సూర్యుడు తూర్పు కొండల్లోంచి బయటకి వస్తూండగా మెలకువ వచ్చింది. టైం చూసుకున్నాను. తొమ్మిదిన్నర.
రాత్రి తాలూకు అలసట ఇంకా వదల్లేదు. అందుకే గడ్డిలో పడుకున్నా మెలకువ రాలేదు. దూరంగా గ్రామం కనిపిస్తుంది.
నన్ను రక్షించిన గ్రామం!
గోవిందు ఇంటి నుంచి బయట కొచ్చేసరికి రాత్రి మూడయింది. పోలీసులు వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఆ భయం లేకపోయింది. ఊరి చివర చెట్టుక్రింద చప్టా ఉంటే, పైన గడ్డి వేసి పడుకున్నాను. నాలాటి ఫకీర్లు మరో ఇద్దరు అక్కడే పడి నిద్రపోతున్నారు.
ఇక్కణ్ణుంచే బస్సులో నా ఊరు వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళదల్చుకోలేదు.
ముందు నారాయణ కుటుంబాన్ని కలుసుకోవాలి.
నేనిచ్చిన డబ్బుతో అతడు తన కొడుకుని తెచ్చుకున్నాడో లేదో తెలుసుకోవాలి. ఈ ధర్మారావు సామాన్యుడిలా కనబడటంలేదు. ఎంతకైనా తెగించగలడు. నావల్ల ఆ కుటుంబం మరిన్ని కష్టాల్లో పడటం నా కిష్టం లేదు.
ఘనాపురం ఈ వూరికి ఎంత దూరమో కనుక్కోవాలి.
ఊరి బయటకు వస్తూన్న ఓ గొర్రెలకాపరి కుర్రవాడిని ఆపి "ఘనాపురం ఎటు వెళ్ళాలి?" అని అడిగాను.
వాడు నావైపు చిత్రంగా చూసి "ఏ ఊరూ?" అని అడిగాడు.
"ఘనాపురం" అన్నాను.
తల అదోలా ఎగరేసి, "ఇదే - ఈ ఊరే ఘనాపురం" అని వెళ్ళిపోయాడు. లిప్తకాలం అర్ధంకాలేదు. తరువాత తెరలు తెరలుగా నవ్వొచ్చింది.
రాత్రంతా అడవుల్లో, తుప్పల్లో పడి, పరుగెత్తి బయల్దేరిన చోటుకే కొన్ని వందల కిలోమీటర్లు పరుగెత్తిన అనుభూతితో చేరుకున్నానన్నమాట. మళ్ళీ నవ్వొచ్చింది. నా ఊహ కర్టెయితే నారాయణ కుటుంబం దగ్గిర పోలీసులు కాపలా వుండకపోవచ్చు. నేను మళ్ళీ వెంటనే అక్కడికి వస్తానని వాళ్ళు ఊహించకపోవచ్చు. వాళ్ళ ఉద్దేశ్యంతో ఈ దోపిడీదార్లు పగలంతా అడవుల్లో దాక్కొని రాత్రిళ్ళు ఊళ్ళమీద పడేవాళ్ళు.
నావైపు చూసుకొన్నాను.
ఫర్లేదు. మరీ బికారిలా లేను.
కొద్దిగా గ్రామంలోకి ప్రవేశించగానే దారి తెలిసింది సత్రానికి.
నేను వెళ్ళేసరికి దంపతులు ఇద్దరూ చెరో స్థంభానికి ఆనుకొని కూర్చొని వున్నారు. బాధకన్నా ఎక్కువైన ఏదో నిర్లిప్తతా భావం వాళ్ళ మొహాల్లో కనబడుతోంది.
"డబ్బు తీసుకెళ్ళిపోయారా?" ఒక చిన్న ప్రశ్న, లేదన్న సమాధానం కోసం....
అవునని తల ఊపటానికి కూడా శక్తిలేనట్టు అతడు కళ్ళు దించుకున్నాడు.
