Previous Page Next Page 
నిషా పేజి 26

    "బ్రాహ్మలమని, ఆచార సంపన్నులమని, త్రికాల సంధ్యలూ, నిత్యాగ్నిహోమాలు చేస్తామనీ అహంకారం జీర్ణించుకుపోయిన ఇంట్లో పుట్టిన పిల్ల భ్రమరాంబిక. ఆ అహంభావం ఒక పాలు ఎక్కువే ఆమె తలకు ఎక్కిందని ఈ రోజు నాకర్ధమైంది. చినబాబూ! ఇకామె మాటలుగాని, చేతలుగాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసు నుండి ఆ విషయం చెరిపివేయండి" ధర్మలింగం తిరిగి వచ్చి వికీతో అన్న మాటలివి.

    ఆయన సలహా విన్నాక వికీ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. సున్నితమైన మనసులో ఏదైనా ఒకటి నాటితే చెరపడం అంత సులభం కాదని ఈయనకు తెలియదు. ఏమైనా ఇక బాధపడను. భ్రమర అపార్ధం తొలగించేందుకైనా తను కొన్నాళ్ళపాటు ఇక్కడే వుండిపోతాడు.

    వికీ లేచి హుషారుగా కూని రాగం తీస్తూ డ్రెస్ మార్చుకోసాగాడు.   

    "ఎక్కడికో బయల్దేరుతున్నారు? మళ్ళీ గుడి దగ్గరికేనా"

    "కాదు! అలా అలా తిరిగి వస్తాను"

    "కారులో వెళ్ళండి! వాకింగ్ మాత్రం వద్దు"

    మౌనంగా తలూగించాడు వికీ.

    క్రిందికి దిగి కారులో కూర్చోబోతూ చూసేసరికి అప్పటికే రాంసింగ్ బాక్ సీటులో కూర్చొని కనిపించాడు.

    వికీ ముఖంలో అసహనం ఒక్క క్షణం కదిలి మాయమైంది. బాడీగార్డ్స్ ని తన క్షేమం కోసమే కదా ధర్మలింగం పెట్టింది అని సరిపుచ్చుకొన్నాడు.

    వికీ స్టీరింగ్ అందుకోగానే రివ్వున పరుగుతీసింది.

    ప్యాలెస్ 'గంధర్వ' నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్య నిర్మింపబడిన గెస్ట్ హౌస్ కృష్ణమహల్ వరకు తారురోడ్డు  వేయబడింది తారురోడ్డు మీద మెత్తగా దూసుకుపోతోంది నల్లటి ఫియట్ కారు.

    చుట్టూ కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు మధ్యన మొలిచిన వృక్షాలూ అల్లిబిల్లిగా అల్లుకొన్న అడవి లతలూ, చక్కటి ప్రకృతి మధ్యన ప్రకృతి సహజత్వం ఏమాత్రం దెబ్బతినకుండా కట్టబడింది ఆ బంగళా. అడుగడుగునా ముగ్ధపరిచేట్టుగా వుంటుంది పాలరాతితో కట్టబడిన ఆ బంగళా.

    చాలా రోజులుగా ఆ బంగళాని ఎవరూ వాడుకోకపోయినా పనివాళ్ళ చేత నిత్యం శుభ్రపర్చబడుతూ వుంటుంది! బంగళా చుట్టూ వున్న తోటని కళకళలాడించడంలో తోటమాలి ఏమాత్రం అశ్రద్ధ చూపడం లేదని తెలిసిపోతుంది తోటని చూడగానే.

    కారు అల్లంత దూరంలో వుండగానే చూశాడు గెస్ట్ హౌస్ వాచ్ మెన్య. కారు లోపలికి రావడానికి సిద్దంగా గేటు తెరిచి వుంచాడు.

    కారు తిన్నగా లోపలికి దూసుకువచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగింది.

