మొదలియార్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నాడు. తను డి.యంయస్. అయిపోయినట్టే భావించాడు.
"తమరు తలచుకొంటే ఇరవైగంటలే చాలు" అన్నాడు.
"మరీ ములగచెట్టు మీదకు ఎక్కించకండి. ప్రయత్నం చెయ్యవచ్చనే అనుకుంటాను" అంది అరుంధతి.
"తమరి దయ ఉంటే!"
"ఏమయ్యా బషీర్?" కంఠంలో కరుకుతనానికి, బషీర్ కు ముచ్చెమట్లు పోశాయి.
"రఘుపతిరావుగారికి ఇవ్వటానికి నిర్ణయం ఐపోయింది." చిన్నగా అన్నాడు బషీర్.
"అయిపోయిన నిర్ణయాన్ని గురించి మాట్లాడతారేమండీ? కాబోయే నిర్ణయం గురించి మాట్లాడండి" అంది విసురుగా అరుంధతి.
"తమరు తలుచుకుంటే అసంభవం ఏమీలేదు" అన్నాడు బషీర్.
"ఏమండి కుక్కుటేశ్వరరావుగారూ! మీకు ఇప్పట్లో ప్రమోషన్ ఛాన్స్ ఏమీ ఉండదా?"
కుక్కుటేశ్వరరావు దిగ్గున లేచి నిల్చున్నాడు.
"మొదలియార్ గారు డి.యం.యస్. ఐతే సూపరింటెండెంట్ పోస్టు ఖాళీ ఔతుంది" అన్నాడు కుక్కుటేశ్వరరావు. ఇంకా నిల్చునే ఉన్నాడు.
"కూచోండి" అంది అరుంధతి.
"ఆ పోస్టు నీకెలా వస్తుంది? నీకు పైన సీనియర్స్ ఇద్దరు ఉన్నారుగా!" గబుక్కున అనేశాడు మొదలియార్.
కుక్కుటేశ్వరరావుకి మహ చెడ్డకోపం వచ్చేసింది. మొదలియార్ తనపై అధికారి అనే విషయాన్నికూడా విస్మరించాడు.
"రఘుపతి మీకంటే సీనియర్ కదూ?"
మొదలియార్ ముఖంలో నెత్తురుచుక్క లేదు. అసలే జిడ్డుగావుండే ముఖమేమో ఇంకొంచెం జిడ్డుకారుతూంది.
అరుంధతి నవ్వొచ్చింది. కాని నవ్వలేదు.
"అయితే ఇంకేం, మీ ఇద్దరూ ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోండి" అంది.
మొదలియార్ కు తన తెలివితక్కువతనానికి తనమీద తనకే కోపం వచ్చింది. కుక్కుటేశ్వరరావుకు మొదలియార్ని చింతచెట్టుకు కట్టి తుమ్మబరికెతో కొట్టాలనిపించింది.
"ఈ తెలివితేటల్తోనా ఒకరు డి.యం.యస్., మరొకరు సూపర్నెంటు కావాలని చూస్తున్నారు!" అనేసింది అరుంధతి.
ఇద్దరూ వెర్రిముఖాలు పెట్టారు.
"మీకున్న తెలివితేటలకు ఈ ఉద్యోగాలే ఎక్కువ అనిపిస్తూంది నాకు" అంది వాళ్ళ ముఖాల్ని వినోదంగా చూస్తూ.
"దీనమ్మ కడుపుకాలా! రివర్షన్ గాని ఇప్పించదు కదా!" భయపడిపోయాడు కుక్కుటేశ్వరరావు.
మొదలియార్ కు మతిపోయినంతపనయింది. వెర్రిచూపులు చూశాడు.
"లేకపోతే ఏమిటండీ! సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ తెచ్చుకోవటానికి నాదాకా రావాలా?" పకపక నవ్వింది అరుంధతి.
