"కానీ ఈ పరిస్ధితుల్లో అదే నా ఆనందం."
"ఒక స్త్రీ పతనం నీకు ఆనందమా? అసలెందుకు దాపరించావు ఇక్కడికి? పచ్చని మా సంసారం విచ్చిన్నం చెయ్యడానికా? అదీ జరిగిందిగా!"
"ఇంకా నీకు తృప్తిగా లేదా?"
"మాలతీ!" అంటూ ముందుకు రాబోయాడు.
"ఆగు -ఒక్క అడుగు ముందుకు వేశావంటే......" ఆమె ఉగ్రమూర్తిలా మారి దృఢనిర్ణయంతో అతనివంక చూసింది.
"ఏం చేస్తావు?"
"ఏమయినా చేస్తాను. ఏమన్నావు? ఈ ఇల్లు నరకంగా మారిందన్నావు కదూ? ఒరేయ్! పవిత్రమైన గృహాన్ని నరకంగా మార్చిన రాక్షసుడా! విను. ఇది నరకమే అయితే, ఇక్కడే చిత్రహింసలను అనుభవిస్తూ ఆనందంగా ఛస్తానుకానీ, ఇక్కడ్నుంచి ఒక్క అడుగుకూడా బయటకు వెయ్యను తెలిసిందా ఇహ బయటకు నడు."
ఆమె రోషం, ఆవేశం చూసిన శంకర్ లో ఇఒ కంపనలాంటిది కలిగింది. బయటకు బింకంగా వుండటానికి ప్రయత్నించాడు కానీ సాధ్యంకాలేదు.
అప్పుడే చీకటి విడి వెలుతురు వ్యాపిస్తోంది.
"కదలవేం? చెప్పేది నీకు కాదూ?"
"ప్రక్కనుంచి ఏదో నీడ పడినట్లయింది. ఏదో అనుమానం వచ్చి తల త్రిప్పి చూసేసరికి ఎంతసేపయిందో, ఎప్పుడు వచ్చాడోగానీ శేఖర్ నిలబడి వున్నాడు నిలువెత్తు విగ్రహంలా."
"శేఖర్!" పెదవులు వణికాయి, మాటలు వణికాయి. కన్నీళ్లు వణికాయి.
శంకర్ నిరుత్తరుడై చూస్తున్నాడు.
"శంకర్!" శేఖర్ గదిలోకి వస్తూ అన్నాడు. అతని ముఖంలో ఏ భావమూ ఏ వివాదమూ తెలియటంలేదు. ఒక్కొక్కసారి అలా తెలియకపోవటం చాలా భయంకరంగా వుంటుంది.
"నువ్వు మహానటుడివి. అందుకని తెల్లవారుఝామునే లేచి ఏకపాత్రాభినయం చేస్తున్నావేమో అనుకున్నాను. కానీ ఇది ద్విపాత్రాభినయం. కానీ మాలతీ! నువ్వుకూడా ఇంత బాగా నటించగలవని నాకు తెలీదు."
మాలతి అర్ధం చేసుకుంది. ఇంత జరిగాక ఇహ దాగుడుమూతలు ఆడి ప్రయోజనమేముంది? తను ఎందుకు స్మృతి తప్పి క్రింద పడిపోలేదో ఆమెకు తెలీదు. సర్వశక్తులా కూడదీసుకుంది.
"నేను నటించడంలేదండీ!"
"కనీసం ప్రయత్నిస్తున్నావు. నాకు చాలా ఇష్టం మాలతీ! నువ్వింత చలాకీగా వుంటే నాకు చాలా ఇష్టం. మాలతీ! ఈ క్షణంలో నువ్వంటే మునపటికన్నా ప్రేమగా వుంది. మాలతీ! నువ్విప్పుడు కొత్తరూపంలో కనబడుతున్నావు. అంతేకాదు కొత్త అందాలతో కనిపిస్తున్నావు."
"ఏమండీ!"
"శంకర్! నేనీమధ్య కథలు రాయటం మొదలుపెట్టాను తెలుసా?"
