వాళ్ళు భోజనం పూర్తిచేశాక తను పెట్టుకు భోంచేసి ముందు గదిలోకి వచ్చింది. చెల్లెలి వళ్ళో తల పెట్టుకొని కబుర్లు చెపుతున్నాడతను. ఆమె కోపంగా ఏదో అంటోంది. అతడు బ్రతిమాలుతున్నాడు. పక్కనే షిఫాన్ చీరె వుంది.
..... ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.
నేలమీద కొంగు పరుచుకు పడుకుంది. బైట వాసంతి అలక చల్లారినట్లుంది. నవ్వులు వినబడుతున్నాయి.
* * *
ఆఫీసు కెళ్ళటం.....ఇంటికి రావటం....భోజనం చెయ్యటం, పక్క చేరటం..... ఏదో చెయ్యాలనుకోవటం.....నిద్రపోవటం, ఇదీ అతని దినచర్య! పావని చదువు కోలేదు. ఆమెకి సైకో అనాలిసిస్ తెలీదు.
వాసంతి ధైర్యస్థురాలు నోటి దురుసుతనంతో అన్ని పనులూ చేసుకొస్తూంది. తనలో లేని ధైర్యాన్ని ఆ స్త్రీలో చూసిన రామ్మూర్తి ఆమెకి అభిమాని అయ్యాడు. ఆమె రాఖీ కట్టింది. అన్నయ్య అయ్యాడు.
ఇన్నాళ్ళూ తన చెప్పుచేతల్లో ఉన్న అన్నయ్య పెళ్ళి చేసుకుంటాననటం, అదీ.....తను అమ్మాయిని చూసి ఓ.కే, చేయకుండా అతడు మాట యిచ్చి రావటం వాసంతిలో అసూయని రేపింది. అందుకని రాగానే పావనిని మాటల్లోనే ఓ చూపు చూసింది.
భాస్కరరామ్మూర్తి పరమహంస దగ్గరకు వెళ్ళొచ్చిన పది రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది.
పరమహంస కార్లో వస్తున్నాడు. ఒక స్కూటరు అతన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళింది. దానిమీద భాస్కరరామ్మూర్తి వున్నాడు. అతడు పరమహంసని చూడలేదు. పరమహంసకి అతని మూడు యాక్సిడెంట్ ల ప్రహసనం గురించి తను చెప్పిన జ్యోతిష్యం గుర్తొచ్చింది. కారు కాస్త వేగం హెచ్చించి అతని పక్కనుంచి పోనిస్తూ, చిరునవ్వుతో స్టీరింగ్ కాస్త పక్కకి తిప్పి, మామూలుగా వెళ్ళిపోయాడు.
ఈసారి కాస్త పెద్ద యాక్సిడెంటే జరిగింది రామ్మూర్తికి.
పావని వెళ్ళేసరికి.....
జనరల్ వార్డులో మంచంమీద వున్నాడు రామ్మూర్తి. వాసంతి చేతులలో ముఖం దాచుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. అతడు ఏడుస్తున్నది యాక్సిడెంట్ వలన వచ్చిన షాక్ తో కాదు. జ్యోతిష్యం నిజమై తనకి ఆస్థి రాదేమో అని! అతని కళ్ళముందు పరమహంస రూపమే కదలాడుతూంది. నర్సు వాళ్ళని విసుగ్గా చూస్తోంది. ఆ టైమ్ లో పావని వెళ్ళింది.
"ఫర్వాలేదా సిస్టర్! ఏం భయంలేదుకదా" పావని వెళ్ళి నర్సుని అడిగింది.
"మరేమీ ఫర్వాలేదు. కాలు ఫ్రాక్చర్ అయిందంతే. దెబ్బ తగలగానే స్పృహ తప్పిందని అబ్జర్వేషన్ లో పెట్టారు. భార్యాభర్తలకి ఆ మాత్రం కంట్రోలు లేకపోతే ఎలా?" అంది నర్సు.
'నేనే భార్యని. ఆమె చెల్లెలు' అందామానుకున్న మాటలు నోటి చివర వరకూ వచ్చి ఆగిపోయాయి.
భర్త దగ్గరికి వెళ్ళి "ఏమండీ ఎలా జరిగింది యాక్సిడెంట్?" అని అడిగింది.
"ఇప్పుడు మరోసారి చేసి చూపించమంటావా? కాసేపు అవతలికి పో...." అనరిచాడు. అతడి అరుపులకి అందరూ అటు చూశారు. పావని బిక్కచచ్చిపోయింది.