కుక్కుటేశ్వరరావు కర్చీఫ్ తో అరచేతులకు పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. మొదలియార్ తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. అరుంధతి సాధారణంగా తనదగ్గర పనులు చేయించుకోవటానికి వచ్చినవాళ్ళముందు నవ్వదు. ఆమె నవ్వుతో వాళ్ళూ శ్రుతి కలిపి నవ్వబోయి ఠక్కున ఆగిపోయారు. అప్పటికే ఆమె చాలా గంభీరంగా ముఖం పెట్టింది.
"వీళ్ళు నిజంగానే దద్దమ్మలు" అనుకుంది అరుంధతి మనస్సులోనే.
"ఆపరేషన్లు చేస్తూ చేస్తూ పరుగెత్తుకొచ్చి, మీరు ఇంతింతసేపు ఇక్కడ ఉంటే మీరేం డాక్టర్లు?" అంది అరుంధతి.
"ప్రాణాలన్నీ అక్కడే ఉన్నాయమ్మా! తమరు అనుమతి ఇవ్వలేదని ఇంతసేపూ కూచున్నాను. వస్తాను, నమస్కారం" అంటూ మొదలియార్ లేచి నిల్చున్నాడు.
కుక్కుటేశ్వరరావు మాట్లాడే స్థితిలో లేడు. చెమటలు కారుతున్న చేతుల్ని జోడించి సెలవు తీసుకుని బయటకు నడిచాడు.
"రేపు రండి! రాత్రికి మీ విషయం ఆయనతో మాట్లాడుతాను" అంది.
"అలాగేనమ్మా!" అని యిద్దరూ ఒకేసారి అనేశారు. గబగబా బయటకు వెళ్ళిపోయారు. మరో క్షణం ఆలస్యంచేస్తే ఈ స్వర్గంనుంచి మళ్ళీ నరకంలోకి తోసేయబడవచ్చునని బయపడ్డారు.
"ఏమండీ బషీర్ గారూ! ఏమయినా వీలుంటుందంటారా?" అంది బషీర్ ముఖంలోకి నిశ్చలంగా చూస్తూ.
"లాభంలేదు" అనాలనుకున్నాడు. "తమరు కావాలంటే తప్పక అవుతుంది అనేశాడు.
వాకిట్లో కారు ఆగిన శబ్దం అయింది.
"మీరు కూడా వెళ్ళండి. రేపు రండి. మీ విషయంకూడా ఈ రాత్రికే మాట్లాడతాను" అంది అరుంధతి.
వంగి సలాంచేసి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు డిప్యూటీ సెక్రెటరీ బషీర్.
విమలాదేవీ, రామినీడూ లోపలకు వచ్చారు.
"చూడండి నాగేంద్రరావుగారూ! విమలాదేవికి గెస్టురూం చూపించండి వెళ్ళండి! మీ బట్టలూ,సామాను ఆ గదిలోనే పెట్టుకోండి. కాస్త ఇవాళ వంటపని చూసుకోండి" అంది అరుంధతి.
"నాయర్ గాడు చెప్పా పెట్టకుండా ఉడాయించాడు, మళ్ళీ కనిపిస్తే తాట వలిపిస్తాను." అంది మళ్ళీ.
విమలాదేవీ, నాగేంద్రరావు పైకి వెళ్ళారు.
"మీకు సీటు రావటం కష్టమే నంటున్నారు అయన" అంది అరుంధతి రామినీడు కేసి నిశితంగా చూస్తూ.
రామినీడుకు నీరసం వచ్చేసింది.
"అలా అనకండి. రాజారావుగారు ప్రయత్నిస్తే రాకపోవడం అంటూ వుండదు. ఆఁ- మర్చిపోయాను. ఎంబాసిడర్. ఈ నెలాఖరుకు సప్లయ్ చేస్తామన్నారు కంపెనీవారు."
"ఏమిటీ మీ ఉద్దేశం?" అరుంధతి ముఖం ఎర్రగా చేసుకుంటూ ప్రశ్నించింది.