"శేఖర్!"
"అవును శంకర్! మనసులోని అస్పష్టతను స్పష్టపరచుకోవటానికి ఇది నాకెంతో ఉపకరించింది. ఈమధ్య ఓ కథ రాశాను. అందులో భర్తకి కావాల్సింది భార్య ఇవ్వడానికి నిరాకరిస్తుంది అతని శ్రేయస్సు కోరి. కానీ దాని ఫలితంగా భార్యకి రావాల్సింది కూడా భర్త ఇవ్వలేకపోవటం ఫలితంగా ఏర్పడింది.....ఈ సంక్షోభంలో అతను కుమిలిపోయాడు. కుమిలిపోయి.....కుమిలిపోయి.......
అన్నట్లు అతనిదగ్గరెప్పుడూ నిద్రమాత్రలుంటాయి."
మాలతి కాళ్లు పట్టుతప్పుతున్నాయి. ఆమె భయంకరమైన పోరాటంలో వుంది.
"ఏమండీ!"
శేఖర్ ఆమెవంక చూసీచూడనట్లు చూసి కొంచెంగా నవ్వి అన్నాడు "కానీ వాటిని నిద్రకు మాత్రమేగాక అంతకుమించి ఉపయోగించటం అసహ్యం. ఆఁ శంకర్! అతనిదగ్గర పిస్టల్ కూడా వుంటుంది."
"శేఖర్!" శంకర్ పొడిగా అన్నాడు.
"కానీ మనుషుల్ని చంపటంలో అతనికి నమ్మకంలేదు. అందుకని....అందుకని ఈ సంఘర్షణకి అంతం ఓ రకంగా చెయ్యాలనుకున్నాడు......ఎలా? పోనీ మీరు చెప్పండి. మాలతి నాకు మంచి సలహాలిస్తూ వుంటుంది.......మాలతీ! ఏం చేస్తే బాగుంటుంది? నువ్వు స్త్రీవి కదా! స్త్రీల సమస్యలు నీకు బాగా తెలుస్తాయి. "తెగతెంపులు" అని ఒకటి వుంది కదా!"
మాలతి కళ్ళనుండి అశ్రువులు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి.
"ఏమండీ! మీరలా మాట్లాడకండీ. రండి, లోపలకు వెడదాం" అని ముందుకు కదలబోయింది.
శేఖర్ ఆమెను రెక్క పట్టుకుని ఆపాడు "ముగింపు చెప్పకుండా ఎక్కడికి మాలతీ? నో నీ శంకర్ చెబుతాడు విందాం....ఆ మరి ఆ హీరో విశాలహృదయం కలవాడు. అతని స్నేహితుడు వుంటాడనుకుందాం. అంటే మాట వరసకి ప్రానస్నేహితుడులే. తానెలాగూ భార్యని దక్కించుకోలేదడు కాబట్టి...భార్యను...ఆ స్నేహితుడికి అంటే ప్రాణస్నేహితుడికి....ఇచ్చి పెళ్ళి చేసేస్తే...?"
శంకర్ ముఖం వివర్ణమైంది. శిలా విగ్రహంలా కదలకుండా మెదలకుండా వుండిపోయాడు.
శేఖర్ మాలతిని విడిచిపెట్టి అతని దగ్గరకెళ్ళి భుజం పట్టుకుని కుదిపాడు.
"ఏమిటలా నిలబడిపోయావు?"
"ఆఁ" అన్నాడు శంకర్ ఈ లోకంలోకి వచ్చినట్లు.
"ఏమంటావు?"
"నాకు......ఇలాంటివి తెలీదు."
"నువ్వు గొప్ప నటుడివి కదా శంకర్! నీకు తెలియకపోవటమేమిటి?"
"నేను నటుడినే.....కానీ....."
"స్వంత ఆలోచన లేదు. ఇతరులు రాస్తే ఆ పాత్రల్ని స్వంతం చేసుకుంటావు. అంటే ఇతరుల వస్తువుల్ని సవంతం చేసుకుంటావు."