Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 26


    "మాట్లాడరేమిటి? ఇంకేదో ఆలోచిస్తున్నట్లున్నారు?" నవ్వుతూ అన్నాడు అతను.
    "అదేనండీ నాకీ సినిమా విషయాలేమీ తెలీదు. ఇంత ఇస్తారని గానీ, అడగాలని గానీ ఐడియా కూడా లేదు. అంచేత ఆ విషయాలన్నీ మీకే వదిలేస్తున్నాను. మీరెలా చెబితే అలా"
    అతను నవ్వేసి ఆలోచనలో పడ్డాడు.
    "బావుంది నామీదే వేసేశారన్న మాట సరే చూడండి. నవలకి ఎనిమిది వేలిస్తాను. అంటే అన్ని భాషల్లోనూ సినిమా తీసే హక్కు నేను కొనుక్కుంటానన్నమాట. తరువాత సంభాషణలకి మరో ఎనిమిదివేలు మొత్తం పదహారు వేలు. ఇది నేను సాధారణంగా ఎవరికయినా ఇచ్చే రేటే కానీ మీరంటే నాకున్న అభిమానం వల్లా, ఈ సంభాషణలు రాయడం వల్ల మీకు కలిగే కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మీ విషయంలో ఈ మొత్తాన్ని నేను ఇరవై వేలకు పెంచుతున్నాను. ఇంత పెద్ద మొత్తం అసలు మన తెలుగు ఫీల్డులోనే ఎవ్వరూ ఇవ్వరులెండి. చెప్పండి మరి ఏమంటారు? మీకు సంతృప్తికరంగా ఉంటుందా?"
    సీతకు మతిపోయినట్లయింది.
    "ఏమిటీ మనిషి మాట్లాడుతూంది? ఇరవైవేలా? కలా, నిజమా ఇది ఎంత సినిమా వాళ్ళయితే మాత్రం ఇంత పెద్ద మొత్తమా అందరికీ ఇలా ఉండదనీ కేవలం తనమీద వున్న అభిమానంతో ఇంత ఇస్తున్నానని అన్నాడుగా అంటే తనమీద అభిమానం ఖరీదు నాలుగు వేలా?
    "పోనీ_చాలదనుకొంటే చెప్పండి మీకెంత కావాలి" ఆమె మౌనం వహించడం చూచి అన్నాడతను.
    "అబ్బే...అదికాదు..." తడబడుతూ అంది సీత. "అసలు ఇంత పెద్ద మొత్తం ఉంటుందని నేనూహించలేదు. అందుకని ఆశ్చర్యం కలిగింది"
    అతను తేలిగ్గా నవ్వేశాడు.
    "భలేవారే మీరు! నేనే అంటే నాకంటే అమాయకుల్లా వున్నారు. నిజమే మీ మనసులో ఉన్నదన్నట్లు మాట్లాదేశారు. నాకు సంతోషంగా వుంది. కాని సినిమా వాళ్ళెవరి దగ్గరా అంత ఓపెన్ గా మాట్లాడేయకండి. మీ నెత్తిన చెయ్యి పెట్టేస్తారు" అన్నాడతను.
    ఆమె నవ్వేసింది.
    "మరి నేనిక వెళ్ళిరానా?" మంచిరోజు చూసుకుని మళ్ళీ కలుస్తాను" లేచి నుంచుంటూ అన్నాడతను.
    "అలాగే" తనూ నుంచుంటూ అంది సీత హఠాత్తుగా ఆమెకు గుర్తుకొచ్చింది తను అతనికి కాఫీ ఆఫర్ చెయ్యలేదని.
    "ఒక్క నిమిషం కూర్చోండి! ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను" హడావుడిగా లోపలకు వెళ్ళబోతూ అందామె.
    "వద్దు. వద్దు" దయచేసి ఈసారికి వదిలేయండి. మరోసారి తప్పక మీ చేతి కాఫీ తాగుతాను... వస్తాను... నమస్తే" వెళ్ళిపోతూ అన్నాడతను.
    నమస్కారం చేసి గడప వరకూ నడచి ఆగిందామె. అతను కార్లో కూర్చొని మరోసారి ఆమెవంక చూసి, చిన్నగా నవ్వాడు. కారు వెళ్ళిపోయింది.
    కాంపౌండ్ లోని చుట్టుపక్కల ఇళ్ళందరూ ఆమె చుట్టూ మూగేశారు.
    "ఎవరండీ ఆయన?"
    "వర్ధనరావుగారు_గంధర్వా ఫిలంస్ ప్రొడ్యూసరట..."
    "అంటే...మీ నవలేదయినా సినిమాకి తీసుకొంటున్నారా?"
    "అవును!"
    "ఏ నవల?"
    "జీవిత సోపానాలు"
    మరుక్షణంలో ఆ ప్రాంతమంతా ఆ నవల గురించిన చర్చల్లో మునిగిపోయింది.
    మాధవరావు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొస్తూనే అతని నోట్లో పంచదార వేసింది సీత.
    "మళ్ళీ ఏమిటి తీపి కబురు? మళ్ళీ నెలతప్పిందా?" నవ్వుతూ అడిగాడు మాధవరావు.
    "ఛీ! అదికాదు. మధ్యాహ్నం సినిమా ప్రొడ్యూసర్ ఒకాయన వచ్చాడు. నా నవల "జీవిత సోపానాలు" ఆయనకు అద్భుతంగా ఉందట. ఇప్పుడు సినిమా తీస్తాట్ట దాన్ని. మరో శుభవార్త ఏమిటంటే దానికి సంభాషణలు కూడా నేనే రాయాలిట."
    సహజంగానే ఈ వార్త మాధవరావుకి దిగ్భ్రాంతి కలిగించింది. అతని అనుమానం మరింత బలపడిపోయింది. అవును! సీత ఆకాశం అంత ఎత్తుకి ఎదిగి పోతోందనుకొన్న తన ఆలోచన తప్పు కాదు.
    "ఆయన డబ్బెంత ఇస్తానన్నారో తెలుసా?" మళ్ళీ అడిగింది సీత.
    "ఎంత?" అడిగాడు మాధవరావు.
    "మీరే చెప్పండి చూద్దాం!"
    మాధవరావు ఓ క్షణం ఆలోచించాడు.
    "పదివేలు"
    "ఫెయిలయి పోయారు..."
    "ఎంత మరి?"
    "ఇరవై వేలు..."
    "ఈజిట్?" విస్మయంతో అడిగాడు.
    "అవును! అందరికీ అయితే పదహారువేలకంటే ఎక్కువివ్వరట. కానీ ఆయనకు నేనంటే అభిమానం ఎక్కువయిపోవడం వల్ల ఇరవైవేలు చేసేశారు"
    "చాలా పెద్దమొత్తం కదూ!" ఇంకా నమ్మకం చాలనట్టు అడిగాడతను.
    "నేనూ నమ్మలేకపోయాను ముందు! ఆయనెంత మంచివారో తెలుసా మీకు? "అంత పెద్ద మొత్తమే" అని అంటే_ "నా దగ్గారంటే అన్నావ్ ఇంకే సినిమా వాడిదగ్గరా ఈ మాట అనకు_నెత్తిన టోపీ పెట్టేస్తారు" అని సలహా ఇచ్చారు"

 Previous Page Next Page