Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 27


    తిన్నగా సంగీత ఇంటికి చేరుకున్నాడతను.
    సంగీత వాళ్ళింటి ముందున్న గార్డెన్ లో కూర్చుని "మోసగించిన ప్రియుళ్ళను హతమార్చటం ఎలా?" అనే పుస్తకం చదువుతోంది.
    అతనిని చూడగానే కోపంగా లేచి నిలబడిందామె.
    "సంగీతా!" కారు దిగుతూ ఆవేదన నిండిన కంఠంతో అరిచాడతను.
    ఆమె కోపంగా తన గదిలోకి పరుగెత్తసాగింది.
    చిరంజీవి ఆమె వెంటపడ్డాడు.
    ఇద్దరూ హాల్లో ఆగిపోయారు.
    వాళ్ళ ఆల్సేషన్ కుక్క వచ్చి ఇద్దరికీ మధ్యలో నిలబడింది.
    "ఏమిటి సిస్టర్! నేనిక్కడుండగానే మా యజమానురాలి వెంబడి పడుతున్నావ్? ఇంత హై గ్రేడ్ కుక్క ఉన్నా లేనట్లే అనుకుంటున్నావా" అన్నట్లు చూసిందతనివేపు.
    "ఎందుకొచ్చాడో అడగవే జూలీ" అంది సంగీత.
    జూలీ అతనివేపు చూసి ఓసారి మొరిగింది దాని భాషలోకి అనువాదం చేసి.
    "జరిగిందంతా నీకు చెప్పాలని వచ్చాను సంగీతా"
    "ఇంకా అతగాడి మాటలు వినాల్సిన అవసరం నాకు లేదని చెప్పవే జూలీ"
    జూలీ మళ్ళీ అనువాదం చేసింది.
    "అదికాదు సంగీతా! అదంతా నాకేమీ తెలీని పరిస్థితిలో జరిగిపోయింది. నాకింకా నమ్మకం కలగటం లేదు అసలలా జరిగిందంటే! ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేనింతకు ముందెప్పుడూ చూడను కూడా చూడలేదు. అంతా తాగుడు మైకంలో జరిగింది."
    "అంతా అబద్ధం! అసలు మీ బుద్ధే అంత! తాగేసి రోజుకో అమ్మాయితో గడపడం మీకు మామూలేనని బోలెడు మంది చెప్పారు."
    "అది గత చిరిత్ర సంగీతా! నిన్ను కలుసుకోకముందు హిస్టరీ! నిన్ను ఆ రోజు స్టేజిమీద చూసిన దగ్గర్నుంచి నేను మారిపోయాను. మంచి బాలుడు స్కీమ్ లోకొచ్చేశాను. ఆ రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి నిన్ను పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాను. అప్పుడే కాదు! ఇప్పటికీ అంతే! నిన్నింకా అదివరకులాగానే ఆరాధిస్తున్నాను. మనిద్దరం పెళ్ళి చేసుకుని తీరాల్సిందే సంగీతా! ఈ విషయంలో నేను రాజీ పడే ప్రసక్తే లేదు!" ఆవేశంగా అన్నాడతను.
    "ఇదంతా నేను నమ్మనని చెప్పవే జూలీ."
    "అయ్యో మన మధ్యలో ఈ జూలీ ఏమిటి సంగీతా? ఐ లవ్ యూ! యూ లవ్ మీ! మధ్యలో ఆల్సేషన్ అనువాదాలెందుకు? నాకు అయిదు నిమిషాలు నీతో డైరెక్టుగా మాట్లాడే అవకాశం ఇవ్వు! అంతవరకూ ఈ ట్రాన్స్ లేటర్ ని బయట నిలబడమను. ఒకవేళ ఆ అయిదు నిమిషాల తర్వాత కూడా నిన్ను నేను కన్విన్స్ చేయకపోతే అప్పుడే నన్ను అనువాదకుడితో బయటకు పంపించెయ్."
    సంగీత కుక్కవేపు చూసింది.
    "జూలీ! నువ్వు కాసేపు బయట కూర్చో!" చెప్పిందామె.
    జూలీ ఓసారి చిరంజీవి వేపు అనుమానంగా చూసి బయటకు నడిచింది.
    "రండి!" అంది సంగీత తనగదిలోకి నడుస్తూ.
    ఆమెను అనుసరించాడతను.
    "అసలు జరిగిందేమిటంటే, ఆ రోజు సాయంత్రం మరీ ఎక్కువ తాగాను. ఆ మత్తులో ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. అదెవత్తో డాన్స్ చేసే పిల్లను పట్టుకుని బలవంతంగా పెళ్ళి చేసుకోమని అడిగానట! అది ఒప్పుకుందట! వెంటనే ఏదో గుళ్ళోకి తీసుకెళ్ళి తాళి కట్టేశానట! ఆ రాత్రి ఇద్దరం అదే హోటల్లో గది తీసుకుని 'శోభనం' చేశామంట. ప్రొద్దున అంటే మధ్యాహ్నానికి గానీ నాకు స్పృహ రాలేదు. అప్పుడు నా పక్కలో ఉన్న అమ్మాయిని దబాయిస్తే ఈ కథంతా చెప్పింది! నువ్వే చెప్పు సంగీతా! ఇందులో నా తప్పేమిటి? కేవలం నాకున్న ఈ పాడు తాగుడు అలవాటు మూలంగా జరిగిందిది" ధీనంగా అన్నాడతను.