"ఎంత మాటన్నారమ్మా! హడావిడిలో చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నన్ను అపార్ధం చేసుకోకండి" అన్నాడు చెట్టంత మనిషి పిట్టంత అయిపోయి.
"ఎంబాసిడర్ అక్కర్లేదు. మీ పాతకారు నాకు నచ్చింది. అదే వాడుకుంటాను. మర్చిపోయాను నేను కూడా చెప్పటం. మహబూబ్ నగర్ వెళ్ళే దారిలో నాకు పాతిక ఎకరాలు వున్న సంగతి మీకు తెలుసుగా? ఆ స్థలం కూడా చూశారనుకుంటాను."
"అవును చూశాను - చెప్పండి."
"దానిపక్క పొలాలు బేరానికి వచ్చాయట. ఎకరం మూడు వందలేనట. పాతిక ఎకరాలు దొరుకుతుందేమో కనుక్కోండి" అంది అరుంధతి.
"నేను ఎం.పి. అవుతానో, కానో తెలియటం లేదు. కాని సీటు సంపాదించేసరికి బికారినయ్యేలా వున్నాను" అనుకున్నాడు రామినీడు.
"ఏమిటలా నీరుకారి పోతున్నారు? డబ్బు నేనే ఇచ్చుకుంటాను. కొంచెం మీరు బేరంచేసి పెట్టండి." స్వరం చాలా చురుగ్గా వుంది.
"డబ్బు విషయం కాదమ్మా నేను ఆలోచిస్తున్నది! మొన్న ఎవరో ఆ విషయం నాతో అన్నారు- అక్కడ పొలాలు అమ్మకానికి వున్నాయని, ఆ చెప్పిన వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నాను." ఠపీమని అతికే అబద్ధం చెప్పాడు.
"అలా దారిలోకి రా" అనుకుంది అరుంధతి.
"మీరు వెళ్ళిరండి!" అంది లేచి నిల్చుంటూ.
"ఆ పొలాల సంగతి కనుక్కోవటానికి రేపే వెళతాను" అని చెప్పి నమస్కరించి బయటపడ్డాడు. ప్రాణానికి హాయిగా వున్నట్లనిపించింది.
28
"మా రాణీగారు తమకోసం పంపించారు" అన్నాడు రాజావారు ఓ పెద్ద పాకెట్ ను పక్కనేవున్న బల్లమీద పెడుతూ. అరుంధతి కుతూహలం కానీ, సంతోషంగాని ప్రదర్శించలేదు. కనీసం దాన్ని గురించి విన్నట్టయినా ప్రవర్తించలేదు. రాజావారికి వళ్ళు మండిపోయింది. అరుంధతి విమలాదేవిని కేకవేసి రాజావారికి కాఫీ తీసుకురమ్మని పురమాయించింది. వెళుతూ వెళుతూ విమలాదేవి అక్కడ వున్న పాకెట్ ను తీసుకెళ్ళింది లోపలకు. అరుంధతి గమనించనట్లే ఉండిపోయింది.
"రామినీడుగారికి సీటు వచ్చిందంటున్నారు" అన్నాడు కుమార్ రాజా.
"వచ్చినట్టే. మీ విషయమే అనుమానంగా ఉంది. చాలా కష్టం అన్నారు ఆయన" అంది అరుంధతి, రాజావారి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.
"తమరు తలచుకుంటే అదెంత లెండి?" అన్నాడు రాజావారు నిర్లక్ష్యంగా.
అరుంధతి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది.
"తమరి కాలుకు దెబ్బ తగిలిందని ఎవరో చెప్పారు. ఎలా ఉంది?"
