Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 27


    ఈ ఆశ కలిగాక వచ్చే జీపుకోసం ఎదురు చూడసాగాను. క్రమక్రమంగా జీపు దగ్గరయింది. ఇటువైపు నుంచి రోడ్డుమీదకి పోలీసులు వచ్చేశారు.
    పోలీసులతోపాటు వున్న సబ్- ఇన్ స్పెక్టర్, రోడ్డు మధ్యలో ఆగిన జీపువైపు వడివడిగా నడిచి వెళ్ళాడు. జీపు హెడ్ లైట్ల కాంతి నామీద పడకుండా జాగ్రత్త పడుతూ వంగి చూశాను.
    జీపులోంచి ఖద్దరు లాల్చీ పంచెతో ఒకరు క్రిందకు దిగారు.
    అతడు ధర్మారావు.
                                              *    *    *
    "అతడెక్కడికీ పారిపోలేదు సార్. ఈ వీధిలోకే ప్రవేశించటం కళ్ళారా చూశాము" అంటున్నాడు ఇన్ స్పెక్టర్.
    నెమ్మదిగా పాక్కుంటూ గడ్డివాము వెనుకవైపు వెళ్ళి అక్కడ గోడమీద చేతులు వేశాను. అటువైపుకి దూకబోతున్న వాడినల్లా 'రోడ్డుకి చెరో వైపున అవతలవేపున పోలీసుల్ని నిలబెట్టాను సార్' అన్న ఇన్ స్పెక్టర్ మాటలు వినిపించి ఆగిపోయాను.
    అంతలో అతి సమీపంలో ఒక కుక్క నన్ను పసిగట్టినట్టుంది. బొయ్యిమంది. దాంతో ఒక్కసారిగా అన్ని కుక్కలూ కంఠాలు విప్పినయ్. దాదాపు అందరి దృష్టీ ఇటే పడింది. ఒక్క గెంతులో నేను ప్రహరీగోడ దూకి పక్క ఇంట్లో ప్రవేశించటం, ధర్మారావు గొంతు "అదిగో అక్కడే" అని వినిపించటం ఒకేసారి జరిగినయ్!
    పక్కింటిలో కూడా ఆగలేదు నేను. వరుసగా నాలుగైదు ఇళ్ళు దాటి ఒక చిన్న ఇంటి అరుగుమీదకు ప్రవేశించాను. మరింత ముందుకు వెళ్ళటం ప్రమాదం. అదీగాక ఈ జీపు శబ్దాలకీ, పోలీసుల మాటలకీ దాదాపు ప్రతి ఇంటి తలుపు తెరుచుకుంది. అందరూ బయటకొచ్చి ఈ దృశ్యాన్ని వింతగానూ, భయంతోనూ చూడసాగారు. వాళ్ళల్లో ఏ ఒక్కరికి కనపడ్డా, నామీద ద్వేషంతో కాకపోయినా, భయంతోనైనా అసంకల్పితంగా అరవొచ్చు. అందుకే మూసి ఉన్న తలుపుమీద చిన్నగా శబ్దం చేశాను.
    మొదట ఒకటీ రెండుసార్లు ఎవరూ పలుకలేదు. తరువాత "ఎవరదీ" అని వినిపించింది. ఆ తరువాత తలుపులు తెరుచుకున్నాయి. లాల్చీలో ఉన్న యువకుడు గుమ్మం దగ్గిర నిలబడి వున్నాడు.
    "అడ్డు లేవండి. లోపలికి వెళ్ళిన తరువాత మిగతా వివరాలు చెపుతాను."
    అతడు అనుమానంగా చూస్తూ "ఎవరు నువ్వు" అన్నాడు. అంతలో అతడి దృష్టి దూరంగా ఆగివున్న జీపుమీదా, పోలీసులమీదా పడింది. అప్పటికే పోలీసులు ఒక్కొక్క ఇల్లూ వెతుక్కుంటూ వస్తున్నారు.
