"రేపట్నుంచీ నువ్వీ వ్యాపారం మానేస్తున్నావు."
తలూపాడు.
"ఇంకో గంటలో నీ మనిషి స్వయంగా నారాయణ కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దింపుతున్నాడు."
తలూపాడు. ధర్మారావు పోయినట్టు తెలిశాక అతడి భయం చూస్తూంటే, తనే స్వయంగా తీసికెళ్ళి దింపేట్టూ వున్నాడు.
"ధర్మారావుని ఎవరు చంపేరో నీకు తెలీదు" అన్నాను అక్కడి నుంచి వెళ్ళటానికి ఆయత్తమవుతూ.
తల వూపాడు
"నీ చెయ్యి ప్రమాదంలో తెగిపోయింది"
తలూపాడు.
చాలు అక్కణ్ణుంచి బయల్దేరాను. ఈ పాము మళ్ళీ తలెత్తదు.
.....
ఆ మరుసటి రోజు నారాయణ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటుంటే దూరం నుంచి చూశాను. కొడుకు తండ్రికి సాయం చేస్తున్నాడు. లక్ష్మి కళ్ళలో ఆనందం కొత్తగా కడుతూన్న ఆ ఇంటిలో వెలుగు నింపుతుందన్న మాట నిర్వివాదాంశం.
ఎవరో కృష్ణమూర్తి అనేవాడు ధర్మారావుని చంపినట్టు రికార్డులో వ్రాసుకుని పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారట. నాకింక అక్కడ పనిలేదు.
11
"సాధించాను గండ్రగొడ్డలీ! నువ్వు చెప్పిన పని సాధించుకు వచ్చాడు."
బట్టలు మడత పెట్టుకుంటున్న అతడు వెనుదిరిగి చూశాడు. అతడి కళ్ళలో నా విజయంపట్ల కనపడిన ఆశ్చర్యం నాకు అపరిమితమైన ఆనందాన్ని కలుగజేసింది.
"అవును. నారాయణ వాళ్ళకి వాళ్ళ కొడుకుని అప్పజెప్పాను."
"అసంభవం-" అన్నాడు.
"లేదు, చేశాను."
"డబ్బు ఇచ్చి అప్పగించావా? నేను ముందే షరతు...."
"లేదు-" అన్నాను అతడి మాటలు మధ్యలో ఆపుచేస్తూ, "అటువంటిదేమీ చేయలేదు."
"అయితే నువ్వెవరో చెప్పి బెదిరించి అతడిని విడిపించావా?"
"లేదు."
ఈసారి అతడి మొహంలో మరింత ఆశ్చర్యం కనిపించింది. "అధికారం ఉపయోగించకుండా, డబ్బు ఇవ్వకుండా చిదానందం నారాయణ కొడుకుని వదిలేశాడా? ఎలా? ఏం చేశావ్?"
"చంపేశాను, ధర్మారావ్ ని చంపేశాను గండ్రగొడ్డలీ... దానితో చిదానందం బెదిరిపోయాడు. కుర్రాడిని, ఒక కుర్రాడినేమిటిలే... కుర్రోళ్ళ నందరినీ వదిలి వేశాడు."
అతడి చేతిలోంచి పక్క బట్టలు నేల మీదకు జారిపోయినయ్! అతడిని ఆ స్థితిలో ఎప్పుడూ చూడలేదు నేను. అంతలా కదిలిపోయినట్టు కనిపించాడు. అయితే అది దుఃఖం, సంతోషం- ఇవేమీ కాదు. ఊహించనంత ఆశ్చర్యం అతడిని కదిలించివేసినట్టూ కనిపించాడు. "చం... చంపేశావా?" అన్నాడు. దూరంగా ఎవరో మైకు పెట్టారు. భగవద్గీత వస్తోంది.
నాకెందుకో అతడి స్థితి చూస్తున్న కొద్దీ సంతోషంగా అనిపించసాగింది. మొదటినుంచీ నేను కాస్త సుపీరియారిటీ కాంప్లెక్స్ తో పెరిగిన మాట నిజమే! నా కాంప్లెక్స్ మీద మొదటినుంచీ దెబ్బకొడుతున్నవాడు ఇతడు. ఇతడంటే నాకీ క్షణం ఏ ద్వేషమూ, కోపమూ లేదు. కానీ ఈ క్షణంలో నా అహాన్ని సంతృప్తిపరిచే పని ఒకటి చేయగలిగి, అతడిని ఆశ్చర్యంలో ముంచెయ్యగలిగాను అన్న సంగతి నన్ను సంతోషపెడుతూంది.
