డ్రింకింగ్ అంటే గుర్తొచ్చింది. ఈవేళ రాత్రి ఎనిమిది గంటలకు ఓ స్నేహితుడింట్లో పార్టీ వుంది. ఈ సోఫిస్టికేటెడ్ సొసైటీలో విసుగూ విరామం లేకుండా షోషల్ కాంటాక్ట్ లు పెట్టుకుంటూ వుండాలి. లేకపోతే మనిషి క్రమంగా గుర్తింపు కోల్పోయి సైడ్ స్క్రీన్ లోకి వెళ్ళిపోతాడు.
శ్రీనివాసరావుకు ఇంకో సత్యం స్ఫురణకి వచ్చింది. విచ్చలవిడితనం తెగబలిసిపోయిన ఈ ఆధునిక సమాజంలో మానవుడికి దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తిరుపతికి వెళ్ళేవాళ్ళూ, స్వామి అయ్యప్ప దీక్ష తీసుకుని మెళ్ళో మాల వేసుకునేవాళ్ళూ, పుట్టపర్తి సాయిబాబా భక్తులూ, షిర్డీ సాయిబాబా భక్తులూ, కాశీ, కన్యాకుమారి, కేదారనాథ్, బదరీనాథ్, ఎన్నో ప్రయాసలకోర్చి అమర్ నాథ్...యిలా తెరిపి లేకుండా తీర్థయాత్రలు చేసేవాళ్ళూ, ఇళ్ళలో నిత్యం పూజా పునస్కారాలు చేసేవాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే యిక్కడ ఓ నిజం ఒప్పుకోక తప్పదు. ఈ పూజలూ, భక్తి శ్రద్ధలూ నటనకాదు. నిజ జీవితంలో వికృతంగా ప్రవర్తిస్తోన్నా యిందులో మాత్రం ఆత్మవంచన లేదు. ఏ కొద్దిమంది విషయంలోనే తప్ప త్రికరణ శుద్ధిగానే చేస్తున్నారు. ఈ రెండు ప్రవృత్తులూ సమాంతర రేఖల్లా సాగిపోతున్నాయి.
ఆ మాటకొస్తే తనలోకూడా యీ ద్వంద ప్రవృత్తి ఉంది. ప్రతిరోజూ ఉదయం, ఓ అరగంటసేపు పూజ చేస్తాడు. ఏడాదికి ఒకటి రెండుసార్లు తిరుపతి వెళ్ళి వస్తాడు. కల్యాణం, అభిషేకం వగైరాలు శ్రద్ధగా చేయిస్తాడు. కాని లోపలవున్న బలహీనతలూ, వికృత మనస్తత్వం పుష్కలంగా వాటిపని అవి చేసుకుపోతూ వున్నాయి.
శ్రీనివాసరావు ఇంటికి చేరుకున్నాడు.
ఆ యింటి వాతావరణం విచిత్రంగా వుంటుంది. అతనికి నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, యిద్దరు కూతుళ్ళు, ఇంకో యిద్దరు పుట్టి నాలుగయిదేళ్ళు పెరిగి చచ్చిపోయారు. భార్యా రాధాబాయి నలభయి అయిదేళ్ళ వయసున్నా పర్సనాలిటీలోని గొప్పతనంవల్ల కానీ, అలంకారంలోని మెలకువల వల్ల గానీ, యింకా చిన్నదానిగానూ, ఆకర్షణీయంగానూ కనబడుతుంది.
ఆ యింట్లో అతనంటే ఎవరికీ లెక్కలేదు. అతను సంపాదిస్తోన్న డబ్బు మాత్రం యధేచ్చగా వాడుకుంటూ వుంటారు. వాళ్ళని కంట్రోల్ లో పెట్టటానికి ప్రయత్నించి, విఫలమై వూరుకున్నాడు.
భార్య రాధాబాయి మీదకూడా అతనికెలాంటి కంట్రోల్ లేదు. ఆమె వాళ్ళకున్న రెండో కారులో ఎప్పుడూ ఏదో ప్రోగ్రాం వున్నట్టు తిరుగుతూ వుంటుంది. ఇంట్లో వండి పెట్టటానికి వంటమనిషి వుంది. పనంతా చేసిపెట్టటానికి పనిమనుశులున్నారు.
పిల్లలు ఎప్పుడూ ఎవరి గదుల్లోవారు, వాళ్ళవాళ్ళ స్నేహితులతో ఉంటారు. వాళ్లెం చేస్తున్నారో, చెయ్యదలుచుకున్నారో తండ్రికీ చెప్పరు. ఎప్పుడన్నా అవసరమున్నప్పుడు మాత్రం తండ్రితో మాట్లాడతారు. ఆ మాటలు చాలా ముక్తసరిగా వుంటాయి. అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే అవి దెబ్బలాటలా ఉంటాయిగానీ, సరళంగా వుండవు. మొగపిల్లలిద్దరూ సిగరెట్లు కలుస్తారు. ఇద్దరూ డ్రింకింగ్ అలవాటయింది. గరల్ ఫ్రెండ్సూ వగైరా వ్యవహారాలు చాలా వున్నాయి. ఎప్పుడూ పార్టీలూ, విందులూ అని ఎక్కడికో అక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఆడపిల్లల తీరు కూడా అనాలే ఉంటుంది. సినిమాలు, షికార్లూ, బాయ్ ఫ్రెండ్సూ చాలా బిజీగా ఉంటారు. ఇతరుల గురించి వాళ్ళు చేసే సంభాషణల్లో బోలెడు వెటకారం, హేళనా నిండి ఉంటాయి. ప్రవర్తనలో, మాటల్లో అణువణువునా అహంకారం మిడిసిపడుతూ ఉంటుంది. ప్రపంచంలో వాళ్ళకు ఆఖర్లేని విషయమంటూ లేదు. నచ్చినదీ లేదు. ఆడపిల్లలై పెద్దవాళ్ళకు చెప్పా పెట్టకుండా బయటకెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికని అడిగితే చెప్పరు. చెప్పకపోగా వాళ్ళకు కోపం కూడా వస్తూ ఉంటుంది. 'మా గురించి మాకు తెలుసు అంటారు. ఇహ శ్రీనివాసరావూ, రాధాబాయీ మాట్లాడుకుంటే అవి మాటల్లా ఉండవు. పోట్లాటల్లా ఉంటాయి. ఇద్దరిమధ్యా ఒకరంటే ఒకరికి బోలెడు ద్వేషం. విరక్తి ఉన్నాయి. ప్రేమ అనేది వాళ్ళలో అంతరించిపోయి చాలా రోజులయింది. మొదట్లో వుండేది అది కామమో, వ్యామోహమో, ఆకర్షణో, అవసరమో ఇద్దర్లో ఎవరికి యిప్పుడు గుర్తులేదు.