Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 27


    "ఆయన అప్పుడే రార్ర్రా. ఇంకో నాలుగురోజులు గడిస్తేనేగాని, సెలవు దొరకొద్దూ మరి?" అని జవాబు చెప్పింది అక్కయ్య.
    
    బావ వచ్చాడంటే శంకరానికి సంతోషం బావతో సినిమాలకు వెళ్ళినా, షికార్లకుపోయినా నాన్న ఏమీ అనలేడు. చూసీ చూడనట్లు కోపం దిగమ్రింగి వూరుకుంటాడు. పైగా సెలవులు బావతో ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు. ఒకందుకు శంకరానికి నవ్వు వచ్చింది. అసలు దసరా సెలవులు కాబట్టేగా బావా, అక్కయ్యా ఇక్కడికి రావడం!
    
    అంతలో శాంతమ్మగారు వచ్చింది అక్కడికి. ఆవిడ శంకరాన్ని చూస్తూనే "అప్పుడే చేరాడూ వెధవ! ఈమధ్య వీడు దానకర్ణుడు అయిపోతున్నాడేవ్ మణీ, ఆయన ఎలానూ ఇవ్వరుగదా అని అప్పుడప్పుడూ దయతల్చి బేడో పావలో ఇస్తుంటే, అది కాస్తా యీ మహానుభావుడు ఇంకోళ్ళమీద దయతల్చి దానం చేస్తున్నాడు" అంది. శంకరం అక్కయ్యపేరు నాగమణి. సాధారణంగా తండ్రికి తెలియని చాలా విషయాలు తల్లీకూతుళ్ళు చెప్పేసుకోవటం చాలా ఇళ్ళలో జరిగే విషయం.
    
    అమ్మ వస్తూనే ఇలా చాడీలు చెప్పటంతో శంకరానికి చాలా కోపం వచ్చింది. ఐనా చేసేదిలేక దిగమ్రింగుకుని వూరుకున్నాడు. ఐతే ఒక్కటి...అతనికి అక్కయ్యని చూసిన సంతోషంతో దారిలో తానుపడ్డ బాధా, అనుభవించిన అవస్థా అంతా మరిచిపోయినట్లనిపించింది.
    
    శంకరం చాలాసేపటివరకూ ఏం మాట్లాడలేదు. శాంతమ్మగారూ, నాగమణీ ఏమిటో చాలా మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి శంకరం "అక్కయ్యా! నేను మా స్కూలు డ్రామాలో యాక్టు చేస్తున్నానే" అన్నాడు. "అలాగా" అని నవ్వి వూరుకుంది అక్కయ్య కాని శాంతమ్మగారికి మాత్రం అది చాలా వింత విషయంలాగా కనిపించింది. "అదేమిట్రా, నాటకంలో వేషాలు వేస్తావా? నీకేమైనా పిచ్చా, చాదస్తమా?" అంది.
    
    శంకరం ఏదో చెప్పబోయాడు. కాని అక్కయ్య కల్పించుకొని "తప్పేముందే? స్కూలు నాటకంలో వేస్తే ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీలేదు. సరదాగా కూడా వుంటుంది" అన్నది.
    
    "ఏమో తల్లీ! నాదేముంది? వాళ్ళ నాన్నగారి ఇష్టం" అంది శాంతమ్మగారు తన అయిష్టాన్ని అందులో ఇమిడ్చి కప్పిపుచ్చేస్తూ.
    
    చటుక్కున శంకరానికి నాలుగు సంవత్సరాలక్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకువచ్చింది. నాలుగేళ్ళక్రితం అంటే తను బాగా చిన్నవాడన్నమాట. తను ఎలిమెంటరీ స్కూల్లో చదివేవాడు. అక్కయ్య తను ఇప్పుడు చదువుకుంటున్న బడికి పోయేది.

    ఒకరోజున అక్కయ్య యింటికి వచ్చి "అమ్మా! మా ఆడపిల్లలమంతా ఒక నాటకం వేస్తున్నామే అందులో నేనుకూడా వున్నాను" అంది గంతులు వేస్తూ. తను అక్కడే వున్నాడప్పుడు.
    
    అమ్మ ఆశ్చర్యంగా చూసింది. "నీకు గాని పిచ్చి ఏమైనా పట్టలేదుకదా! పదమూడేళ్ళు దగ్గర పడుతున్నాయి నాటకాలేమిటే నాటకాలు, సిగ్గు ఎగ్గూ లేకుండా!" అంది తిడుతూ.
    
    అక్కయ్య బిక్కమొహంవేసింది. "అంతా ఆడపిల్లలమేనమ్మా!" అంది జాలిగా అయినా అమ్మ జాలిపడలేదు. "అయితేమట్టుకు? నలుగురి ఎదుటా బల్ల ఎక్కి తైతక్కలాడాలని వుందా?" అంటూ ఇంకా తిట్టింది. అక్కయ్య ఇంకేం అనలేదు. అమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత మంచంమీద వాలిపోయి ఏడ్చుకున్నది. తనకు ఓదార్చాలని అనిపించింది. ఎలా?
    
