తమ టెంట్స్ వైపు బయలుదేరాడు. నిధి రహస్యాలు తెలుసుకోవాలని బయలుదేరి సుబ్బయ్య సహకార సంఘాల గురించి తెలుసుకున్నాడు. నవ్వుకున్నాడు.
గుహ చుట్టుపక్కల తవ్వకాలు మొదలుపెట్టారు. ఏమైనా ఆధారాలు దొరికితే, సూర్యనేత్రానికి సంబంధించిన వివరాలు ఊహించవచ్చునేమో?
లచ్చింబోడు అడవిదారిలోకి వచ్చాడు. ముందు కొద్ది దూరంలో కనిపించింది కాషాయాంబధారిణి. లేడిపిల్లలా చురుగ్గా ముందుకు ఉరుకుతూ పోతోంది.
పేరు పెట్టి పిలుద్దామంటే రవికి వాళ్ళలో ఎవరి పేర్లూ తెలియవు. చప్పట్లు కొట్టాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరగలేదు.
"ఏయ్! ఓయ్!" అని గట్టిగా అరిచాడు.
ఆ అమ్మాయి ఒక్కసారి తలతిప్పి చూసి మెరుపులా నవ్వి ముందుకు సాగిపోయింది ఆగకుండా. రవి ఆమెని అనుసరించాడు.
ఆమె ఎటు పోతుందో అతనికి అర్థం కావటం లేదు.
తనకు పరిచితమైన దారి కాదని తెలుస్తోంది. అయినా ఆమెనే దృష్టిలో పెట్టుకుని నడుస్తున్నాడు. వేగంగా...పరిగెత్తడానికి వీల్లేదు.అడవి దారి కొత్త దారి. కింద ఏముందో చూసుకోవాలి. కాలిబాట పక్కనే ముళ్ళపొదలుండవచ్చు.
బంగారులేడిలాగా ఆ అమ్మాయి దగ్గిరయినట్లే అయి అంతలో దూరమవుతుంది. అలా చాలా దూరం నడిచినట్లు అతడి ఆయాసం చెప్తోంది. ఆగి గడియారం చూసుకున్నాడు. రేడియం డయల్ ఉన్న వాచ్ అది. రాత్రి పదకొండున్నర.
సుబ్బయ్య ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఎనిమిది గంటలే! అంటే తను మూడున్నర గంటలు నడిచాడా? ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది!
ఎంత అద్భుతమైనది మన మనసు? కాషాయాంబధారిణినే చూస్తూ మరే ఆలోచనా లేకుండా నడుస్తున్నంతసేపూ అతడికే శ్రమా తెలీలేదు. మూడున్నర గంటలు నడిచాననుకోగానే మరొక్క అడుగు కూడా వేయలేనంత అలసట తోచింది.
తన ఈ ఆలోచనలలో ఉండగా కాషాయాంబధారిణి వెళ్ళిపోయిందేమోనని చూశాడు. లేదు. అతి మెల్లిగా నడుస్తోంది. తనను తప్పించుకుపోవడం ఆ అమ్మాయి ఉద్దేశం కాదు. తన వెంట ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తోంది. లేకపోతే ఆగదు.
ఈ ఆలోచన రాగానే అతడికి మరింత ధైర్యం వచ్చింది. తనూ నడవసాగాడు మళ్ళీ. దాహంతో గొంతు ఎండిపోతుంది. వెనుకటిలా చురుగ్గా నడవలేకపోతున్నాడు. కాషాయాంబధారిణి కూడా ఆగి ఆగి నడుస్తోంది. మరో అరగంటలో ఆమెని కలుసుకున్నాడు. కాదు ఆ అమ్మాయే రవికి తన్ను కలుసుకునే అవకాశం ఇచ్చింది.
ఆమె చెయ్యి పట్టుకుని ఒగరుస్తూ నిలబడిపోయాడు. నోట మాట రాక...
