Previous Page Next Page 
కళ్ళు పేజి 27


    "ఆఖరిప్రశ్న అడిగి వెళ్ళిపోతాను. ఏ రంగం నుంచి కానీ మీకెవరి మీదన్నా అనుమానమున్నదా?"

 

    "నాకెందరో వ్యక్తులతో పరిచయముంది కానీ, ఏమీ చెప్పలేకుండా వున్నాను."

 

    "నే వస్తాను" అంటూ రంజిత లేచి నిలబడింది.

 

    "సారీ! ఇందాకట్నుంచీ మరచిపోయాను, కాఫీ త్రాగి వెళ్ళండి."

 

    "నో! మీరీస్థితిలో ఉండి- ఫార్మాలిటీస్ ఏమిటి? వస్తాను" అని రంజిత స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటికి వచ్చింది.

 

    ఎదురుగా హేమసుధ తల్లి కనిపించింది. రంజిత ఆమెతో రెండు మూడు నిమిషాలు యధాలాపంగా మాట్లాడి "ఈ ఇంట్లోకి నేను రాకముందు కొత్త వ్యక్తెవరయినా వచ్చారా?" అనడిగింది.

 

    హఠాత్తుగా ఆమె మొహంలో రంగులు మారాయి. "లేదే!" అన్నది. ఆమె గొంతు తడబడుతున్నట్లు గ్రహించింది రంజిత.

 

    "ఎవరో వచ్చారు. నేను చూశాను" అంది ఆమె ముఖకవళికల్ని కనిపెడుతూ.

 

    "లోపలికి మాత్రం రాలేదు. ఇంచుమించు గంటసేపట్నుంచీ తలుపు గడియవేసే ఉంది. వచ్చి బయటనుంచి అటే వెళ్ళిపోయారేమో!" అంది. ఈసారి ఆమె గొంతులో తొట్రుపాటు లేదు. నిబ్బరంగానే ఉంది.

 

    "సరే!" అని రంజిత బయటకు వెళ్ళిపోయింది.

 

    రంజిత వెళ్ళిపోయిన ఓ గంటకు హేమసుధ దగ్గరకు నలుగురు నిర్మాతలు వచ్చారు. వాళ్ళు నాలుగైదు రోజుల్నుంచీ ఆమెను కలుసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదు. రంజితకు అవకాశమిచ్చాక వాళ్ళు ఫోన్లు మీద ఫోన్ లు చేస్తున్నారని తల్లి చెబితే, "రమ్మను. ఈ వేళ ఎవరొచ్చినా మాట్లాడేస్తాను" అన్నది హేమసుధ ఒకవిధమైన నిస్పృహతో.

 

    వాళ్ళు రెక్కలు కట్టుకుని వచ్చి వ్రాలారు.

 

    "ఒకటి, రెండు కాదు, ముప్పై లక్షలు బ్లాకయిపోయాయి. ఏం చెయ్యాలో తెలీటంలేదు" అని వాపోయారు.

 

    హేమసుధకు కూడా బాధగానే ఉంది. కాని తాను ఏం చెయ్యగలదు? ఈ భయంకరమైన దుర్ఘటన జరిగాక తన జీవితం తన చేతిలోంచి జారిపోయింది. నిశ్శబ్దంగా కూర్చుంది.

 

    "చిత్రాలన్నీ సగంలో ఆగిపోయి వున్నాయి. ఇలా జరిగిందని తెలిసి ఫైనాన్సర్స్ ప్రాణాల్తోడేస్తున్నారు."

 

    "ఐ... ఐ... ఐయామ్ సారీ!"

 

    వాళ్ళలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన ఆలోచనలు వున్నాయి. కాని, అవి బయటపెట్టాలంటే ప్రక్కవారున్నారని మొహమాటంగా ఉంది. ఎవరిమట్టుకు వారు ఒంటరిగా మాట్లాడాలని అభిలషిస్తున్నారు. మిగతావారు ఎప్పుడు లేస్తారా, తాము అడగదల్చుకున్నది అడిగేద్దామా అని ఆరాటపడుతున్నారు. కాని, ఎవరూ కదలకపోయేసరికి నిరాశపడి లోలోపల విసుక్కుంటూ చివరకు లేచారు. తలుపు తీసుకుని బయటకు వెళ్ళాక "మీరు వెళ్ళండి, నేనిప్పుడు వస్తాను" అని అందులో ఒకతను మిగతావారి మనోభిప్రాయాలను ఖాతరు చెయ్యకుండా మళ్ళీ లోపలకు దూసుకెళ్ళాడు.

 

    "ఏమిటి?" అంది హేమసుధ అలికిడి విని.

 

    ఆ నిర్మాత యువకుడు. ఆలోచనలో పదును, వేగం ఉన్నవాడు. "మీతో ఓ విషయం మాట్లాడాలి" అన్నాడు.

 

    "చెప్పండి."

