"ప్రామిస్ అలా దూరంగా చెప్పకూడదు."
"ఊహు! నేను దగ్గరకు రాను."
"రాకపోతే నేనే వస్తాను"
"రండి! చూద్దాం."
ఇద్దరూ గదంతా కొద్దిసేపు పరుగెత్తాక బాత్ రూమ్ తలుపు దగ్గర దొరికిపోయిందామె. ముద్దు పెట్టి రెండు నిమిషాలయినా కాకముందే "ఇంక చాలు! దూరంగా జరగండి" అన్న గొంతు వినిపించేసరికి ఇద్దరూ అదిరిపడి దూరంగా జరిగారు.
ఎదురుగ్గా గుమ్మం మధ్యలో నిలబడి వుంది శారద.
స్టన్ అయిపోయారిద్దరూ.
"ఎందుకొచ్చావిక్కడికి?" మండిపడుతూ అన్నాడు చిరంజీవి.
"భారత స్త్రీకి భర్త చెంతనే కదా స్వర్గసీమ. అదీగాక ఇంట్లో వంట చేయడానికి సరుకులు తేమని లిస్ట్ రాసిచ్చాను కదా! తేకుండా మీరిలా ముసురు ముఖాలతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ఎలా? నేనెంత పతివ్రతనయినా తిండి లేకుండా భర్త స్మరణ చేసుకుంటూ రోజులు గడపలేను కదా! అదీగాకుండా మీ భోజనానికి వేళయింది."
సంగీత కోపంతో మండిపడింది.
"ఏయ్ నన్నింకోసారి ముసురుముఖం అన్నావంటే నీ ముఖం చట్నీ చేస్తాను! ముసురుముఖం నీది! అందుకే తాగిన మైకంలో నిన్ను పెళ్ళి చేసుకున్నాడు చిరంజీవి. స్పృహలో ఉన్నోడెవడూ నీ ముఖానికి నూట పధ్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడు" ఆవేశంగా అందామె.
"పో పోవే హైద్రాబాద్ రోడ్లలాగా ముఖం నువ్వూనూ."
సంగీతకు ఆ మాటకు రోషం పొడుచుకొచ్చింది.
"ఏమిటి? నా ముఖం హైద్రాబాద్ రోడ్డు అంటావా? ఎంతకావరమే నీకు? నా ముఖం హైద్రాబాద్ రోడ్డు అయితే నీ ముఖం హుస్సేన్ సాగర్ లోని దరిద్రపు నీళ్ళంత కలుషితమే!"
"అలాగా! నీ ముఖం కంట్రోల్లేని హైద్రాబాద్ ట్రాఫిక్ లాంటిదే."
"నీ ముఖం అసెంబ్లీలో గందరగోళం లాంటిదే."
"నీ ముఖం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే భాషే"
"నీ ముఖం పోలీస్ డిపార్ట్ మెంటే."
"నీముఖం జంట నగరాల మున్సిపల్ కార్పొరేషన్"
"నీముఖం నాలుగొందలేళ్ల సుందర నగరమే"
నీముఖం ఆంధ్రప్రదేశ్..."
"ఆపండి!" బిగ్గరగా అరిచాడు చిరంజీవి.
ఇద్దరూ ఆపేశారు.
"ముందు దాన్ని నా యింట్లో నుంచి పొమ్మనండి" అంది సంగీత.
"ముందు మా ఆయన్ని మీ యింటినుంచి బయటకు పంపవే"
"మొగుడి కోసం పరాయి ఆడదానింటికెళ్ళే ఆడదాన్ని నిన్నొక్కర్తెనే చూశాను."
"పరాయి ఆడదాని మొగుడితో కులికేదాన్ని నిన్నొకర్తేనే చూశాను"
"శారదా!" మళ్ళీ గావుకేక పెట్టాడు చిరంజీవి.
"అలా గావుకేక వేయకండి. కేకలు వేయటం బ్లడ్ ప్రెజర్ కి మంచిదికాదని నేను ఇంటర్ చదివేప్పుడు టెస్ట్ బుక్ లో చదివాను."
"నువ్వు మర్యాదగా ఇంటికెళ్తావా లేదా?"
"మీరు రాందే వెళ్ళనుగాక వెళ్ళను"
"వెళ్ళవా?"
"అయ్యో రామ! మీకు చెవుడు కూడా వున్నట్లుంది. డాక్టర్ కి చూపించుకుందురుగాని పదండి."
ఆమె చెంప ఛెళ్ళుమంది. మరుక్షణం అతని చెంప కూడా ఛెళ్ళుమంది. అతనితోపాటు సంగీత కూడా నిశ్చేష్టురాలయింది.
హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది శారద.
"అయ్యో! కోపంలో ఎంత పని చేశాను? నన్ను కొట్టిన భర్త మీదే చేయి చేసుకున్నాను భగవంతుడా! నేనే పతివ్రతనయితే నా చేతికి పక్షవాతం వచ్చేలా చేయి స్వామీ" అంటూ చేయి పైకెత్తి చేతి వంకే చూసింది.