ఆ అమ్మాయి ముఖంమీద కూడా చెమట బిందువులున్నాయి కానీ అంత అలిసిపోయినట్లు కనిపించటం లేదు.
కన్ను కొట్టి విలాసంగా నవ్వింది. విభ్రాంతితో పట్టుకున్న చెయ్యి వదిలేశాడు.
"అటు చూడండీ?"
చూశాడు. కనుచూపుమేర దూరంలో మట్టిరోడ్డు మీదుగా దూరం నుంచి వస్తున్న జీప్, దశమి వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జీప్ చప్పుడు దగ్గిర కాసాగింది.
ఆ అమ్మాయి త్వరత్వరగా చెప్పింది. "ఆ జీప్ లో ఉన్నదెవరో, ఇప్పుడేం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంటే, ఆ గుబురుగా ఉన్న పొదచాటున కదలకుండా చూర్చోంది. పొరపాటున ఆ జీప్ లో ఉన్న మనిషికి మీరు కనిపించారంటే ప్రాణాలతో బయటపడరు."
రవి విభ్రాంతిలోంచి తేరుకునే లోగానే ఆ అమ్మాయి అడవి దారులలో అదృశ్యమైపోయింది.
జీప్ చప్పుడు దగ్గిర కావస్తుంది. చటుక్కున పొదమాటున కూర్చున్నాడు రవి. జీప్ కొంచెం ముందుకు సాగి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆ వెలుగులో అతడి ముఖం స్పష్టంగా కనిపించింది. అతడు దేవనారాయణ్.
సిగరెట్ వెలిగించిన సంకేతం అందుకొన్నట్లుగా అటువైపు నుంచి మరో జీప్ వచ్చి ఆగింది. అందులోంచి మరో వ్యక్తి దిగాడు. అతడు చిరపరిచితుడయినట్లు దేవనారాయణ్ అతడికి షేక్ హాండ్ ఇచ్చాడు.
తన చేతిలోని చిన్న పెట్టెని తెరచి చూపించాడు. అందులో ఏముందో రవికి కనపడలేదు. రెండో వ్యక్తి తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ తెరచి చూపించాడు. అందులో ఉన్నవి రూపాయల నోట్ల దొంతరలు! అన్నీ వందనోట్ల కట్టలు. కథల్లోలాగ మోసపోకుండా దేవనారాయణ్ ప్రతి కట్టా చెక్ చేసుకున్నాడు. తరువాత అట్టపెట్టి అతడికిచ్చి బ్రీఫ్ కేస్ తన జీప్ లో పెట్టుకున్నాడు. రెండు జీప్ లూ చెరో వైపుకి సాగిపోయాయి.
రవి నెమ్మదిగా కదిలేసరికి అతడి వీపుకేదో మెత్తగా తగిలింది. కెవ్వున కేక వేశాడు భయంతో. అతడి కేకలో మరో కేక కలిసింది. అది అనిలది. ప్రళయ ప్రభంజనానికి లేదీగలాగ వణికిపోతోంది.
"మీరు...మీరా?"
"మీరేనా?"
అనిలా, రవి పరస్పరం విభ్రాంతితో పలకరించుకున్నారు. భయంతో దడదడలాడుతున్న ఇద్దరి గుండెలూ స్థిమితపడ్డాయి.
"ఇంత రాత్రి వేళ మీరు...ఒంటరిగా...?" అడిగాడు రవి ఆశ్చర్యంగా.
"ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే?" మొదట కలిగిన భయం పోగానే, అనిల ఎప్పటిలా మొండి అనిల అయిపోయింది.
"ఆడవాళ్ళకి ప్రమాదం?"
ఇలాంటి మాటలకి అనిల రియాక్షన్ ఎలా ఉంటుందో, తెలిసే అనకుండా ఉండలేకపోయాడు. అనిలని నొప్పించాలని కాదు. అంత రాత్రివేళ ఆ నిర్జీవరణ్యంలో ఆమెని ఒంటరిగా చూడటం, అతనికీ భయంగా ఉంది!