    "అయితే ఇప్పుడేమంటావ్?"
    "ఆ పిల్లకు విడాకులిచ్చి నిన్నే పెళ్ళి చేసుకుంటాను."
    "నిజంగా నీకు నా మీద ప్రేమ వుందా?"
    "అదేమిటి సంగీతా అలా మాట్లాడతావ్. ప్రేమ లేకపోతే ఇంతగా ఎందుకు ప్రాధేయపడతాను నిన్ను? నువ్వు దక్కకపోతే నేను బ్రతకలేను సంగీతా!"
    "ప్రేమలో పడ్డ కొత్తలో అందరికీ అలానే అనిపిస్తుంది."
    "అందరి సంగతి వేరు. నా సంగతి వేరు సంగీతా! నాకెంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది! అయినా గానీ నేనెవరి ప్రేమలోనూ పడలేదు!"
    హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది.
    చిరంజీవి నిశ్చేష్టుడయ్యాడు.
    ఆమె దగ్గరకు నడిచి ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు.
    "సంగీతా! ఎందుకేడుస్తున్నావ్?"
    "ఆ రోజు గుడి దగ్గర ఎదురుచూసి చూసి మీరు రాకపోయేసరికి ఎంత విరక్తి చెందానో మీకు తెలీదు. జీవితం ముగించేద్దామని స్లీపింగ్ పిల్స్ కూడా తెచ్చుకున్నాను. కానీ వాటిని మా అమ్మ చూసింది. నేను చావదల్చుకుంటే ముందు తనకా పిల్స్ ఇచ్చి తరువాత నన్ను వేసుకోమంది. దాంతో నేనా ఆలోచన విరమించుకోక తప్పలేదు. ఇందాక మీరూ ఆ పిల్లా పెళ్ళి దుస్తుల్లో అదే గుళ్ళో కూర్చోవటం, పూజలు చేయటం చూసేసరికి నాకున్న విరక్తి అంతాపోయి అది మీ మీద ప్రతీకారవాంఛగా మారింది. వెంటనే పుస్తకాల షాపుకెళ్ళి మోసగించిన 'ప్రియుళ్లను హతమార్చటం ఎలా?' అనే పుస్తకం కొన్నాను. మీరొచ్చేముందే అది పూర్తిగా చదివి సూచనల ప్రకారం మిమ్మల్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడెలా?"
    "ఈ ఒక్కసారికి ఆ నిర్ణయం మళ్ళీ మార్చుకో సంగీతా! నేను నిన్ను కావాలని మోసగించిన ప్రియుడిని కాదు కాబట్టి ఆ పుస్తకం మనకి సబంధించింది కాదు! కేవలం విధి వక్రించిన దురదృష్టకర అభాగ్య అనాధ అమరశోకతప్త విచలిత విరహ విభాగినుల రమ్య దివ్య మూర్తుల అమర ప్రేమికుడిని నేను"
    ఆమె భయంగా చూసిందతనివేపు.
    "నువ్వన్నదానికి అర్థం ఏమిటి? నన్ను పెళ్ళిచేసుకుందామన్న నీ ఆలోచనలో మార్పు వచ్చినట్లు ఆ మాటల అర్థం కాదు కదా?"
    "ఊ! మార్పా! మార్పనేది ఇంక రాదు సంగీతా! జీవిత జీవన స్రవంతిలో వినువిధుల విరహగరువములో."
    "ఇంకవద్దు చిరంజీవి! నాకర్థం కాని భాష మాట్లాడకు! మామూలుగా మాట్లాడు."
    "సంగీతా! నీ పెదాల మీద ముద్దు పెట్టుకుని ప్రామిస్ చేస్తున్నాను. మనిద్దరం ఒకటయ్యేరోజు ఎంతో దూరం లేదు. ఆ శారద గొడవ వీలయినంత త్వరలో వదిలించుకుందాం! ఇవాళే లాయర్లతో మాట్లాడతాను. ఒట్టు" అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడతను.
    "మరీ ఇంతసేపు ప్రామిస్ లు చేయాలేమిటి?" చిరుకోపంతో అతనిని వెనక్కి తోసేస్తూ అందామె అరగంట తర్వాత.
    "నామీద నీకు నమ్మకం కలిగించటానికి ఎక్కువసేపు ప్రామిస్ చేశాను. ఇప్పటికయినా నా మీద నమ్మకం కలిగిందా సంగీతా? ఒకవేళ కలగలేదంటే మళ్ళీ ప్రామిస్ చేస్తాను."
    "వద్దు వద్దు! పూర్తిగా నమ్మకం కుదిరింది!"
    "ప్రామిస్?"
    "ప్రామిస్!"

 Previous Page Next Page