జనం చుట్టూ మూగారు. "ఎందుకింత తొందర? రెడ్ లైట్ వెలుగుతున్నా లెక్కచెయ్యరు. డ్రైవరు సమయానికి బ్రేక్ వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే డైరెక్టుగా స్వర్గానికి చేరేవాడు."
అతడికా మాటలు వినిపించడంలేదు. "నేను జ్యోతిష్యులకే దేవుడి లాంటివాడిని" అన్న పరమహంస మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూండగా అతడికి స్పృహ తప్పింది.
2
భాస్కరరామ్మూర్తికి స్పృహ వచ్చేసరికి మరో అరగంట పట్టింది.
చిరిగిన బట్టలతో, మోచేతిమీద గాయంతో వస్తున్న భర్తని చూసి పావని దిగులుగా "ఏమైందండీ?" అని అడిగింది.
అప్పటికి వివాహం జరిగి వారం రోజులు కూడా కాలేదు.
అతడికి మాత్రం ఆమె తన పాలిత శనిలా కనబడింది. లక్షలు ఆశించి, భవిష్యత్తులో లక్షాధికారి నవుతానని ఊహించి, కాణీ కట్నం లేకుండా చేసుకుంటే ఇప్పుడు జరిగిందేమిటి?
రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు. ఇంకెవర్ని చేసుకున్నా కట్నమైనా వచ్చి వుండేది. తను మోసపోయాడు. అందరూ తనని చూసి నవ్వుతున్నారు. అదిగో! తన భార్యే నవ్వుతుంది..... పైగా, 'ఏమైందండీ" అని మరీ అడుగుతోంది.
'రా....క్ష....సీ......' అంటూ దగ్గరకొచ్చిన పావనిని బలంగా కొట్టాడు. చెంపమీద పడిన ఆ దెబ్బకి పావని క్రిందకి తూలిపోయింది.
భర్త తనని అలా ఎందుకు కొట్టాడో ఆమెకు అర్ధంకాలేదు. ఆమె బీద ఇంట్లో ఎవరూ ఆమెని పల్లెత్తుమాట అనలేదు. అలాంటి మమతానురాగాలున్న ఇంట్లోంచి వచ్చిన అమ్మాయి, అకారణంగా భర్త కొట్టటంతో నిశ్చేష్టురాలైంది.
"కాస్త ఉప్పు తీసుకొచ్చి నా చుట్టూ తిప్పి పొయ్యిలో పడెయ్యి" అన్నాడు కసురుకుంటున్నట్టు- ఆమె అలాగే చేసింది. అతడు వెళ్ళి పడుకున్నాడు.
అర్దరాత్రి దాటింది. ఆమె అలాగే మోకాళ్ళమీద తల పెట్టుకుని కూర్చుంది. ఆమె కెందుకో ఇది అపశ్రుతిలా తోచింది. కాణీ కట్నం లేకుండా రామ్మూర్తి తనను చేసుకుంటానని ముందుకొచ్చినప్పుడు పొంగిపోయింది- కానీ మొదటిరోజే....మొదటి రాత్రే....
"అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు?" అడిగింది పావని. గదిలో అగరొత్తుల పరిమళం గుప్పుమంటోంది.
"ఇంట్లో అందరూ 'మూర్తీ' అని పిలిచేవారు. ఆఫీసులో 'భాస్కర్' అంటారు...."
"అయితే నేను 'రామూ' అని పిలుస్తాను. ఆ పిలుపు నా ఒక్క దానికే పరిమితం కావాలి సరేనా?"
అతడి ముఖం మ్లానమైంది. "వద్దు! నాకు ఇష్టం వుండదు- మా చెల్లి ఒక్కతే అలా పిలుస్తుంది- మాట ఇచ్చాను."
ఆమె అర్ధంకాక "మీకు చెల్లెళ్ళున్నట్లు నాకు తెలీదే!" అంది.
