Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 27


    "శుభం పలకరా!.... అంటే ఏదో అన్నట్లు శకునపక్షిలా ఏమిటా మాటలు? ఆ శనినోటినుంచి మంచి మాట రాదు!" అని విరుచుకు పడింది సుమతి.
    "నాది శని నోరూ, మీవి శని బ్రతుకులూ...." నెమ్మదిగానే నవ్వుతూ అన్నాడు నీలకంఠం.
    "మావి శని బ్రతుకులా? అవును. మీలాంటివాళ్ళని కట్టుకున్నాక శని బ్రతుకులు కాక మరొక బంగారు బ్రతుకు ఎలా వస్తుంది?" ఏడుస్తూ, ఒగరుస్తూ అంది సుమతి.
    తులసి తన తల గట్టిగా పట్టుకుని, "అబ్బబ్బ!.... అక్కయ్యా! మీరిద్దరూ దెబ్బలాడుకోకండి. బాబు ఏడుస్తున్నాడు చూడు" అంది.
    "అదీ, అలా బుద్ధిచెప్పండి." అన్నాడు నీలకంఠం.
    "అంటే? నేను బుద్ధి తక్కువ దాన్నా!" ఏడుస్తున్న పిల్లవాణ్ణి పట్టించుకోకుండా అరిచింది సుమతి.
    లాభం లేదని గోడకానుకుని కళ్ళు మూసుకుంది తులసి. రాయవెల్లూరు వెళ్ళాలంటే డబ్బుకావాలి! ఎక్కడిది? తను ఉద్యోగంలో చేరి మూడునెలలు కూడా కాలేదు. అంతా కలిపి ఒకే ఇంట్లో ఉండాలనే ప్రతిపాదనతో, తల్లి జబ్బుతో, తన జీతం ఏ నెలది ఆనెల పైసా మిగలకుండా ఖర్చయిపోతోంది. ఒక మామూలు చీర కొనుక్కుందామన్నా డబ్బు మిగలటంలేదు. ఇంట్లో ఎవరికీ బంగారు నగలు లేవు. మంగళ సూత్రాలు తప్ప.
    ఈ పరిస్థితుల్లో ఒక్క నీలకంఠమే ఆదుకోవాలి! అందుకే సిగ్గువిడిచి అడిగేసింది....
    "బావగారూ! ప్రస్తుతం నా వైద్యానికి డబ్బు సర్దుబాటు చెయ్యండి. తరువాత నేను ఉద్యోగంలో చేరగానే తీర్చేస్తాను."
    నీలకంఠం బోలెడు ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు. "నేనా! డబ్బా? బలే జోక్! నా దగ్గర డబ్బెక్కడిది?" నీలకంఠం తన జీతంలోంచి తప్పనిసరిగా నెలకి ఒక వందరూపాయలు బ్యాంక్ లో వేసుకుంటాడు. ఆరు నూరైనా ఆ డబ్బులోంచి పైసాకూడా ఇంటికి తీసుకురాడు. ఇన్నాళ్ళూ తను జీతంలోంచి కొంచెం కూడా తనకోసం ఉంచుకోకుండా, అతని పిల్లల మందులకీ, మాకులకీ ఖర్చుపెట్టింది. ఇప్పుడిలా మాట్లాడుతున్నాడు.
    "మీకు ప్రావిడెంట్ ఫండ్ మీద లోన్ వస్తుందికదా? అలా అప్పు తీసుకుని ఇవ్వండి, నా చెయ్యి నయంకాగానే వడ్డీతో సహా తీర్చేస్తాను."
    "భలే బాగుంది! రాయవెల్లూరులో వైద్యం చేయించినా, నీ చెయ్యి నయమవుతుందని ఏముంది? నయమయినా, సూర్యం మళ్ళీ నీకు ఉద్యోగం ఇస్తాడని గ్యారంటీ ఏముందీ? అంతగా అభిమానించే మనిషే అయితే, అసలు ఉద్యోగంలోంచి తీసెయ్యటం దేనికి? లేని ఉద్యోగాన్ని నమ్ముకుని నీకు అప్పెలా ఇవ్వను?"
    ఎంత నిర్మొహమాటంగా, వ్యవహారపక్షంగా మాట్లాడుతున్నాడు? ఇంత మొరటుగా మనుష్యులెలా ఉండగలరు? ఇందులో సగం స్వార్థం తనకున్నా, ఈనాడు ఇతని ముందు ఇలా చెయ్యి జాపవలసి వచ్చేదికాదు కదా!
    "ఒక షరతుమీద అయితే ఇస్తాను." అదొకలా నవ్వుతూ అన్నాడు నీలకంఠం.