    "ఎవర్నువ్వు?"
    అసంకల్పితంగా, అప్రయత్నంగా అన్నాను. "గండ్రగొడ్డలి తాలూకు మనిషిని"
    అతడు చప్పున గుమ్మం నుంచి అడ్డుతొలగి, "లోపలికి రండి" అన్నాడు. ఏకవచనం నుంచి బహువచనంలోకి మారటం గమనించే స్థితిలో లేదు మనసు. చటుక్కున లోపలికి అడుగుపెట్టి తలుపువేసి, గుండెలనిండా వూపిరి పీల్చుకున్నాను. 'ఈ మాత్రం రక్షణ దొరికితే ఎలాగో ఒకలా తప్పించుకోవచ్చు' అనుకుంటూ తలెత్తి చూసిన నేను నోటమాట రానట్టు అచేతనుడయ్యాను.
    ఒకటే గది అది. ఆ గదిలో ఒక మూలగా మంచం వుంది. నిండా మల్లెపూలు జల్లి వున్నాయి. ఊదొత్తుల పొగ మందంగా వ్యాపించి వుంది.
    మంచం పక్కగా, జరుగుతున్నది అర్ధంగాక, భయంతో- సిగ్గుతో నిలబడి ఉంది- కొత్త పెళ్ళి కూతురు. వాళ్ళకెవరూ లేనట్టుగా, అన్నీ వాళ్ళకి వాళ్ళే అమర్చుకొన్నట్టుగా ఉంది ఆ గది. ఆ రాత్రి వాళ్ళ మొదటి రాత్రి కాబట్టే బైట కలకలానికి వాళ్ళు తలుపు తెరవలేదని అర్ధమైంది. నేనెంత తప్పు చేశానో తెలిసి, బయటకి అడుగుపెట్టబోయాను. అంతలో బయట ధర్మారావు కంఠం బిగ్గరగా వినపడింది.
    "ఇల్లిల్లూ వెతకండి. ఈ సందులోనే ఉన్నాడు వాడు. ఎలాగైనా పట్టుకోండి."
    చిన్నపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. పోలీసులు సామాన్లు జరుపుతున్న చప్పుడు. ఆ ప్రదేశాన్ని అష్టదిగ్భంధనం చేసినట్టున్నారు.
    నేను బయటకు వెళ్ళటానికి వీల్లేకుండా ఇదే ఇంటి ఎదురుగా ధర్మారావు. ఇన్ స్పెక్టరూ రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా వూహించలేదు నేను.
    "చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి ఇన్ స్పెక్టర్! పట్టపగలు ఒక వ్యాపారస్థుడి ఇంటికి వెళ్ళి మరీ బెదిరించాడంటే, భవిష్యత్తులో ఒక పెద్ద క్రిమినల్ అవుతాడు. అలా అవకముందే వాడిపని పట్టాలి" అంటున్నాడు ధర్మారావు. తన సామ్రాజ్యంలో చాలాకాలం తరువాత తలెత్తిన మొట్టమొదటి వ్యతిరేకతని మొక్కగానే అణిచి వేయాలనుకుంటున్నాడు అతడు.
    "ఇంకెక్కడికీ తప్పించుకోలేడు సార్. సూది పట్టే స్థలాన్ని కూడా వదలకుండా వెదుకుతున్నారు మా వాళ్ళు. ఈ వీధిలో ఏ ఇంటినీ వదిలిపెట్టం."
    నేను వాళ్ళని ఎదుర్కోవటానికే నిశ్చయించుకున్నాను. ధర్మారావు నన్ను విడిచిపెట్టడనీ - నా నోట మాట బయటకి రాకముందే గుళ్ళు పేలతాయనీ నాకు తెలుసు. ఆ కసి అతడి మొహంలోనే కనబడుతూంది. అయినా తలుపు తియ్యబోయాను.