"అవునండి! కాలు బెణికింది. వారం రోజులు ప్లాస్టర్ వేసి ఉంచారు. బెడ్ మీద నుంచి కదల్లేదు. కాలు నొప్పికంటే ప్లాస్టర్ నొప్పే ఎక్కువగా ఉంది. నిన్ననే ప్లాస్టర్ తీశారు. ఇంకా కొంచెం నొప్పి ఉంది. మొదలియార్ గారే స్వయంగా రెండుపూటలు వచ్చి చూస్తున్నారు" అంది అరుంధతి గర్వంగా.
రాజాగారికి వినాలనిలేదు. కాని చాలా శ్రద్ధగా వింటూ కూర్చున్నారు.
"మొదలియార్ గారే డి.యం.యస్. కావటానికి ప్రయత్నిస్తున్నాడట!" అన్నాడు రాజావారు.
"అవును. ముఖ్యమంత్రిగారికి ఇష్టంలేదు. ఆయన సీనియర్ కు ఇవ్వటానికి నిశ్చయించారట కాని, నేనే మొదలియార్ కు ఇవ్వాల్సిందని పట్టుపట్టాను" అంది గంభీరంగా.
"మీరు పట్టుపడితే పని అవకపోవటం అంటూ ఉండదు" అన్నారు రాజావారు విమలాదేవి అందించిన కాఫీ సిఫ్ చేస్తూ.
కాఫీ తాగినంతసేపు ఎవరి ఆలోచనల్లో వారు వుండిపోయారు. విమలాదేవి ఖాళీ కప్పులు తీసుకొని లోపలకు వెళ్ళిపోయింది.
"ఈవిడగారు ఇక్కడ పాచి పని చేస్తూందెందుకో!" అనుకున్నాడు రాజావారు ఆమె వెళ్ళినవైపే చూస్తూ.
"విమలాదేవిని యం.యల్.సీ.గా నామినేట్ చేయించాలని ఉంది" అంది అరుంధతి రాజాగారి ఆలోచనల్ని పసిగట్టినట్లు.
"కాలాంతకురాలు" అనుకున్నాడు రాజావారు, అరుంధతి వెంటనే తన ఆలోచనలకు సమాధానం ఇచ్చినందుకు. ఏదో ఆలోచిస్తూ జేబులోకి చెయ్యి పోనిచ్చాడు రాజావారు. అరుంధతి చూడనట్లే చూస్తూంది.
గుప్పెడు నిండుగా ఉన్న పెద్ద నోట్లకట్టను బయటకు తీశాడు. "ఇవి ఉంచండి!" అంటూ లేచి అరుంధతి చేతికి అందించబోయిన రాజావారి చెయ్యి కరెంటు షాక్ తగిలినట్లు వెనక్కి వచ్చేసింది. మరుక్షణంలో ఆ కట్ట మళ్ళీ జేబులోకి వెళ్ళిపోయింది. అరుంధతి కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి. ముక్కోళ్ళు అదురుతున్నాయి. మునిపళ్ళతో కిందపెదవిని నొక్కి పట్టింది, ఆమెలో ఉబుకుతున్న కోపాన్ని అణుచుకొనే ప్రయత్నంలో.
రాజావారు కొంచెం అటూ ఇటూ కదిలారు కుర్చీలోనే అశాంతిగా. అంతలోనే అరుంధతి పెదవులమీద చిరునవ్వు తెచ్చిపెట్టుకుంది.
"లంచం ఇస్తున్నారా?" అంది నిదానంగా.
"పొరపాటు-క్షమించండి!" అన్నాడేకాని తను పొరపాటు ఏం చేశాడో, అతనికి బోధపడలేదు.
"మీరు నాకు నోట్లకట్ట అందించి సీటు తెప్పించుకోవాలని చూస్తున్నారా? మీరు ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారనుకోలేదు. రాజవంశీకులు. మర్యాదలు తెలుసనుకున్నాను. ఇక వెళ్ళండి" అంటూ గబుక్కున లేచి లోపలకు అడుగు పెట్టి తలుపుల్ని దభీమంటూ వేసింది. రాజావారికి ఆ తలుపులు తన ముఖం మీదనే వేసినట్లు మనస్సు చివుక్కుమన్నది. త్రుళ్ళిపడ్డాడు. వెర్రివాడిలా ఆ మూసిన తలుపుల కేసి చూస్తూ నిలబడిపోయాడు. ఆయనకు జీవితంలో ఏనాడూ, ఎవరిదగ్గరా అంత అవమానం జరగలేదు.