అతడికి వివరాలేం చెప్పలేదు. మంగా వాళ్ళ మరణం గురించి కూడా చెప్పలేదు. నేను వెళ్ళి ఆఫీసుల్లో తిరిగిన విషయం, చిదానందం వేసిన చిన్న చిన్న ఎత్తులు, కలెక్టర్ దగ్గిరకి వెళ్ళటం, ధర్మారావ్ గూండాల్ని పంపటం- చివరికి అతడిని చంపి చిదానందం చెయ్యి కత్తిరించి, ప్రామిసరీ నోట్లు తగలబెట్టటం- వివరంగా చెప్పాను. అంతా చెప్పి "నువ్వు చెప్పినట్టు ఇది కష్టమైన విషయమే! కానీ ఎలాగైతేనేం సాధించగలిగాను. నీ చివరి కోరిక తీర్చగలిగాను. అదీ సంతృప్తి. ఇక పోలీసుల సంగతంటావా- చూద్దాం ఏమవుతుందో? దామోదరాన్ని నేను గానీ చంపకపోయి వుంటే ఈ సమస్య పరిష్కారం అయి వుండేది కాదు. అది మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఇది నన్ను నేను సమర్ధించుకోవడం కాదు. అన్నిదార్లూ వెతికి, ఐమీన్- అన్ని వైపుల్నుంచీ ప్రయత్నించి వీలుకాక చివరికి ఇలా చెయ్యవలసి వచ్చింది. ఆ క్షణం నేను వాళ్ళకి దొరికిపోయి ఉంటే నన్ను ఖండ ఖండాలుగా నరికి వుండేవారు. చట్టరీత్యా చూసినా కూడా ఇదంతా నేను ఆత్మరక్షణార్ధమే చేశాను. కాబట్టి నా మనసులో కూడా అన్యాయం చేశానన్న గిల్టీకాన్షస్ ఫీలింగ్ ఏమీలేదు."
అతడు వెంటనే సమాధానం చెప్పలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు. "నేను నీ చెయ్యి అందుకోవచ్చా?"
మాట్లాడకుండా చెయ్యి అందించాను. అభినందిస్తున్నట్టు దాన్ని అందుకున్నాడు. వదలకుండా దాన్ని అలాగే పట్టుకుని అన్నాడు.
"జనారణ్యంలోకి వెళ్ళి విజయం సాధించుకు వచ్చినందుకు నీకు నా అభినందనలు ఆఫీసర్! నిజం చెప్పాలంటే నువ్వీ పనిచెయ్యలేక వచ్చి క్షమాపణలు చెపుతావనుకున్నాను."
"థాంక్స్..." అన్నాను. నా కంఠంలో లీలగా గర్వం ధ్వనించింది.
"కానీ ఒకే ప్రశ్న! సమాధానం చెపుతావా?"
"అడుగు".
"నా మరణానికి ముందు ఇదే చివరి ప్రశ్న. సమాధానం తెలిస్తే నిజాయితీగా చెప్పు"
"అడగమన్నాగా-"
"అన్ని విధాల ఓడిపోయి, చివరికి శత్రువుని చంపటం తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదని గ్రహించిన నీకు, గత ఇరవై సంవత్సరాలుగా అదే పనిచేస్తున్న నన్ను ఉరితీసే హక్కు ఎవరిచ్చారు?"
బాంబులా పేలింది ఆ ప్రశ్న. అప్పటివరకూ మెట్లెక్కి శిఖరాన్ని అధిరోహించాననుకున్న నన్ను ఈ ప్రశ్న శిఖరం మీదనుంచి తోసేసినట్టు అనిపించింది.
నిరుత్తరుడనై చూశాను.
అతడు నావైపే సూటిగా చూస్తున్నాడు.
అతడి కళ్ళు ప్రశ్నిస్తున్నాయి.
సమాధానం దొరకటం లేదు.
చివరికి తేరుకున్నాను.
