కోటీశ్వరుడవ్వటం మీకిష్టం లేదూ?"
"అఫ్ కోర్స్! అవ్వాల్సిందే కానీ...ఇంతకుముందే గుర్రం పేరు చెప్పి సహాయం అడిగిన ఓ ఫ్రెండ్ కి సహాయం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాను..."
"ఉద్యోగం పోతేపోనీండి! మీరిప్పుడు నాకు సహాయం చేస్తే_మా బావగారిస్తానన్న పాతికవేలూ మా ఫ్రెండ్ మీకిస్తాడు_"
"కానీ మీ ఫ్రెండ్ కి ఆ డైరీలలో ఏమిటి పని?"
"మరేంలేదు. మా బావగారు ఆత్మకథ రాసి "లంబోదరా పబ్లికేషన్స్" వాళ్ళకి పబ్లిష్ చేసే హక్కులు ఇస్తానన్నాడట! మా ఫ్రెండ్ కది ఇష్టంలేదు. ఆ పుస్తకం పబ్లిష్ చేస్తే వాళ్ళ సంస్థ మా ఫ్రెండ్ వాళ్ళ పబ్లికేషన్స్ సంస్థ కంటే పెద్దదయిపోతుందని మా ఫ్రెండ్ అనుమానం! అందుకని ఆ పుస్తకం రాయనీకుండా ఆ డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు కొట్టేస్తే..."
"అర్ధమయింది బ్రదర్! అర్థమయింది! ప్రొఫెషనల్ జెలసీ అన్నమాట!"
"సెంట్ పర్సెంట్ కరెక్ట్!"
"అయామ్ సారీ మైడియర్ ఫ్రెండ్! ఆ పనిచేయటం నావల్ల కాదు! దొంగతనాలు చేయలేదనికాదు గానీ... ఆ ట్రాక్ వేరు. చిన్నప్పుడు సరదాగా మామిడి తోటల్లో కొబ్బరి తోటల్లో దొంగతనాలు చేసేముగానీ... ఇలా లార్జ్ స్కేల్లో_నో_అయాం ఎక్స్ ట్రీమ్లీ సారీ!"
"అంటే ఈ నవయువకుడి భవిష్యత్తు ఇలా ఆంధ్రప్రదేశ్ హౌస్ లోనే సర్వనాశనం అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా? నేనూ శిరీషా విరహంతో తపిస్తూ సైక్లోన్ లో చనిపోవాలని మీరు అనుకుంటున్నారా?"
"అలా కోరుకోవటంలేదుగానీ..."
"నేనూ, శిరీషా చిలకా గోరింకల్లా ఒకటయి ఆనందంగా జీవితం గడపాలని కోరటంలేదా?"
"కోరుతున్నాను కానీ, సారీ! ఆ పనిమాత్రం చేయను."
"సరే" అంటూ తన చేతిలో వున్న పాకెట్ విప్పి ఓ పుస్తకం బయటకు లాగాడతను. దాని కవర్ పేజీ భవానీశంకర్ వేపు తిప్పి చూపించాడు.
దానిమీద "విషసర్పం" అని వుంది. దానికిందే దీప్ చంద్ అన్న అక్షరాలు కనిపించినయ్.
"ఓ! నా నవల. ఎక్కడ దొరికింది నీకా పుస్తకం?"
"అద్దె లైబ్రరీలో"
"చదువు చాలా సస్పెన్స్ తో నిండివుంటుందా నవల. చాలా ఎప్లాజ్ వచ్చింది దానికి" అన్నాడు భవానీశంకర్ సర్దుకుంటూ.
"అందుకే మార్కెట్లో అవుటాఫ్ స్టాక్ అయుంటుంది."
"కరెక్ట్! మళ్ళీ ఇంకో ఎడిషన్ వేయాలని మా పబ్లిషర్ మొన్నే ఉత్తరం రాశాడు"
"వెంటనే వేయించండి. ఆలస్యం చేయవద్దు."
"ఓ తప్పకుండా."
"వర్ధనరావ్ పుస్తకం వెనకవేపు అట్ట భవానీశంకర్ కి కనిపించేట్లుగా పట్టుకున్నాడిప్పుడు.