    ఆ మరునాడు తనను రిహార్సల్సుకని పిలవడానికి వచ్చిన స్నేహితురాళ్ళతో "నేను రాలేనే" అని చెప్పి అక్కయ్య చాటుగా కళ్ళు తుడుచుకున్న సంగతి తనకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా వుంది.
    
    శంకరం అక్కయ్యవంక చూశాడు. బహుశా అక్కయ్యకు కూడా ఆ విషయమే జ్ఞాపకం వచ్చివుండాలి. జీవంలేనట్లుగా ఒక నవ్వు నవ్వింది.
    
    శంకరానికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. అతను ఇంటికి వస్తూ ఆలోచించు కొన్న విషయాల్ని గురించి పూర్తిగా మరచిపోయాడు. నాటకంలో ఎలా నటించాలి? స్టేజిమీదకి ఎక్కి భయపడకుండా ఎలావుండాలి? తను నటిస్తుంటే ప్రేక్షకులు ఎంతమందో తనవంక చూస్తుంటారు కాబోలు! వాళ్ళందరూ ఆనందించేట్లుగా తను యాక్టు చెయ్యాలి. తన పేరప్పుడు స్కూల్లో మ్రోగిపోతుంది.
    
    ఈ విధంగా ఆలోచించుకుంటూ ఏ అర్ధరాత్రికో కన్నుమూశాడు శంకరం. మరునాటి ఉదయం అతను కాఫీ త్రాగటం పూర్తి అయాక బయటికి వచ్చేసరికి తెలుగు మాష్టారు తన ఇంటికే వస్తూ కనిపించాడు. శంకరం ఆయనకు నమస్కారం చేశాడు. "మీ నాన్నగారు వున్నార్రా?" అని అడిగాడు ఆయన "ఉన్నారండీ" అన్నాడతను. "అయితే పద నేను వచ్చానని చెప్పు" అని ఆయన లోపలికి వచ్చేశాడు. శంకరం భయంగా తండ్రిదగ్గరకు పోయాడు.
    
    "ఏమిట్రా?" అన్నాడాయన.
    
    "మా తెలుగుమాష్టారు వచ్చారు నాన్న నీకోసం" అన్నాడు శంకరం తడబడుతూ.
    
    "ఎందుకు?"
    
    "ఏమో నాన్నా" అనేశాడు శంకరం.

    "సరే పద" అంటూ బయటికి వచ్చాడు నారాయణరావుగారు. "నమస్కారమండీ" అన్నాడు తెలుగుమేష్టారు. నారాయణరావుగారుకూడా ప్రతి నమస్కారం చేసి "మీరు వచ్చిన పనేమిటో తెలుసుకోవచ్చా?" అని అడిగాడు యీజీచైర్ లో కూచుంటూ తెలుగుమేష్టారు అంతా చెప్పారు. అంతాచెప్పి "అందులో మీ అబ్బాయిచేత ముఖ్యమైన వేషం వేయిద్దామనుకుంటున్నాను" అన్నాడు తెలుస్తూ.
    
    "అబ్బే చదువుకునే కుర్రాళ్ళు వీళ్ళకెందుకండీ నాటకాలూ, వేషాలూనూ... చదువు పాడుచేసుకునేందుకు కాకపోతే?" అన్నాడు నారాయణరావుగారు అంతా విని శంకరం ఈ మాటలన్నీ ప్రక్కగదిలోంచి వింటున్నాడు. అతని గుండె గతుక్కుమన్నది.
    
    కాని తెలుగుమేష్టారు అంతటితో వదిలిపెట్టలేదు. నాటకాల్లో వేసినంత మాత్రాన చదువు పాడైపోదనీ, ప్రపంచజ్ఞానం అలవర్చుకునేందుకు ఇటు వంటివి అవసరమనీ, పిల్లల్లో ఉత్సాహం రేకెత్తించాలంటే ఇటువంటివి వుండి తీరాలనీ అరగంటసేపు నూరిపోశాడు. చివరికి నారాయణరావుగారు ఒప్పుకోక తప్పలేదు. ఎలా అయితేనేం "సరే" నన్నారు. అంటూ, "ఒక్క విషయం ఈ విషయంలో నన్ను చందాలడగటం అటువంటివి మాత్రం చేయవద్దు" అని చెప్పాడు కుండబద్దలు కొట్టినట్టు. ఆయనమీద కొండంత ఆశపెట్టుకున్న తెలుగుమేష్టారు ఏమీ అనలేకపోయాడు. "సరే ఐతే వస్తానండి. నాటకానికి మీరంతా రావాలి" అన్నాడు సెలవు పుచ్చుకుంటూ.

 Previous Page Next Page