Previous Page Next Page 
8 డౌన్ పేజి 27

       "సార్!" దుఃఖం ఆపుకుంటూ పిలిచాడు అసిస్టెంట్ మూర్తి.   
    "ఏమిటి?"    
    "మన చావు చివరకు విజయవాడ స్టేషన్ లో రాసి పెట్టి వుంది కద్సార్"    
    "అవును మూర్తీ! నేను అదే ఆలోచిస్తున్నాను"    
    మూర్తి కళ్ళ వెంబడి కారుతోన్న నీరు చూసిగురుమూర్తి చలించిపోయాడు.    
    "మూర్తి! ఏడుస్తున్నావా? ఏమిటా పిరికితనం? మనం ఏదొక రోజు ఛావల్సిందేనన్న విషయం మర్చిపోయావా?" అతనికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.    
    "లేద్సార్! నేను భయపడుతోంది నా గురించి కాదు. మా మిసెస్ కి ఆపరేషన్ జరగబోతోంది సార్! దానికోసం నేను సి.సి.యస్.లోనూ పి.యఫ్.లోనూ అడ్వాన్సూ, బయటవడ్డీకి పాతికవేలరూపాయలు పోగుచేసివుంచాన్సార్! కానీ నేనిప్పుడు ఇలా యాక్సిడెంటులో పోయానని తెలుస్తే అది బ్రతకదు సార్! ఆపరేషనుకు ముందే ప్రాణాలు వదులుతుంది. అప్పుడిక మా పిల్లల్ని ఎవరు చూస్తారు సార్? ఎవరు పెంచి పెద్దచేస్తారు? ఎవరువారికి తిండిపెడతారు?"    
    "మీ వాళ్ళెవరూ లేరా?"    
    "దగ్గర వాళ్ళెవరూలేరు సార్! దూరపువాళ్ళు నా పిల్లల్ని ఎలా పెంచుతారో నాకు తెలుసు! వాళ్ళు కూలీలవుతారు!"    
    గురుమూర్తి అతని భుజంతట్టాడు ఆప్యాయంగా.    
    "చూడు మూర్తీ! బండి ఏ మాత్రం స్లో అయినా దూకేయడానికి ప్రయత్నిద్దాం. నువ్ కంగారు పడకు.    
    "ఈ స్పీడ్ లో దూకితేకాళ్ళు చేతులూ విరగడం ఖాయం! కాళ్ళు చేతులూ లేకుండా మనం బతకటం అనవసరం! ఆ నరకం భరించటంమనవల్ల కాదు. దాని బదులు చావే మంచిది సార్!"    
    8 డౌన్ వెస్ట్ కాబిన్ పాసయిపోయింది. విజయవాడ రైల్వేస్టేషన్ అరణ్యంలా కనబడుతోంది ఆ వేకువజాము వెల్తురులో తోరణాల్లా వెలుగుతోన్న లైట్లు, కదులుతోన్న షంటింగ్ ఇంజన్లూ- వైజాగ్ సైడ్ నుంచి వస్తోన్న మరో ఎక్స్ ప్రెస్ ట్రెయినూ, అప్పుడే హైద్రాబాద్ డైరెక్షన్ వెళుతోన్న ఓ ఎక్స్ ప్రెస్ ట్రెయినూ-    
    అంతా అయోమయంగా వుంది.    
    తమ ట్రెయిన్ ఏ ఫ్లాట్ ఫాం మీద కెళ్తోందీకూడా తెలీటం లేదు.
     అంతా ఆగమ్యగోచరం-    
    ఏ క్షణాన్నయినా ఆ టర్న్ అవుట్స్ దగ్గర బండి పడక తప్పదు.    
                                                                   * * *   
    కొద్దిసేపు ఏం జరిగిందీ విశ్వాసానికి అర్ధంకాలేదు.    
    తన చేతిని ఎవరో తాకినట్లనిపించింది.    
    లేచి కూర్చుని మిగతాబెర్తుల్లో వారందరినీ చూశాడు.    
