Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 26


    "భలేవారే ఇవికూడా సహాయాలేనా ఏమిటి?" తనూ నవ్వుతూ అంది.
    నాదో విచిత్ర మనస్తత్వం సావిత్రిగారూ! చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యమైనవిగా తీసుకుంటాను! ఎంతో ముఖ్యమయిన విషయాలు తేలిగ్గా చూస్తాను! ఈ మనస్తత్వం మూలాన నేను చాలా నష్టపోయాననుకోండి! అయినాగాని మనస్తత్వం మార్చుకోవడం అంత తేలికకాదు గదా...? అది దేముడెలా రాస్తే అలాగే ఏర్పడిపోతుంది. ఒకోడు పెళ్ళాంబిడ్డలని కూడా వదిలేసి ఇరవై నాల్గు గంటలూ తాగుతుంటాడు. చివరకు తాగుడులోనే చస్తాడు కూడా! అలా చేయడం తప్పని వాడికి తెలీదూ! అతిగా తాగితే చస్తారని తెలీని వారెవరుంటారు? అయినా గాని అది వదలక పోవడానికి కారణం ఏమిటి? వాడి మనస్తత్వం. అది మారడం వాడిచేతుల్లో ఉంటే అలా ఎందుకు జరుగుతుంది? అలాగే అన్నిరకాల మనస్తత్వాలూనూ! ఒకడు తినకుండా డబ్బు దాచుకొనేవాడూ, ఒకడు దొంగతనాలు, లూటీలు చేసేవాడు...మీకు "బోర్ కొడుతున్నాను కదూ..." ఠక్కున ఆపి నవ్వుతూ అడిగాడతను.
    "అదేం లేదు...! సరదాగా వుంది మీ మాటలు వింటూంటే!"
    "నేనుట్టి మాటల పోగునులెండి! హాకీ మూలాన తిరిగి ఈ మాటలు నేర్చుకొన్నాను..."
    "సాధారణంగా హాకీ బాగా ఆడేవాళ్ళకి గవర్నమెంట్ సంస్థల్లోగానీ, ప్రయివేట్ సంస్థల్లోగాని ఉద్యోగాలు దొరుకుతాయి కదా?"
    "అది పూర్వం సంగతండీ! ఒలింపిక్స్ లో మనవాళ్ళు గెలిచిన కొత్తలో తర్వాత ఎవరూ కేర్ చేయటం లేదు. ఇప్పుడు ఎవరు చూసినా క్రికెట్! అన్నిచోట్లా. క్రికెట్ ఇంపార్టెన్స్! డబ్బు కూడా అంతేగా! క్రికెట్ ప్లేయర్స్ లక్షలు సంపాదిస్తున్నారు. కానీ హాకీ, ఫుట్ బాల్ వాళ్ళకు వేలమీద కూడా ఉండదొకసారి_ అయినా మరో ఉద్యోగం లేకుండా కేవలం హాకీ ఆడటమే ఉద్యోగంగా ఉండేట్లయితే ఎవరికయినా ఆ ఆట మీద ఆసక్తి ఉంటుంది. నాలాంటి మిడిల్ క్లాస్ ఫెలోస్ హాకీ ఆడుకుంటూ కూర్చుంటే తిండెవరు పెడతారు?"
    అతని మాటలు నిజమేననిపించింది సావిత్రికి.
    శాంత షటిల్ అద్భుతంగా ఆడేదట_కానీ ఆరోజుల్లో! అలాగే తన ఫ్రెండ్ ఉమ వాలీబాల్ బ్రహ్మాండంగా ఆడేది. ఎప్పుడూ పేపర్లలో ఆమె ఫోటో వస్తుండేది.
    లోపలకు వెళ్ళి స్టౌవ్ మీద 'టీ' తయారుచేసుకొచ్చిందామె.
    అతని దృష్టి తన రూపం మీదే ఉండటం తనకు తెలుస్తూనే వుంది.