    ఎలాగైనా తన చెయ్యి బాగుచేయించుకోవాలనే ఆరాటంలో ఉన్న తులసి వెంటనే, "ఏమిటది?" అంది.
    "నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే ఖర్చులన్నీ భరించి నేను వైద్యం చేయిస్తాను."
    శ్రోతలందరూ ఒక్కసారిగా, "ఆఁ!" అన్నారు దిగ్భ్రాంతితో.నీలకంఠం ఏమాత్రం చెదరకుండా, "నేను ఎంత త్యాగం చేస్తున్నాను? పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను. నయంకాలేదనుకోండి. నా డబ్బంతా వృధా! అంతేకాదు, ఒక అవిటిమనిషినీ, ఆవిడ పిల్లల్నీ జీవితాంతమూ పోషించాలి! అలా కాక నా అదృష్టం బాగుండీ నయమవుతుందనుకోండి, పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. చదువుకున్న భార్య కనుక నాకు సంపాదించి పెడుతుంది." అన్నాడు.
    జానకి పిచ్చిదానిలా చూసింది అల్లుణ్ణి.
    "వీల్లేదు! వీల్లేదు!" అని అరిచింది.
    నీలకంఠం నవ్వుతూ, "అత్తగారూ! ఎందుకంత గాభరా పడతారు? మీ అమ్మాయి సంపాదన నేను మింగేస్తాననా! అసలు ముందు చెయ్యి బాగుకానీయండి. ఆ తరువాత సంపాదన మాట...." అన్నాడు.
    సుమతికి వెర్రి ఆవేశం వచ్చేసింది. సాధారణ మర్యాద కూడా మరిచిపోయింది.
    "దుర్మార్గుడా! ఇదా నీ మనసులో ఉన్న కుళ్ళు ఆలోచన! ఎంతకాలం నుంచి కుళ్ళుతోంది నీ మనసు ఇలాగ. నీ బ్రతుక్కితోడు బంగారంలాంటి నా చెల్లెలు కావలసి వచ్చిందా? ఒసేవ్, తులసీ! పారిపోవే! ఇక్కడినుంచి పారిపో! నేను భరించలేనే ఈ క్షోభ! ఓయ్ దేవుడా! ఇది జరగదని తెలుసు, కాని.... నువ్వు ప్రాణం పోయినా ఈ రాక్షసుడ్ని పెళ్ళిచేసుకోవని తెలుసు, కాని.... అంతగా వస్తే నేనే నీ పీక నొక్కి నిన్ను కాపాడతాను. కాని.... ఈ పిశాచి మనసులో ఇంత దుర్మార్గపు ఆలోచన...."
    పళ్ళు పట పట నూరుతూనే పిడికిళ్ళు బిగించి మూర్ఛ పోయింది సుమతి. పిల్లలు గోలగోలగా ఏడుస్తోంటే యథాప్రకారం నిమ్మకు నీరెత్తినట్లు నవ్వుకుంటూ కూర్చున్నాడు నీలకంఠం.
    "దాని ముఖాన ఇన్ని నీళ్ళు చల్లవే! ఆ పసివెధవల ముఖం చూసయినా మనం ఈ క్షోభ అనుభవించక తప్పదు." అంది జానకి మంచంలోంచి లేవలేక ఆయాసపడుతూ.
    "పారిపో! పారిపో!" అన్న సుమతి కంఠం తులసి చెవుల్లో మార్మోగుతోంది. అక్క దగ్గర నుంచి, బావ దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, ఆ పరిసరాల నుంచి దూరంగా పారిపోవాలని ఉంది. ఎక్కడికి పారిపోతుంది? ఈ నరకంలో తప్ప తనకు ఆశ్రయమెక్కడ ఉంది?
    "తులసీ!" అని పిలుస్తూ, స్వతంత్రంగా లోపలికి వచ్చేశాడు కృష్ణారావు.
    సుమతి ముఖంమీద నీళ్ళు చల్లుతోన్న తులసి, కృష్ణారావును అయోమయంగా చూసింది. కృష్ణారావు కదిలిపోయి, "అదేమిటి? ఏమయింది? ఎందుకలా చూస్తున్నావు? సుమతి మూర్ఛపోయినందుకా? అలవాటేగా! అదిగో, అప్పుడే కళ్ళు తెరుస్తోంది. కాస్త అలా తిరిగివద్దాం రా!" అన్నాడు.
    అల్లకల్లోలంగా ఉన్న తులసి మనసు ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఆసరానయినా అందుకోవటానికి సిద్ధంగా ఉంది.
    "సమయానికి వచ్చారు! నిజంగానే ఎంతో నిరాశతో ఉన్నాను." అంది స్నేహస్వరంతో.

 Previous Page Next Page