ట్రాన్స్ లోలా మెట్లెక్కి ఓ ద్వారం దాటి లోపల అడుగుపెట్టాడు.
గదిలో మంద్రంగా వెలుగుతున్న నీలిరంగు బెడ్ లైట్.
వెనుక ద్వారం మూసుకుంది వినిపించని గుండెచప్పుడుతో.
నెమ్మదిగా చాలా నెమ్మదిగా తలతిప్పి చూసాడు.
క్షణంపాటు రక్తప్రసరణ స్థంభించింది.
విశాలమయిన గదిలో చైనా కాబినెట్స్ మధ్య పాలనురుగులా మెరుస్తున్న ఫోంబెడ్. స్క్వేర్ కుషన్ పై వెల్లకిలా పడుకునివున్న ఓ యువతి.
"వెల్ కమ్" గొణిగింది యింకా మత్తు వదలని కంఠంతో.
వినిపించలేదది. కాదు వినిపించుకోలేదు శ్రీహర్ష.
అది రూపంకాదు "అదృశ్యహృదయజతుల్ని సుతిమెత్తగా నియంత్రించగల సమ్మోహన కావ్యం"
గుండెలపై కంపోర్టర్ లావున్న దుప్పటిని తొలగించుకొని బరువుగా లేచి నిలబడింది.
రెండు పదులు దాటీదాటని వయసులోవున్న ఆమె ఒంపుల్ని నైటీ దాచలేక బడలికగా నలిగిపోయింది.
అవి చూపులుకావు.
"మింటి మెరుపులమధ్య గంపలతో కుంకుమపూలనువిసిరి వాటిపై పవళించిన సంధ్యారాగిణి అలసిన దృక్కులు."
జీవన సంజీవిని కోసం అన్వేషించే తపోనిధుల హృది తలపుల తలుపుల్ని తెరిచి వెచ్చని ఆశ్రయంకోసం ఆరాటపరిచే నెచ్చెలియై మిశారణ్యంలా మెత్తగా అడుగులువేస్తూ సమీపిస్తూ అంది.
"రాణా చెప్పాడు."
ఇంకా తేరుకోలేదు శ్రీహర్ష.
"వెంటనే సరేనన్నాను. అందుకే అర్థరాత్రయినా నా గదికి రప్పించుకున్నాను".
"చెప్పండి"
"ఏమిటి?
"నా పరంగా మీకే సహాయం కావాలి" సూటిగా జూలీ గురించి అడగలేదు, అది రాణా అభ్యర్థన.
"నేను చెక్ చేయాలి" అంది నెమ్మదిగా.
"ఏమిటి"
"మీ సమర్థత" బరువుగా కిటికీ దగ్గరికి నడిచింది.
చూపులు మరల్చుకోలేక పోతున్నాడు. "నేరస్థుడికి కాండక్ట్ సర్టిఫికెట్ దొరకదు."
"అదెందుకు"
"నేనేమిటీ అని మీరు తెలుసుకోడానికి"
క్షణంపాటు అతడివైపు చూసి తల తిప్పుకుంది. ఆజానుబాహుడూ అసాధారణమైన ఆకర్షణకలవాడు మాత్రమేకాక అందంగా మాటాడగలవాడుకూడా అనుకుంది. "నాకు కావాల్సింది సర్టిఫికేట్స్ కాదు మిస్టర్ శ్రీహర్షా... నిబ్బరం."
"అది నాకుంది."
"ఎలా నమ్మమంటారు"
"ఒక చీకటి రాత్రివేళ" మృదువుగా అన్నాడు.
"మగాడి నిగ్రహానికి సవాల్ గా నిలిచే మీ అసాధారణ సౌందర్యాన్ని ఇన్ని లిప్తలపాటు యింకా చూస్తూ నిలబడటమే నా నిబ్బరానికి గీటురాయిగా భావిస్తే మీరు నన్ను నమ్మితీరాలి."
ఉద్విగ్నంగా చూసింది. అతడి మాటల్లో మెచ్చుకోలు తప్ప కాంక్షలేదు.
నిజాయితీ తప్ప అహం కనిపించలేదు.