    "పొగడటం కాదు గానీ మీరు 'టీ' చాలా బాగా చేస్తారు" అభినందిస్తూ అన్నాడతను.
    సావిత్రి ఆనందంతో వుక్కిరిబిక్కిరయింది.
    "నా కోసమయితే ఇంత కష్టపడను_ఏదో ఇన్ని ఏళ్ళుగా తాగేస్తాను. గెస్ట్ ల కయినా సరిగ్గా ఇవ్వకపోతే_ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు."
    అతను నవ్వాడు. ఇంకా అతని చూపులు వుండుండి తన శరీరమంతా పాకి తనకు చక్కిలిగిలి కలిగిస్తూనే ఉన్నాయి.
    "అతనికి తనమీద ఆ ఆసక్తి ఏర్పడిందా?"
    ఛీ_! ఏమిటి ఆలోచనలు? ఎందుకిలా ఆలోచిస్తోంది? ఒకసారి తగిలిన గాయాన్ని అప్పుడే ఎలా మర్చిపోగలిగింది?
    ఎందుకు మళ్ళీ కోరికల కళ్ళేన్ని వదిలేస్తోంది?
    అతనికి తనమీద ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా__
    "ఓ పక్క ఉద్యోగం లేదని నేనేడుస్తోంటే__మా ఇంటి దగ్గర్నుంచీ ఉత్తరాలు_ పెళ్ళి సంబంధాలొస్తున్నాయట నాకు!" నవ్వుతూ చెప్పాడతను. "ఎంత ఫార్స్ గా ఉందో చూడండి! ఓ సంబంధం వాళ్ళయితే ఉద్యోగం కూడా వాళ్ళే ఇప్పిస్తామంటున్నారట."
    "అయితే అదే వప్పుకోవడం మంచిదనుకుంటాను! ఈ రోజుల్లో అంతకంటే కావలసిందింకేముంది__?" అతని మనసులోని అభిప్రాయం తెలుసుకోవాలని అంది సావిత్రి.
    "భలేవారే__ఉద్యోగం ఇప్పిస్తే సరిపోయిందా. జీవితాంతం కలసి గడిపే అమ్మాయి ముఖ్యమా_ ఉద్యోగం ముఖ్యమా? నాకు ఉద్యోగం రాకపోయినా ఫర్వాలేదండీ. మా ఊళ్ళో కిళ్ళీషాప్ అయినా ఓపెన్ చేసుకుని బ్రతగ్గలను గానీ నాకు నచ్చని అమ్మాయిని చేసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్పాడు.
    సావిత్రికి పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లయింది.
    తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే అవకాశం వచ్చింది. తన వంటరితనం సెల్ నుంచి బయటపడుతుందా ఈసారయినా?
    కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయినాయి.
    "మీరు ఏమిటో ఆలోచిస్తున్నట్లున్నారు_" అన్నాడతను.
    శాంత ఆలోచనల్లో నుంచి బయటికొచ్చింది.
    "మరేం లేదు_మా ఫ్రెండ్ శాంత గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ మదర్ కెలా ఉందో ఏమో ఇంతవరకూ రాలేదు. ఉత్తరం కూడా లేదు."
    "ఆమె లేకపోవటం వల్ల మీకు చాలా బోర్ వుంటుందనుకుంటాను."    
    "అవును! ఎప్పుడూ ఏదొకటి మాటలాడుతూంటుంది. తను వుంటే సమయం ఎంతో త్వరగా గడిచిపోతుంది."
    "మా ఫ్రెండ్ సుధాకర్ కూడా అంతే! ఎప్పుడూ ఏదొక విషయం గురించి చాలా ఫన్నీగా మాట్లాడుతుంటాడు. బాచ్ వాళ్ళందరం వాడింటికెళ్ళి కూర్చునేవాళ్ళం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ. అక్కడే వుద్యోగాల కోసం న్యూస్ పేపర్లు వెదకటం, అక్కడే అప్లయ్ చేయటం.

 Previous Page Next Page