 

    "నాకో ఐడియా వచ్చింది. మన సినిమా మిగతావారి చిత్రాలకన్నా గొప్పగా వస్తోంది. ఇప్పుడు మీకు కళ్ళు లేవు కదా. ఆ కథలో ఓ మార్పు చేద్దాం. హీరోయిన్ కి కారు ఏక్సిడెంట్ లో కళ్ళుపోయి అంధురాలయిపోతుంది. అప్పట్నుంచీ కథలో మలుపు, కళ్ళు లేకుండా హీరోయిన్ అద్భుతమైన పనులు చేస్తూ వుంటుంది. చివరకి క్లయిమాక్స్ లో కళ్ళున్న వారికన్న తెలివిగా ప్రవర్తిస్తూ విలన్ని చంపి పారేస్తుంది. ఎండింగ్ చాలా ఫెంటాస్టిక్ గా వుంటుంది. మీకు కళ్ళులేవు కదా. కష్టపడకుండా గొప్పగా యాక్ట్ చేసి పారేస్తారు. మీ బ్లైండ్ నెస్ గురించి ముందే విపరీతంగా పబ్లిసిటీ ఇస్తాం కాబట్టి ఆడియన్స్ కీ చాలా సింపతీ ఉంటుంది. వెయిట్ అన్ టిల్ డార్క్ లో ఆడ్రో హెబర్స్ కన్నా న్యాచురల్ గా యాక్ట్ చేసి పారేస్తారు. మన పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది. మీకు రీజనల్ లెవల్ లో, నేషనల్ లెవల్ లో, ఇంగ్లీషులోకి డబ్ చేయిద్దామని చూస్తున్నాను. ఇంటర్నేషనల్ లెవల్ లో అవార్డులమీద అవార్డులు... మీ పేరు ప్రపంచ మంతటా మార్మోగిపోతుంది. మీకు కళ్ళు...

 

    "గెటవుట్" అని అరిచింది హేమసుధ.

 

    ఆ గదిలో హేమసుధ ఒంటరిగా కూర్చుని వుంది. చుట్టూ ఇంచుమించు పదివరకు కలర్ టి.వి.ళు అమర్చి వున్నాయి. ఓ ప్రక్కన వున్న వి.సి.ఆర్.కు టి.వి.లన్నీ కనెక్ట్ చెయ్యబడి వున్నాయి. ఆమె కోరికమీద ఇంట్లోవారు ఏర్పాటుచేసి వెళ్ళిన వీడియో క్యాసెట్ తిరుగుతోంది. టి.వి.లన్నిట్లో, తెరలమీద వయ్యారంగా కదుల్తూ, డైలాగులు చెబుతూ, డ్యూయెట్స్ లో మనోహరంగా స్టెప్స్ వేస్తూ హేమసుధ.

 

    హీరో హీరోయిన్ దగ్గరకొచ్చాడు. ఆమెను చేతుల్లోకి తీసుకుని ముఖానికి ముఖం దగ్గరగా చేర్చాడు. పెదవులకి పెదవులు దగ్గరిగా చేరాయి.

 

    హేమసుధకేమీ కనబడదు. ఆ దృశ్యాలని ఊహించుకుంటోంది.

 

    పెదవులమీద పెదవులు ఆన్చబోయి ఒక్కక్షణం ఆగాడు. హేమసుధ ఊపిరి బిగబట్టింది.

 

    "వీటికంటే..."

 

    "ఊ"

 

    కళ్ళు.

 

    "ఇవే..." అతని పెదవులుపైకి జరిగి ఆమె కళ్ళ దగ్గర ఆగాయి.

 

    "ఈ అపురూపమైన, అపూర్వమైన... ఎవరికుంటాయి ఈ కాంతులు, విశాలమైన ఈ అందాలు!" ఆబగా, ఆర్తిగా ఆమె కళ్ళను ముద్దుపెట్టుకుంటున్నాడు.

 

    "నో" అని అరుస్తూ హేమసుధ లేచి నిలబడింది.

 

    "ఐ కాన్ట్... ఐ కాన్ట్ బేరిట్! స్టాపిట్! స్టాపిట్" అని పిచ్చిపట్టిన దానిలా అరుస్తూ ముందుకెళ్ళి టి.వి.లన్నీ క్రిందకు తోసేస్తోంది. ఒక్కొక్క టి.వి. క్రిందపడి బ్రద్దలైపోతోంది. వాటి స్క్రీన్ ళు నేలమీద ఆమె కాళ్ళక్రిందపడి నలిగిపోతున్నాయి. తూలి క్రిందపడబోతూ గోడను ఆధారం చేసుకొంటూ నిలద్రొక్కుకుంటూ వుంటే చేతికి ఫ్లవర్ వాజ్ అందింది. అది తీసుకుని "స్టాపిట్ స్టాపిట్" అని అరుస్తూ దాంతో టి.వి.లన్నీ తడుముకుంటూ తడుముకుంటూ బ్రద్దలు కొట్టసాగింది. చేతులు తెగి, నెత్తురు ధారలుగా ప్రవహిస్తోంది.

 Previous Page Next Page