ఆ కుర్రాడు ఓ లావుపాటి పుస్తకం తీసి అందించాడు.
"ఎంత ఇది?" అడిగాడు వర్ధనరావ్ ఆత్రుతగా.
"రోజుకి అర్థరూపాయి సార్!"
"నాకు అద్దెకు కాదు కావలసింది. కొనడానికి కావాలి."
వాడు ఓ క్షణం ఆలోచించాడు. "పన్నెండు రూపాయలు సార్!"
వర్ధనరావ్ పన్నెండు రూపాయలిచ్చి పుస్తకం తీసుకుని ఆనందంగా నడవసాగాడు. పుస్తకంలో పేజీలు తిరగేశాక నవల వెనుకవేపు చూశాడు. నడుస్తున్నవాడల్లా ఠక్కున నిలబడిపోయాడు.
వెనుక దీప్ చంద్ ఫోటో, కింద అతని వివరాలు.
ఆ ఫోటో వంక నిర్ఘాంతపోయి చూస్తూండిపోయాడతను. తమ ఆంధ్రప్రదేశ్ హౌస్ లో వున్నది ఆ ఫోటోలోని వ్యక్తి కాదు.
* * * *
మధ్యాహ్నం డిన్నర్ టేబుల్ చాలా హడావుడిగా వుంది. అప్పల్రాజు, తమ హెల్త్ మినిష్టర్ గా పనిచేసినప్పటి అనుభవాలు చెప్తున్నాడు. అతని మాటలు వినిపించుకోకుండా శమంతకమణి 'టైగర్స్ క్లబ్'లో కొత్తగాచేరి ఆ మీటింగ్ కోసం విచ్చేసిన కాకినాడ శ్యామలారాణితో క్లబ్ ఔన్నత్యం గురించి చెప్తోంది. మనోచిత్ర తదేకంగా భవానీశంకర్ వంక ఆరాధనతో చూస్తోంది. భవానీశంకర్ ప్రేమనంతా ఒలకబోస్తూ కన్యక వేపు చూస్తున్నాడు. వర్ధనరావ్ భోజనాలయ్యాక తను భవానీశంకర్ తో జరుపబోయే చారిత్రాత్మక సమావేశం ఎలా వుండాలో రిహార్సల్స్ వేసుకుంటున్నాడు.
"మీ నవలలంటే నాకు చాలా ఇష్టం దీప్ చంద్ గారూ" అంది శ్యామలారాణి హఠాత్తుగా.
"థాంక్యూ!" అన్నాడు భవానీశంకర్.
"ఒకసారి కొత్తగా పెట్టిన మా కాకినాడ టైగర్స్ క్లబ్ కి కూడా మీరు అతిథిగా వస్తే చాలా సంతోషం."
"తప్పక వస్తాను మేడమ్! ఎక్కడ ఆహ్వానముంటే అక్కడ నేనుంటాను."
ఇప్పుడు అప్పల్రాజు గొంతు మరికొంత పెద్దదయింది.
"...అప్పుడు ఆ డాక్టరేమన్నాడో తెలుసా? ఆపరేషన్ చేయాలంటే వెయ్యిరూపాయలు ఇవ్వాల్సుంటుందన్నాడు. సరేనని చెప్పి జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసి లెక్కపెట్టి ఇచ్చాను. అతను తీసుకొంటూండగా నా వెనక నిలబడ్డ యాంటీ కరప్షన్ వాళ్ళు అతనిని అరెస్టు చేశారు. అప్పుడు తెలిసింది ఆ డాక్టర్ కి నేను హెల్త్ మినిష్టరునని."
కొంచెం గాప్ ఇచ్చి అందరివంకా సగర్వంగా చూశాడతను. కానీ అతని మాటలెవరూ పట్టించుకోలేదు. ఆ గ్యాప్ ను ఆసరాగా తీసుకుని శమంతకమణి తమ 'టైగర్స్ క్లబ్' అనుభవాల్లో కొచ్చేసింది.
"ఓసారి నల్గొండలో మా క్లబ్ బ్రాంచివాళ్ళిలాగే స్కూల్ పిల్లలకు ఆటల పోటీలు కండక్టు చేయాలని ఫండ్స్ పోగుజేశారుగానీ ఆ పోటీలు నిర్వహించలేదని నాకు తెలిసింది. వెంటనే నేను అక్కడికి వెళ్ళి అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న సీతాలక్ష్మిని డిస్మిస్ చేసిపారేసి యమునారెడ్డిని ప్రెసిడెంట్ చేసేశాను. రెండు రోజులు నేనక్కడే ఉండి ఆ పోటీలు నిర్వహించి బహుమతులు పంచిపెట్టాము."
"మీరు నవలలెలా రాస్తారు దీప్ చంద్ గారూ! కథలు ఎలా అల్లుతారు? ఎక్కడయినా జరిగిన సంఘటనల నుంచా లేక అంతా ఊహా కల్పనలేనా?" అడిగింది శ్యామలారాణి.
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు.
