Previous Page Next Page 
తదనంతరం పేజి 27


    శ్రీనివాసరావుకు ఇంట్లో ఎవరూ కనబడలేదు. బజర్ నొక్కగానే ఎవరో అపరిచిత స్త్రీ వచ్చి తలుపు తీసింది. వయసు ముప్ఫయి అయిదూ, ముప్ఫయి ఎనిమిదీ మధ్య ఉండవచ్చు. 'చామనఛాయ రంగులో వున్నా కనుముక్కు తీరు బాగానే వుండి, ఒడ్డూ పొడవూ' అవయవాల పొందికా మనిషి కొట్టొచ్చినట్లు కనబడుతోంది.


    శ్రీనివాసరావు లోపలికి వస్తూ ఆమె వంక ప్రశ్నార్థంగా చూశాడు.


    అతని ముఖంలోకోసారి చూసి, అర్థం చేసుకున్నట్టు "నేనీ ఇంట్లో ఈవేళే వంట మనిషిగా చేరాను అంది తలదించుకుంటూ.


    ఆ ఇంట్లో ఎవరూ నాలుగయిదు నెలల కంటే ఎక్కువగా పని చెయ్యలేరు. రాధాబాయి జబర్దస్తీ, పిల్లల అధార్టి, ఒక్కోరికి ఒక్కో టేస్టూ...


    పాత వంటమనిషి మానేసి నాలుగయిదు రోజులయింది. అప్పట్నుంచీ హోటల్ నుంచి పనిమనిషి క్యారియర్ తీసికొచ్చి డైనింగ్ టేబుల్ మీద పడవేస్తోంటే ఎవరిదార్న వాళ్ళు తినేస్తున్నారు.


    చాలా ఇళ్ళలో యీ వంట మనుషులూ, పనిమనుషులూ యజమానులని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో లేక వాళ్ళవాళ్ళ ఆర్ధికావసరాలకోసం అనేక విధాల లొంగిపోతూ వుంటారు. యజమానులకు అట్టే శ్రమ లేకుండా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడూ, పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళినప్పుడూ అవసరాలు తీర్చబడుతుంటాయి. చాలా ఇళ్ళలో కుర్రాళ్ళకి తొలి అనుభవం పనిమనిషి దగ్గరే మొదలవుతుంది.


    శ్రీనివాసరావు స్నేహితుడున్నాడు. అతని సమ వయస్కుడు భార్యా, భర్త ఇద్దరే ఇంట్లో వుంటారు. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూనో, చదువుల నిమిత్తమో వారు ఊళ్ళలో ఉంటున్నారు.


    అతని పెళ్ళాం బాగా లావుగా వుండి కదల్లేక కదల్లేక కదుల్తూ ఉంటుంది. ఆవిడకి భక్తి ఎక్కువ. రోజూ గుడికి వెళ్ళి అభిషేకం, అష్టోత్తరం వగైరాలు చేయించనిదే, సాయంత్రం పురాణ కాలక్షేపాలకు వెళ్ళనిదే ఉండలేదు. అలాగే శక్తినంతా కూడతీసుకుని యీడ్చుకుంటూ యీడ్చుకుంటూ నడిచి వెళ్ళివస్తూ ఉంటుంది. ప్రతిరోజూ యీ తతంగమంతా రెండు మూడు గంటలు పడుతుంది. వాళ్ళింట్లో పనమ్మాయి చలాకీ మనిషి. ఇంటి యజమాని భార్య గుడికో, పురాణానికో వెళ్ళే టైము కోసం గ్రద్దలా కాచుకు కూర్చునేవాడు. ఎప్పుడయినా ఆవిడ ఇంట్లో పని తెమలక ఆలశ్యం చేస్తే "తొరగా వెళ్ళు. లేకపోతే సుందరకాండలో ముఖ్యమైన ఘట్టాలు పోగొట్టుకుంటావు." అని బలవంతంగా తొందర చేసేవాడు. వర్షమొస్తే "తప్పు తప్పు మధ్యలో దైవకార్యం ఆగకూడదు అంటూ రిక్షా ఎక్కించి పంపించేవాడు. ఆవిడ సందు మలుపు తిరిగిందో లేదో సర్వెంట్ మెయిట్ తో యీయన ప్రణయ పర్వం మొదలై ఇంకో అయిదునిమిషాల కొస్తుందనేదాకా విచ్చలవిడిగా కొనసాగుతూ వుండేది. మందు కొడుతున్నప్పుడు ఈ అనుభవాన్ని గురించి స్నేహితుల ముందు గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు.


    శ్రీనివాసరావు ఆమెవైపు ఇంకోసారి చూసి గదిలోకి వెళ్ళిపోయాడు.


    అయిదు నిమిషాల తర్వాత ఆమె గది గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది. అతను తల త్రిప్పిచూశాడు.


    "కాఫీ తెమ్మంటారా?" అంది.


    "టీ" అన్నాడు.  


    పదినిమిషాల్లో ఆమె కాఫీ తీసుకొచ్చి కప్పు అందించింది. కొంచం సిప్ చేశాడు.


    "చాలా బావుంది."

 Previous Page Next Page