"పెళ్ళి చేసుకున్నప్పటినుంచీ శని దేవత నా నెత్తిన కూర్చుని నాట్యం చేస్తోంది." గొణుగుతున్నాడు అతడు. వాసంతి అతడి జుట్టులో చెయ్యి పెట్టి ఓదారుస్తూంది.
వార్డ్ లో పేషెంట్ల పరిస్థితి భయంకరంగా వుంది. వంటినిండా కట్లు.....రక్తం....ఇదంతా చూసి భర్త మరింత బెదిరిపోతున్నాడని...."వాసంతీ......స్పెషల్ రూమ్స్ ఏమయినా వుంటాయేమో అడిగితే...." మెల్లగా భయంగా అంది.
"వెళ్ళమ్మా.....ఊరికే కూర్చోపోతే వెళ్ళి అడగరాదూ" అంది వెటకారంగా వాసంతి.
పావని భయం భయంగా ఆమెవైపు చూసింది. వాసంతి గర్వంగా నవ్వింది. ఆ నవ్వులో హేళన వుంది. ఈతరానివాడిని బలవంతంగా నీళ్ళలోకి తోస్తే ఆటోమేటిగ్గా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఒడ్డుచేరడానికి ప్రయత్నిస్తాడు. వాసంతి నిర్లక్ష్యం, వ్యంగ్య ధోరణి పావని గుండె నిద్రాణమైవున్న ధైర్యాన్ని రెచ్చగొట్టి లేపింది.
లేచి ఎదురుగా కనిపిస్తున్న డాక్టర్ గదిలోకి వెళ్ళింది. అంతకుముందు వచ్చిన నర్సు సహాయం అడగాలని ఆమె ఉద్దేశ్యం. లోపల ఆవిడలేదు. ఓ కుర్రడాక్టర్ సీరియస్ గా రాసుకుంటున్నాడు.
"ఎస్" అన్నాడు తలెత్తి. కొద్దిక్షణాలపాటు అతడి చూపులు ఆమె ముఖంమీదే ఆగిపోయాయి.
"డాక్టర్" పిలిచింది పావని. ఆమె స్వరం ఆమెకే వినిపించనంత మెల్లగా.
"ఊఁ ఏమిటి, చెప్పండి" అన్నాడతను తేరుకుని.
"మా వారికి స్పెషల్ రూం ఏదైనా దొరుకుతుందేమోనని!"
"ఏ బెడ్ మీద పేషెంటూ?"
ఆమె వివరాలు చెప్పింది.
"అయితే ఎమర్జెన్సీ పేషెంటు. స్పెషల్ రూం సాధారణంగా ఇవ్వరు. అయినా ఈ బిల్డింగ్ బయట ఆర్.ఎమ్.వో.గారి ఆఫీసుంది వెళ్ళి కనుక్కోండి."
పావనికేమీ తోచలేదు. ఆ బిల్డింగ్ ఓ మయసభలా వుందామెకు-"డాక్టర్! నాకీ వూరు కొత్త. ఈ హాస్పిటల్ అసలు తెలియదు. ప్లీజ్.... కొంచెం సహాయం చెయ్యగలరా?" నెమ్మదిగా అంది. ఆమె స్వరంలోని ఆర్ధ్రతకే కదిలిపోయాడో కళ్ళల్లో ధైన్యానికి చలించాడోగానీ వెంటనే లేచాడు- "నాతో రండి" అంటూ దారితీశాడు.
ఆ తరువాత పన్లన్నీ వేగంగా జరిగిపోయాయి. అరగంట తరువాత భాస్కరరామ్మూర్తి స్పెషల్ రూంలో వున్నాడు.
"డాక్టర్...." వెళ్ళబోతున్న అతను పావని పిలుపు విని ఆగాడు. "...థాంక్యూ డాక్టర్! మీ సహాయాన్ని మర్చిపోలేను!" రెండు చేతులూ జోడించింది.
"దాన్దేముంది సిస్టర్! నేను చేయగలిగింది చేశాను. మీరు అంతగా కృతజ్ఞత చెప్పవలసిన అవసరంలేదు. అన్నట్లు నేను డాక్టర్ ని కాదు. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ని. వస్తా" అని వెళ్ళిపోయాడు. అప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ, పావని వాటిని ఆర్గనైజ్ చేసిన విధానాన్నీ, ఆశ్చర్యంతో చూస్తున్న వాసంతి, అతడు వెళ్ళిపోగానే "నేను వెళ్ళి ఎన్ని ప్రశ్నలు అడిగినా నోరు విప్పలేదు. ఆ కుర్రడాక్టర్ ఈవిడని చూసి ఎలా ఐసైపోయాడో చూశావా రామూ...." అంది కసిగా.