    అంతలో నా భుజంమీద చెయ్యిపడింది. "అన్నా! నా పేరు గోవిందు. అది నిన్నటివరకూ నా మరదలు. నిన్నే నా పెండ్లామయింది. నీకేం భయంలేదు. ఈ గదిలోనే ఉండు" అని భార్యవైపు తిరిగి, "ఏందే మంగా! అర్ధమైందిగా. పెద్దన్న పంపిండంట. ఈయన కోసం ప్రతి ఇల్లూ వెతుకుతున్నారు పోలీసులు. ఈ గదిలోనే నీతోనే, నీ పక్కనే వుంటడు. నేను బయటపడుకుంటా" అంటూ తలుపు తెరవబోయాడు.
    ఆకాశం విచ్చుకుని అందులోంచి ఒక మెరుపు తీగె బయల్వెడలి కళ్ళు మిరిమిట్లు గొలిపినట్టు నా మనసులో అతడు చేయదల్చుకున్న పని తాలూకు భావం అర్ధమై - నిలువెల్లా కంపించిపోయాను.
    "గో... విం....దూ" నా కంఠం వణికింది. "ఏమిటి ..... ఏమిటి నువ్వు చేయదల్చుకున్నది?"
    "నీకు తెలీదన్నా ఈళ్ళ సంగతి. వంట పాత్రలతో సహా దేన్నీ వదిలిపెట్టరు. అన్నీ వెదుకుతున్నారు. ఇంకేమీ ఆలోచించకు వెళ్ళి పడుకో. ఈ పరిస్థితిలో ఇంకో దారి లేదు."
    "కానీ - కానీ"
    ... అప్పటికే అతడు చాపచుట్ట పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. నేనూ మంగ మిగిలేం.
    బయట పోలీసుల హడావుడి కన్నా ధర్మారావు తాలూకు మనుష్యుల కర్ర చప్పుళ్ళు ఎక్కువగా వినిపిస్తున్నాయి. క్రమక్రమంగా అలికిడి దగ్గిరయింది.
    ........
    ఆమె ఊపిరి నాకు తగుల్తోంది.
    నాకు అమ్మ గుర్తొచ్చింది.
    తల్లికోడి గుర్తొచ్చింది.
    డేగ తన్నుకుపోకుండా తన రెక్కల మాటున పిల్లల్ని దాచుకుని, కావలసివస్తే తన ప్రాణాలనయినా అర్పించటానికి సిద్ధపడే తల్లికోడి -
    నా కంటినుంచి అశ్రువులు రాలుతున్నాయా? ఏమో.... ఇంత త్యాగాన్ని భరించలేక .... మనుష్యుల్లో ఇంత దయ. క్షమ, కరుణల్ని చూసి నా గుండె ఉద్వేగంతో... కొట్టుకోవటం ఆగిపోయిందా? ఏమో... నాకేమీ తెలియటం లేదు. గుండెల్ని నొక్కిపట్టినట్టు మనసంతా ఏదో తెలియని ఆవేశంతో నిండిపోయింది. పక్కమీద ఉన్న మల్లెపూలు, తెల్లరెక్కలు కట్టుకున్న చిరుదేవతలై పులకరించే హృదయాల్తో ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అనిపించింది. అగరొత్తుల పొగ మేఘాల మధ్యనుంచి అశ్వనీ దేవతలు ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది.
    బైట ఒక కంఠం కర్కశంగా వినిపించి - "ఒరేయ్! తలుపు తెరవరా"
    గోవిందు కంఠం జవాబు చెపుతూంది - "నా తమ్ముడికి నిన్నే పెండ్లయింది దొరా? లోన పడుకున్నాడు."
    "నీ మాదచ్చోద్ కబుర్లన్నీ ఈడ కాదుబే. తలుపు తెరు."
