Previous Page Next Page 
8 డౌన్ పేజి 28

    చంద్రిక ఆశ్చర్యపోయింది.
    "కానీ నూజివీడు లో బండెలా ఆపుతాం? వాక్యూమ్ సిస్టం పని చేయటం లేదుకదా?"    
    "తెలుసు! అందుకే విజయవాడలో నువ్వు బండి దిగి గార్డు బ్రేక్ దగ్గర నిలబడతావ్! బండి తిరిగి స్టార్టయ్యాకపరుగుతో వెళ్ళి గార్డు బ్రేక్ అందుకుని ఎక్కేస్తావ్! మీవాళ్ళంతా వేరే కోచ్ లో వున్నారనీ, నువ్వు ఫలహారంకోసం స్టాల్ కెళ్ళావనీ, ఈలోగా బండి బయల్దేరటంవల్ల అతని పెట్టెలో ఎక్కాల్సివచ్చిందనీ, తర్వాత స్టేషనులో దిగి వెళ్ళిపోతాననీ చెప్తావ్. నువ్ అందమయిన అమ్మాయివి కనుక గార్డు వప్పుకుంటాడు. నూజివీడు స్టేషన్ దాటగానే నువ్ పిస్టల్ తీసి గార్డుతో వాక్యూమ్ వేయిస్తావ్! బండి ఆగిపోతుంది. అందరం దిగి వెళ్ళిపోతాం. ఇదీ ప్లాన్!"
    జమదగ్ని, చంద్రిక సంతృప్తి పడ్డారు.
    "బాగుంది" అన్నాడు జమదగ్ని.    
    "రఘునాథ్!" పిలిచాడు డాక్టర్ ఫణి.
    అతడు తలెత్తి ఫణివేపు చూశాడు.    
    "ఏమిటి?"    
    "నువ్ చేయాల్సిందేమిటో అర్ధమయిందిగా?"    
    "ఉత్తరం రాసివ్వాలి."    
    "అవును!"        
    "ఆల్ రైట్! అలాగే!"    
    అతనికి హోమ్ మినిస్టర్ స్వంత లెటర్ పాడ్, ఒక పెన్నూ అందించిందామె. రఘునాథ్ ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు.    
    "నా లెటర్ హెడ్ మీ కెక్కడిది?"    
    "అది నీ కనవసరం! అందరి లెటర్ పాడ్స్ మా అందరి దగ్గరా వుంటాయ్. ఎలా వుంటాయ్ అంటూ ప్రశ్నలేయకు."    
    అతను ఇంక ప్రశ్నించలేదు. లెటర్ హెడ్ మీద డి.జి.పి.కి ఉత్తరం రాయసాగాడతను. రెండునిమిషాల్లో లెటర్ రాయడం పూర్తి చేశాడు.    
    "ఎవరెవరి పేర్లు రాయాలి?" అడిగాడతను.    
    "శ్రీలత- జమదగ్ని భార్య.    
    ఉదయ్ - జమదగ్ని కొడుకు.    
    అమల- జమదగ్ని కూతురు.    
    మైసమ్మ- ఈశ్వర్ రెడ్డి భార్య.    
    సహదేవ్- సింపతైజర్    
    లక్ష్మీ నరసింహం-రైతుకూలీ నాయకుడు-    
    అంతే! మొత్తం ఏడుగురు!"    
    రఘునాథ్ ఆ పేర్లన్నీ రాసి ఫణికిచ్చాడు.    
    "గుర్తుంచుకో! మీ పోలీసుఅధికారులు వచ్చినప్పుడువారితో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మా హోస్టేజస్ గా వున్నట్లు ఎలాంటి సూచన వారికి అందకూడదు. అందిందంటే ముందు మిమ్మల్ని చంపి మేము చనిపోతాం. మా దగ్గర సైనైడ్ కాప్స్యూల్స్ వున్నాయి. మేం పోలీసులచేతికి దొరకటంకల్ల! మాకు ప్రాణం మీద తీపిలేదు. భార్య బిడ్డలమీదా వ్యామోహాలు లేవు. అర్ధమయిందా?"    