పావని మొహం మ్లానమైంది. ఆమెది అపురూపమైన అందమే. కాని ఈ అభియోగం?
"ఏమిటే వాడితో అంతసేపు కబుర్లు ఇన్నాళ్ళూ ఇంటినుంచి బయటకొచ్చే అవకాశం దొరక్క, ఇప్పుడు బయటకు రావటం ఆలస్యం..... మొదలెట్టావా భోగంవేషాలు" అన్నాడు కోపంగా.
ఆమె బిత్తరపోయింది. భర్తలో కొత్త అవతారాన్ని చూస్తోంది.
"సమాధానం చెప్పదు. ముంగిలా కూర్చుంటుంది. నువ్వెళ్ళి మనం తినటానికేమయినా తీసుకురా" అన్నాడతను.
వాసంతి వెళ్ళి పళ్ళు కొనుక్కొచ్చింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు.
పావని బయటకొచ్చింది.
లేబర్ రూమ్ లోంచి ఒక తల్లి కేకలు వినిపిస్తున్నాయి. ఆమె బయట అరుగుమీద నిస్సహాయంగా కూలబడింది. అంతవరకూ బిగపట్టిన ఏడుపు అప్పుడొచ్చింది. 'అమ్మా! ఎందుకు కన్నావమ్మా నన్ను' అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చింది.
తను ఏ లేబర్ రూం పక్కన కూర్చుని ఏడుస్తూందో..... ఆ ప్రసూతి గృహంలో ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే తననీ రోజు ఈ స్థానంలో వుంచిందని పావనికి తెలీదు.
3
జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో ఉత్సాహంగా ఒక పని చేపడతారు. దాన్ని 'పెళ్ళి' అంటారు.
మనిషికి ఏ అర్హతా లేకపోయినా పెళ్ళి చేసుకునే అర్హత వుంది. మనిషికి దేవుడిచ్చిణ సులభమైన వరం. కానీ అనుబంధం నిలుపుకోవటం మాత్రం చాలా కష్టం. బంధం నిలబడవచ్చు. కానీ అది.... అందరూ ఏమనుకుంటారనో, నైతిక విలువకు భయపడో, విడిగా వెళ్ళి బ్రతకలేమనో, పిల్లల మీద ప్రేమచేతో, 'ఆ.....ఇలా బాగానే వుంది కదా, ఏదో గడిచిపోతుందిలే' అనో, పుట్టింటికి వెళ్తే ఈ మాత్రం సుఖం కూడా వుండదనో, మిగతా విషయాల్లో ఆయన మంచివారే (ఆమె మంచిదే), ఈ ఒక్క విషయమే కదా ఆమె (ఆయన) బలహీనత..... అని సరిపుచ్చుకుంటూ వుండటంచేతో, తన భాగస్వామిలో లేనిది "బైట" వెతుక్కుని సంతృప్తిపడటం ద్వారానో..... దేవుడో.....తాగుడో.... నగలో ....వీటివల్ల సక్సెస్ అయి వివాహ వ్యవస్థని నిలబెట్టవలసి రావటం దురదృష్టకరం.
ఉద్దరు కలిసి జీవించటం అన్నాక కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. కానీ రాజీ పడవలసిన గుణాలే ఎక్కువైనప్పుడు వస్తుంది ఇబ్బంది. పిల్లలు, ఇల్లు, భద్రత, సెక్సు అనేది లేకపోతే వివాహవ్యవస్థ ఎప్పుడో కూలిపోయి వుండేది. భార్యాభర్తల అనుబంధం మీద సర్వే చేసిన ఒక సంస్థ పంపిన ప్రశ్నాపత్రంలో "....మీ సంసార జీవితం ఎలా వుంది?" అన్న ప్రశ్నకు తొంభైశాతం గృహిణులు 'సంతృప్తికరంగా' అని సమాధానం ఇచ్చినా, "మీ భర్తలో మీకు నచ్చని గుణం ఒకటి చెప్పండి...." అన్న ప్రశ్నకు- "నన్ను అర్ధం చేసుకోలేకపోవటం" అని 95 శాతం సమాధానం ఇవ్వటం గమనార్హం.