    ఎదుటి బెర్తుమీదే పడుకుని తనవంకే చిరునవ్వుతో చూస్తున్న రజనీ కనిపించిందతనికి.    
    ఆ డిమ్ లైటులో ఆమెను గుర్తుపట్టలేకపోయాడు.  తన దారిన తను మళ్ళీ పడుకోబోతుండగా ఆమె నెమ్మదిగా రహస్యంగా మాట్లాడింది. "అప్పుడే మర్చిపోయారా నన్ను?"    
    విశ్వం అదిరిపడి ఆమెవేపు వంగి పరీక్షగా చూశాడు.    
    అతని ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు లేకపోయినయ్!    
    "రజనీ! నువ్వా?" ఆశ్చర్యంనుంచి కోలుకుంటూ అడిగాడు.    
    "ఊ!" అందామె.    
    అతను మిగతా బెర్తులవేపు చూశాడు.    
    "మీ వాళ్ళా?"    
    "ఊ!"    
    "ఎక్కడికెళుతున్నారు?"    
    "గోదావరిలోకి!"    
    అతను నవ్వాడు.    
    "రాజమండ్రా?"    
    "కాదు! గోదావరి!"    
    "గోదావరి స్టేషనా?"    
    "కాదు నది!"    
    "ఓ! గోదావరి స్నానానికా?"    
    "కాదు! మునగడానికి" నవ్వుతూ అంది.    
    "అదేమిటి?"    
    "అదంతే!"    
    అతనికి ఆమె మాటలేమీ అర్ధం కావటంలేదు.    
    "పిల్లలా?"    
    "నా మొఖానికి ఆ అదృష్ట మొకటే తక్కువ-"    
    "రజనీ!"    
    "ఊ!"    
    "నిన్ను మీ వాళ్ళు సరిగ్గా చూసుకుంటారా?"    
    "వాళ్ళకు నచ్చిన విధంగా చూసుకుంటున్నారు."    
    "అంటే?"    
    "శైలజ ఎలా వుంది?"    
    "వాళ్ళ మదర్ దగ్గర వుంది! ఆడపిల్ల!"    
    "ఓ! అలాగా!"    
    ముందు ఆమె అత్తకు మెలకువ వచ్చింది వారి సంభాషణ వల్ల.    
    అనుమానంగా రజని బెర్తువేపు చూసింది. ఆమె కెదురుగ్గా కూర్చుని ఆమెతో నెమ్మదిగా మాట్లాడుతోన్న విశ్వాన్ని చూసింది. వెంటనే నాగరాజుని నిద్రలేపసాగింది. ఆమెను చూసి విశ్వం వెనక్కు తగ్గి రజనితో మాట్లాడటం ఆపేశాడు. నాగరాజు బెర్తుదిగి నిలబడ్డాడు నిద్రమత్తుతో.    
    "ఏమిటమ్మా?"    
    "అది- ఆ ఎదురుగ్గా కూర్చున్నవాడెవడితోనో మాట్లాడుతోందిరా?" నాగరాజుని నిద్రమత్తెగిరిపోయింది.    
    విశ్వంవేపు చూశాడు ఓ క్షణం! తర్వాత ఇంకా పడుకుని వున్న రజనివేపు చూశాడు.    
    "లే! బెర్తు దించేస్తాను" అన్నాడు.    
    ఆమె లేచి నిలబడింది. బెర్తు గొలుసులు తీసి కిందకు దించేశాడు. అందరూ సీటుమీద కూర్చున్నారు.   
    "ఏమిటి వాడెవడితోనో మాట్లాడావుట" అడిగాడతను.    
    "వచ్చేది విజయవాడ స్టేషనా అని అడిగాను."   
    "ఎందుకడిగావ్?"    
    "తెలుసుకోవాలనిపించింది."  
    "వాడినెందుకడిగావ్?"    
    "అడిగితేనేం?"    