"అనేక రకాలుగా ఉంటుందిలెండి అది! ఓసారి నేచురాలిటీ కోసం నెలరోజులు చేపలుపట్టే వాళ్ళమధ్య_ వాళ్ళతోపాటు తిరుగుతూ తింటూ గడిపి_వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుని నవలరాశాను. అది సహజత్వానికి దూరంగా ఉందని పాఠకులు కొట్టి పారేశారు. దాంతో వళ్ళుమండి ఇంకో నవల_ఏమాత్రం నేచురాలిటీ లేకుండా ఊహాలోకంలో విహరించేటట్లుగా రాశాను. హీరోయిన్ కి నాగదేవత ఇష్టదైవం. ఆమె భర్త క్లబ్ ల్లో, బార్స్ లో తిరుగుతూ ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. హీరోయిన్ పాముని ప్రార్థిస్తుంది. ఆ పెళ్ళి ఎలాగయినా ఆపమని వేడుకుంటుంది. నాగదేవత వెంటనే పెళ్ళిమండపం మీద ప్రత్యక్షమయి పెళ్ళిపీటల మీద కూర్చున్నవారిని పారిపోయేలా చేస్తుంది. దాన్ని కర్ర తీసుకుని కొట్టబోయినవారికి చేతులు పడిపోతాయ్. అంటే పక్షవాతం వచ్చేస్తుందన్నమాట. పెళ్ళికొడుక్కి కళ్ళు పోతాయ్. దాంతో ఆ అమ్మాయి అతనిని చేసుకోడానికి నిరాకరిస్తుంది. అప్పుడతను తిరిగి తన భార్యదగ్గరకెళ్ళి క్షమించమని వేడుకుంటాడు. ఈ నవల అద్భుతంగా, సహజత్వం ఉట్టిపడుతోందని లక్షల ఉత్తరాలొచ్చాయ్..."
మనోచిత్ర ఆశ్చర్యపడింది.
"అదేమిటి_ఆ నవల నేనే పత్రికలోనూ చదవలేదే?" అంది విస్తుబోతూ.
భవానీశంకర్ కేం చెప్పాలో తెలీలేదు.
"చదవలేదా?"
"చదవలేదు. మీ నవలలన్నీ నేను వదలకుండా చదివాను..."
"ఓ! అయితే ఇది డైరెక్ట్ నవల అయుంటుంది. సీరియల్ గా వచ్చి ఉండదు"
"ఆ నవల పేరేంటి?" ఆత్రుతగా అడిగిందామె.
"ప్రేమ పడగలు"
"మైగాడ్! మిస్సయ్యాను! రేపే హైద్రాబాద్ నుంచి తెప్పిస్తాను."
"నోనో...లాభం లేదు డియర్! అది అవుటాఫ్ స్టాక్! పద్నాలుగు ఎడిషన్లు ప్రచురించినా వారం రోజుల్లో కాపీలయిపోతున్నాయ్! దాంతో పాఠకుల మీద విసుగుపుట్టుకొచ్చి ఆ పబ్లిషర్ ఇంక అది ప్రచురించడం ఆపేశాడు..."
"ఓ!" నిరుత్సాహపడిపోయిందామె. "పోనీ మీ దగ్గరో కాపీ ఉంటుంది కదా! అది ఇస్తారా! రెండు గంటల్లో చదివి మీకిచ్చేస్తాను మళ్ళీ"
"ఓ! డెఫినెట్ లీ మైడియర్ ఫ్రెండ్! తప్పక తెప్పిస్తాను మా ఇంటి నుంచి."
భోజనాలు ముగిశాయ్.
తన గదిలోకి చేరాడు భవానీశంకర్. అయిదు నిమిషాలు కూర్చున్నాడో లేదో డోర్ బెల్ మోగింది.
"కమిన్"
వర్ధనరావ్ లోపలికొచ్చి అతనికెదురుగ్గా కూర్చున్నాడు.
"మీకిక్కడ అన్నీ సౌకర్యంగా ఉన్నాయా గురూజీ..."
"అత్తగారిల్లులా ఉంది."
"ఆతిథ్యం విషయంలో మా బావగారు మహా నిక్కచ్చిగా ఉంటారులెండి!"
"నన్నడిగితే ఆయనకు సన్మానం చేయాలి__ ఇంతకూ నువ్వేం చేస్తున్నావ్ బ్రదర్! ఇంకా చదువుతున్నావా?"
"లేదు గురూజీ! డిగ్రీ అయిపోయింది. ఏదయినా బిజినెస్ చేయాలని నా ప్లాన్! కానీ అక్కకీ బావకీ అదిష్టం లేదు..."
"ఎందుకని?"
"నేను డబ్బంతా ఆర్పేస్తానని వాళ్ళ అనుమానం..."
"వెరీబాడ్_"
"మీరే చెప్పండి! సినిమా తీస్తే మనం ఆరిపోతామా?"
"నెవర్ డియర్! మన సినిమా కొన్న ఏరియావాళ్ళు ఆరిపోతారు గానీ మనకేం ఫర్లేదు..."
"అదే చెప్తే మావాళ్ళు నమ్మటం లేదు..."
"పూర్ నాలెడ్జ్_"
"పోనీ రేసు గుర్రం ఒకటి కొని...రేసులో పరుగెత్తిస్తానన్నాను. దానికీ ఒప్పుకోవటం లేదు. మీరే చెప్పండి! రేసు గుర్రం పరిగెత్తితే ఎంత లాభం?"
"తెగలాభం అని విన్నాను బ్రదర్__"
"అవునా! దానికీ ఒప్పుకోవటం లేదు__"
"నిజం చెప్పాలంటే...అసలేపనీ చేయకుండా ఇలా జీవితాంతం గడిపేస్తే చాలా బావుంటుందని నా అభిప్రాయం..." అన్నాడు భవానీశంకర్.
"అది నాకూ ఇష్టమే గురూజీ! కానీ మరి శిరీషను మారేజ్ చేసుకోవటం ఎలా?"
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"శిరీషెవరు?"