    "అయింది" అన్నాడతను.    
    రైలు విజయవాడ స్టేషన్ చేరుకుంటోంది.    
    "కమాన్! గెట్ రడీ!" అన్నాడు ఫణి.    
    "జమదగ్నీ! చంద్రికా! ఇద్దరు సిద్దంగా వుండండి. వీళ్ళల్లో ఎవరు అతితెలివిగా ప్రవర్తించినా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపండి"    
    "సరే!"    
    సంగీత డైలమాలో పడింది తన సంగతేమిటి? తను వీరి మధ్యలో ఇరుక్కుపోయింది. తననుబయటపడనిస్తారా?    
    "డాక్టర్!" పిలిచాడు ఫణి.    
    "యస్!"    
    "దయచేసి మీరు కూడా మాతో కోపరేట్ చేయండి. మీరుకూడా విజయవాడలో దిగటానికి వీలులేదు"    
    "మరి?"    
    "ఏలూరు వరకూ మీరూ రావాల్సివుంటుంది."    
    "అలా రావటంవల్ల చాలా ప్రాబ్లమ్స్ వుంటాయ్!"    
    "ఏ ప్రాబ్లమూ వుండదు. మీకు ఏలూరు నుంచి విజయవాడవెళ్ళటానికి అవసరమయిన టాక్సీ ఛార్జీలు మేమిస్తాం"    
    "సరే!"    
    "సారీ! మీకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు! గత్యంతరం లేక మీకీ ఇబ్బంది కలిగిస్తున్నాం"    
    "దట్సాల్ రైట్! టాక్సీ ఫేర్స్ ఇచ్చేటట్లయితే-దేరీజ్ నో ప్రాబ్లమ్?"    
    'థాంక్స్ ఫర్ యువర్ కైండ్ కోపరేషన్!"    
    ట్రెయిన్ విజయవాడ స్టేషన్ దరిదాపులకొచ్చేసింది.    
    "ఏమిటి? స్టేషన్ వస్తున్నాఇంత స్పీడ్ లో వెళుతోంది?" అనుమానంగా అడిగాడు జమదగ్ని.    
    "అవును! నేనూ అదేచూస్తున్నాను" అంది చంద్రిక.    
    బండి అటూ ఇటూ వూగిపోతోంది. ఆ స్పీడ్ కి సరిగ్గా కూర్చోకపోతే పక్కకి పడిపోయేట్లున్నారు.    
                                                               * * *
    "ఆ! విజయవాడ వచ్చేస్తోంది" అరిచాడు బాలక్ అద్దంలోనుంచి బయటకు చూస్తూ.    
    "ఎందుకు బాలక్ ఉత్సాహం? విజయవాడ అంటే ఎందుకంత ఎగ్జయిట్ మెంట్?"    
    "ఏ సినిమా అయినా ఇక్కడ వందరోజులాడుతుంది కదంకుల్! ప్రపంచంలో ఎక్కడా లేదట ఇంత సినిమా అభిమానం! మా తాతయ్య చెప్తుండేవాడు. ఎప్పటికయినా కూడా మనం విజయవాడలో మకాం పెట్టగలమా అని ఒకటే బాధ పడుతుండేవాడు."    
    "ఒండర్ ఫుల్ సెంటిమెంట్! దేవుడు మేలుచేస్తే అతి త్వరలో భవానీ శంకర్, జయసుధల కాంబినేషన్ తో ఆడే మహోజ్వల సాంఘిక చిత్రం తాలూకూ కొత్త ఇంటికి ఆహ్వానిస్తామని ఆయనతో చెప్పుబాలక్!"   
    "ఇంతకూ మీరెందాకా వెళుతున్నారు?" అడిగింది జయసుధ.    