    ఆమె చెంప చెళ్ళుమంది. విశ్వం నిశ్చేష్టుడయ్యాడు. కోపం భగ్గుమంది. తనుపూవుల్లో పెట్టిపూజించుకోవాలనుకొంటున్న అమ్మాయినా వాడలా కొడుతోంది? అందరి ఎదురుగ్గానే ఇంతగా హింసిస్తోంటే ఇంక ఇంట్లో ఎంత దారుణంగా వుండివుండాలి? రజని ఎందుకీ నరకం అనుభవిస్తోంది? రజని కళ్ళ వెంబడినీళ్ళు తిరిగినయ్.    
    "ఇంకోసారి మాట్లాడావంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త!"    
    ఇంకో దెబ్బ!    
    విశ్వానికి రక్తం సలసలకాగిపోతోంది. అతనిని పట్టుకుని గొడ్డుని బాదినట్లుబాదాలని వుంది. కానీ అందువలన రజనికి మరింత హానిజరుగుతుందేమోనన్న భయం! రజనికన్నీరు తుడుచుకుంటూ విశ్వం వేపు చూసింది. ఆ చూపులోని భావాలు ఎన్నో!    
    నువ్వేం దిగులు పడకు-నా జీవితం ఇంతే అనో-    
    ఒకరి గుండెల్లో దేవత-మరొకరి బానిస అనో-    
    అవును- అన్ని బాధలుపడుతూ ఆమె అతనినేయెందుకు అంటిపెట్టుకుని వుండాలి? ఆమెకోసం తపించిపోయే తన దగ్గరకు యెందుకు రాలేదు? వివాహమవగానే స్త్రీ శారీరకంగా, మానసికంగా రుగ్మత పాలవుతుందా? ఏదేమయినా తనిప్పుడు చేయగలిగిందేమీలేదు
    రైలు విజయవాడ చేరుకుంటుండడంచూసి తన సామాను సర్దుకోసాగాడతను.
    అతని హృదయంబరువెక్కిపోయింది.
    రజనిని చూసిన ఆనందంకన్నా ఆమె గడుపుతున్న జీవితం ఎక్కువ బాధకలిగిస్తోంది.
    "విజయవాడ వస్తోన్నట్లుంది. కాఫీ తాగాలి" అంది నాగరాజు తల్లి.
    "తాగుదాం" అన్నాడు నాగరాజు.
    బయట ఇంకా సన్నగా వర్షం పడుతూనే వుంది.
                                                                     * * *
    "ఇప్పుడేం చేద్దాం?" అడిగాడు జగదగ్ని.
    ఫణి అప్పటికే ప్లాన్ సిద్దం చేశాడు.
    "విజయవాడలో 8 డౌన్ ఆగుతుంది. ఆగగానే హోమ్ మినిస్టర్నీ, సెక్రటరీని రిసీవ్ చేసుకోవటానికి పోలీస్ అధికారులువస్తారు. కానీ రఘునాథ్ బండి దిగడు. అత్యవసరమయిన పనిమీద తను తిరిగి రాబోతున్నట్లు చెప్తాడు. విజయవాడ వచ్చిన పోలీసు అధికారులకు ఆయన ఒక ఆర్డర్ రిటెన్ గా సంతకం చేసి ఇస్తాడు. అది డి.జి.పి.కి అడ్రస్ చేయబడి వుంటుంది. అందులో అరెస్ట్ చేసిన మనవాళ్ళందరినీ విడుదల చేయమని వుంటుంది. తను ఏలూరు వెళ్ళేలోగా అందరినీ జైళ్ళనుంచీ, లాకప్ ల నుంచీ పంపించేయమనీ, ఆ విషయం అమలు జరిపాక తనకు మళ్ళీ ఏలూరులో ఇన్ ఫర్మేషన్ ఇవ్వాలనీ- రాస్తాడతను. నిజానికి హోమ్ మినిస్టర్ తో సహా అందరం ఏలూరు కంటే ముందున్న నూజివీడు స్టేషన్లోనే బండి ఆపి దిగిపోతాం- ఇదీ ప్లాన్!"

 Previous Page Next Page