ఎందుకిలా ప్రవర్తించింది? డబ్బు తీసుకొనే పని చేస్తుందని తను విన్నాడు. వినటం ఏమిటి? జగమెరిగిన సత్యం. దానికి సాక్ష్యం ఈ భవనమే. మరి తను డబ్బు ఇవ్వబోతే అలా పత్తిత్తులా మాట్లాడిందేం? తను ఆమెకు చేసిన అమర్యాదేమిటో ఎంత ఆలోచించినా రాజావారికి బోధపడలేదు, "చిత్రమయిన మనిషి!" గొణుక్కున్నాడు.
అడుగులో అడుగు వేసుకొంటూ, ఆలోచనల్లో మునిగిపోయి గేటులో అడుగు పెట్టిన రాజావారు "నమస్కారమండి" అనటంతో తలెత్తి చూశారు. నాగేంద్రరావు అప్పుడే గేటు తెరుచుకొని లోపలకు వస్తున్నాడు.
"నమస్కారం!" అన్నాడు రాజావారు విని వినకుండా.
"వెళుతున్నారా?" అన్నాడు నాగేంద్రరావు.
"వెళుతున్నట్టు కనిపిస్తూనే ఉందిగా?" అనాలనిపించింది వళ్ళుమండిన రాజావారికి. అంతలో ఓ ఆలోచన పుట్టింది.
"ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకండేం!"
"అయ్య ఎంతమాట! అడగండి? తమరు అడగటం నేను చెప్పకపోవటమూనా?" అన్నాడు నాగేంద్రరావు వినయంగా.
"రామినీడుకు సీటు వచ్చిందట, ఏమయినా ముట్టచెప్పాడా?"
"బాగానే ముట్టింది. మహబూబ్ నగర్ వెళ్ళేరోడ్డు పక్కన ఓ పాతిక ఎకరాల పొలం, ఇప్పుడమ్మగారు వాడుతున్న కారూ ఇచ్చారు" అన్నాడు, నాగేంద్రరావు రాజావారిని పరీక్షగా చూస్తూ.
"మరయితే నేను డబ్బు ఇవ్వబోతే లంచం ఇస్తున్నారా అంటూ కళ్ళెర్రజేసిందేం?" అడిగారు రాజావారు అయోమయంగా.
"అరెరె! ఎంతపని జరిగిందీ? ఎంత పని జరిగిందీ? మీరు అంతపనీ చేస్తారని నేను అనుకొంటూనే ఉన్నాను. నాతో మాటమాత్రం అంటే ఈ అవస్థ జరిగుండేది కాదుగా?"
రాజావారికి చిరాకు వేసింది. తను చేసినదానిలో ఉన్న అనర్ధం ఏమిటో అర్ధం కాలేదు.
"అమ్మగారు ఏమన్నారేమిటి?" సాలోచనగా అడిగాడు నాగేంద్రరావు.
"నాకు లంచం ఇచ్చి సీటు సంపాదించాలని చూస్తున్నారా? అని అంది. మరి రామినీడు దగ్గరనుంచి తీసుకున్న దాన్ని ఏమంటారు?" విసురుగా అన్నారు రాజావారు.
"మీరు అమ్మగారికే డబ్బు అందిస్తే ఎలాగండీ? దానిక్కూడా ఓ పద్ధతి అంటూ ఉంటుందిగా!" అన్నాడు నాగేంద్రరావు చిరునవ్వుతో. అతని మాటల్లో ఏదో ఆశారేఖలు గోచరించాయి. రాజావారికి ప్రాణం లేచివట్టినట్లయింది.