దానిమీద దీప్ చంద్ ఫోటో చూస్తూనే భవానీశంకర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
"ఈ ఫోటో కింద మీ వివరాలు చదివాను. మీర్రాసిన మొట్టమొదటి నవల 'వినువీధిలో పెనుగాలి' అటకదా."
"అఫ్ కోర్స్! కరెక్టు...కరెక్టు..." తడబడుతూ అన్నాడతను. అతనికి అర్థమయిపోయింది. తను వర్ధనరావ్ చేతిలో పట్టుబడిపోయాడు. ఇంక దొంగాట ఆడటం అనవసరం.
"సో, మైడియర్ ఫ్రెండ్! నేను దీప్ చంద్ ని కాదని తెలుసన్నమాట!" అన్నాడు చిరునవ్వుతో.
"కొద్దిసేపటి క్రితమే."
"చాలా ఆశ్చర్యపోయుంటా వనటంలో ఏమాత్రం సందేహం లేదు నాకు"
"తెగ ఆశ్చర్యపోయాను."
"భలే తమాషాగా వుందికదూ ఇలా జరగటం?"
"చాలా తమాషాగా వుంది."
"జీవితంలో ఇలాంటి తమాషాలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్."
"అనే అనిపిస్తోంది."
"నిజం చెప్పాలంటే నేను ఇలా దీప్ చంద్ లా ఇక్కడికి రావాల్సి వస్తుందనిగానీ, వస్తాననిగానీ నేనెప్పుడూ అనుకోలేదు."
"అలాగా?"
"అంతా అనుకోకుండా జరిగిపోయింది."
"ఐసీ!"
"ఇలా దీప్ చంద్ పేరుతో రావటానికి గల కారణం ఏమిటో చెప్తే నువ్వు మరీ ఆశ్చర్యపోతావు."
"అలాగా?"
"యస్! చాలా అనూహ్యమయిన సింపుల్ రీజన్."
"ఒకోసారి అంతే."
కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. వర్ధనరావు చిన్నగా దగ్గి భవానీశంకర్ వేపు చూశాడు"
"నా ప్రాజెక్టుకి సహాయం చేసే విషయంలో మీ అభిప్రాయం ఏమయినా మార్చుకున్నారా?"
భవానీశంకర్ ఓ క్షణం ఆలోచించాడు.
"మార్చుకోడానికి ఆస్కారం వుంది బ్రదర్! కానీ..."
"మీ ఇష్టం. బలవంతమేం లేదు."
"నో, నో! అదేంకాదు. నిజం చెప్పాలంటే నీలాంటి యంగ్ మెన్ కి అన్నివిధాల సహాయం చేయాలనేదే నా పాలసీ."
"చాలా మంచి పాలసీ మీది."
"ఇప్పుడు నేను నీతో సహకరించి ఆ డైరీలను, ఫోటోలను కాజేయాలి, అంతేకదా!"
"అంతే."
"అలాచేస్తే నా రహస్యం చాలా జాగ్రత్తగా కాపాడబడుతుంది?"
"ఇనుపపెట్టిలో ఉన్నట్లే"
"ఒకవేళ కాదు పొమ్మంటే నేను దీప్ చంద్ ని కాదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది."
"క్షణాల్లో."
"చాలా డెలికేట్ పరిస్థితి కదూ?"
"టూ డెలికేట్" వప్పుకున్నాడు వర్ధనరావు.
"అయితే సరే. వప్పుకుంటున్నాను"
వర్ధనరావు ఆనందంగా లేచి భవానీశంకర్ ని కౌగిలించుకున్నాడు.
"యూ ఆర్ ఎ గ్రేట్ ఫ్రెండ్!"
"ఫ్రెండ్ షిప్ కి ప్రాణం ఇస్తాను."
"మన ఫ్రెండ్ షిప్ కి ప్రాణం అక్కర్లేదు. చిన్న ఎడ్జస్ట్ మెంట్ చేస్తే చాలు"
"అఫ్ కోర్స్! ఇంతకూ నేనేం చేయాలి?"