చేతికి ఏమీ కాలేదు. "భగవంతుడా! ఏమిటి నాకీ పరీక్ష? నా చేతిని ఇప్పుడే కాల్చుకుని నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అగ్గిపెట్టె తెప్పించండి."
చిరంజీవికి వళ్ళంతా కోపంతో రగిలిపోతోంది.
సంగీతకు కూడా లోలోపల భయం కలిగింది ఆమె చిరంజీవిని చెంపదెబ్బ కొట్టిన దృశ్యం చూసేసరికి.
"చిరంజీవీ! ఇక్కడది న్యూసెన్స్ చేయకుండా తీసుకెళ్ళు" అంది ఆమె.
అప్పుడే ఆ గొడవంతా విని సంగీత తల్లి హడావిడిగా పైకొచ్చింది.
ఆమెను చూస్తూనే ఆనందంగా పలుకరించింది శారద "హలో! మీరు మినిస్టర్ గారి ముం... అహహ! కొంచెం గౌరవప్రదంగా మాట్లాడాలి కదూ! మీరు మినిస్టర్ గారి బాడీగార్డ్. అంటే ఆయన బాడీని కాపాడేవాళ్ళన్నమాట. మిమ్మల్ని కల్సుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. నా పేరు శారద. నేను చిరంజీవిగారి హోమ్ గార్డ్ ని. హోమ్ గార్డ్ అంటే తెలుసు కదా! ఆయన ఇంటికి కాపాడే ఇల్లాలిని."
"నా యింటికెందుకొచ్చావ్ నువ్వు? గెటౌట్"
"అబ్బో! ఇంగ్లీషు ఎప్పుడు నేర్చుకున్నావ్? 'ముప్పయ్ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి' స్కీమ్ లో ఇంగ్లీషా అది? మినిస్టర్ గారి బాడీగార్డ్ అవటం వల్ల సెన్సార్ బోర్డ్ కి ఛైర్మన్ అయ్యారనీ, సాహిత్య అకాడమీ అద్యక్షురాలయ్యారనీ మనకు బాగా తెలుసు మేడమ్. నీ ఇంటికి బూతు సినిమాలు ఓ.కే చేయించుకోడానికొచ్చిన ప్రొడ్యూసర్ని కాదు నేను. చిరంజీవి మిసెస్ ని. మా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళడానికొచ్చాను. భర్త ఎక్కడుంటే అక్కడికి వచ్చే హక్కు భారతనారికుందని మన వేదాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సీతను చూడండి. రాములారు సఫారీ కెళ్తోంటే తనూ రధం ఎక్కేసింది. సతీ అహల్య కూడా ఒకప్పుడు మన నియోజకవర్గంలో ఓటరే మేడమ్. ముండ కావాలని ముచ్చటపడ్డ మొగుడ్ని అర్థరాత్రి మోసుకెళ్ళి ఆ ఇంటికి చేర్చిన నెంబర్ వన్ పతివ్రత. నా మొగుడికి కాళ్ళు, చేతులూ, ఆరోగ్యం అన్నీ తిన్నగానే ఉన్నాయి కాబట్టి తనే మీ ఇంటికొచ్చేశాడు నా సాయం లేకుండానే. కనీసం తిరిగి ఇంటికి తీసుకెళ్ళేప్పుడయినా ఈనాటి అహల్యలు మొగుడికి సాయం చేయాలి కదా. అందుకని వచ్చాను. ముండ ఇంటికి మొగుడ్ని తీసుకెళ్ళే హక్కు అహల్య మార్కు భారతనారికున్నప్పుడు ఆ ఇంటి నుంచి భర్తను మళ్ళీ రిటర్న్ జర్నీ చేయించే హక్కు కూడా భారతనారికుంటుంది. ఇదన్నమాట అసలు సంగతి.
అంచేత 'నా ఇంటికెందుకొచ్చావ్ నువ్వు గెటౌట్' అంటూ ఆల్సేషన్ లాగా అరవొద్దు. ఇంటికొచ్చిన అతిథితో మర్యాదగా, మంచిగా మాట్లాడటం నేర్చుకో మేడమ్.
ఈ పెదవుల్నీ, పదవుల్నీ చూసి పొంగిపోకు. మినిష్టరుగారి పదవి పోగానే అన్నీ కొట్టుకుపోతాయి."
మేడమ్ మండిపడుతూ చిరంజీవివేపు చూసింది "మిస్టర్ చిరంజీవీ! ఈ రాక్షసి కూడా ఇలా వచ్చి గొడవ చేసేట్లయితే నువ్వు కూడా మా ఇంటికి రాకు. మాది మర్యాదస్తుల కుటుంబం."
శారద కిలకిల నవ్వింది.
"బాడీ గార్డ్స్ కి చెందిన కుటుంబం"


