ఏమిటీ... ఇంత మొండిగా మాటాడుతున్నాడేం... సవ్యసాచి అంటే సరైన అవగాహన లేకనా!
"అంత పెద్ద పని అక్కర్లేదు శ్రీహర్షా. తండ్రి "అహంకారాన్ని పుణికిపుచ్చుకున్న దృశ్యద్వారా సవ్యసాచిని కాస్త కంగారుపెట్టాలి."
"చాలా మామూలు పరీక్ష" భావరహితంగా అన్నాడు.
"చెప్పండి... సవ్యసాచి యింట అడుగుపెట్టి ఆమె ఒంటిపై వున్న బట్టల్ని విప్పి తీసుకురావాలా..."
మృదువుగా నవ్వింది అతడిమాటలు ఏదో స్ఫురింపచేసినట్టు "దృశ్య అహంకారానికి పరాకాష్ట ఆమె 'బ్రా'లకి చేసే ఖర్చు... ... ఈ దేశంలో మరెవరు వాడేదీ తెలీదు కాని దృశ్యం మాత్రం ఫ్రాన్స్ లో తయారయ్యే డెకోలెట్ బ్రాలకి లక్షల ఖర్చు చేస్తుంది.
"బ్రాసరీ" టిప్స్ కి డైమండ్స్ వాడే "డెకోలెట్ బ్రా'లు శ్రీహర్షకు పరిచయమే. "వెల్... ఆమెనుంచి ఆ బ్రాసరీని తీసుకొస్తాను... ఈ రాత్రికే."
"ఇప్పుడా..." మరింత నివ్వెరపోయింది.
"అనుకున్నది వెంటనే సాధించడం నాకు అలవాటు రేష్మీ! కాని ఒక్క విషయం. నేను బ్రాను తీసుకొచ్చినా ఆమెనుంచే తెచ్చినట్టు నమ్మకం యేమిటి"
"నేను మిమ్మల్ని నమ్ముతాను"
"నమ్మకంవుంటే నా శక్తిని చెక్ చేయాలని సంకల్పించే పరీక్ష అవసరమయ్యేది కాదు మిస్ రేష్మి.
"ఓ పని చేయండి."
"చెప్పండి"
"మీరు మీరెవరన్నదీ చెప్పకుండా సవ్యసాచి యింటి సెక్యూరిటీ ఆఫీసర్ డేవిడ్ కి ఫోన్ చేసి చెప్పండి."
ఉలిక్కిపడిందామె "ఏమని"
"దృశ్య ఒంటిపైనున్న ఓ బ్రాసరీ యీ రాత్రికే దొంగిలింపబడుతుందని"
"వద్దు" ఆమె సన్నగా కంపిస్తుంది "ఇట్స్ సూయిసైడల్"
ఫర్వాలేదు మిస్ రేష్మి...
"మీకోసం మాత్రమే కాక నాకూ ఆసక్తిగా ఉంది"
"నామాట వినండి"
"ముందు మీరు నేను చెప్పినట్టు చేయండి"
వణుకుతున్న చేతులతో రిసీవర్ అందుకున్న రేష్మీ డేవిడ్ కి ఫోన్ చేసి చెప్పింది.
అప్పటికే గది దాటి వెళ్ళిన శ్రీహర్ష ఆమె దృష్టిలో ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందీ అతడికి తెలీదు...
* * *
అర్థరాత్రి ఒంటిగంటన్నర దాటి మూడు నిముషాలు.
అవుట్ హవుస్ లో వున్న డేవిడ్ హడావుడిగా ఒంటిపై ఓవర్ కోట్ వేసుకున్నాడు.
అప్పటికే ఫోన్ రిసీవ్ చేసుకుని రెండునిముషాలు కావస్తుంది. ముందు పెద్దగా పట్టించుకోలేదు కాని క్షణాలు గడుస్తున్నకొద్దీ నిశ్శబ్దంగా వుండలేకపోయాడు.
సుమారు ఎకరం నేలపై విశాలంగా వున్న ఆ భవంతి చుట్టూ సెక్యూరిటీ గార్డులు అప్పటికే పహారా కాస్తున్నా తాను వాళ్ళందరికి మాత్రమేగాక సవ్యసాచికి, అతడి కుటుంబ సభ్యులకీ రక్షణ ఇవ్వాల్సిన ప్రత్యేక అధికారి.
ఫోన్ లో చెప్పింది నిజం కాకపోవచ్చు.