    "షెడ్యూల్డ్ ప్రోగ్రాం ప్రకారం విజయవాడలో రైలు దిగి బస్ లో గుడివాడ చేరుకుని అక్కడినుంచి బందర్ అనే ప్రదేశానికి బోట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఇటీవల ఉప్పెనలో బందరంతా మునిగిపోయినట్లు తెలిసింది."    
    "అయ్యో! నేనింకా వైజాగ్ వస్తున్నారనుకున్నాను."        
    "ఇప్పుడు రానని ఎవరున్నారు?"    
    "మీరేగా రైలు, బస్సు, పడవప్రోగ్రాం చెప్పింది?"    
    "నోనో! అది హైద్రాబాద్ లో రాలెక్కకముందు ప్రోగ్రామ్ రైల్లో మీరు కనిపించాక ఆ ప్రోగ్రాం మారిపోయింది!"    
    "ఇప్పుడు ప్రోగ్రాం ఏమిటయితే?"    
    "వైజాగ్ వరకూ రైలు, అక్కడినుంచి బస్సు ఆ తర్వాత ఆటోలో మీఇల్లు-" ఆమెముఖం ఆనందంతో తొణికిసలాడింది.    
    "నిజంగా వస్తున్నారా?"    
    "రాకుండా వుండడానికి మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు-"   
    "నిజంగా మా ఇంట్లో వుంటారా?"            
    "మీ వాళ్ళందరితో సినిమా ఫీల్డ్ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ లు చేస్తూ, నేను చూసిన సినిమా అనుభవాలు చెప్తూ, మధ్య మధ్యలో ఉద్యోగం వెతుక్కుంటూ, మీతోనూ, బాలక్ తో నూ బీచ్ కి వెళ్ళి మీ మమ్మీ తీయదల్చుకున్న 'పిడికెడుమట్టి, గుక్కెడు గంగ' గురించి స్క్రిప్ట్ వర్క్ చేస్తూ, అలా కొన్నేళ్ళు గడిపేస్తాం!"    
    వారు మాట్లాడుతుండగానే పై బెర్తుమీద నుంచి జయసుధ తండ్రికిందకు దిగాడు.   
    "మా ఫాదర్! ఇతను కైకలూర్లో నాతోపాటు చదివిన క్లాస్ మేట్ భవాని శంకర్ నాన్నా!" చెప్పిందామె.   
    "హలో మైడియర్ సర్! మీ పేరు నాగయ్య అనీ, మీ ఫాదర్ చిత్తూరు నాగయ్య అభిమానిఅనీ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది."    
    "ఏమిటో బాబూ! ఆ సినిమాల మైకంలోనే జీవితమంతా గడిచిపోయింది కానీ ఇప్పుడు ఇంక జీవితం ఎదురు తిరిగింది. ఈ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?"    
    "తెలీదండీ! కానీ ఏ తెలుగు సినిమాలో అయినా ఏదో పాత్ర ఎడా పెడాపలికేయడానికి ఆస్కారం వుంది!"    
    "వుంది కానీ ఎవరూ పలకలేదుబాబూ! అందుకే నేనేస్వయంగా తయారుచేశానది- ఎందుకోతెలుసా?"        
    "మీ మిసెస్ తీయబోయే "పిడికెడు మట్టి-గుక్కెడు గంగ" సినిమా కోసం"    
    "కాదు బాబూ! ఇంకా అసలు సినిమాల జోలికే పోదల్చుకోలేదు నేను. అంత పెద్ద దెబ్బతగిలింది జీవితంలో"   
    "అదేమిటో తెలుసుకోవచ్చాసార్? మీకు వుద్యోగం దొరకకపోవటమేనా? డోంట్ వర్రీ డియర్ సర్! ఇద్దరం కలసి వుద్యోగాలవేట ప్రారంభిద్దాం!"

 Previous Page Next Page