రేష్మిలో తాగిన మైకం పూర్తిగా నిండిపోయింది. తనలోని స్త్రీత్వపు పొరల్ని సుతిమెత్తగా తాకుతున్న అతడి మాటల్ని మననంచేసుకుంటూ అంది నెమ్మదిగా "నేను మీనుంచి ఆశించేది మాటల గెలుపుకాదు"
"నేను వచ్చిందీ అందుకు కాదు"
"మగాడే కావాలీ అనుకుంటే నాలాంటి అందగత్తెకదో సమస్య కాదు."
"మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను."
"ఏదన్నా చేయగల శక్తివంతుడయిన క్రిమినల్ కావాలి. అలా అని మిమ్మల్ని యధాతధంగా అంగీకరించలేను. మీరో పరీక్షకి నిలబడాలి"
"వెల్ కమ్" స్థిరంగా అన్నాడు.
అది డబ్బుకోసమో లేక ఆమె అందంకోసమో తలఒగ్గే భావన కాదు. ఒక్కటే. తన బిడ్డ జూలీకి దేశంకాని దేశంలో ఆశ్రయమిచ్చిన ఒక స్త్రీగా, పైగా ఆ పసికందును అమితంగా ప్రేమిస్తుందన్న ఆలోచనకు బదులుగా అతను కృతజ్ఞతని వ్యక్తంచేయాలన్న తలంపు అంతే.
"మిస్టర్ శ్రీహర్షా" రేష్మి నేత్రాలు అరుణిమలయ్యాయి "ఈ స్వల్పవ్యవధిలో నేనేం నష్టపోయానూ అన్నది మీకు చెప్పలేను కాని చాలా కోల్పోయిన నేను ముందుగా అంటే నా మనిషిగా అంగీకరించేముందు ఓ పరీక్షలో పంపి అక్కడ మీ నెలవులో కొంత స్ఫూర్తిని పొందాలనుకుంటున్నాను" రేష్మి నేత్రాలు నీళ్ళను చిమ్ముతున్నాయి. "నాకెందరు శతృవులున్నా కాని అందరిలో కీలకమైనవాడు బిజినెస్ టైకూన్ సవ్యసాచి."
శ్రీహర్ష పెదవులపై చిరునవ్వు. కాకతాళీయంగా సవ్యసాచి తనకూ ప్రత్యర్థే...
"మీరు ఆయింట అడుగుపెట్టాలి. కాని అదంత సులభం కాదు. చాలామందికి శతృవైన సవ్యసాచి ఆత్మరక్షణ పేరిట తనకంటూ ఓ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడమేగాక రెండురోజుల క్రితం డేవిడ్ అనబడే ఓ వ్యక్తిని సెక్యూరిటీ ఇన్ ఛార్జిగా నియమించుకున్నాడు "డేవిడ్ సామాన్యుడు కాదు... పాకిస్తాన్ లో శిక్షణ పొందిన టెర్రరిస్టు."
"సవ్యసాచి యింటిలో అడుగుపెట్టి డేవిడ్ ను కిడ్నాప్ చేయాలా"
ఉలికిపడింది అదో మామూలు విషయంలా అతడు చర్చిస్తుంటే "అది కాదు... సవ్యసాచికి ఈ దేశంలో వున్న ప్రతిష్ట మీకు తెలీదు..."
ఆ యింట అడుగుపెట్టాక నేనేం చేయాలో చెప్పండి రేష్మీ రెట్టించాడు.
"సవ్యసాచి ఎంత దూరంగా విస్తరించిపోయింది ఊహించలేరు. ఈ దేశంలోని నేర వ్యవస్థల్ని నియంత్రించే వ్యక్తి సవ్యసాచి. పైగా డేవిడ్..."
"నేను చేయాల్సింది చెప్పండి"
శ్రీహర్షలో నిబ్బరం ఆమెకు ధైర్యంకన్నా భయాన్నే కలిగిస్తుంటే చెప్పింది ఎంత యెదిగిన నేర ప్రపంచపు చక్రవర్తికయినా ప్రాణాంతకమైన అభిరుచులు కొన్నుంటాయి శ్రీహర్షా... సవ్యసాచికి అతడి కూతురు దృశ్య అలాంటిదే...
హి లవ్స్ హెర్ మోర్ దేన్ ఎనీ థింగ్... ...
ఆమెను కిడ్నాప్ చేయాలా... ..."