Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 29

  

         మోరీన గ్రీన్ సిద్దాంతం ప్రకారం దాంపత్య జీవితం ఇంగ్లీషు అక్షరం "W" తో పోల్చవచ్చు. మొదటి రెండు సంవత్సరాలున్న హుషారు, తరువాత నెమ్మదిగా దిగిపోతుంది. అర్ధరాత్రి పిల్లాడి ఏడుపులు, ఎవరు ఎత్తుకోవాలన్న ప్రశ్న, ఖర్చులు, చిరాకుల్తో.....ప్రేమ గీత క్రిందికి దిగిపోక ఏం చేస్తుంది? కానీ పది పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి- కొన్ని బాధ్యతలు, ఆర్ధికంగా కాస్త నిలదొక్కుకోవటంతో తిరిగి ప్రేమ పెరుగుతుంది. పిల్లలకి 18-22 వచ్చేసరికి మళ్ళీ కట్న సమస్య, పిల్లల ఎదురు జవాబులు, సరిపడని అభిప్రాయాలు....గీత మళ్ళీ జారుతుంది. అందరూ వెళ్ళిపోయాక 'ఒకరి కొకరం' అన్న ఫీలింగ్ తో తిరిగి ఆరోహణ ప్రారంభం అవుతుంది.
   
    అయితే, ప్రతి సత్యానికి కొన్ని మినహాయింపులుంటాయి. చాలామంది దంపతుల జీవితాలు "W" అయితే, పావని సంసారం మాత్రం "I" అయింది. క్రిందకి దిగటమే తప్ప ఆరోపణ కనబడే సూచనలు లేవు.
   
    "నాన్నని చూడకపోతే నాకు బాధగా వుంటుంది. ఒకసారి చూసివద్దాం రండి" అని బ్రతిమాలితే వప్పుకున్నాడు భాస్కరరామ్మూర్తి.
   
    అంతకు ముందుసారి అతడికి యాక్సిడెంట్ అయినప్పుడు ఉత్తరం వ్రాస్తే తండ్రి ఆఘమేఘాలమీద వచ్చాడు. ఆయన వెళ్ళిపోయాక 'ఇంత చిన్న విషయానికి ఆయన్నెందుకు రమ్మన్నావ్' అని అతను తిట్టాడు. ఆమె తలవంచుకుని సమాధానం చెప్పలేదు. "నేను చాలా భయస్తుడిననీ, కంగారుపడతాననీ మీ ఇంటివాళ్ళకి చెప్పటమే కదా నీ వుద్దేశం-"
   
    ఆమె దానికి కూడా సమాధానం చెప్పలేదు.
   
    ఆ తర్వాత కొన్ని రోజులకి అతనికి రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె తండ్రికి తెలియనివ్వలేదు. ఆస్పత్రినుంచి డిశ్చార్జయ్యి వచ్చేశాక వాసంతి అంది- "ఇంత పెద్ద యాక్సిడెంటయినా మీ మామగారు రాలేదేమిటి రామూ?"
   
    "వాళ్ళ నాన్నకి ఇది జరిగినట్టు ఉత్తరం వ్రాయలేదేమో...."
   
    "తల్లీ, తండ్రీ లేని అల్లుడు కదా.....కన్నకొడుకులా చూసుకోవద్దూ?"
   
    అదే సమయానికి పావని వంటింట్లో పని ముగించుకుని వస్తూ.....వాళ్ళ మాటలు విన్నది.
   
    "కన్న కొడుకులా చూసుకుంటే ఆస్థి పంచివ్వవలసి వస్తుందేమో?" నవ్వులు ".....లేకపోతే ఆస్పత్రి డబ్బులు కట్టవలసి వస్తుందనయినా కావచ్చు."
   
    మనిషికి రెండు నాలుక లుంటాయని ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తోంది. కేవలం చెల్లి చెప్పింది సమర్ధించటం కోసం తను అంతకుముందు చెప్పినదాన్నే కాదనేటంత ఆత్మవంచన చేసుకునేవాడా తన భర్త అని విస్తుబోయింది.
   