కసి, కోపం, నిస్సహాయతా అన్నీకలగలసిన భావంతో ఊగిపోయాను.
ఏం చెయ్యాలో తోచలేదు.
ఎక్కడ ప్రారంభమయినా, ఎటు తిరిగినా సమస్య మళ్ళీ వున్నచోటుకే వస్తూంది.
తహసిల్ ఆఫీసు - పోలీస్ స్టేషను - కంప్లెయింట్స్ బాక్సు - లేబర్ డిపార్ట్ మెంటు - కలెక్టర్ వరకూ సమస్య వెళ్ళి క్రిందపడి - సావుకారు గల్లాపెట్టె - దబాయింపు - ప్రాణంకోసం పరుగు - తప్పించుకోవటం వరకూ వెళ్ళి- పరిష్కారం మళ్ళీ క్రింద పడింది.
ఏమిటీ సమస్యకి పరిష్కారం?
"డబ్బు, అధికారం ఉపయోగించకుండా నువ్వీ పని చెయ్యాలి" గండ్రగొడ్డలి మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి.
ఎలా? ఎలా??
పెరుగుతున్న పట్టుదలని వాస్తవం వెక్కిరిస్తూంది.
నారాయణ, లక్ష్మి నావైపు చూడటం లేదు. అసలెటువైపూ చూడటం లేదు.
కాలిపోయిన ఇంటికోసం బాధపడటంలేదు. కూలిపోయిన ఆశల సౌధం బాధపెడుతూంది. "మా సెర్మంతో సెప్పులు కుట్టించుతామన్నా" - అన్న లక్ష్మి స్వరం ఇంకా అలాగే వినబడుతూ నన్ను పరిహసిస్తూంది. నేను తిన్న కంచం ఇంకా తడి కూడా ఆరలేదు.
ఎంతో చిన్న సమస్య అనుకున్నాను.
ఎంత బాధ పెడుతూంది.
ఏమిటి దీనికి పరిష్కారం?
ఏమిటి ?
నేను వాళ్ళని ఓదార్చటానికా అన్నట్టు ఏదో అనబోయాను.
అంతలో దూరంనుంచి ఎవరో పిచ్చెత్తినట్టు అరుచుకుంటూ పరుగెడుతున్నారు.
"గోవిందునీ, ఆడి పెళ్ళాన్నీ సంపేసిన్రు. గోవిందునీ ఆడి పెళ్ళాన్నీ సంపేసిన్రు."
స్థాణువు నయ్యాను.
జనం దాదాపు పరుగెడుతున్నట్టు అటువైపు వెళుతున్నారు.
నారాయణ కూడా లేచి వడివడిగా మెట్లు దిగాడు. లక్ష్మి మాత్రం తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ నిర్లిప్తంగా వుండిపోయిన భూదేవిలా అలాగే వుండిపోయింది.
స్పృహలోకి వచ్చినట్లు పరుగెత్తాను. గాలికన్నా వేగంగా- పరుగుకన్నా తొందరగా.
అరుగుకి అడ్డంగా తీర్థంలా వున్నారు జనం. పోలీసులు ఇంకా రాలేదు.
తోసుకుంటూ లోపలికి వెళ్ళాను. ఒక మనిషెవరో శవాలకి దగ్గిరగా జనం వెళ్ళకుండా ఆపుతున్నాడు. నన్ను కూడా ఆపబోయాడు గానీ, పక్కకి తోసేసి ముందుకు వెళ్ళాను.
రక్తంతో తడిసిన మల్లెల మధ్య -
తెగిన పీకెల్తో -
నిర్జీవంగా పడివున్నారు కొత్త దంపతులు !