    ధడేలున కిటికీ తలుపు తెరుచుకున్న చప్పుడు. లోపలికి ఒక మొహం తొంగి చూసింది. మేము పడుకొని ఉన్న భంగిమ చూసి ఆ మొహంమీద లేకి నవ్వు... కొడుక్కి స్థన్యాన్ని ఇస్తూన్న మాతృమూర్తిని కూడా వాంఛతో చూడగలిగే చూపు... కొద్ది క్షణాల వరకూ కదల్లేదు. మంగ కాలు వేసి, నా పాంటు చివర రక్తం చుక్కలు.... పేలికలు కనబడకుండా అడ్డు పెట్టింది.
    అంతలో కిటికీ తలుపు దగ్గిరకి లాగిన ధ్వని వినిపించింది.
    "ఒరేయ్! వెనకాల గదులేమైనా ఉన్నాయేమో చూడండ్రా" 
    "ఏమీలేవు దొరా. రండి పెరడు చూపిస్తా" గోవిందు కంఠం. వాళ్ళు ఇంటి వెనక్కి వెళుతున్న అలికిడి...
    నెమ్మదిగా హడావుడి తగ్గింది.
    అరగంట .....
    గంట గడిచింది.
    తలుపు నెమ్మదిగా తెరిచాను. గోవిందు లోపలికి వచ్చాడు.
    "వెళ్ళిపోయారు వాళ్ళు" అన్నాడు.
    మినుక్కు మినుక్కుమనే మసక దీపం వెలుగులో మంగ మంచం పక్కన నిల్చుని వుంది.
    "ఎక్కడ దాచారో, ఎలా దాచారో తెలియక జుట్టు పీక్కొన్నారు, ఎవరైనా దాచినట్టు తెలిస్తే పీకెలు తెగ్గోస్తామని బెదిరించిపోయారు" నవ్వుతూ దగ్గిరకి వచ్చాడు. "అయినా నీకేం ఫర్లేదన్నా. వెళ్ళిరా..."
    మంగవైపు తిరిగి - చెమర్చిన కళ్ళతో చేతులు జోడించాను. "చిన్నపిల్లవని నీ కాళ్ళకు నమస్కరించటం లేదమ్మా! ఈ రోజు నువ్వు చేసిన పని, చరిత్రకారు లెవరూ గుర్తించకపోవచ్చునేమో కానీ, నా మనసు పుటల్లో శాశ్వతంగా భద్రపరచబడి వుంటుంది. నా భయం ప్రాణం పోతుందని కాదు. ప్రాణం పోకుండా కాపాడటం కోసం నువ్వూ నీ భర్తా నన్ను రక్షించిన వైనం -" 
    "అంత మాటలనకన్నా..." మొదటిసారి మాట్లాడుతూ అంది మంగ. "... పెద్దన్న తాలూకు మనిషివి. ఈ రోజు మేమిట్టా వున్నా మంటే, ఆ చిదానందం మా కొంప మీదకి రాలేదంటే పెద్దన్నకి భయపడే. ఆ సావుకార్ల గుండెల్లో పెద్దన్న గండ్రగొడ్డలిలా వున్నంతకాలం మా బతుకులకి ఏ భయమూ లేదన్నా."
    ఆర్తరావ మందిరాలు - ఆస్తిమూల పంజరాలు - నా ఆర్తి ఏ దిగంతాలకు పయనించగలదు ? ఎవరి గుండె స్పృశించగలదు?
    గండ్రగొడ్డలీ! నీ జీవితం ధన్యమైంది. ఉరికంబం నీ ప్రాణాలు తీయవచ్చు గాక. చట్టం నీ మెడ విరిచెయ్యవచ్చు గాక. కానీ ఈ గుండెల్లో నీ మూర్తి సజీవమై వుంటుంది.
    వాళ్ళ దగ్గిర్నుంచి శలవు తీసుకుని అక్కడి నుంచి నిష్క్రమించాను.
                                             *    *    *

 Previous Page Next Page