"నన్ను బెదిరిస్తున్నావా?" అని అడిగాను. ఆ క్షణం నాకు దేనికీ భయపడే అవసరం కనపడలేదు. నేను అత్యంత ఆప్యాయంగా ప్రేమించే అమ్మమీద ఒట్టేసి చెపుతున్నాను. ఈ విషయం అంతా బయటకొచ్చి నేను దోషిలా నిలబడవలసి వచ్చినా నేను బాధపడను. భయపడను. నా మనసుకి మాత్రమే నేను జవాబు దారిని. నేను చేసింది తప్పని నేను అనుకోలేదు. ఆ విషయమే చెప్పి, "నువ్వు నన్ను బెదిరించదల్చుకుంటే చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు" అన్నాను.
అతడు నవ్వేడు. "నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావ్ ఆఫీసర్!" అన్నాడు. ఆ తరువాత అతడి స్వర్గం నిర్ఘరఝరీ ప్రవాహంలా కదిలింది. అతడి చూపు దిగంతాలు కలిసేచోట కృంగిపోతున్న సూర్యుడి ఎర్రదనంమీద నిలిచింది. ఒక ఆవేశ తరంగాన్ని అతికష్టంమీద ఆపుకుంటున్నట్టు అనిపించింది.
"ఒకప్పుడు నేనూ నీలాగే ప్రపంచం అంతా మంచితనంతో నిండివుందనీ, మనిషి నిర్మించుకున్న కట్టుబాట్లు - మనిషి తయారుచేసుకున్న న్యాయశాస్త్రం - నైతిక విలువల్ని, జీవన విధానాన్నీ పరిరక్షిస్తాయనీ భావించే వాడిని. నారాయణలాగే నాకూ ఒక కొడుకు వుండేవాడు. అయిదెకరాల పొలం వుండేది. చిదానందం లాటి మరో వ్యాపారి ఆ రెండింటినీ లాగేశాడు. అంతేకాక నా భార్యమీద కన్నేశాడు. చాలామంది అంటారు- 'విప్లవం పాలేర్ల భార్యల్ని కామందులు రేప్ చేస్తే వచ్చే ఆవేశంవల్ల రాదు' అని. కాని నేను అనుకొనేది- 'మనిషి తాలూకు ఆస్తులకన్నా పెద్దది జీవిత సహచారిణి' అని! చేసిన చిన్న తప్పు అప్పు తీసుకోవటం!! దానికి ప్రతిగా నేను మొదటి సంవత్సరం పొలం కోల్పోయాను. రైతుకూలీ నయాను. రెండో సంవత్సరం కొడుకుని కోల్పోయాను. మూడో సంవత్సరం భార్యని కూడా కోల్పోవలసి వచ్చింది. నువ్వు వెళ్ళినట్టే నేనూ తహసిల్ ఆఫీసుకి వెళ్ళాను. నీలాగా ఇంగ్లీషు మాట్లాడకపోయి వుండవచ్చు. తెలంగాణా మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు, మీలా చదువుకున్న ఆఫీసర్లకి అర్ధమయ్యే భాషలో చెప్పటం చేతకాలేదు. కంప్లెయింట్ ఇవ్వమన్నారు. రికార్డులు లేవన్నారు. సాక్ష్యాలు చాలవన్నారు. బంతిని కొట్టినట్టు ఒక ఆఫీసునుంచి మరొక ఆఫీసుకి కొట్టారు. పొలం పోయినా ఫర్లేదు, నా కొడుకు దక్కితే చాలనుకున్నాను. అసలు నా కొడుకు నాకు కొడుకే కాదు- అని నిరూపించే లెవల్ కి వెళ్ళాడు చిదానందం లాటివాడు. అతడి వెనుక దామోదరాలు, ధర్మారావులు వున్నారు. నా భార్య ఒక్కతే మిగిలింది. ఆ చివరి ఆస్థిమీద అతడి కన్నుపడింది. హోరుమన్న వర్షంలో పోలీసుస్టేషన్ కి పరుగెత్తాను. జగన్నాధంలాంటి ఇన్ స్పెక్టర్ నా గోడు పట్టించుకోలేదు. అప్పుడు ... సరీగ్గా ఆ సమయంలో నాకు సాయంగా దొరికిందీ గండ్రగొడ్డలి. ఏ సాక్ష్యాలు అడక్కుండా చిదానందం మెడని ఛిద్రం చేసింది. ఏ ఋజువులు అడక్కుండా ధర్మారావుని