తొలి రాత్రే ఆశలు సమాధులు కాగా, కన్నకలలు కరిగిపోగా, చేయని తప్పుకీ - చేసిన సాయానికీ ప్రతిగా తమ ప్రాణాల్ని బలిపెట్టుకున్న అమాయక జీవులు! నా కోసం ... కేవలం నా కోసం... అన్నా! సావుకార్ల గుండెల్లో గండ్రగొడ్డలి మా పెద్దన్న ... ఆయన తాలూకు మడిసివి నువ్వు. నీ కోసం ప్రాణాల్నయినా ఇస్తాం.... అదే చిరునవ్వు- అదే తృప్తి-
మరణం కూడా ఆ తృప్తిని వారినుంచి వేరు చేయలేకపోయింది.
"ధర్మారావ్..."
కొండల్లో అయితే ఆ కేక లోయలు దాటి వుండేది. అడవుల్లో అయితే అంచులు దాటి వుండేది. మనుష్యుల మధ్య గుండెల్లో అది ఆగిపోయింది.
... అక్కణ్ణుంచి పట్నం వరకూ ఎలా వచ్చానో నాకే తెలీదు. నిప్పుల మీద నాట్యంచేసే మనుష్యులకు పట్టిన పూనకంలాంటిది నన్నావహించింది. కుర్రవాడి కోసం దీనవనిత అయిన లక్ష్మి కళ్ళముందు కనిపిస్తూంది. దిగులుగా నారాయణ కన్పిస్తున్నాడు. ఎవరో అన్నట్టు ఈ ఆవేశం కడలి కదిలినట్టు, ఘనంఘణల నిక్వణక్వణల ఝణంఝణల నాదం, నినాదం లేని ఆవేశం. ఒక నారాయణ గొంతు ఎన్నో వేల మనది దీనార్త దంపతుల గొంతులై కొడుకుల కోసం, పోయిన పొలాల కోసం రోదిస్తున్నట్టు- ఒక లక్ష్మణ్ అర్ధరాత్రి చీకట్లో తుపాకి చేతపట్టి నాకు దారి చూపిస్తున్నట్టు - మరో గోవిందు చేతులు సాచి నాకు ఆశ్రయమిచ్చి తను బలి అయినట్టూ- పైకి వస్తూన్న సూర్యుడిని చూసి ఎవరో ఒక పేరు తెలియని కవి ఎలుగెత్తి "మేం మనుష్యులు - మేం మహస్సులం" అని ప్రార్ధన చేస్తున్నట్టూ- కత్తిరించిన మెడ మీద నుంచి కారిన రక్తం స్వచ్చమైన మల్లేని ఎర్రబరిచినట్టుగా- ధర్మారావ్ దారుణంగా తీర్చుకున్న కసి- నా మనసు ఎర్రబరిచింది. గత కొన్నాళ్ళుగా వ్యధలో కృంగిన మనసు, మొదటి వర్షపు చుక్క పడగానే బీటలు విచ్చుకున్న భూమిలాగా ప్రతీకారంతో జ్వలించి పోయింది. ఏడ్చే భూమికి తెల్లపావురం ఓదార్పు ఎంత నిరర్ధకమైనదో, అంతే నిరర్ధకంగా ఉన్న ఈ న్యాయస్థానాలు ధర్మారావుకి ఏ శిక్షా వేయవనే నమ్మకంతో ఉన్న నేను, ఆ శిక్ష నేనే వేయదల్చుకున్నాను.
చుట్టూ ఎవరు ఉన్నారో చూసుకోలేదు. ఎవరు చూస్తున్నారో పట్టించుకోలేదు. అతడి బంగళాలోకి ప్రవేశించాను. నన్ను చూసి అతడి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. కనబడిన ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది. కనురెప్పకూడా మూత పడలేదు. ఎవరినో పిలవటానికి తెరిచిన నోరు కూడా అలాగే ఉండిపోయింది. తల మాత్రం తెగి పడింది. ఒకే వ్రేటు. గోవిందు, మంగల ఆత్మశాంతికి చేసిన రక్తతర్పణం.
ఒక అర్ధరాత్రి క్రొత్త దంపతుల్ని హత్యచేసి తనమీదకు రాకుండా, ఏ సాక్ష్యమూ లేకుండా ఇతడు ఎలా తప్పించుకున్నాడో, అలాగే నేనూ ఆ ఇంటినుంచి బయటపడ్డాను.