    తన తండ్రి..... ఒక స్త్రీ తన భార్యగా వస్తానంటే.... వద్దని చెల్లెలిగా చూసుకున్నాడు సుందరిని. ఇక్కడ తన భర్త..... ఒక స్త్రీని "చెల్లి.....చెల్లి" అంటూనే కౌగిలింతలతో, ముద్దులతో సోదర బంధాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
   
    భర్తతో పుట్టింటికి బయల్దేరింది పావని. స్టేషన్ లో కళ్ళన్నీ ఆమెమీదే తెల్లటి తెలుపు పావనిది. బొద్దుగా, ఆరోగ్యంగా వుంటుంది. ఇంకా పెళ్ళికాని అమ్మాయిలాగానే వుంటుంది. (అందులో అతిశయోక్తి కూడా ఏమీ లేదుకదా!) అందులోనూ ఆ రోజు ఆమె పచ్చటి బోర్డరున్న చీరె కట్టుకుంది. ఆ బోర్డరూ, శరీరమూ పోటీపడుతున్నాయి.
   
    త్రీ టైర్ కంపార్ట్ మెంట్లో భార్యాభర్తలిద్దరూ కూర్చునున్నారు.
   
    ట్రైన్ ఇంకొద్దిసేపట్లో కదలబోతూ వుండగా ఒక జంట పిల్లవాడితో ఆ కంపార్ట్ మెంటెక్కింది. పిల్లవాడికి ఒకటి, ఒకటిన్నర సంవత్సరాల వయసుండవచ్చు. ఆవిడ మళ్ళీ నిండు గర్భిణి. లావుగా, నల్లగా వుంది. భర్త ఆ పిల్లవాడిని సముదాయించలేక సతమతమవుతున్నాడు. "ఏమిటా పాలు పట్టటం? అదికూడా చేతకాదు?" అంటూంది. మొత్తం కంపార్ట్ మెంటంతా వాళ్ళవైపే చూస్తున్నారు. అందరి ముందూనే అలా అంటే ఇక ఆ ఇంట్లో అతని పరిస్థితి ఎలా వుంటుందో కదా అనుకుంది పావని. అలా అనుకుంటే అతనిమీద జాలితోపాటు నవ్వుకూడా వచ్చింది.
   
    వాళ్ళు వచ్చి ఎదుటి సీట్లో సెటిలయ్యారు. పాలసీసా పిల్లాడి నోటిలోంచి తీసి సంచిలో పెట్టబోతూ అతను తలెత్తాడు.

    అతన్ని చూసి పావని స్టన్నయ్యింది.
   
    అతను సుదర్శనం!
   
    అదే సమయానికి అతను కూడా ఆమెను చూశాడు.
   
    అయితే అతనామెని గుర్తుపట్టటానికి కొద్దిసమయం తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతడిది "అలౌకికమైన" ప్రేమయినా కేవలం ఒకే ఒకసారి తొలిచూపే కదా! అందువలన మర్చిపోయాడు. అదీగాక సంసారం ఝంఝాటము అతడి నెత్తిమీద జుట్టుని అనతికాలంలోనే తెల్లబర్చటమేగాక, ప్రేమ మైకపు నెత్తిమీద గట్టిగా మొట్టి బట్టతలని చేసింది.
   
    ఆమెని గుర్తుపట్టాక మాత్రం అతనలాగే కళ్ళప్పగించి ఆమెవైపు చూడసాగాడు. అది గమనించిన భార్య "మీరిలా వచ్చి కూర్చోండి....." అని గదమాయించి, తనెళ్ళి అతడి సీట్లో కూర్చుంది. పావనికి నవ్వు వస్తోంది. అయితే అది అతని గురించి కాదు..... తన గురించి!

    ఒకప్పుడు ఎంతో  అద్భుతంగా కనబడిన అనుభవాలే, కాస్త వయసొచ్చాక, తల్చుకుంటే నవ్వొచ్చేవిగా తోడవచ్చు. "అక్షరమైత్రి" పేరు తల్చుకుంటేనే ఆమెకిప్పుడు నవ్వొస్తూంది. ఇప్పుడితన్ని చూస్తే శైలజ ఏ విధంగా ఆట పట్టిస్తుంది? అసలే అల్లరిపిల్ల! "నా హృదయవీణపై ప్రేమతంత్రుల్ని మ్రోగించి, నన్ను భగ్న ప్రేమికుడ్ని చేసి వెళ్ళిపోయిన సుందరీ..... నీ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ....జీవితాంతం గడపదలచుకున్న నీ ప్రేమికుడు" అని తనకిముందు ఉత్తరం వ్రాసిన సుదర్శనం, ఆ తర్వాత శైలజని ప్రేమించి, ఇప్పుడు ప్రస్తుతం యీ విధంగా ఇక్కడ తెలాడంటే.....
   
    మనుష్యులకి ప్రేమంటే ఎంత తేలికైపోయిందో.....
   