నిలువునా పడగొట్టింది. నా భార్యాబిడ్డల శృంఖలాల్ని తెగ్గొట్టింది. ఇప్పుడు చెప్పు ఇన్ స్పెక్టర్! నువ్వు చేసిన తప్పే నేనూ చేస్తే దీనికి ఉరిశిక్ష ఎందుకు? సమస్యకి ఎటూదారి తోచని మనిషి ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావ్? నాలుగ్గోడల జైలుకి కాసింత ప్రమాదం అనేసరికే యుక్తాయుక్తాలు మర్చిపోయి నా సాయం తీసుకున్నావు. అందుకే అడిగాను. చట్ట పరిధిలో శత్రువుని చంపినందుకు నీకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు నాకు ఉరిశిక్ష! ఇదేమి న్యాయం అని! నువ్వు సమాధానం చెప్పలేదు. కానీ నువ్వెళ్ళాక నేను ఆలోచించుకున్నాను. నా వాదనలో ఏదైనా తప్పుందేమో... కేవలం నా పనిని సమర్ధించుకోవటం కోసం నేనిలా వాదిస్తున్నానేమో అని! పరిస్థితి మారిపోయిందేమో, ఇక నాలాటి గొడ్డళ్ళ అవసరం లేదేమో అనుకున్నాను. తెలంగాణా రైతాంగానికి నీలాటి చదువుకున్న వాళ్ళు మరో మార్గంలో ఏదైనా సాయం చేయగలరేమో అనుకున్నాను. అందుకే నిన్ను ఆఖరి కోరిక కోరాను. కానీ నువ్వు చేసిందేమిటి? నేను చేసిన పనినే నువ్వూ చేశావు. నేను నిన్ను తప్పు పట్టటంలేదు ఆఫీసర్! ఆలోచించమంటున్నాను. అంతే! ఒకసారి జరిగినదంతా పునర్ ఆలోచించు. ఈ పట్నాల్లో ఉన్న మీకు... నాగరికత సోకని ఆ చీకటి పల్లెల్లో జరుగుతున్న సంగతులు తెలియవు ఆఫీసర్! మీ ఆర్థికశాస్త్రాలు అక్కడి వరకూ పాకవు. ఇదంతా అసలు ఒక సమస్యేనా అని మీకు అనిపిస్తుంది. గోడలమీద నినాదాలు వ్రాసేవారు మీకు విపులంగా సమస్యని విప్పి చెప్పరు. అక్కడి పరిస్థితులు వివరించరు. అక్కడ బానిస కొడుకు బానిసే! అమాయకుడి కొడుకు చరిత్రహీనుడే! వాళ్ళ జీవితాల్ని ఎవరూ రక్షించలేరు. వ్యాపారుల, నాయకుల, తెలివైన వాళ్ళ కబంధ హస్తాల్నుంచి ఎవరూ రక్షించలేరు. నేను నిన్ను డబ్బు ఉపయోగించవద్దన్నది ఎందుకో నీకీ పాటికే అర్ధమై ఉంటుంది. నీ దగ్గిరున్న డబ్బుతో ఎంతమంది నారాయణల్ని రక్షించగలవు? నిన్ను అధికారం డబ్బుతో ఎంతమంది నారాయణల్ని రక్షించగలవు? నిన్ను అధికారం ఉపయోగించవద్దన్నాను. ఎందుకో తెలుసా? నీ స్థితిలోనే ఒక నారాయణ ఉంటే అతడు ఏ అధికారి సాయం కోరగలడు? నీకు చేసినట్టు వాళ్ళకి కలెక్టర్లు స్నేహితులు కారు. చట్టం సాయం చేయదు. ఆఫీసుల్లో మాట వినరు. అందుకని నేను గొడ్డలిని ఆశ్రయించాను. కనీసం కొందరు ధర్మారావుల్నీ, చిదానందాల్నీ నా భయంలో ఉంచుకున్నాను. నా పరిధిలో నేను అలా సాయం చేశాను. నీ చదువుతో, నీ విజ్ఞానంతో కొత్త సూత్రం ఏదీ కనుక్కోలేక పోయావు. పాత దారినే అనుసరించావు. పాతిక సంవత్సరాలలో చరిత్ర ఏమీ మారలేదనీ, కొత్త పరిష్కారం ఏదీ కనుక్కోబడలేదనీ నిరూపించావు. నాకు సంతోషంగా ఉంది ఆఫీసర్! ఇక నా మనసులో ఏ బాధా లేదు. నెఉ తప్పు చేశానన్న భావం లేదు. వెళ్ళిరా. కృతజ్ఞతలు ...."