కానీ ఈసారి జనం తెలివిమీరారు. క్రితంసారి ఐశ్వర్య కంపెనీ దివాలా ఎత్తుతుందని పుకారు పుట్టించింది ఐశ్వర్యే అని జనాలకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అక్కడ రాదు అన్న పుకారు కూడా ఆమే పుట్టించి ఉంటుందని జనం అనుకున్నారు. అందుకని ఎవ్వరూ అమ్ముకోలేదు. ఆ పక్కనే ఇంకో వెయ్యి ఎకరాలు కొంది ఐశ్వర్య. జూబ్లీహిల్స్ లో ప్లాట్ల కోసం ఎగబడ్డట్లు ఎగబడ్డారు జనం. అప్పుడు తెలిసింది రూమరు నిజమేనని! ఎందుకూ పనికిరాని స్థలాన్ని ఫాబ్యులస్ రేట్స్ కి అమ్మింది ఐశ్వర్య. కన్ను మూసి తెరిచేలోగా కోట్లు సంపాదించింది."
చిన్నగా నవ్వాడు మూర్తిగారు.
"ఇంతకీ నీ కంప్లయింటు ఏమిటి? ఐశ్వర్య సంపాదించిందనా? కొందరు తెలివితక్కువగా నష్టపోయారనా?"
"అక్రమంగా సంపాదించింది. అన్యాయం చేసింది" అన్నాడతను ఆవేశంగా.
"నీ జేబులో డబ్బు బలవంతంగా గుంజుకుంటే అది అక్రమం! నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరకి అమ్మితే అది అన్యాయం. ఐశ్వర్య అలా చేసిందా?"
"అలాంటిదే!"
"కాదు. తిండికి లేనివాడు ఆమె కంపెనీలో షేర్లు కొనలేదు. వెయ్యి రూపాయలకి కొని రెండు వేలకి అమ్మొచ్చనే ఆశతో కొన్నారు కడుపు నిండిన వాళ్ళు. తలదాచుకోవడానికి ఓ గుడిసె కోసం జాగా కావాలని అనుకునేవాళ్ళు ఆమె ప్లాట్లు కొనలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చాక మారు బేరానికి అమ్ముకోవచ్చనే స్పెక్యులేషన్ తో కొన్నారు. దటీజ్ గాంబ్లింగ్! ప్యూట్ అండ్ సింపుల్! జూదం డబ్బున్న వాళ్ళ హాబీ! దాన్లోకి వెళ్ళమని ఎవరడిగారు?"
"అదీ ఇదీ ఒకటేనని నేననుకోను"
"నువ్వు ఆమె కంపెనీలో షేర్లు కొన్నావా? ఆమె అమ్మిన ప్లాట్లు కొన్నావా?"
"లేదు."
"అంటే, నీకు అత్యాశ లేదు. నీలాంటి వాళ్ళని ఏమీ చెయ్యలేదీ ఐశ్వర్య. అవునా?"
అతను ఏం జవాబు చెప్పలేకపోయాడు.
నవ్వారు మూర్తిగారు.
"ఆర్గ్యుమెంట్ కోసం చెబుతున్నాను. అసలు డబ్బుకి రంగులేదు, రుచిలేదు,వాసన లేదు. బ్లాక్ మనీ మీద బ్లాక్ అని రాసి ఉంటుందా? ఉండదు! మనమే దానికి పేరు పెడతాం. డబ్బు సంపాదించడం ఏ పద్ధతిలో అయినా సంపాదించవచ్చు. కానీ ఖర్చు పెట్టడం మాత్రం సక్రమంగా ఖర్చు పెట్టాలి. అక్రమ సంపాదన అయినా కూడా సక్రమంగా ఖర్చు పెడితే అందులో ఏమీ పాపం ఉండదు. బాగా సంపాదించండి. పుష్కలంగా దానధర్మాలు చెయ్యండి. గమ్యం మంచిదయితే చాలు - దారి ఏదయినా ఫర్వాలేదు" అన్నాడు.
వెంటనే చప్పట్లు మారుమోగాయి. అది అందరికీ నచ్చే సందేశం. మనం తప్పు చేస్తున్నామేమో అని మనసులో ఏ కోశాన అన్నా బాధ ఉంటే దాన్ని ఉపశమనం చేసే స్లోగన్ అది. గమ్యం మంచిదయితే చాలు! దారి ఏదయినా ఫర్వాలేదు! డబ్బు సక్రమంగా ఖర్చు పెట్టదలచుకుంటే చాలు. దాన్ని అక్రమంగా సంపాదించినా తప్పులేదు!
'ఈ సందేశం మనిషి ప్రవృత్తికి చాలా దగ్గర' అనిపించింది అదంతా వింటున్న కాశీకి. సందేశంలో మొదటి భాగం - అంటే 'సంపాదించడం ఎలా అయినా సంపాదించు' అన్నది అందరూ పాటిస్తారు. పంచాలు పట్టీ, మోసాలు చేసీ, టాక్సులు ఎగ్గొట్టీ -
అసలు అదే తప్పు అయితే - ఇంకా తప్పులో తప్పు ఏమిటంటే - సందేశంలో రెండో భాగానికి వచ్చేసరికి వెనకంజ వెయ్యడం, అక్రమంగా సంపాదించిన డబ్బుని కూడా సక్రమంగా ఖర్చు పెట్టడానికి చేతులు రావు.
'చూద్దాం - చూద్దాం - చేద్దాం - చేద్దాం' అనుకుంటూ ఉండగానే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది!
ఒక్కసారి షాక్ కొట్టినట్లయింది కాశీకి.
పుణ్యకాలం!
పుణ్యకాలం! పుణ్యకాలం! పుణ్య...
పుణ్యవతి!
ఆ! అవును! అదే పేరు! గత జన్మలో ఐశ్వర్య పేరు పుణ్యవతి! తాత పేరు కదా అని పాపారావుకి ఆ పేరు పెట్టారు. అది అంత బాగాలేదేమో అనిపించి, ఆడపిల్ల పుట్టగానే పుణ్యవతి అని పేరుపెట్టారు తల్లిదండ్రులు.
అన్న పాపారావు. చెల్లి పుణ్యవతి! పుణ్యవతి! తన భార్య! గత జన్మలో!
మగత కమ్ముతున్నట్లయింది కాశీకి.
గత జన్మలో కూడా-
ఇలాగే ఒక గుడి -
ఆ గుడిముందు ఒక కారు -
ఆ కారులో తను - డ్రైవింగ్ సీట్లో పాపారావు.
ఆ గుడిమెట్లమీద - మోకాళ్ళలో తలపెట్టుకుని ఐశ్వర్య... కాదు... కాదు... ఆ జన్మలో పుణ్యవతి! తన భార్య!