తర్వాత దృశ్యాలు త్వరత్వరగా మారిపోయినట్లయింది.
పెద్ద దివాణంలాంటి ఇల్లు.
పుణ్యవతి ఏదో జాలిగా తనను అడుగుతోంది.
ఆ వెంటనే - ఆ దృశ్యం మసగ్గా అయిపోయి -
ఒక క్లబ్బు - అక్కడ పేకాట జోరుగా సాగుతోంది. సోడా బాటిల్ ఓపెన్ చేసిన చప్పుడు. సోడా గ్లాసుల్లోకి ఒంపుతున్నారు ఎవరో!
ఛీర్స్! ఛీర్స్! ఛీర్స్!
ఎవరో ఒక అమ్మాయి... పాట పాడుతూ అభినయిస్తోంది.
"మూడు నాళ్లాయెరా మువ్వగోపాలా...
నిన్ను చూడ నేనింక నిలువజాలనురా"
ఆ అమ్మాయి పైట నిలవడం లేదు.
హఠాత్తుగా దృశ్యం మారింది. చిన్న గుట్ట. దానిమీద గుడి. పైనుంచి పురాణపఠనం వినడుతోంది. "ఎన్నో జన్మలు ఎత్తితే గానీ మానవజన్మ దొరకదు. దుర్లభమైన మానవజన్మ దొరికిన తర్వాత మనం మరిన్ని మంచిపనులు చేసి..."
దృశ్యం మారిపోయింది.
జనం కలకలం!
మనసంతా కేంద్రీకరించాడు కాశీ.
ఏమిటది? కలా! నిజమా! తన భ్రమా! తన దురాశా? ఎందుకిలా రిపీటెడ్ గా ఏవేవో దృశ్యాలు కనబడుతున్నాయి తనకి! గత జన్మ ఏమిటి? గుర్తు రావడం ఏమిటి?
విషాహారం తిన్న తర్వాత తన మతి చలించిందా? దేవుడా! దారి చూపించు!
సినిమా థియేటర్ లో పిక్చర్ నడుస్తుండగా కట్ అయిపోయి, లైట్లు వెలిగి, కాసేపటి తర్వాత మళ్ళీ లైట్లు ఆరిపోయి పిక్చర్ మొదలయినట్లుగా -
ఛక్ మని దృశ్యం తిరిగి కనబడడం మొదలెట్టింది. దాని తర్వాత ఇంకో దృశ్యం... ఇంకో దృశ్యం... రీలు తర్వాత రీలు మారినట్లుగా! పూర్తి కథ కనిపించేటట్లుగా అనేక దృశ్యాలు!
మనోనేత్రంతో చూస్తున్నాడు కాశీ. అతనికి సీక్వెన్స్ నెమ్మదిగా అర్థం అవుతున్నట్లుగా ఉంది.
గత జన్మలో - అంటే యాభైఏళ్ల క్రితం -
తను...తను...తను... తన పేరు మల్లికార్జునరావు. అర్జున్ అని పిలిచేవారు దగ్గరివాళ్ళు. తల్లిదండ్రులకి తను ఒక్కడే కొడుకు.
తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ముప్పొద్దులా తిన్నా మూడు తరాలకు సరిపోయే ఆస్తి. కానీ కూర్చుని తినడం వేరు - వ్యసనాలకు తగలెయ్యడం వేరు. వ్యసనాలకి అలవాటుపడితే కొండంత ఆస్తి ఐస్ క్రీమ్ కోన్ లాగా కరిగిపోతుంది.
మంచి సాంప్రదాయకమైన కుటుంబం తనది. ఇరవయ్యేళ్ళు వచ్చేదాకా కాఫీ, టీలు కూడా అలవాటు లేదు. వక్కపొడి వేసుకోవడం మహాపాపంగా భావించేవాడు. హోటళ్ళలో తినడం అన్న అలవాటు ఇంటావంటా లేనేలేదు. ఓ రోజున హార్ట్ ఎటాక్ వచ్చి తన తండ్రి పోయాడు. తల్లి దిగులుతో చిక్కి సగమైపోయింది. చండశాసనుడైన తండ్రి చనిపోగానే, తన దగ్గర చేరాడు పాపారావు. అతను మహామాట చాకచక్యం ఉన్న మనిషి. నోరు పెట్టుకు బతికే రకం. ఆస్తిలేదు. ఉద్యోగం చెయ్యడు. కానీ నిరంతరం బిజీగా ఉన్నట్లే కనబడతాడు. పేకాట క్లబ్బులో అతను లైఫ్ మెంబరు. మూడు ముక్కలాట ఆడడంలో ఆ జిల్లాలో అతన్ని మించినవాడు లేడు! ఫుల్ బాటిలు తాగేసి మాట తూలకుండా, ఒళ్ళు తూలకుండా ఇంటికి నడిచి వెళ్ళగలడు. ఒక్కసారి మాత్రం రెండు బాటిల్స్ ఒకేసారి తాగేసి ఇంటికెళ్తూ సైడు కాలువలో పడి పోయాడు. ఎవరో లేవదీశారు. "నా మెళ్ళో ఉండే గొలుసు కాలువలో పడిపోయింది. వెదుకుతున్నా!" అన్నాడు పాపారావు. తెల్లారేసరికి ఊళ్లో ఉన్న పనీపాటా లేని పిల్లలందరూ ఆ మురిక్కాలవని ఆ చివరినుంచి ఈ చివరిదాకా శుభ్రం చేసేశారు - గొలుసు దొరుకుతుందేమోనన్న ఆశతో! అతనిలో స్పెషాలిటీ అదే! అతను అబద్ధాలాడతాడని అందరికీ తెలుసు. కానీ ఎప్పటికప్పుడు టెంపరరీగా అతని బుట్టలో పడిపోతూనే ఉంటారు. అతను కావుకావుమని అరుస్తున్న కాకిని చూపించి - అది కాకి కాదు కోయిన అన్నా అప్పటికి నమ్మేస్తారు జనం. శాంతిదూత లాంటి తెల్లపావురాన్ని చూపించి, అది కాకి అన్నా నమ్మేస్తారు. దేవుడు అతనికి ఏమీ ఇవ్వలేదు - నోరు తప్ప. అది పెట్టుకు బతికేస్తున్నాడు పాపారావు. అతన్ని ఎదురుగా ఉన్నప్పుడు మెచ్చుకోనివాళ్ళు, అతని పరోక్షంలో తిట్టనివాళ్ళూ ఉండరు.
పాపారావుకి చాలారోజుల నుంచి మల్లికార్జునరావు మీద కన్నుంది. అతన్ని తన గ్రిప్పులోకి తెచ్చుకోవాలని ఒకటి రెండు ప్రయత్నాలు చేశాడు కూడా. కానీ మల్లికార్జునరావు తండ్రి ఓసారి అతన్ని పిలిచి "ఈసారి మళ్ళీ ఈ వీధిలో కనబడ్డావంటే వీపు చిట్లగొడతా!" అని చెప్పాడు.
ఆ మాట పాపారావు పంతాన్ని ఎక్కువ చేసింది. పెద్దాయన పోయేదాకా ఓపికపట్టాడు అతను. తర్వాత ఒక రోజున గ్లాస్కోపంచె బెంగాలీ కట్టుకట్టి, హంబర్ సైకిలు మీద మల్లికార్జునరావు ఇంటికి వచ్చాడు పాపారావు. "నేను అప్పుడే అనుకున్నా!" అన్నాడు.
"ఏమని?" అన్నాడు మల్లికార్జునరావు.
"మీ నాన్న పోతాడని."
"ఎలా తెలుసు?"