కానీ ఇటీవలి కాలంలో తను ఎంక్వయిరీ ఆఫీసర్ గా చాలా యాక్సిడెంట్స్ గురించి విచారణ జరిపినప్పుడు చాలా దారుణమయిన విషయాలు వెలుగులోకొచ్చాయి.
స్టేషన్ మాస్టర్లు, డ్రయివర్లు, గార్డులు, ట్రెయిను ఎగ్జామినర్లు, పర్మనెంట్ వే ఇన్స్ పెక్టర్లు వీళ్ళు చేసే పొరబాట్లవల్లేగాక రైల్వే ఎడ్మినిస్ట్రేషన్ రూల్స్ ని నిర్లక్ష్యం చేయటంవల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
బ్రేక్ పవర్ సర్టిఫికెట్స్ ని తాజాగా ఇవ్వాల్సి వున్నా దానివల్ల జాప్యం జరుగుతుందను కున్నప్పుడు రూల్స్ ని అతిక్రమించి గూడ్స్ ట్రెయిన్లు నడపడం, డ్రయివర్స్ తో ఒకేసారి ఇరవై గంటల వరకూ డ్యూటీలు చేయించటం, తగినన్ని లగేజ్ కమ్ బ్రేక్ కోచ్ లు లేకపోవడం వల్ల ప్రయాణీకుల రైళ్ళల్లో యాంటీ టెలిస్కోపిక్ ఫార్మేషను రూల్స్ ని అతిక్రమించటం, ఇంజినీరింగ్ లో ట్రాక్ కి సంబంధించి ఎన్ని అవకతవకలున్నా మెటీరియల్ షార్టేజ్ అన్న వంకతో ఎవరూ పట్టించుకోకపోవటం.......ఇవిగాక గార్డ్ బ్రేకులు గార్డులు లేకుండా, టైల్ లాంప్ లు లేకుండా గూడ్స్ ట్రెయిన్ లు నడపడం, షార్ట్ కట్ మెథడ్స్ ని ఎంకరేజ్ చేయటం- చాలాతరచుగా జరుగుతూండే విషయం.
ఆ విషయాల గురించి తను అనేకసార్లు అన్ని డిపార్టుమెంటుల అధికారులతోనూ చర్చించాడు.
అయినాగానీ ఏమాత్రం ఉపయోగంలేదు.
రైళ్ళు నడపడం ఒక్కటే ప్రధానోద్దేశ్యంగా తయారైంది అందరికీ! ఆ ప్రెజర్ లో ఎవరికీ సేఫ్టీ అనేది ఒకటుందనే గుర్తుండదు. ఆ పరిస్థితిలో తనేం చేయాలో అతనికి తోచలేదు. ఒకసారి చీఫ్ సేఫ్టీ సూపరింటెండెంట్ తో ఈ విషయం గురించి మాట్లాడాడు.
అతను తననుచూసి నవ్వాడు.
"యంగ్ బ్లడ్ కదా! అందుకని నీకు యాంగ్జయిటీ, నీ డిపార్టు మెంటుకి సంబంధించినంత వరకూ ఎలాంటి లోపం లేకుండా శ్రమపడి వర్క్ చేయాలని నీకుండటం సహజమే. కానీ దురదృష్టవశాత్తూ భారత రైల్వేల్లో సేఫ్టీ అనేది కేవలం అలంకారం కోసం ఏర్పాటు చేసిన డిపార్టు మెంట్. ఆ డిపార్టు మెంట్ ఒకటి చట్టరీత్యా ఉండాలి గనక ఉంది! అంతే! ఆ డిపార్టు మెంట్ కి అధికారం, ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెడితే ఇప్పుడు నడిచే రైళ్ళలో సగం కూడా నడవవ్! అందుకే సేఫ్టీ డిపార్ట్ మెంట్ కి అధికారం లేకుండా చేయటానికి దానిని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో అంతర్భాగంగా రూపొందించారు. ఇప్పుడర్దమయిందా?" తనుతల ఊపాడు.
ఆ రోజునుంచి తను మళ్ళీ ఎప్పుడూ రైల్వే ఆఫీసర్లు రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేయడం గురించి ఎవరినీ ప్రశ్నించలేదు- చర్చించలేదు. అదీగాక తనకు తెలుసు. ఇవాళ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ గా పని చేస్తే రేపు తనే డివిజనల్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్ గాకూడా పని చేయాల్సివస్తుంది. అప్పుడు తనూసేఫ్టీ రూల్స్ ని పక్కకు నెట్టివీలయినన్ని ఎక్కువ ట్రెయిన్లు నడపటంలోని నిమగ్నమయిపోతాడు.
జీప్ పెదవడ్లపూడి స్టేషను దగ్గరకు చేరుకుంది. స్టేషనంతా చాలా నిశ్శబ్దంగా వుంది.
జీప్ కొంచెం దూరంలోనే ఆపి టార్చ్ లైట్ తీసుకుని స్టేషన్ వేపు నడవసాగాడతను.
