Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 26


    "అలాగే సార్" అంటూండగానే లోపల్నుంచి వచ్చింది శారద ఇల్లు ఊడుస్తూ.
    "ఒరే కిష్టిగా"
    "అమ్మా"
    "అవన్నీ చింపమంటే చూస్తూ నుంచున్నావేమిటి?" కోపంగా అడిగింది.
    "అయ్యగారు వద్దన్నారమ్మా"
    "ఈ ఇంటికి యజమానురాలు చెప్పినమాట ఎక్కువా? అయ్యగారు చెప్పిన మాట ఎక్కువరా నీకు?"
    వాడికేం చెప్పాలో తెలీలేదు.
    "అదమ్మా! అదీ...అది...మీరు చెప్పిందే ఎక్కువగానమ్మా! మరి అయ్యగారు చెప్పింది కూడా తక్కువేమీ కాదమ్మా! అంటే మీ మాట కన్నా అయ్యగారి మాట ముఖ్యం. అయ్యగారి మాటకన్నా మీ మాట ముఖ్యం అన్నమాటమ్మా! అంటే...."
    "అయితే ఇంకా చూస్తావేమిటి? చింపెయ్ ఆ చెత్త బొమ్మలన్నీ! సంసారుల కొంపల్లో వుండాల్సిన బొమ్మలేనా అవి?
    "ఆ మాట మాత్రం నిజమేనమ్మా! సంసారుల కొంపలో మాత్రం వుండాల్సినవి కావివి."
    మళ్ళీ చిన్పటం మొదలుపెట్టేసరికి చిరంజీవికి కోపం ఆగలేదు.
    తన బెల్టు తీసుకుని వాడి దగ్గరకు నడిచాడు.
    "ఏమిట్రా నేను చెప్పే మాటకు విలువ లేదా?" అంటూ బెల్టుతో ఒక్కటిచ్చాడు అతను.
    "బాబోయ్! కొట్టకండి సార్. ఆ బొమ్మలు నేనింక చింపను."
    మాట పూర్తికాకుండానే వాడి వీపుమీద పడింది చీపురుదెబ్బ.
    "ఏమిట్రా? నా మాట నీకు లెక్కలేదా? ఆ కాగితాలు చింపవా?"
    "బాబోయ్! చింపేస్తాను. మీ మాటే ఎక్కువ నాకు"
    వాడి మీద మరో నాలుగు చీపురుదెబ్బలు, బెల్టు దెబ్బలూ తగిలాక ఇల్లొదిలి పారిపోయాడు వాడు.
    "శారద! దిసీజ్ టూమచ్! నువ్వు అతిగా బిహేవ్ చేస్తున్నావు"
    "నేనూ అదే చెపుతున్నాను"
    "నీలాంటి పొగరుబోతుతో సంసారం చేయటం నావల్ల కాదు."
    "నాకూ అదే అనిపిస్తోంది. కాని ఈ మెడలోని తాళిబొట్టు వల్ల చేయక తప్పదు గనుక చేస్తాను."
    "నీకిష్టమయితే ఈ ఇంట్లో పడి వుండు! నీ ముఖం చూడదల్చుకోలేదు."
    "నేనొక్కర్తెనూ పడివుండటానికి నేను మీ ఉంపుడుగత్తెను కాదని ఓసారి చెప్పాను. పదిసార్లు చెప్పటం నాకిష్టంలేదు."
    "అయితే నీకు ఇవాళే విడాకులిస్తాను."
    ఆమె స్టన్నయిపోయింది.
    "విడాకులిస్తారా?"
    "అవును"
    "నిన్న పెళ్ళీ, ఇవాళ విడాకులా?"
    "అవును"
    "ఇంతకంటే సిగ్గుమాలిన విషయం ఇంకేమయినా ఉంటుందా? నాకు విడాకులిచ్చి ఆ సంగీతను కట్టుకుని వూరేగాలని ఆలోచిస్తున్నారేమో! నా కంఠంలో ప్రాణం వుండగా అలా జరగనీయను."
    "అంటే?"