అక్కణ్ణుంచి చిదానందం ఇంటికి బయల్దేరాను.
అతడు నోట్లు లెక్క పెట్టుకుంటున్నాడు. నన్ను చూసి పాముని చూసినట్టు బెదిరాడు. ఇంత తొందరగా వస్తానని వూహించి ఉండడు. వణికే చేతుల్తో పదివేల రూపాయల కట్టల్ని నా ముందు ఎత్తి పట్టుకున్నాడు. మళ్ళీ ఒకే వ్రేటు. కానీ చేతికింద! మణికట్టు వరకూ తెగిపడింది. ప్రాణభయంతో కెవ్వున అరవాలన్న బాధకూడా తెలియలేదు.
"ఇలాగే నీ కుడి స్థంభం కూలిపోయింది తెలుసా!... నేనే కూల్చేశాను" అన్నాను తాపీగా. "ప్రజలకి ధర్మారావు పేరుతో చెలామణి అయ్యేవాడూ, నీలాటి వాళ్ళకి "దామోదయం" అయిన ఆ రాజకీయ వటవృక్షాన్ని నేను కూల్చేశాను...!" అతడు మాట్లాడలేదు. ఇంకో గంటా రెండుగంటల వరకూ మాట్లాడే స్థితిలో లేడు.
"చాలాకాలంగా నువ్వూ అతడు కలసి ఈ చుట్టు ప్రక్కల గ్రామాల్ని మకుటంలేని మహారాజుల్లా ఏలారు... ఇప్పుడు చెప్పుకో చిదానందం ఎవరికి చెప్పుకుంటావో.... ఎవరికి చెప్పుకుని నీ పనులు పూర్తి చేయించుకుంటావో-"
.......
అతడి చేయి తిమ్మిరినుంచి తేరుకుని, బాధ తెలుస్తున్నట్టు వుంది. అతడి ముందున్న పెట్టె రక్తంతో తడుస్తూంది. అయినా దానివంక చూడటంలేదు. నా చేతిలో ఆయుధం వంకే చూస్తున్నాడు.
"తెరువు" అన్నాను.
పెట్టె తెరిచాడు. ప్రామిసరీ నోట్లు, గిర్వి వస్తువులు, ఎన్నో జీవితాల్ని బంధించి వుంచిన బంధనాలు. కుప్పలు తెప్పలుగా పడి వున్నాయి.
అగ్గిపెట్టెతో స్టాంపు నోట్లని అంటించాను. చితిమంటలాంటి మంట, పాపపు శవం కాలిపోతున్న భావం. బంధనాలు కాలి బూడిదయ్యాక అతడితో అన్నాను- "నేను నిన్ను కూడా చంపొచ్చు. కానీ చంపను. నీవల్ల కావల్సిన పనులు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా విని ఆచరించు. రేపు సాయంత్రానికల్లా ఈ వస్తువులు, దస్తావేజులు ఎవరివి వారికి చేరుకోవాలి. ఇంకో గంటలో నీ దగ్గిర పనిచేస్తున్న పిల్లలందరూ ఎవరిళ్ళకి వారు చేరుకోవాలి. అర్ధమైందా"
అతడు తలూపాడు. తన సొంత కొడుకుని వదిలిపెట్టమన్నా వదిలి పెట్టేటట్టూ ఉన్నాడు. నేను కొనసాగించాను.
"ఈ విషయం ఎవరికీ తెలిసే అవసరంలేదు. నేను నీ పక్కనే వుండి నిన్ను అనుక్షణం గమనిస్తూ వుంటానని మర్చిపోకు. నీ దృష్టి మళ్ళీ నారాయణ కుటుంబం మీదగానీ, అతడు కొడుకు మీదగానీ పడిందా... ఈసారి నీ పీకే తెగుతుంది ఏకంగా. అర్ధమైందా" అబద్ధమైనా ఈ మాత్రం బెదిరింపు అవసరం.
అతడు తలూపాడు.