"చెల్లెలంటే స్వంత చెల్లి కాదు. చిన్నప్పటినుంచి మా పక్క ఇంట్లో వుంటారు. నా దగ్గర బాగా అలవాటు."
"పెళ్ళికి వచ్చినట్లు లేదు?"
"తగిన సౌకర్యం లేక ఇబ్బంది పడతారని తీసుకురాలేదు" అన్నాడతను. మా అమ్మ నర్సు కదా....! ఎప్పుడూ డ్యూటీలకు వెళ్ళేది. నేను ఎక్కువగా వాళ్ళింట్లోనే వుండేవాడిని. వాళ్ళమ్మ నాకు అన్నీ చేసిపెడుతూ వుండేది. ఇప్పుడావిడ కూడా లేదు. వాళ్ళ ఋణం నేనెప్పటికీ తీర్చుకోలేను...." అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకో ఆమెకి తెలీలేదు. దిండులో అలాగే తల వంచుకొని వుండిపోయాడు. ఆమెకి భయంవేసి "ఏమండీ" అంది.
"ఊ...."
"ఏమైందీ?"
"ఏం లేదు" అంటూ అతడు తలెత్తి "పావనీ.....నిన్నో మాట అడగనా?" అన్నాడు.
పావని గుండెల్లో రాయి పడినట్లు అయింది. పాత జ్ఞాపకాలు గురించీ, ప్రేమల గురించీ అడిగితే ఏం చెప్పాలి? అనుకుంది. రైల్లో తనవైపు చూసి ఆ తర్వాత పత్రికలో తనకి ప్రేమలేఖ రాసిన సుదర్శనం గురించి అడిగితే ఏం చెప్పాలి? చెప్పకపోతే....ఒట్టెయ్యమని అడిగితే....
"అడగండి" అంది ఎలాగో గుండె దిటవుపర్చుకుని.
"అనుకోకుండా నీకు లక్షల ఆస్థి వచ్చిందనుకో.....ఏం చేస్తావు?"
ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, "నాకు ఆస్థి ఏమిటండీ! లాటరీ కూడా అలవాటు లేదే" అంది నవ్వుతూ.
"వచ్చిందనుకో... అందులో సగం చెల్లికి వ్రాసిస్తావా?"
"సగమేమిటి- మొత్తం ఇచ్చేస్తాను సరేనా?"
"అన్నమాట నిలబెట్టుకోవాలి సుమా?"
"ఇప్పుడే వ్రాసివ్వనా?" నవ్వుతూ అంది.
"మనింటికి వెళ్ళాక వ్రాయించుకుంటాలే...." నవ్వకుండా అన్నాడు.
ఆమె బదులు చెప్పలేదు.
"నువ్వు చాలా మంచిదానివి అందుకే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. చెల్లికి నచ్చుతావో లేదోనని భయపడ్డాను. కానీ ఫోటో చూపించగానే ఓ.కే. అంది."
ఆమె తలవంచుకు కూర్చుంది. అతడు తన గురించి అడగలేదు. అతని స్వవిషయాలు చెప్పలేదు. ఈ అరగంటలోనూ దాదాపు పదిసార్లు 'చెల్లి' అని వుంటాడు. అతడిని అంత ప్రభావితం చేసిన ఆ అమ్మాయిని చూడాలనుకుంది.
"ఏం చదువుతున్నారు ఆవిడ?"
"టెన్త్ చదివి మానేసింది."
ఆమె అతనివైపు ఆశ్చర్యంగా చూసింది. తను ఎక్కువ చదువుకోలేదన్న న్యూనతా భావం ఆమెలో వుండేది. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది.
అతడామెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె సిగ్గుతో మొగ్గయి పోయి, అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అతడు మెల్లగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమె నెమ్మదిగా సిగ్గు వదిలేసి అతనితో సహకరిస్తోంది.
అతని ఆక్రమణలో కోరికే తప్ప ఆవేశంలేదు. రెండు నిముషాలు ప్రయత్నించి, ప్రక్కకు వాలిపోయి, "నేనూ.....నేనూ...." అన్నాడు.