    "పెళ్ళంటే ఆడదాన్ని ఓ రోజు ఎంజాయ్ చేసి వదిలేయటం అనుకుంటున్నారేమో! మీకింతవరకూ తగిలిన కేసులు కూడా అలాంటివే అనుకుంటాను. కానీ నేనలాంటిదాన్ని కాదు. మగాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోడానికయినా తయారవుతాడుగానీ నాలాంటి ఆడది ఒకేసారి మనువాడుతుంది. ఆ బంధమే జీవితాంతం నిలుపుకుంటుంది. భర్త చిత్ర పఠాన్నే గుండెల మీద శాశ్వతంగా ముద్రించుకుంటుంది. వైవాహిక బంధం ఓ తీయని వరం! మీకు నేనంటే ఎంత అయిష్టం వున్నా, నా పీడ విరగడవ్వాలని లోలోపల మీరెంతగా భగవంతుడిని ప్రార్థించినా, నాకు విడాకులివ్వడానికి చట్టరీత్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం మీ భార్యగానే వుంటాను. నాకు యిష్టం లేని విడాకులు మంజూరు చేయడానికి ఏ కోర్టూ ఒప్పుకోదన్న విషయం మీకు తెలియదేమో! కాఫీ రడీ అయినాయి. డైనింగ్ రూమ్ లోకి రండి"
    "నాకేం అఖ్ఖర్లేదు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు."
    "ఒకరోజు క్రితం అద్భుతమైన అందంతో వెలిగిపోయిన మొహం యివాళ అంత అసహ్యకరంగా కనిపిస్తోందంటే డిఫెక్ట్ నా మొహానిది కాదని మీ వంకరబుద్ధిదనీ స్పష్టంగా తెలుస్తోంది" అంటూ లోపలికెళ్ళిపోయింది.
    చిరంజీవికి ఆమె మాటలతో రక్తం ఉడికిపోయినట్లయింది. ఆమె మెడ పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది.
    లేచి బయటకు నడవబోతూంటే కాఫీ కప్పుతో వచ్చిందామె."ఇదిగో కాఫీ"
    కాఫీ కప్పు విసిరి నేలకేసి కొట్టాడతను.
    "నాకు తెలుసు మీరిలాంటి మొండిపనులు చేస్తారని! అందుకే సర్ఫ్ తీసుకొచ్చాను క్లీన్ చేయటానికి..." అంటూ తన చేతిలో వున్న ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి సర్ఫ్ నీళ్ళు జల్లి కాఫీ పడినచోటంతా క్లీన్ చేయసాగింది.
    చిరంజీవి బయటకు నడుస్తూంటే లేచి పరుగుతో అతనికి అడ్డం వచ్చింది. తన చేతిలోని కాగితం అతనికిచ్చింది.
    "ఇదిగో! మార్కెట్ నుంచి ఈ వస్తువులన్నీ తీసుకురండి. ఇవాళ్టినుంచీ నేనే యింట్లో వంట చేస్తాను. మీరు రాత్రి తొమ్మిదికల్లా యింటికి వచ్చేయండి. టైమ్ కి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడయిపోతుందని మా తొమ్మిదో తరగతి పుస్తకంలో రాసి వుంది."
    "నా యిష్టం వచ్చినప్పుడు వస్తాను. నన్నడగటానికి నువ్వెవతివి?"
    "మీ పెళ్ళాన్ని"
    అతను విసుగ్గా కార్లో కూర్చుని కారు స్టార్టు చేశాడు.
    "ఇదిగో భర్తగారూ! పన్నెండుకల్లా ఇంటికి రాకపోతే నేనే వస్తాను గుర్తుంచుకోండి."
    "షటప్"
    "అదిగో! అలా పెళ్ళాన్ని ఇన్సల్ట్ చేస్తేనే వళ్ళు మండేది. అన్నట్లు మల్లెపూలు తేవటం మర్చిపోరు కదూ?"
    "మల్లెపూలూ తేను... మొగలిపూలూ తేను"
    "పైకలా అంటారుగానీ మీరే తెస్తారు. మీకు మనసులో ఎంత ప్రేమ లేకపోతే నన్ను అంత అర్ధాంతరంగా పెళ్ళి చేసుకుంటారు?"
    కారు బయటకు దూసుకొచ్చేసింది.

 Previous Page Next Page