విధ్యుద్దీపాలు వెలుగుతూవున్నాయి. ఫ్లాట్ ఫారం మీదకొచ్చాడతను. లూప్ లైన్ మీద గూడ్స్ ట్రెయిన్ ఆగివుంది. స్టేషన్ మాస్టర్ ఆఫీస్ పక్కనే వున్న బెంచిమీద పాయింట్స్ మెన్ ముసుగు పెట్టుకుని నిద్రపోతున్నాడు. అతని పక్కనే హాండ్ సిగ్నల్ లాంప్.
తలుపు అద్దాల్లోనుంచి లోపలకు చూశాడు జయకర్.
ఏ ఎస్సెమ్ టేబుల్ మీద తల ఆనించికూర్చునే నిద్రపోతున్నాడు. లోపలకు నడిచి ఏఎస్సెమ్ కెదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చున్నాడతను.
ఆ శబ్దానికి వులిక్కిపడి నిద్రలేచాడు ఏఎస్సెమ్., ఎదురుగ్గా కుర్చీలో కూర్చున్న జయకర్ ని చూడగానే అదిరిపడ్డాడు.
"గుడ్ మాణింగ్ సర్" అన్నాడు లేచి నుంచుని.
"సో - యూ ఆర్ స్లీపింగ్!" అన్నాడు జయక
"ఇప్పుడే జమ్ముతావి పోయింది సార్! సెక్షన్ క్లియర్ అవుతూందేమోనని చూస్తుంటే.
నిద్ర వచ్చేసింది. అదీగాక రెండు వారాలనుంచీ రెస్ట్ అవర్ రావటం లేద్సార్! వరుసగా అన్నీ రాత్రి డ్యూటీలు!"
"ట్రెయిన్ రిజిస్టర్ ఇటివ్వు!"
అతను ట్రెయిన్ రిజిస్టర్ తెచ్చి ఇచ్చాడు. ఎంట్రీస్ అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేశాడతను. సాధారణంగా స్టేషన్ మాస్టర్లు తప్పులు చేసేది క్లియరెన్సుల దగ్గరే. అందుకే తనెక్కడికి ఇన్ స్పెక్షను కెళ్ళినా క్లియరెన్సులు సరిగ్గా వేసిందీ లేనిది చెక్ చేస్తాడు.
"ఆ బెంచీమీద పడుకున్నోడు పాయింట్స్ మెన్నేనా?"
"అవున్సార్!"
"అంటే అందరూ కలిసినిద్రపోతున్నారన్నమాట"
"......"
"ఆ గూడ్స్ ట్రెయిన్ ఎందుకు ఆగి ఉంది?"
"జమ్ము-తావికి ప్రిఫరెన్సు కోసం ఆపారు సార్!"
"అంటే అది క్లియరవగానే వెళ్లిపోతుందా?"
"అవున్సార్!"
"ఆల్ రైట్ నేను ఓసారి ఇంజెన్ దగ్గర కెళ్తాను. ఈలోగా లైన్ క్లియర్ దొరికితే స్టార్టు చేసెయ్"
"సరే సర్!"
జయకర్ బయటికొచ్చి చకచక ఇంజనువేపు నడవసాగాడు. బండి ఎక్కడయినా ఆగితే చాలుడ్రైవర్లు, అసిస్టెంట్లు నిద్రపోతూంటారు సాధారణంగా. జయకర్ ఇంజన్ దగ్గరకు చేరుకునేసరికి సిగ్నల్ ఇచ్చేశాడు ఏ ఎస్సెమ్. కానీ డ్రైవర్ సిగ్నల్ ని చూసినట్లులేడు. ఇంజన్ పైకి ఎక్కి కాబిన్ లో కొస్తుంటే కునికిపాట్లు పడుతున్న డ్రైవర్ కి అప్పుడే మెలుకువవచ్చింది.
జయకర్ ని చూసి కంగారుపడ్డాడతను.
"అయామ్ డి.ఎస్.ఓ!" అన్నాడు జయకర్.
"గుడ్ మాణింగ్ సార్!" అన్నాడు డ్రైవర్. వినయంగా లేచినిలబడ్డారు!
ఆ సంభాషణ విని అసిస్టెంట్ నిద్రమత్తులో నుంచి బయటపడ్డాడు.
"యూ ఆర్ స్లీపింగ్!" అన్నాడు జయకర్.
"లేద్సార్, ఇప్పుడే కళ్ళు మూసుకున్నాను. ఇంతకుముందే జమ్ముతావికి ఎక్సేంజ్ కూడా చేశాను".
"కళ్ళు ఎందుకు మూసుకుపోయినయ్? ఆల్కహాల్ ఏమయినా తీసుకున్నారా?"
"లేద్సార్!"
జయకర్ తన బాగ్ లోంచి బ్రెత్ ఎనలైజర్ బయటకు తీశాడు.
"ఏదీ ఇందులో ఊదు ఓసారి!"
అతను ఊదాడు. నీడిల్ తిరిగింది.
"తాగలేదంటావేమిటి? నీడిల్ చూశావా?"
