విషయం గ్రహించిన నవీన్ రోడ్డుకు అటు వైపున పొదల మాటుకు చూశాడు.
అక్కడ....చనిపోయి వున్న ప్రియాంక.
ఆమె చేతిలో టెలిస్కోప్ అమర్చిన రైఫిల్.
"థాంక్స్ వీరేష్!" తన ప్రాణం కాపాడిన అసిస్టెంట్ ను అభినందించాడు నవీన్.
దూరంగా వున్న భగత్ సింగ్ బ్లాక్ మీదినుంచి బైనాక్యులర్స్ తో ఇదంతా చూస్తూనే వున్నాడు కమాండరు. అతని ముఖం నెత్తురుగడ్డ అయింది.
విద్యార్ధి నాయకురాలు ప్రియాంక చనిపోవడంతో ఈసారికి ఆపరేషన్ ఫెయిల్ అయింది. సరే! మరల పన్నే పద్మవ్యూహం నుంచి ఈ పోలీస్ ఆఫీసర్లు ఎలా తప్పించుకుంటారో అదీ చూస్తాను!" అనుకుంటూ ఆవేశంగా తన స్థావరానికి వెళ్ళిపోయాడు కమాండరు. అతని దారి అతనికున్నది, అది రహస్యం....
కమాండరు ఉనికిని గుర్తించని పోలీస్ అధికారులు ఆత్మ విశ్వాసంతో ఠీవిగా ముందుకు నడిచారు. కొత్త పథకాలను ఆలోచిస్తూ నడిచారు.
* * *
అది మట్టి రోడ్డు. అక్కడక్కడా గుంటలు. అయినా వాహనాల రాకపోకలకు అనువుగానే వుంది. కాకపోతే దుమ్ము మాత్రం వలయాలు తిరుగుతోంది.
రోడ్డుకు ఇరువైపులా పొదలు. పెద్ద పెద్ద చెట్లు. చెట్ల మీద పక్షిగూళ్ళు.
అది అడవిలోని గూడానికి దగ్గరలోనే వున్నప్పటికీ, జన సంచారం లేని ప్రాంతం. పక్షుల కలకలారావాలు, కీచురాళ్ళ ధ్వనులు మిన్నుముడతాయి.
గుడ్ల గూబల అరుపులు, తీతువుల ఉత్తీతలు, గబ్బిలాయిల రణగొణలు......
పొద్దు వాలిపోయింది. సంధ్య చీకటులు. కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. మసక మసక దారులు. ఏ దారి ఎటు పోతుందో అందరికీ తెలియదు......
జీప్ ను నడుపుతున్న వీరేష్ హెడ్ లైట్లు వేశాడు. అదే అతను చేసిన పొరపాటు. ఆ వెలుతురే పోలీసుల ఉనికిని అడవిలో బయటపెట్టింది.
ప్రక్కనే వున్న నవీన్ ఖంగారుపడిపోయాడు. "వీరేష్! లైట్లు తీసెయ్!" దాదాపు అరచినంతగా అన్నాడు. అతనిదంతా ముందుచూపు.
ఉలిక్కిపడిన వీరేష్ వెనువెంటనే లైట్స్ ఆఫ్ చేశాడు. కాని, అప్పటికే ఆలస్యం అయిపోయింది! తమంతట తామే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారు....
లైట్లు లేకుండా జీప్ పది గజాలు వెళ్ళిందో లేదో......
ఢాం.....!
దిక్కులు పిక్కటిల్లాయి. దిశలు దద్దరిల్లాయి. మందుపాతర పేలింది.
పోలీస్ జీప్ నిలువెత్తున లేచి ధడాలున కింద పడింది.
కారు నల్లని పొగ మబ్బులు కమ్ముకున్నాయి. ఏదో విస్ఫోటకం...
ఏమి జరిగిందో తెలుసుకునే లోపే జీప్ లోని ఎస్కార్ట్ సిబ్బంది స్పృహ తప్పి పడిపోయారు. ఏదో మైకం వారి జీవనాడులను స్తంభింపజేసింది.
నవీన్ తల పగిలింది......
వీరేష్ చేయి విరిగింది......
జరుగుతున్నది చోద్యంగా చూస్తూ పొదల చాటున మాటువేసి ఉన్న టెర్రరిస్టుల మూఠా విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూ రోడ్డెక్కారు.
"వీరేష్, క్విక్! ఎస్కార్ట్ ను ఎలర్ట్ చెయ్. టేక్ పొజిషన్...." గాయంతో తలనుంచి రక్తస్రావం జరుగుతున్నా, ఆయాసంతో తడబడుతూనే ఆర్డర్ జారీచేశాడు నవీన్. ఉచ్ఛారణ తేలిపోతున్నది....
జీప్ లో ఎవరెవరున్నది, ఎవరు చనిపోయారు, క్షత్రగాత్రులెందరూ అనేది ఆ చీకటిలో టెర్రరిస్ట్ గ్యాంగుకు స్పష్టంగా తెలియదు.
నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. విప్లవ గీతాలు, వీరాలాపనలు. వీథి నాట్యాలు....
"సర్ ! ఎస్కార్ట్ అంతా స్పృహ కోల్పోయారు. పికప్ వ్యాన్ ను దూరంగా ఆపి, సిబ్బంది చెల్లా చెదురయ్యారు. టెర్రరిస్టులు సుమారు పాతిక మంది వరకు వున్నారు...." నిస్పృహలోనే నీరసంగా అన్నాడు వీరేష్.
వీరేష్ భుజం తట్టాడు నవీన్. "కొన ఊపిరి వున్నంత వరకు పోరాడదాం!" ధృఢంగా అన్నాడు. ఆత్మ విశ్వాసంతో అన్నాడు దూరానికి తేరిపార చూస్తూ అన్నాడు.
చాటు మాటుగా చుట్టూ మూగివున్న సాయుధులు ఎటాక్ రేంజిలోకి వచ్చారు.
"పోలీస్ ఆఫీసర్స్! మీలో ఏ ఒక్కరు సజీవంగా వున్నా మర్యాదగా ఆయుధాలతో సహా మాకు లొంగిపోండి. లేదా నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాం!" సాయుధుల నాయకుడు హెచ్చరించాడు.