ఆకతాయిగా అన్న విషయం కావచ్చు.
కాని "తను అలర్టు కావాలి. తను మాత్రమే కాదు దృశ్యని అలర్టు చేయాలి"
ఈ ఆలోచన రాగానే ప్రహరీ ద్వారం దగ్గర వున్న సెక్యూరిటీ యిన్ స్పెక్టర్ కి క్లుప్తంగా చెప్పి, భవంతిచుట్టూ వున్న తన సిబ్బందిని అప్రమత్తంగా వుంచమని హెచ్చరించాడు.
హాలునుంచి మెట్లవైపు వెళుతూ క్షణంపాటు సవ్యసాచి నిద్రపోతున్న బెడ్ రూంవైపు చూసాడు.
అతడ్ని డిస్టర్బ్ చేయడం సమంజసం కాదనిపించింది.
మరో ముప్పయి సెకండ్ల వ్యవధిలో పై అంతస్తులోని దృశ్య బెడ్ రూం చేసుకున్న డేవిడ్ కంగారుగా బజర్ నొక్కాడు.
పదిలిప్తల వ్యవధిలో బడలికగా తలుపు తెరిచింది దృశ్య. "వాట్! ఎందుకొచ్చావు" నిద్రాభంగమైనందుకు కాదు డేవిడ్ చూపులు నైటీలోనుండి లోపలికి చొచ్చుకుపోతుంటే కంగారుపడిపోయింది.
సుమారు నలభయ్యేళ్ళ వయసున్న డేవిడ్ కి అమ్మాయిలుకాని, అందమైన అమ్మాయిల ఎత్తయిన పొంకంగాని కొత్తకాదు. హత్యలు చేయడం, కసిగా గుండెల్లో కత్తులు దించడం మామూలు హాబీయేకాని యిప్పుడిలా ఓ అమ్మాయి బ్రాసరీ గురించి ఆలోచించాల్సి రావడం అరుదయిన అనుభవం.
ఏమిటది "డెకోలెట్ డైమండ్ టైప్ బ్రా'
అదేకదూ తను ఫోన్ లో చిన్నది.
మత్తు వదిలిన దృశ్య అతడి చూపుల్లో ఏ భావం కనిపించిందో హఠాత్తుగా గుండెలకి చేతుల్ని అడ్డుపెట్టుకుంది "బాస్టర్డు".
"మేడమ్" ఆమె అపార్థం చేసుకుంటుందని గ్రహించిన డేవిడ్ వెంటనే ఆ బ్రా సంగతి చెప్పలేకపోయాడు "మీరు జాగ్రత్త"
"నిద్రలేపి ఈ హెచ్చరికేమిటి"
"మేడమ్ మీ ఒంటిపై..." గొంతు పెగల్లేదు. చాలా మధనపడిపోతూ అన్యాపదేశంగా కక్కేసాడు. "మీరు, మీ ఒళ్ళు జాగ్రత్త. అది కాదు. మీరు మీ ఒంటిపై.... ఓ ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడే ఈ రాత్రికే."
"మీకు పిచ్చిపట్టింది."
"ఇట్స్ ట్రూ మేడమ్. నేను చెప్పేది నిజం".
"అవును. నీకు పిచ్చెక్కడం నిజం. అవుట్... ముందు నడువ్. లేకపోతే డాడీని పిలవాల్సి వస్తుంది."
"మేడమ్... ..నేను చెప్పాలన్నది మీ శరీరం..."
"ఐ సే గెట్ లాస్ట్."
ఆ కేక ముందు వినిపించింది డాడీకికాదు. పక్కగదిలో నిద్రపోతున్న నాన్నమ్మకి. వెంటనే వచ్చేసింది కళ్ళు చిట్లించుకుంటూ.
"గ్రాండ్ మా....ఈ కొత్త సెక్యూరిటీ ఆఫీసరుగాడు వుండాల్సింది ఇక్కడ కాదు. పిచ్చాసుపత్రిలో..." అప్పటికే వెళ్ళిపోతున్నాడు డేవిడ్.
"నన్ను నిద్రలేపి మీ ఒళ్ళు జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు"
"ఏమోలేవే. మీ డాడీ బోలెడంత డబ్బుపోసి పెట్టుకున్నవాడు. ఏం తెలిసి అన్నాడో మనకెందుకు, నీ ఒళ్ళు జాగ్రత్త" అంది ఆ ముసల్ది కూడా.