"నిజం సార్! బైగాడ్ చెప్తున్నాను -డ్యూటీలోనేనెప్పుడూ తాగన్సార్".
నిజానికి స్టాఫ్ డ్యూటీలో తాగి వున్నదీ లేనిదీ తెలిపే ఆ బ్రెత్ ఎనలైజర్ వల్ల ఏమాత్రం ఉపయోగంలేదని జయకర్ కు తెలుసు. ఎందుకంటే అవతలి వ్యక్తి జరదాపాన్ వేసుకున్నా, సిగరెట్ తాగినా కూడా నీడిల్ తిరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా అతనుతాగాడని చెప్పటానికి వీల్లేదు.
"మీ పేర్లు చెప్పండి!" తన నోట్ బుక్ తెరిచి అడిగాడతను.
ఇద్దరూ పేర్లు చెప్పారు.
"కమాన్ స్టార్ట్ యువర్ ట్రెయిన్!"
ఇంజన్ దిగుతూ అన్నాడతను. బండిస్టార్టయింది. స్టేషన్ చేరుకుని రిపోర్టు రాసుకుని మళ్ళీ జీప్ దగ్గరకు చేరుకున్నాడతను.
"కృష్ణా కెనాల్ స్టేషన్ కి పోనీ" డ్రైవర్ తో చెప్పాడతను.
జీప్ కృష్ణాకెనాల్ స్టేషన్ వేపు పరుగెత్త సాగింది.
* * *
గురుమూర్తి వేగంగా సమీపిస్తోన్నరాయనపాడు సిగ్నల్స్ ని చూడసాగాడు. సిగ్నల్స్ అన్నీ డేంజర్ లోనే వున్నాయి. ఏ క్షణాన ఏ ట్రెయిన్ తో ఢీకొంటుందో, ఏ సైడింగ్ లోడిరెయిల్ అయిపోతుందో తనకే తెలీదు. బండి ఇంతవరకు వచ్చిందంటే అంతా కేవలం తన అదృష్టమే. శరవేగంతోరాయనపాడు స్టేషన్ దాటేస్తోంది బండి.
గురుమూర్తి చెమటలు తుడుచుకుంటూ టైమ్ చూసుకున్నాడు. సరిగ్గా నాలుగు నిమిషాల్లో కొండపల్లినుంచి రాయనపాడు చేరుకుంది బండి. అక్కడి నుంచి విజయవాడ వెస్ట్ కాబిన్ కి అయిదునిమిషాల రన్! వెస్ట్ కాబిన్ నుంచి స్టేషన్ కి ఎనిమిది నిమిషాల రన్ వుంది గానీ ఈ వేగంలో కేవలం నాలుగు నిమిషాలకే చేరుకుంటుంది.
అక్కడ తప్పక యార్డ్ లోనే పడిపోవటమో, లేదా ఫ్లాట్ ఫారం మీదున్న ఏ బండి కో ఢీ కొనటమోతప్పదు. ఆ సమయంలో సంధ్య తన ఇంజనువెనుక భోగీలోనే కూర్చుని వుంటే ఆ క్రాష్ లో ప్రాణాలు పోగొట్టుకోకతప్పదు. ఈ లోగా ఎలాగయినా ఆమెను "వెస్టిబ్యూల్" ద్వారా చివరి కోచెస్ లోకి పంపగలిగితే ఆమె రక్షింపబడుతుంది. కానీ ఆ వెస్టిబ్యూల్స్ క్లోజ్ చేసి వుంచుతారు.
అయినాగానీ ఆమెనెలా హెచ్చరించటం?
తనెలా చేరుకుంటాడక్కడికి?
తన ఆలోచన తఃనకే వెగటుగా అనిపించిందతనికి. అంతమంది ప్రయాణీకులగురించి ఆలోచించకుండాతను సంధ్య గురించిన ఆదుర్దాపడడం యెంతదారుణం? ముందు కోచీలో ఉన్న ప్రయాణికులందరినీ ఆఖరి కోచీల్లోకి ఎవరకయినా పంపగలుగుతే యెంతబావుంటుంది? అలా జరిగితే ఎంత పెద్దప్రమాదం జరిగినా చాలా తక్కువ మందికి ప్రాణభయం కలుగుతుంది. చాలా తక్కువ మందికి గాయాలు తగులుతాయి.
కానీ అదెలా సాధ్యపడుతుంది? అదే తెలీని విషయం!
దూరంగా వెస్ట్ కాబిన్ కనబడుతోంది. గురుమూర్తి రావ్ కి భయం ప్రారంభమయింది. ఇక ఏ క్షణాన్నయినా యాక్సిడెంట్ తప్పదు. యాక్సిడెంట్ జరిగితే ముందు ప్రాణాలు కోల్పోయేధీ ఎవరో తనకు తెలుసు. తనూ, తన అసిస్టెంటూ ఇంజనులోనే రక్తం, మాంసాల కుప్ప అయి, ఆ మంటలకు దహించుకుపోయిబూడిదయిపోతారు.