ఆమెకి అర్ధంకాలేదు. అర్ధం చేసుకునేటంత వయసుగానీ, అనుభవంగానీ, ప్రాపంచిక జ్ఞానంగానీ లేవు.
* * *
స్టేషన్ నుంచి ఇంట్లోకి రాగానే, "పద వెళ్ళి చెల్లిని ఇంటికి పిల్చుకొద్దాం. భోజనానికి నువ్వే పిలవాలి" అంటూ ఎలా మాట్లాడాలో పదేపదే హెచ్చరించాడు.
రెండిళ్ళ అవతలే వాసంతి ఇల్లు. రెండే రెండు ఇరుకుగదులు......సామాన్లన్నీ చిందరవందరగా పడేసి వున్నాయి. శుభ్రత లోపించింది. 'వాళ్ళని పెళ్ళికి తీసుకొస్తే ఇబ్బందిపడతారని తీసుకురాలేదు' అని మొదటిరాత్రి భర్త అన్నప్పుడు, బాగా డబ్బున్న వాళ్ళేమో అనుకుంది. ఇల్లు చూస్తే యిలా వుంది.
ఆమె ఆలోచనలలో ఉండగానే లోపల్నుంచి వాసంతి వచ్చింది. పావనీ ఆమెను చూసి షాకైంది. టెన్తు క్లాసంటే చిన్న పిల్ల అనుకుంది. కానీ ఆమె వయసు దాదాపు పాతికదాకా వుంటుంది. నల్లగా, పొట్టిగా వుంది. ముఖం మీద అక్కడక్కడా స్ఫోటకం మచ్చలున్నాయి.
పావని ఆవిడకు నమస్కారం పెట్టింది. దాన్ని గుర్తించకుండానే వాసంతి 'అన్నయ్యా' అంటూ వెళ్ళి రామ్మూర్తి చేతుల్లో వాలిపోయింది. పావని నిశ్చేష్టురాలై చూస్తోంది. అచ్చం సినిమాల్లో సీన్లా వుందది.
కొంచెంసేపటికి వాళ్ళు మామూలు మనుష్యులయ్యారు.
వాసంతి పావని వైపు ఎగాదిగా పరీక్షించి చూసి "నీ పెళ్ళాం బాగానే వుందిరా రామూ" అంది.
'రామూ...." అన్న పిలుపు ఆమె నోటివెంట వినిపించి మనసు చివుక్కుమంది. తన ముఖంలో భావాలు కనిపించకుండా, "భోజనానికి రండి ఈ రోజు మా ఇంటికి" అంది.
"ఏమిటి చికెన్ బిర్యానీ చేశావా?"
ఆమె ఎగతాళికి అంటూందని, "కాదండీ! వంకాయకూర, టమోటా పప్పు" అంది.
"అయితే రాన్లే."
పావని నిస్సహాయంగా రామ్మూర్తివైపు చూసింది. అతడు "మా ఆవిడకు బుద్దిలేదు. మరోసారి చేస్తుందిలే. నీ కోసం మంచి చీరె కొన్నాను. రావా?"
"ఏం చీరెరా? జార్జెంటా?"
"కాదు-షిఫాను."
"పద పద వస్తున్నాను" అదో జోకులా అనుకుంటూ బయల్దేరింది వాసంతి. వాళ్ళిద్దరూ ముందు నడుస్తుంటే పావని వెనక ఇల్లు చేరుకుంది.
* * *
ఆమెను వడ్డించమని చెప్పి కూర్చుని భోంచేశారు. వంటకాల మీదా, పెళ్ళిమీదా జోక్స్ వేస్తూ భోజనం ముగించారు. కొత్తగా పెళ్ళిచేసుకొని పరాయి ఇంటికి వచ్చిన అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించకుండా వెక్కిరించారు. కాపురానికి కొత్తగా వెళ్ళేటప్పుడు అమ్మాయికి తోడుగా ఎవరినైనా ఎందుకు పంపుతారో అర్ధమైంది పావనికి.