"అవును! ఆదవాళ్ళకి ప్రమాదం పులులూ, పాములూ, ఎల్లుగ్గొడ్లూ మొదలైన క్రూర జంతువుల వల్ల ప్రమాదం ఆడవాళ్ళకీ మొగవాళ్ళకీ ఒక్కలాగే ఉంటుంది. వాటి బారినుంచి తప్పించుకునే నేర్పు నాకుంది. చాలా రోజుల్నుంచీ ఈ అడవి దారుల్లో తిరగటానికి అలవాటు పడ్డదానినే! కానీ క్రూర జంతువులకంటే క్రూరుడైన మొగవాడి బారి నుంచి మాత్రం నన్ను నేను తప్పించుకోలేను. ఆ భయం నాకు వుంది! అందుకే వంటరిగా రాలేదు" కసిగా, రోషంగా, బాధగా అంది.
ఎక్కడినుంచో అకస్మాత్తుగా ప్రత్యక్షమయినట్లు వారి ముందువచ్చి నిలిచింది త్రిసికి. ఎక్కడచూసినా కొండరాళ్ళూ, వటవృక్షాలు, దుబ్బులూ, గుట్టలూ, లోయలూ ఉన్న ఆ ప్రాంతంలో మనుష్యులు ఒకరికి కనిపించకుండా మరొకరు దాక్కోవటం కష్టం కాదు.
భావరహితంగా ఉండే త్రిసికి చూపులలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "ఇక వెళ్దాం" అన్నట్లు చూసింది అనిలవైపు. అనిల అర్థం చేసుకుంది.
"రండి? మనం నడుస్తూ మాట్లాడుకుందాం?" అని దారి తీసింది అనిల.
అర్థరాత్రి, అడవి దారిలో, లేత వెన్నెల్లో అనిలలాంటి అందమైన అమ్మాయి పక్కన నడవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది రవికి. ఆ అనుభూతిలో ఉన్న ఉత్సాహం భయాన్ని కూడా మింగేసింది.
త్రిసికి చేతిలో కమండలం ఉంది. అందులో ఉన్న నీళ్ళు అనిలకీ, రవికీ ఇచ్చింది. ఆ నీళ్ళు తాగగానే చిత్రంగా అప్పటివరకూ ఉన్న శ్రమ, అలసట, భయం అన్నీ మాయమై కొత్తబలం వచ్చినట్లు తోచింది. ముగ్గురికీ చురుగ్గా పడసాగాయి అడుగులు.
త్రిసికి కొద్దిగా ముందు నడవసాగింది నాలుగు పక్కలా చూసుకుంటూ. ఆ చూపులలో ముందు జాగ్రత్త స్పష్టంగా తెలుస్తుంది. అడవిదారి గనుక అంత హెచ్చరికగా ఉందా? లేక అనిలకి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చని త్రిసికి భయపడుతోందా?
"ఇప్పుడు చెప్పండి ఈ ప్రాంతానికి ఎందుకొచ్చారో?"
"మీకోసం వెతుక్కుంటూ..." అల్లరిగా అన్నాడు.
"అబద్ధం! నేనిక్కడ ఉంటానని మీకు తెలీదు. ఊహించలేరు. నిజం చెప్పాలనుకుంటే చెప్పండి. ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు."
"రహస్యాలు దాచుకోవలసిన అవసరం నాకేం ఉందీ?" భావగర్భితంగా అన్నాడు రవి. తర్వాత తను సహకార సంఘాల సుబ్బయ్య ఇంటికి వెళ్ళటమూ, తిరిగి టెంట్స్ దగ్గరకి వస్తుండగా కాషాయాంబధారిణి కనిపించటమూ ఆమెని వెంబడించి తాను ఆ ప్రాంతానికి రావటమూ చెప్పాడు.