    వాచ్ మెన్ కారు తలుపు తీయడానికి పరిగెత్తుకు వచ్చేలోగానే వికీ దిగాడు గెస్ట్ హౌస్, మెట్లమీద నిలబడి చుట్టూ పరిసరాలని, తోటనీ కొద్ది నిమిషాలపాటు వీక్షించిన వికీ, "ఇక్కడి నుండి కనిపించే దృశ్యం చాలా అద్భుతంగా వుంది" అన్నాడు.

    అప్పటికే తలుపు తాళం తీసివచ్చిన వాచ్ మేన్ "దొరవారి చేత నియమింపబడిన ఇద్దరు ఇంజనీర్లు అహోరాత్రులు శ్రమించి రూపకల్పన గావించిన బంగళా ఇది. అద్భుతంగా వుండక ఏమౌతుంది? లోపలికి రండి. చినబాబుగారూ చూడండి." వినయంగా ఒక్కోగది తిప్పి చూపసాగాడు.

    గోడలు పాలరాతి పలకలతో తళతళలాడిపోతున్నాయి. గది మూలలకు అపురూప కళాఖండాలనదగిన పాలరాతి, కంచువిగ్రాలు అలంకరించి వున్నాయి. అతి ఖరీదైన షాండియర్లు, గోడలకి అతివిలువైన తైలవర్ణ చిత్రాలు, బంగళా చుట్టు ప్రత్యేక శ్రద్ధతో పెంచబడిన తోట.... తండ్రి వుత్తమాభిరుచికి చక్కని నిదర్శనంగా ఓవైపు కనిపిస్తూంటే.....

    ఆయన హయాంలో గానాబజానా జరిగే హాలు, ఎందరో అతివల జీవితాలు చిదిమివేయబడిన శయ్యామందిరం. వికీలో క్రోధావేశాన్ని రెచ్చగొట్టాయి. స్త్రీలపట్ల ఆయన కాముకతకు దర్పణం పడుతున్నట్టుగా శయనమందిరంలోనూ, సంగీత నృత్యాలు సలిపే హాలులోనూ, నగ్న, అర్ధనగ్న చిత్రాలు గోడల్ని అలంకరించి వున్నాయి. ఆయన గొప్ప సంగీత ప్రియుడని చెప్పడానికన్నట్టు వివిధ వాయిద్యాలు చక్కగా ముసుగులు కప్పుకొని వున్నాయి.

    ఆ చిత్రాల్ని తీసి నేలకు కొట్టి, ఆ వాయిద్యాల్ని ధ్వంసం చేసి, శయ్యామందిరంలో హంసతూలికా తల్పాన్ని చింపి ప్రోగులుపెట్టి, అసలు ఈగెస్ట్ హౌస్ నే డైనమేట్లు పెట్టి ప్రేలిస్తే తప్ప తండ్రి రసిక చరిత్రకు తెరపడి తనని నీడలా వెన్నాడ్డం మానేస్తుందేమో అనిపించిందొక్క క్షణం వికీకి.

    తన పిచ్చిగాని అవి నాశనం చేసినంతమాత్రాన భ్రమర తనని పవిత్రుడిగా ఒప్పుకొంటుందా? తండ్రి తాతల హీనచరిత్ర నీడై తనని వెంటాడ్డం మానేస్తుందా?

    గెస్ట్ హౌస్ లో ఎక్కువసేపు ఉండలేనట్టుగా బయటికి వచ్చేశాడు వికీ.

    తోటమాలి చక్కగా తయారుచేసిన పూలగుత్తిని వికీ చేతికందించి, నమస్కరించాడు వినయంగా.

    "థాంక్యూ" స్నిగ్ధంగా నవ్వాడు వికీ. పూలగుత్తిలోని పువ్వుల్ని గాఢంగా వాసన చూసి,  "ఓ! లవ్లీ!" అన్నాడు మురిసిపోతున్నట్టుగా.

    కాస్సేపు తోటలో తిరిగి వచ్చి , గార్డెన్ చెయిర్ లో కాస్సేపు విశ్రాంతి తీసుకొని తిరిగి కారెక్కాడు వికీ.

    అప్పటికి చీకట్లు బాగా ముసిరాయి

                                                                      *    *    *

 Previous Page Next Page