    ఆలోచనల్లో వుండి ట్రైన్ కదలటం ఆమె గమనించలేదు.
   
    కొంచెం సేపయ్యాక ఆమె టాయిలెట్ కి వెళ్ళింది. బయటకొస్తూంటే తలుపు దగ్గర అతను నిలబడున్నాడు. అదోరకమైన సెల్ఫ్ పిటీతో "నన్ను గుర్తుపట్టారా?" అన్నాడు. అతనా విధంగా అక్కడ నిలబడుంటాడని వూహించని పావని తత్తరపాటుతో తలూపింది.
   
    ఆమె అతన్ని తప్పుకుని వెళ్ళబోతూంటే "శైలజగారు ఎలా వున్నారు?" అనడిగాడు.
   
    "బాగానే వుంది" క్లుప్తంగా అని రాబోతూ చప్పున ఆగి పోయింది.
   
    ఎప్పుడొచ్చాడో తెలీదుగానీ, భాస్కరరామ్మూర్తి అక్కడ కొచ్చి నిలబడి వాళ్ళనే చూస్తున్నాడు.
   
                             *    *    *
   
    "ఎవడే వాడు?" గదిలోకి పిలిచి అతనడిగిన మొదటి ప్రశ్న.
   
    "నాకు తెలీదు" ఆమె చెంప చెళ్ళుమంది. మీ యిద్దరూ ఒకర్నొకరు చూసుకోవటం, నవ్వుకోవటం నువ్వు వెళ్ళగానే వాడు బయల్దేరడం గమనించలేదనుకున్నావా? చెప్పవే..... ఎవడు వాడు?"
   
    ఆమె ఏడవసాగింది. అతనొదిలిపెట్టలేదు. చెయ్యి మెలిపెట్టి చెప్పమని బలవంతం చేశాడు. ఆమె వెక్కిళ్ళమధ్య జరిగిందంతా చెప్పింది. తన తప్పేమీ లేదని, కేవలం రైల్లో చూసి ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉత్తరం వ్రాసినట్లు వప్పుకుంది. శైలజా అతనూ ప్రేమించుకోవటం.....శైలజ అతన్ని ఆట పట్టించటం కూడా చెప్పింది.
   
    వింటున్నంతసేపూ అతడి మొహం కఠినంగా మారింది. తనని చంపేస్తాడేమో అనుకుంది. అయితే అతను మరేమీ మాట్లాడలేదు. గదిలోనుంచి వెళ్ళిపోయాడు. పుట్టింటికొచ్చానన్న సంతోషం ఏమీ మిగలలేదు.
   
    పావని వచ్చిందని తెలిసి శైలజ వచ్చింది. ఆమెతో మాట్లాడటం కాస్త ఓదార్పు!
   
    పావని తండ్రికి వృద్దాప్యం ముంచుకొచ్చేస్తూంది. ఇంకా ఇద్దరి ఆడపిల్లల పెళ్ళి చేయాలన్న సమస్య మొహంలో స్పష్టంగా కనిపిస్తూంది. "ఎలా వున్నావమ్మా?" కూతుర్ని అడిగాడు.
   
    "బాగానే వున్నాన్నాన్నా" అంది.
   
    "అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా?"
   
    "బాగానే చూసుకుంటున్నాడు నాన్నా....."
   
    ఆయన కూతురివైపు చూశాడు. ఆమె తల దించుకుంది. ఆమె పరిస్థితి ఆయనకర్ధమైంది. ఆయన కర్ధమైందని ఆమె కర్ధమైంది. కొన్ని భావాలు చెప్పటానికి మాటలవసరంలేదు. ఇద్దరూ నిస్సహాయులే. తిరిగొచ్చేస్తూంటే శైలజ కూడా స్టేషన్ కొచ్చింది. భాస్కరరామ్మూర్తి ఏవో పుస్తకాలు కొనుక్కోవటానికెళ్ళాడు. ట్రైనింకా రాలేదు.
   
    చెపుదామా.. వద్దా అన్న సందిగ్ధంలో కాస్త తటపటాయిస్తున్నట్లు శైలజ "....మీ ఆయన గమ్మత్తు మనిషిలా వున్నాడే!"
   
    పావని విస్మయమూ, భయమూ కలిపిన స్వరంతో "ఏమయింది?" అనడిగింది.
   
    "ఏమీ కాదులే....."
   
    "చెప్పకపోతే నా మీద ఒట్టే...."

 Previous Page Next Page